వ్యాక్సీన్: ప్రపంచంలో తొలి టీకా ప్రచారాన్ని భారత రాణులే చేపట్టారా?

పెయింటింగ్‌లో కనిపిస్తున్న దేవజమ్మణి చిత్రం

ఫొటో సోర్స్, Courtesy: Sotheby's

ఫొటో క్యాప్షన్, పెయింటింగ్‌లో కనిపిస్తున్న దేవజమ్మణి చిత్రం
    • రచయిత, అపర్ణ అల్లూరి
    • హోదా, బీబీసీ న్యూస్

మైసూర్ రాజ దర్బారులో 1805లో దేవజమ్మణి అడుగుపెట్టారు. కృష్ణరాజ వొడియార్-3తో వివాహం కోసం ఆమె అక్కడికి వచ్చారు. వారిద్దరి వయసూ 12 ఏళ్లే. దక్షిణ భారత దేశంలో సుసంపన్న రాజ్యానికి కొత్త రాజుగా ఆయన అప్పుడే బాధ్యతలు తీసుకున్నారు.

పెళ్లితోపాటు దేవజమ్మణి మరో కీలక బాధ్యత తలకెత్తుకున్నారు. అదే మశూచి టీకాపై అందరికీ అవగాహన కల్పించే కార్యక్రమం. ఈ విషయంలో ఆమె చేసిన కృషి ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రతినిధులు వేయించిన ఓ పెయింటింగ్‌లో కనిపిస్తుంది. టీకాల కార్యక్రమంపై అందరికీ అవగాహన కల్పించేందుకు ఈ పెయింటింగ్‌ను వేయించినట్లు కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి చెందిన చరిత్రకారుడు డాక్టర్ నైజెల్ ఛాన్సెలర్ వివరించారు.

మశూచికీ టీకా అప్పుడే వచ్చింది. బ్రిటన్ వైద్యుడు ఎడ్వర్డ్ జెన్నర్ ఆరేళ్ల ముందే దాన్ని కనుగొన్నారు. అయితే భారత్‌లో దీనిపై వ్యతిరేకత వ్యక్తమైంది. చాలా మంది దీన్ని విశ్వసించేవారు కాదు. ఎందుకంటే దీన్ని బ్రిటిషర్లు కనుగొన్నారు కాబట్టి. 19వ శతాబ్దంలో బ్రిటిష్ శక్తి సామర్థ్యాలు క్రమంగా పెరుగుతూ వచ్చాయి.

మశూచి టీకాను భారతీయులందరికీ ఇవ్వాలని బ్రిటన్ పట్టుదలతో ఉండేది. దీనికి అవసరమైన ఖర్చు, కృషికి వారు రెండు కారణాలు చెప్పారు. ఏటా బలవుతున్న ప్రాణాలను కాపాడొచ్చని.. మరోవైపు జనాభా పెరిగితే ఉత్పత్తి ఎక్కువవుతుందని వివరించారు.

అయితే, ప్రపంచంలోనే తొలి వ్యాక్సీన్‌ను భారత్‌లో ప్రవేశపెట్టేందుకు ఈస్ట్ ఇండియా కంపెనీ.. రాజకీయాలు, అధికారం, ఒత్తిడిని ఉపయోగించాల్సి వచ్చింది. దీని కోసం బ్రిటిష్ సర్జన్లు, భారత టీకా సిబ్బంది, ఈస్ట్ ఇండియా కంపెనీ యజమానులు, సన్నిహిత రాజులు కలిసి పనిచేశారు. ఈ రాజుల్లో వొడియార్లు కీలక పాత్ర పోషించారు. 30 ఏళ్లపాటు అజ్ఞాతంలో ఉన్నవారిని బ్రిటిషర్లే సింహాసనం ఎక్కించారు. అందుకే బ్రిటిషర్లకు వొడియార్లు చాలా రుణపడి ఉన్నారు.

