అర్మేనియా - అజర్బైజాన్‌ల మధ్య ‘సరిహద్దు యుద్ధం’ - BBC Newsreel

ఫొటో సోర్స్, EPA
వివాదాస్పద నాగోర్నో-కరబఖ్ సరిహద్దు వద్ద అర్మేనియా, అజర్బైజాన్‌ల మధ్య భారీ ఘర్షణ చెలరేగింది. ఇరువైపులా మరణాలు సంభవించాయని వార్తలు వస్తున్నాయి.
అజర్బైజాన్ జరిపిన వాయు, ఫిరంగి దాడుల్లో అర్మేనియా హెలికాఫ్టర్లు, ట్యాంకులు ధ్వంసమయ్యాయని ఆరోపిస్తూ.. దేశంలో సైనిక శాసనం (మార్షలా లావ్) అమలులోకి తెచ్చినట్లు అర్మేనియా ప్రకటించింది.
అయితే అజర్బైజాన్ షెల్లింగ్‌కు ప్రతిస్పందనగా ఎదురు దాడికి దిగినట్లు అజర్బైజాన్ చెప్పింది.

ఈ ప్రాంతం అంతర్జాతీయంగా అజర్బైజాన్‌లో భాగంగా గుర్తించినప్పటికీ స్థానికంగా అర్మేనియన్ల నియంత్రణలో ఉంది.
ఒకప్పుడు సోవియట్ యూనియన్‌లో అంతర్భాగమైన అర్మేనియా, అజర్బైజాన్ ప్రాంతాలు సాంస్కృతిక, మతపరమైన విభేదాల కారణంగా రెండు దేశాలుగా విడిపోయాయి.
ప్రస్తుత ఘర్షణల నేపథ్యంలో అజర్బైజాన్‌లో కూడా కొన్ని ప్రాంతాల్లో సైనిక శాశనాన్ని అమలుపరిచినట్టు ప్రకటించారు.

ఫొటో సోర్స్, Getty Images
అనుమానాస్పద స్థితిలో జపాన్ నటి యూకో తకెయుచి మరణం
ఉత్తమ నటిగా అనేక అవార్డులందుకున్న యూకో తకెయుచి తన సొంత ఇంట్లో శవమై కనిపించారు. ఆమె వయసు 40 సంవత్సరాలు.
తకెయుచి భర్త, స్వయంగా నటుడు అయిన తైకి నకబయషి, అచేతనంగా ఉన్న తన భార్యను ఆస్పత్రికి తరలించగా, అక్కడ ఆమె చనిపోయినట్లు నిర్థారించారు.
ఇది ఆత్మహత్య అని పోలీసులు అనుమానిస్తున్నారు. వాస్తవాలు నిర్థారించేందుకు దర్యాప్తు మొదలుపెట్టారని మీడియా రిపోర్టులు తెలుపుతున్నాయి.
ఇద్దరు పిల్లల తల్లి అయిన తకెయుచి జపాన్‌లో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమె అనేక సీరియళ్లనూ, సినిమాల్లోనూ నటించారు. ఉత్తమ నటిగా అనేక బహుమతులు గెలుచుకున్నారు.
2018 లో హెచ్‌బీఓ చానల్లో ప్రసారమైన మిస్ షెర్లాక్ సీరీస్‌లో మహిళా షెర్లాక్ హోమ్స్‌గా నటించి అంతర్జాతీయ గుర్తింపు తెచ్చుకున్నారు.
2004 నుంచి 2007 వరకూ వరుసగా మూడేళ్లు ఉత్తమనటిగా జపనీస్ అకాడమీ అవార్డులు గెలుచుకున్నారు.
తకెయుచి మరణం ఆత్మహత్యగా ఇంకా నిర్థారణ కానప్పటికీ, ఇటీవల కాలంలో పలువురు ప్రతిభావంతులైన జపాన్ నటులు ఆత్మహత్య చేసుకోవడం ఒక విషాదం.
ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాల ప్రకారం ప్రపంచంలో అత్యధిక ఆత్మహత్యలు నమోదైన దేశాల్లో జపాన్ ఒకటి. అయితే 2015 తరువాత నివారణా చర్యలు చేపట్టిన అనంతరం ఈ సంఖ్య బాగా తగ్గిందని రిపోర్టులు తెలుపుతున్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
అమీ కోనీ బారెట్‌ను సుప్రీంకోర్టుకు నామినేట్ చేసిన ట్రంప్
అమెరికా సుప్రీంకోర్టు అసోసియేట్ జస్టిస్‌గా అమీ కోనీ బారెట్‌ను అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ నామినేట్ చేశారు.
వైట్‌హౌస్ రోజ్ గార్డెన్‌లో మాట్లాడిన ఆయన.. అమీని నిరుపమాన సాధకురాలిగా అభివర్ణించారు.
ఆమె ఎంపికను సెనేటర్లు ఆమోదిస్తే ఇటీవల మరణించిన రూత్ బాడర్ గిన్స్‌బర్గ్ స్థానంలో ఆమె నియమితులవుతారు.
అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అమీ నామినేషన్ ధ్రువీకరణపై సెనేట్లో వాడివేడి చర్చ జరగొచ్చు.

