చైనాలో మరో ఇన్ఫెక్షన్... 4 వేల మందికి సోకిన బ్రుసెలోసిస్ బ్యాక్టీరియా లక్షణాలేంటి?

ఫొటో సోర్స్, Getty Images
చైనా వుహాన్ నుంచి వ్యాపించిన కరోనావైరస్ గుప్పిట్లో ప్రపంచమంతా విలవిల్లాడుతుంటే, నైరుతి చైనా గైన్సూ ప్రాంతంలోని లాంజోవూ నగరంలోని వందల మందికి ఒక కొత్త ఇన్ఫెక్షన్ సోకింది.
బ్రుసెలోసిస్ బ్యాక్టీరియాతో వ్యాపించిన ఇన్ఫెక్షన్ వల్ల జనం పెద్ద సంఖ్యలో అనారోగ్యానికి గురయ్యారు.
ఈ బ్యాక్టీరియా వల్ల దాదాపు 3,245 మంది ఇన్ఫెక్షన్‌కు గురయ్యారని గైన్సూ ప్రాంతంలోని సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ విభాగం చెప్పినట్లు చైనా ప్రభుత్వ పత్రిక గ్లోబల్ టైమ్స్ ప్రచురించింది.
గత సోమవారం మొత్తం 21 వేల మందికి పరీక్షలు చేయగా, వారిలో 4,646 మందికి పాజిటివ్ వచ్చింది. అయితే ఈ సంఖ్య ఇంకా ఎక్కువగానే ఉంటుందని భావిస్తున్నారు. ఇప్పుడు ఇది మరింత వ్యాపిస్తుందేమోనని అధికారులు, సామాన్యులు ఆందోళనకు గురవుతున్నారు.
నగరంలోని 11 ప్రభుత్వ సంస్థలకు ఉచిత పరీక్షలు, చికిత్సలు చేయడానికి ఆస్పత్రి హోదా ఇచ్చారని వార్తా పత్రిక చెప్పింది.

ఫొటో సోర్స్, PORNCHAI KITTIWONGSAKUL
బ్రుసెలోసిస్ ఏంటి, ఇది ఎలా వ్యాపిస్తుంది
బ్రుసెలోసిస్ ఒక బ్యాక్టీరియా వల్ల పుట్టే వ్యాధి. ఇది ప్రధానంగా ఆవులు, మేకలు, గొర్రెలు, పందులు, కుక్కలకు వ్యాపిస్తుంది.
ఈ వ్యాధి సోకిన జంతువులను తాకితే ఇది మనుషులకు కూడా వ్యాపిస్తుంది.
అంటే, ఈ వ్యాధి సోకిన పశు ఉత్పత్తులు తినడం, తాగడం లేదంటే గాలిలోని బ్యాక్టీరియాను పీల్చడం వల్ల ఇది మనుషులకు వ్యాపిస్తుంది.
ఈ వ్యాధి సోకిన జంతువుల కంటే ఎక్కువగా పాశ్చురైజ్డ్ పాలు లేదా పనీర్ తీసుకోవడం వల్ల ఇది మనుషులకు ఎక్కువగా వ్యాపిస్తోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పింది.
ఇది ఒకరి నుంచి మరొకరికి చాలా తక్కువగా వ్యాపిస్తుంది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ వివరాల ప్రకారం ఈ వ్యాధి గురించి ప్రపంచంలోని మరికొన్ని దేశాల నుంచి కూడా రిపోర్టులు వచ్చాయి.
దీనికి చికిత్స సాధ్యమే. బాధితులు వరసగా నెలా, నెలన్నర మందులు వాడాల్సి ఉంటుంది.

ఫొటో సోర్స్, William Campbell
దీని లక్షణాలు ఏంటి...
వ్యాధి లక్షణాలు కనిపించడానికి వారం నుంచి రెండు నెలలు పట్టవచ్చు. కానీ, తరచూ రెండు నుంచి 4 వారాల్లో లక్షణాలు కనిపిస్తాయి.
జ్వరం, చెమటలు పట్టడం, అలసట, ఆకలి లేకపోవడం, తలనొప్పి, బరువు తగ్గడం, కండరాల నొప్పులు లాంటి లక్షణాలు చాలాకాలం వరకూ ఉండవచ్చు.
మాటిమాటికీ జ్వరం రావడం, కీళ్ల నొప్పులు, వృషణాల వాపు, గుండె లేదా కాలేయం వాపు, అలసట, డిప్రెషన్ లాంటి కొన్ని లక్షణాలు ఎప్పటికీ పోకపోవచ్చు.
కొన్ని సార్లు చాలా తేలికపాటి లక్షణాలు కనిపిస్తాయి