హిక్కీ వేసిన పెయింటింగ్

ఫొటో సోర్స్, Courtesy: Sotheby's

ఫొటో క్యాప్షన్, హిక్కీ వేసిన పెయింటింగ్

పెయింటింగ్‌లో కనిపించే మహిళలు...

ఈ పెయింటింగ్ 1805 నాటిదని డా. ఛాన్సెలర్ వివరించారు. ఇది కేవలం రాణి.. టీకా కార్యక్రమంలో పాల్గొనడానికి ఆధారం మాత్రమే కాదు.. అప్పటి బ్రిటిషర్ల కృషికి ఇది నిదర్శనమని చెప్పారు.

ఈ పెయింటింగ్‌ను చివరగా 2007లో సౌథబే సంస్థ వేలం వేసింది. అయితే దీనిలో కనిపించేది ఎవరో ఎవరికీ తెలియదు. వీరు నృత్యకారిణులని కొందరు అనుకున్నారు. అయితే డా.ఛాన్సెలర్ దీన్ని చూసి వెంటనే గుర్తుపట్టారు.

పెయింటింగ్‌లో కుడివైపు కనిస్తున్నది చిన్న రాణి దేవజమ్మణి అని ఆయన చెప్పారు. సాధారణంగా అయితే ఆమె చీర.. ఎడమ చేతిని కప్పి ఉంచుతుంది. అయితే టీకా వేయించుకున్నానని చెప్పేందుకు ఆమె ఆ చేతిని బయటపెట్టినట్లు ఆయన వివరించారు.

ఎడమవైపు ఉండే మహిళ రాజుగారి పెద్ద భార్య దేవజమ్మణి అని పేర్కొన్నారు. ఇద్దరి భార్యల పేర్లూ ఒకటే. తన ముక్కు కింద, నోటి చుట్టూ ఉన్న మచ్చలు.. మశూచీ టీకాలోని వైరస్ వల్లే వచ్చినట్లు ఆయన చెప్పారు. మశూచి నుంచి కోలుకున్న వారి చర్మంపై పొక్కులను సేకరించి బూడిద చేస్తారు. మశూచి ఇంకా సోకనివారికి ఆ బూడిదను ముక్కు రంధ్రాల దగ్గర ఊదేవారు. దీన్ని వేరియోలేషన్ అనేవారు. దీని వల్ల కొంత స్పల్ప తీవ్రతగల ఇన్ఫెక్షన్‌తో బయటపడొచ్చు.

తను చెప్పిన అంశాలతో పెయింటింగ్‌లోని వివరాలను కలిపి 2001లో డా.ఛాన్సెలర్ ఓ కథనం రాశారు.

పెయింటింగ్ వేసిన తేదీ.. వొడియార్ రాజు పెళ్లి రోజులు, జులై 1806నాటి కోర్టు రికార్డులతో సరిపోతోంది. దేవజమ్మణి టీకా వేసుకోవడంతో ప్రజలు కూడా ముందుకు వచ్చినట్లు రికార్డుల్లో పేర్కొన్నారు. పెయింటింగ్‌లో మహిళల చేతిపై ఉండే బంగారు కడియాలు, పాపిడి గొలుసులు.. వడియార్ రాణులు వేసుకునే ఆభరణాల్లానే ఉన్నాయని మైసూర్ చరిత్రకారుడు డాక్టర్ చాన్సెలర్ వివరించారు. ఈ పెయింటింగ్‌ను వేసిన థామస్ హిక్కీ.. అంతకుముందు వడియార్లతోపాటు ఆయన రాజ దర్బారులోని సభ్యుల బొమ్మలు వేశారు.