ఫొటో సోర్స్, Getty Images
కాగా అమెరికా ప్రజలు కొత్త అధ్యక్షుడిని ఎన్నుకునే వరకు ఈమె నియామకంపై నిర్ణయం తీసుకోవద్దని డెమొక్రాట్ల అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్ సెనేట్‌ను కోరారు.
''న్యాయస్థానంలో ఎవరు పనిచేయాలనే విషయంలో వోటర్ల గొంతు వినడానికి అమెరికా రాజ్యాంగం అవకాశం ఇస్తుంది. ఆ సమయం వచ్చింది. ఇప్పుడు వారి గొంతు వినిపించాలి'' అని బైడెన్ అన్నారు.
అమీ నియమితులైతే అమెరికా అత్యున్నత న్యాయస్థానంలో కన్జర్వేటివ్‌ల అనుకూల జస్టిస్‌ల ఆధిక్యం 6-3కి పెరుగుతుంది.
నలభై ఎనిమిదేళ్ల అమీ నియమితులైతే ట్రంప్ హయాంలో నియమితులైన మూడో జడ్జి అవుతారు. ఇంతకుముందు 2017లో నీల్ గోర్షూ, 2018లో బ్రెట్ కవానాలను ట్రంప్ నియమించారు.
అమెరికా సుప్రీంకోర్టులోని 9 మంది న్యాయమూర్తులు జీవితకాలం సేవలందిస్తారు. తుపాకులు, ఓటింగ్ హక్కులు, అబార్షన్, ప్రచార నిధులు వంటి సకల అంశాలపైనా వారిచ్చే తీర్పులు ప్రభుత్వ విధానాలకు మార్గమేస్తాయి. తమను నియమించిన అధ్యక్షుల పదవీకాలం పూర్తయి కార్యాలయాన్ని వదిలి వెళ్లిన తరువాత కూడా వీరి సేవలు కొనసాగుతుంటాయి.

