నగార్నో-కరాబక్: అర్మేనియా, అజర్‌‌బైజాన్‌ల మధ్య భీకర యుద్ధం.. ఎందుకు జరుగుతోంది?

అర్మేనియాపై యుద్ధ ట్యాంకులను ప్రయోగిస్తున్న అజర్‌బైజాన్

ఫొటో సోర్స్, Reuters

కాకసస్ ప్రాంత దేశాలు అర్మేనియా, అజర్‌బైజాన్‌ల మధ్య మరోసారి యద్ధం మొదలైంది. భీకరంగా జరుగుతున్న ఈ యుద్ధంలో తమదే పైచేయి అని రెండు దేశాలూ చెప్పుకుంటున్నాయి.

ఒకప్పటి సోవియట్ దేశాలైన ఈ రెండిటి మధ్య నగార్నో-కరాబక్ ప్రాంతం విషయంలో ఏర్పడిన వివాదం దశాబ్దాలుగా అపరిష్కృతంగానే ఉంది.

నగార్నో కరాబక్ అజర్‌బైజాన్‌లో భాగమని గుర్తించినప్పటికీ ఆ ప్రాంతం స్థానిక అర్మేనియన్ జాతుల అధీనంలో ఉంది.

1980ల చివర్లో, 1990ల ప్రారంభంలో ఈ ప్రాంతం కోసం రెండు దేశాలూ భీకర యుద్ధం చేశాయి.

ఆ తరువాత కాల్పుల విరమణ ఒప్పందం చేసుకున్నా శాంతి ఒప్పందం మాత్రం కుదరలేదు.

తగలబడుతున్న ఆర్మీ వాహనాలు

ఫొటో సోర్స్, Armenian government

పటం

అర్మేనియా, అజర్‌బైజాన్‌లు 1922-91 మధ్య ఉన్న కమ్యూనిస్ట్ దేశం సోవియట్ యూనియన్‌లో భాగంగా ఉండేవి.

ఆగ్నేయ ఐరోపాలలో కాకసస్‌గా పిలిచే వ్యూహాత్మకంగా కీలకమైన ప్రాంతంలో ఈ రెండు దేశాలూ ఉన్నాయి. వీటికి పశ్చిమాన టర్కీ, దక్షిణాన ఇరాన్ ఉన్నాయి. అర్మేనియాకు ఉత్తరాన జార్జియా, అజర్‌బైజాన్‌కు ఉత్తరాన జార్జియా, రష్యాల సరిహద్దు ఉంది. అజర్‌బైజాన్‌కు తూర్పున కాస్పియన్ సముద్రం ఉంటుంది.

1990ల నాటి యుద్ధంలో సుమారు 10 లక్షల మంది నిరాశ్రయులయ్యారు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, 1990ల నాటి యుద్ధంలో సుమారు 10 లక్షల మంది నిరాశ్రయులయ్యారు

అర్మేనియా క్రైస్తవ ఆధిక్యం ఉన్న దేశం కాగా చమురు బావులున్న అజర్‌బైజాన్ ముస్లిం దేశం.

సోవియట్ కాలంలో నగార్నో-కరాబక్ అజర్‌బైజాన్ పాలనలోనే ఉన్నప్పటికీ అక్కడ అర్మేనియా జాతీయులు పెద్ద సంఖ్యలో ఉండేవారు.

సోవియట్ యూనియన్ పతనం మొదలైన తరువాత 'నగార్నో-కరాబక్' అర్మేనియాలో భాగంగా ఉండేందుకు అక్కడి ప్రాంతీయ పార్లమెంటు నిర్ణయించింది.

ఆ నిర్ణయం జాతుల సంఘర్షణకు దారితీసింది. సోవియట్ యూనియన్ పతనం నేపథ్యంలో అర్మేనియా, అజర్‌బైజాన్‌లు స్వాతంత్ర్యం ప్రకటించుకున్నాయి. అదే సమయంలో యుద్ధమూ ప్రకటించాయి. ఆ యుద్ధంలో లక్షల మంది చనిపోయారు.. రెండు వర్గాలూ జాతి నిర్మూలనకు తెగబడడంతో సుమారు పది లక్షల మంది నిరాశ్రయులయ్యారు.

1994లో రష్యా మధ్యవర్తిత్వంతో కాల్పుల విరమణకు అంగీకరించడానికి ముందే అర్మేనియన్ బలగాలు 'నగార్నో-కరాబక్'పై పూర్తి పట్టు సాధించాయి. కాల్పుల విరమణ ఒప్పందం తరువాత నగార్నో-కరాబక్ అజర్‌బైజాన్‌లో భాగంగా ఉండిపోయింది. కానీ, అక్కడి పాలన మాత్రం అర్మేనియా ప్రభుత్వ మద్దతు ఉన్న అర్మేనియా జాతుల చేతులలోనే ఉంది.

రెండు దేశాలలో నిత్యం నిరసనలు జరుగుతుంటాయి

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, రెండు దేశాలలో నిత్యం నిరసనలు జరుగుతుంటాయి
రెండు దేశాలలో నిత్యం నిరసనలు జరుగుతుంటాయి

ఫొటో సోర్స్, Getty Images

ఫ్రాన్స్, చైనా, రష్యా ఆధ్వర్యంలో 1992లో ఏర్పాటైన ఆర్గనైజేషన్ ఫర్ సెక్యూరిటీ అండ్ కోపరేషన్ ఇన్ యూరప్(ఓఎస్‌సీఈ) మిన్స్క్ గ్రూపు మధ్యవర్తిత్వంతో ఆ తరువాత శాంతి చర్చలు జరిగాయి.

పలుమార్లు చర్చలు జరిగినా ఇంతవరకు శాంతిఒప్పందం మాత్రం కుదరలేదు. గత మూడు దశాబ్దాలలో పోరాటం సాగుతూనే ఉంది. తాజా ఘర్షణలకు ముందు 2016లో కూడా ఇలాగే ఉద్రిక్తతలు ఏర్పడ్డాయి. రెండు దేశాలకు చెందిన సైనికులు పదుల సంఖ్యలో చనిపోయారు.

కాలక్రమంలో జియోపాలిటిక్స్ కారణంగా రెండు దేశాల మధ్య వివాదం మరింత ముదిరిపోయింది. అజర్‌బైజాన్‌ను స్వతంత్ర దేశంగా గుర్తించిన తొలి నాటో దేశం టర్కీ. 1991లో అది అజర్‌బైజాన్‌ను స్వతంత్ర దేశంగా గుర్తించింది.

అజర్‌బైజాన్ ఒకప్పటి అధ్యక్షుడు హైదర్ అలియే అర్మేనియా, అజర్‌బైజాన్‌లను ఒకే దేశంలోని రెండు రాష్ట్రాలుగా పేర్కొనేవారు.

మరోవైపు అర్మేనియాకు రష్యాతో మంచి సంబంధాలున్నాయి. అర్మేనియాలో రష్యా సైనిక స్థావరం కూడా ఉంది. సైనిక కూటమి 'ది కలెక్టివి సెక్యూరిటీ ట్రీటీ ఆర్గనైజేషన్'(సీఎస్‌టీఓ)లో అర్మేనియా, రష్యాలు సభ్య దేశాలు కూడా.

అజర్‌బైజాన్ యుద్ధ ట్యాంకుల్ని కాల్చేశామంటూ అర్మేనియా ఈ ఫొటోలు విడుదల చేసింది

ఫొటో సోర్స్, EPA

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)