అన్నింటి కంటే ముఖ్యమైనది ఏమిటంటే.. ఆ పెయింటింగ్‌లోని మహిళలు ధైర్యంగా నవ్వుతూ నిలబడ్డారు. ఇలా భారత రాజ కుటుంబాలకు చెందిన మహిళలు.. ఐరోపా పెయింటర్ల కోసం నిలబడటం చాలా అరుదు. ఏదో బలమైన కారణం లేకుండా వడియార్ రాణులు ఇలా నిలబడరని డాక్టర్ ఛాన్సెలర్ చెప్పారు.

దేవతలు కోపిస్తే మశూచి వస్తుందని హిందువులు భావించేవారు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, దేవతలు కోపిస్తే మశూచి వస్తుందని హిందువులు భావించేవారు

తమవారిని కాపాడేందుకు..

ఈస్ట్ ఇండియా కంపెనీకి అది కొంచెం క్లిష్టమైన సమయం. 1799లో వారు మైసూర్ రాజు టిప్పు సుల్తాన్‌ను ఓడించారు. వారి స్థానంలో వడియార్లను కూర్చోబెట్టారు. అయితే బ్రిటిషర్ల ఆధిపత్యం ఇంకా వేళ్లూనుకోలేదు.

దీంతో విధ్వంసకర వ్యాధికి చికిత్సను చూపించడం ద్వారా రాజకీయంగా లబ్ధి పొందుదామని అప్పటి మద్రాసు గవర్నర్ విలియం బెంటిక్ ప్రయత్నించి ఉండొచ్చని డాక్టర్ ఛాన్సెలర్ పేర్కొన్నారు.

మరోవైపు భారత్‌లో నివసిస్తున్న బ్రిటిషర్లను కాపాడేందుకు ఈ టీకాను ఇక్కడకు తీసుకురావాలని బ్రిటిష్ పాలకులు పట్టుబట్టినట్లు చరిత్రకారుడు మైఖెల్ బెనెట్.. తన పుస్తకం వార్ ఎగైనెస్ట్ స్మాల్‌పాక్స్‌లో వివరించారు.

భారత్‌లో మశూచీ ఇన్ఫెక్షన్లు చాలా ఎక్కువగా ఉండేవి. మరణాలు కూడా ఎక్కువగానే సంభవించేవి. చాలా మంది జ్వరం.. ముఖం, చేతులపై మచ్చలతో మరణించేవారు. ఈ వ్యాధి నుంచి బయటపడిన వారు జీవితాంతం మచ్చలతో బతికేవారు.

శతాబ్దాలపాటు దీనికి కేవలం వేరియోలేషన్, కొన్ని మతపరమైన కార్యక్రమాలతో చికిత్స చేసేవారు. మరియమ్మ లేదా సీతల లాంటి అమ్మవార్లు కోపించినప్పుడు ఈ ఇన్ఫెక్షన్‌ వస్తుందని హిందువులు భావించేవారు.

టిప్పు సుల్తాన్‌తో యుద్ధం అనంతరం వడియార్లకు బ్రిటిషర్లు అధికారం అప్పగించారు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, టిప్పు సుల్తాన్‌తో యుద్ధం అనంతరం వడియార్లకు బ్రిటిషర్లు అధికారం అప్పగించారు

మొదట కౌపాక్స్‌ వైరస్‌తో కూడిన వ్యాక్సీన్ అందుబాటులోకి వచ్చింది. అందుకే చాలా మంది దీన్ని స్వాగతించలేదు.

బ్రాహ్మణ వేరియోలేటర్లు లేదా టీకా నిపుణులు.. తమ జీవనాధారంపై టీకా ముప్పు తీసుకొస్తుందని వ్యతిరేకించేవారు.

''ఆరోగ్యవంతమైన పిల్లలకు జంతువుల వైరస్‌ను ఎక్కించడం ఏమిటని ఎక్కువ మంది ఆందోళన చెందేవారు''అని ప్రొఫెసర్ బెనెట్ చెప్పారు.

