రూత్ బాడర్ గిన్స్‌బర్గ్: ప్రఖ్యాత స్త్రీవాది, అమెరికా సుప్రీంకోర్టు న్యాయమూర్తి మృతి - BBC Newsreel

రుత్ బాడర్ గిన్స్‌బర్గ్

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, రుత్ బాడర్ గిన్స్‌బర్గ్

స్త్రీ సాధికారత, హక్కుల సంరక్షణ కోసం పాటుపడిన యోధురాలు.. అమెరికా సుప్రీంకోర్టు న్యాయమూర్తి రూత్ బాడర్ గిన్స్‌బర్గ్ 87 యేళ్ల వయసులో క్యాన్సర్ వ్యాధితో శుక్రవారం నాడు కన్నుమూశారని సుప్రీంకోర్టు తెలిపింది.

రూత్ బాడర్ గిన్స్‌బర్గ్ ప్రముఖ స్త్రీవాదిగా, ప్రజాస్వామిక న్యాయవాదిగా ప్రఖ్యాతి పొందారు.

యూఎస్ అత్యున్నత న్యాయస్థానాన్ని అధిరోహించిన రెండో మహిళగా గిన్స్‌బర్గ్ 27 యేళ్లపాటూ సుప్రీంకోర్టులో బాధ్యతలు నిర్వహించారు.

"మన దేశం ఒక చరిత్రాత్మక వ్యక్తిని కోల్పోయింది" అని అమెరికా అత్యున్నత్త న్యాయమూర్తి జాన్ రాబర్ట్స్ శుక్రవారం ఒక ప్రకటనలో సంతాపం తెలిపారు.

"రుత్ బాడర్ గిన్స్‌బర్గ్ ఒక అవిశ్రాంత, న్యాయ విజేత అని" కీర్తించారు.

గిన్స్‌బర్గ్ అనారోగ్యం దృష్ట్యా, సుప్రీం కోర్టులో ఆమె స్థానాన్ని భర్తీ చేస్తూ రిపబ్లికన్ పార్టీ ప్రతినిధిని నియమించే అవకాశాలున్నాయని ఊహాగానాలు వస్తున్నాయి.

ఈ నేపథ్యంలో ఆమె మరణించడానికి కొన్ని రోజుల ముందు "కొత్త దేశాధ్యక్షుడు ఎన్నికయ్యేవరకూ నా స్థానాన్ని భర్తీ చెయ్యకుండా ఉండాలన్నది నా ప్రగాఢమైన కోరిక" అని ఆమె అన్నారని నేషనల్ పబ్లిక్ రేడియో తెలిపింది.

గిన్స్‌బర్గ్ మరణం పట్ల స్పందిస్తూ "ఆమె ఒక గొప్ప మేధావి, న్యాయశాస్త్రంలో అజేయురాలు" అని ట్రంప్ ట్వీట్ చేశారు.

న్యాయవాద వృత్తిలో స్త్రీలకు సంబంధించిన అనేక పోరాటాల్లో రూత్ బాడర్ గిన్స్‌బర్గ్ వారి తరఫున పోరాడారు. స్త్రీ పురుష వేతనాల్లో అంతరాలు, అంగవైకల్యం ఉన్నవాళ్ల హక్కులు, మిలటరీ ఇన్స్టిట్యూట్‌లో స్త్రీల ప్రవేశం మొదలైన ఎన్నో అంశాలలో ఆమె మహిళల తరపున వాదించారు.

టిక్ టాక్, ట్రంప్, వీచాట్

ఫొటో సోర్స్, Alamy/epa

టిక్‌టాక్, వీచాట్: అమెరికాలో ఆదివారం నుంచి కనుమరుగు కానున్న యాప్‌లు

టిక్‌టాక్, వీచాట్ యాప్‌లను అమెరికాలోని యాప్ స్టోర్ల నుంచి తొలగించనున్నారు. ఆదివారం నుంచి ఈ నిషేధం అమలులోకి రానుంది. చివరి నిమిషంలో అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ మనసు మారితే తప్ప ఈ నిర్ణయం మారే అవకాశం లేదు.

ఏ యాప్ స్టోర్ నుంచి కూడా వీటిని అమెరికా ప్రజలు డౌన్‌లోడ్ చేసుకునే వీలు లేకుండా నిషేధిస్తామని అక్కడి వాణిజ్య శాఖ వెల్లడించింది.

ఈ సంస్థలు జాతీయ భద్రతకు ముప్పు కలిగిస్తాయని.. యూజర్ల డాటాను చైనాకు చేరవేసి ఉండొచ్చని ట్రంప్ ప్రభుత్వం ఆరోపిస్తోంది.

కానీ, ఈ రెండు కంపెనీలు, చైనా కూడా ఈ ఆరోపణలను ఖండిస్తున్నాయి.

ఆదివారం నుంచి అమెరికాలో వీచాట్ పూర్తిగా ఆగిపోతుంది. కానీ, టిక్ టాక్ యాప్ స్టోర్లలో మాత్రమే అందుబాటులో ఉండదు. ఇప్పటికే డౌన్‌లోడ్ చేసుకుని వాడుతున్నవారు నవంబరు 12 వరకు కొనసాగించొచ్చు. నవంబరు 12 నుంచి టిక్‌టాక్‌ను కూడా పూర్తిగా నిషేధిస్తారు.

ట్రంప్ ప్రభుత్వ ఆందోళనలు, లేవనెత్తిన అభ్యంతరాల నేపథ్యంలో ముందెన్నడూ లేని స్థాయిలో అదనపు పారదర్శక చర్యలు చేపట్టామని.. అయినా, ఇలాంటి నిర్ణయం ప్రకటించడం సరికాదని టిక్‌టాక్ అసంతృప్తి వ్యక్తంచేసింది.

నిర్దేశిత ప్రక్రియ పాటించకుండా అన్యాయంగా తీసుకొచ్చిన ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై తాము పోరాడుతామని టిక్ టాక్ చెప్పింది.

మరోవైపు వీచాట్ యాజమాన్య సంస్థ టెన్సెంట్ తాజా పరిణామాలపై స్పందిస్తూ అమెరికా ప్రభుత్వంతో చర్చలు కొనసాగిస్తామని, దీనికి దీర్ఘకాలిక పరిష్కారం కోసం చూస్తున్నామని, ఈ నియంత్రణలు దురదృష్టకరమని పేర్కొంది.

ట్రంప్ ప్రభుత్వం ఆగస్టులో జారీచేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ప్రకారం చైనా కంపెనీలతో 45 రోజుల్లో లావాదేవీలన్నీ ముగించాలి.. దాని ప్రకారమే వాణిజ్య శాఖ ఈ నిషేధ ఉత్తర్వులు జారీ చేసింది.

అయితే, శుక్రవారం ట్రంప్ ఈ విషయంపై మాట్లాడుతూ.. ''టిక్ టాక్ అద్భుతమైన కంపెనీ.. చాలాచాలా పాపులర్. కానీ, చైనా నుంచి మాకు భద్రత అవసరం'' అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)