ఫొటో సోర్స్, Reuters
ఇంతకీ అమీ కోనీ బారెట్ ఎవరు.. ఆమెను ఎవరెవరు వ్యతిరేకిస్తున్నారు?
ఇండియానాలోని నోట్ర డామ్ యూనివర్సిటీ లా స్కూల్‌లో చదువుకున్న తరువాత అమీ జస్టిస్ ఆంటోనిన్ స్కాలియా వద్ద పనిచేశారు. 2017లో ట్రంప్ ఆమెను షికాగోలోని సెవన్త్ సర్క్యూట్ కోర్ట్ ఆఫ్ అప్పీల్స్‌కు నామినేట్ చేశారు.
2013లో ఒక మ్యాగజీన్‌లో వచ్చిన కథనం ప్రకారం ఆమె క్యాథలిక్ విశ్వాసాలు ఆచరించే ఆమె 'జీవితం గర్భస్థ దశ నుంచే మొదలవుతుంది'' అని చెప్పారు. ఈ వ్యాఖ్యలతో ఆమె మత సంప్రదాయవాదులకు ఇష్టురాలిగా మారారు. దేశవ్యాప్తంగా అబార్షన్లను చట్టబద్ధం చేయాలన్న 1973 నాటి సుప్రీంకోర్టు నిర్ణయాన్ని మార్చాలని మత సంప్రదాయవాదులు కోరుతున్నారు.
అయితే, ఎల్‌జీబీటీ వర్గాలు మాత్రం ఆమెను వ్యతిరేకిస్తున్నాయి. వివాహితులైన ఆడామగా మధ్య మాత్రమే లైంగిక సంబంధం ఉండాలని బోధించే స్కూల్ నెట్‌వర్క్స్ కలిగి ఉన్న 'పీపుల్ ఆఫ్ ప్రైజ్' అనే సంప్రదాయ క్యాథలిక్ గ్రూపులో ఆమె సభ్యురాలు కావడాన్ని తప్పుపడుతున్నాయి.
ట్రంప్ ప్రభుత్వం తీసుకొచ్చిన కఠిన ఇమిగ్రేషన్ విధానాలకూ అమీ మద్దతిచ్చారు. అంతేకాదు తుపాకీ హక్కులను మరింత విస్తృతం చేయడానికి అనుకూలంగానూ ఆమె తన అభిప్రాయాలు చెప్పారు.
గత అధ్యక్షుడు బరాక్ ఒబామా తీసుకొచ్చిన ఆరోగ్య బీమా కార్యక్రమం ఒబామాకేర్‌ను రద్దు చేయడానికి అమీ తోడ్పడతారని కన్జర్వేటివ్‌లు ఆశిస్తున్నారు.
ఈ అఫర్డబుల్ కేర్ యాక్ట్(ఏసీఏ)ను రద్దు చేస్తే 2 కోట్ల మంది అమెరికన్లు హెల్త్ కవరేజ్ కోల్పోతారు.
అమీని ట్రంప్ నామినేట్ చేసిన తరువాత డెమొక్రాట్ల అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్ ఈ విషయాన్ని ప్రస్తావించారు. ఏసీఏను రాతపూర్వకంగా వ్యతిరేకించిన ట్రాక్ రికార్డు అమీకి ఉందని బైడెన్ అన్నారు.
అయితే, నామినేషన్ తరువాత మాట్లాడిన అమీ సుప్రీంకోర్టు జస్టిస్‌గా తన తీర్పులు న్యాయం ఆధారంగానే ఉంటాయని అన్నారు.
''న్యాయమూర్తులు విధాన రూపకర్తలు కారు. వారికి ఎలాంటి విధాన దృక్పథాలున్నా వాటిని పక్కనపెట్టాలి'' అన్నారు.
ఇవి కూడా చదవండి:
- అండమాన్ కాలాపానీలో బ్రిటిష్ వైస్రాయ్ లార్డ్ మేయో హత్య.. ‘‘ద ఫస్ట్ జిహాద్’’
- కొళాయి నీళ్లలో మెదడును తినేసే సూక్ష్మజీవులు.. ఆ నీళ్లు వాడొద్దంటూ అధికారుల వార్నింగ్
- కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి ఐక్యరాజ్యసమితి చేస్తున్న కృషి ఏమిటి?: నరేంద్రమోదీ
- మీ పాత టీవీ, రేడియో అమ్మితే రూ. 10 లక్షలు.. ఏమిటీ బేరం
- భారత్-పాక్ 1965 యుద్ధం: జనరల్ అయూబ్ ఖాన్ రహస్య బీజింగ్ పర్యటన, యుద్ధం చేయాలని చైనా సలహా
- కరోనావైరస్ వంటి ప్రాణాంతక మహమ్మారులు సహజంగానే అంతరించిపోతాయా? అదెలా సాధ్యం?
- మోదీ కేబినెట్లో మంత్రి రాజీనామాకు కారణమైన మూడు బిల్లుల్లో ఏముంది.. రైతులకు లాభమా, నష్టమా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