''కౌపాక్స్‌ను ఎలా అనువదిస్తారు? దీని కోసం సంస్కృత విద్వాంసులను పిలిపించారు. అయితే వారు కౌపాక్స్ కంటే దారుణమైన జబ్బులకు వాడే పదాలను చూపించారు. దీంతో స్థానికులు ఇంకా భయపడిపోయారు''

ఇంకో సమస్య కూడా ఉంది. అది టీకా వేసే విధానమే. మొదట ఒకరి చేతికి వ్యాక్సీన్ ఎక్కించాలి. వారం తర్వాత ఎక్కించిన చోట పొక్కులు వస్తాయి. ఆ పొక్కుల్లోని చీమును ఇంకొకరి చేతికి ఎక్కించాల్సి ఉంటుంది.

కొన్నిసార్లు, సేకరించిన పొక్కుల్లోని చీము ఎండిపోతుంటుంది. ఫలితంగా ఇంకొకరికి ఎక్కించేందుకు అది ఉపయోగపడేది కాదు.

19వ శతాబ్దం నాటి వ్యాక్సీన్ కార్టూన్
ఫొటో క్యాప్షన్, 19వ శతాబ్దం నాటి వ్యాక్సీన్ కార్టూన్

మూడేళ్ల పాపతో మొదలు

అన్ని జాతులు, మతాలు, కులాలకు చెందిన వ్యక్తులు ఒకరితర్వాత ఒకరి శరీరాల నుంచి ఈ వ్యాక్సీన్ ముందుకు రావాల్సి ఉంటుంది. అంటే కొందరు హిందువులు చెప్పే స్వచ్ఛత అనే ధర్మానికే ఇది విరుద్ధంగా ఉండేది. ఈ భయాందోళనలను హిందూ రాజులే తొలగించగలరు.

వడియార్ రాణి వరకూ ఈ టీకా వెళ్లిందంటే.. బహుశా అది బ్రిటిష్ సేవకురాలి కుమార్తె, మూడేళ్ల పాప అన్నా డస్ట్‌హాల్ నుంచి ఇది మొదలై ఉండొచ్చు.

1800ల్లో ఈ టీకాను బ్రిటన్‌ నుంచి ఓ పడవలో తీసుకువచ్చారు. ఎండిపోయిన పొక్కుల ద్వారా లేదా వ్యాక్సీన్ కొరియర్లు అంటే.. ప్రయాణంలో కొంత మంది మనుషులకు ఒకరి తర్వాత ఒకరికి వ్యాక్సీన్ ఇస్తూ దీన్ని భారత్‌కు తీసుకొచ్చారు. అయితే ఇవేమీ పని చేయలేదు.

చాలాసార్లు విఫలమయ్యాక ఎండిపోయిన పొక్కులను గాజు ఫలకాల మధ్య సీల్‌చేసి.. వియన్నా నుంచి బగ్దాద్‌కు 1802లో తీసుకొచ్చారు. దీన్ని మొదట అక్కడి ఒక ఆర్మేనియన్ బాబుకు ఇచ్చారు. అతడి చేతిపై పొక్కుని ఇరాక్‌లోని బాస్రాకు తీసుకెళ్లారు. అక్కడి నుంచి ఒకరి తర్వాత మరొకరికి ఎక్కిస్తూ బాంబేకు తీసుకొచ్చారు.

14 జూన్, 1802లో అన్నా డస్ట్‌హాల్‌కు భారత్‌లో తొలిసారి మశూచీ టీకాను ఎక్కించారు. ఆమె గురించి బయటకు తెలిసింది చాలా తక్కువ. ఆమెకు టీకా ఎక్కించిన డాక్టర్.. ఆమె చాలా ప్రశాంతంగా ఉండేదని పేర్కొన్నారు. డస్ట్‌హాల్‌ తండ్రి యూరోపియన్. తల్లి ఏ ప్రాంతానికి చెందినవారో తెలియదు. కానీ, ఉప ఖండంలో అందరికీ ఈమె నుంచే వ్యాక్సీన్ వెళ్లింది.

మొదటి వారంలోనే బాంబేలో ఐదుగురు ఇతర పిల్లలకు డస్ట్‌హాల్ చేతి నుంచి సేకరించిన చీముతో టీకా ఎక్కించారు. అక్కడి నుంచి ఒకరి చేతి నుంచి మరొకరి చేతికి ఎక్కిస్తూ చాలా బ్రిటిష్ పాలిత ప్రాంతాలకు టీకా వెళ్లింది. ఆ ప్రాంతాల్లో హైదరాబాద్, కొచ్చిన్, టెల్లిచెర్రీ, చింగెల్‌పుట్, మద్రాస్ ఉన్నాయి. చివరగా మైసూర్ రాజ దర్బార్‌కు ఈ టీకా చేరింది.

కౌపాక్స్ టీకా వేయడంలో వీటిని ఉపయోగించేవారు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, కౌపాక్స్ టీకా వేయడంలో వీటిని ఉపయోగించేవారు

రికార్డుల్లో రాయలేదు

అయితే, టీకా ఎవరి నుంచి ముందుకు వెళ్తోందనే అంశాన్ని బ్రిటిష్ పాలకులు రికార్డు చేయలేదు. కానీ కొంతమంది గుర్తు తెలియని వ్యక్తుల శరీరాల నుంచి ఇది ముందుకు సాగింది. ముగ్గురు పిల్లల నుంచి మద్రాస్‌లో ఈ సరఫరాను మళ్లీ పునరుద్ధరించారు. ఓ మలయ్ పిల్లాడు ఈ టీకాను కలకత్తాకు తీసుకెళ్లాడు.

రాణి దేవజమ్మణి ఎలా టీకా ఎక్కించుకున్నారో ఎవరికీ తెలియదు. ఆ రాజ దర్బారులో ఇంకెవరన్నా వేసుకున్నారో లేదో ఎలాంటి ఆధారాలూ లేవని డా.ఛాన్సెలర్ వివరించారు.

టీకా వేసుకున్న జ్ఞాపకాలను పెయింటింగ్ రూపంలో రాణి పదిలంగా ఉంచగలిగారు. ఇదంతా రాజు నాన్నమ్మ లక్ష్మీ అమ్మణి వల్లే సాధ్యపడింది. ఆమె తన భర్తను మశూచికి కోల్పోయారు. మధ్యలో కనిపిస్తున్న మహిళ.. లక్ష్మీ అని డా. ఛాన్సెలర్ అభిప్రాయపడ్డారు.

ఆ పెయింటింగ్ సాధ్యపడటానికి కారణం.. లక్ష్మీ చేతిలో అప్పటికి అధికారం ఉండటమేనని ఆయన వివరించారు.

టీకాతో ఉపయోగాలు ప్రజలకు తెలియడంతో ఈ టీకా కార్యక్రమం అలా ముందుకు వెళ్లింది. చాలా మంది టీకా నిపుణులు.. వేరియోలేషన్ నుంచి టీకాలు వేయడానికి మారారు. 1807నాటికి దాదాపు పది లక్షల డోసుల వ్యాక్సీన్ ఎక్కించి ఉంటారని ప్రొఫెసర్ బెనెట్ అంచనా వేశారు.

కాలక్రమేణా, ఈ పెయింటింగ్ ఇంగ్లండ్‌కు రావడంతో మరుగున పడింది. 1991 వరకూ దీన్ని ఎవరూ గుర్తించలేదు. డా. ఛాన్సెలర్ దీన్ని ఓ ప్రదర్శనలో చూసి.. ఆ మహిళలకు ప్రాచుర్యం కల్పించారు. దీంతో ప్రపంచంలోనే తొలి టీకా కార్యక్రమ ప్రచారకర్తల్లో ఒకరిగా వారికి స్థానం లభించింది.

ఇవికూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)