ఫొటో సోర్స్, BSIP
చైనాలో ఇది ఎలా మొదలయ్యింది
గత ఏడాది జులై-ఆగస్టులో ఒక ఫ్యాక్టరీ నుంచి లీక్ అయిన ఈ బ్యాక్టీరియా గాలిలో వ్యాపించింది.
ఈ బ్యాక్టీరియా చికిత్స కోసం తయారయ్యే బ్రుసీలా వ్యాక్సీన్ ఉత్పత్తి కోసం గడువుతీరిన కీటకనాశినులు ఉపయోగించారు. దాంతో ఈ బ్యాక్టీరియా ఉన్న తుంపరలు గాలిలో లీక్ అయ్యాయి.
ఆ తర్వాత లాంజోవు వెటర్నరీ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌కు దగ్గరగా ఉన్న వారికి ఇది గాలి ద్వారా వ్యాపించిందని, మనుషులలో ఈ వ్యాధి లక్షణాలు కనిపించడం మొదలైందని చెబుతున్నారు.
ఆ తర్వాత ఎలాంటి చర్యలు చేపట్టారు
ఈ వ్యాధి వ్యాపించిన కొన్ని నెలల తర్వాత ఫ్యాక్టరీ నుంచి జరిగిన లీక్ గురించి ప్రాంతీయ, మునిసిపల్ అధికారులు దర్యాప్తు ప్రారంభించారని లాంజోవు హెల్త్ కమిషన్ ప్రకటించిందని ఏఎన్ఐ చెప్పింది..
బ్యాక్టీరియా లీకేజీతో జనవరి వరకూ ఈ ఫ్యాక్టరీ వ్యాక్సీన్ ఉత్పత్తి లైసెన్స్ రద్దు చేశారు. మొత్తం 7 జంతువుల కోసం ఫ్యాక్టరీలో తయారయ్యే మందుల అప్రూవల్ నంబర్ రద్దు చేశారు.
దీంతో, ఫ్యాక్టరీ ఫిబ్రవరిలో బహిరంగ క్షమాపణ కోరిందని, ఈ లీకేజీకి కారణమైన 8 మందిపై కఠిన చర్యలు తీసుకుందని ఏఎన్ఐ చెప్పింది.

ఫొటో సోర్స్, SMITH COLLECTION/GADO/GETTY IMAGES
హంటా వైరస్ ప్రభావం కూడా తగ్గింది
యునాన్ ప్రాంతంలో హంటా వైరస్ వల్ల మార్చి 23న ఒక వ్యక్తి చనిపోయాడని ఇదే ఏడాది గ్లోబల్ టైమ్స్ వార్త ప్రచురించింది.
హంటా వైరస్ ఎలుకల నుంచి వ్యాపిస్తుంది. ఎలుకల మలమత్రాలు లేదా లాలాజలం తగిలిన చేతులను ముఖాలపై పెట్టుకుంటే హంటా వైరస్ మనుషులకు వ్యాపించే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
అయితే సాధారణంగా హంటా వైరస్ ఒకరి నుంచి మరొకరికి వ్యాపించదు.ఈ వైరస్ లక్షణాలు బయటపడడానికి వారం నుంచి 8 వారాల సమయం పడుతుంది.
ఒక వ్యక్తికి హంటా వైరస్ సోకితే, అతడికి జ్వరం, ఒళ్లు నొప్పులు, జలుబు, వాంతులు లాంటి లక్షణాలు కనిపించవచ్చు.
హంటా వైరస్ వచ్చిన వారి పరిస్థితి దిగజారితే ఊపిరితిత్తుల్లో నీరు చేరుతుంది, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటుంది.
2019 జనవరిలో హంటా వైరస్ వ్యాపించి పెటాగోనియాలో 9 మంది చనిపోయారు. ఆ తర్వాత పర్యాటకులను ఈ వైరస్ గురించి హెచ్చరించారు.
అప్పటి నుంచి ఒక అంచనా ప్రకారం మొత్తం 60 హంటా వైరస్ కేసులు వెలుగులోకి వచ్చాయి. వీరిలో 50 మందిని క్వారంటీన్లో ఉంచారు.
హంటా వైరస్ వల్ల మరణాల రేటు 38 శాతం ఉందని, ఈ వ్యాధికి ఒక నిర్ధారిత చికిత్స అంటూ లేదని అమెరికా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ చెప్పింది.
ఇవి కూడా చదవండి:
- భారతదేశంలో అసలు కరోనావైరస్ కేసుల సంఖ్య 10 కోట్లు దాటిపోయిందా?
- సముద్రపు దొంగలను పట్టిస్తున్న అరుదైన పక్షి ఇది..
- మోదీ కేబినెట్లో మంత్రి రాజీనామాకు కారణమైన మూడు బిల్లుల్లో ఏముంది.. వాటి వల్ల రైతులకు లాభమా, నష్టమా?
- 40 ఏళ్ల కిందట చోరీ అయిన సీతారామ లక్ష్మణుల విగ్రహాలు బ్రిటన్‌లో ఎలా దొరికాయి?
- హుస్సేన్‌సాగర్‌లో దూకి ఆత్మహత్యకు ప్రయత్నించిన 114 మందిని ఈయనే కాపాడారు
- #విమెన్ హావ్ లెగ్స్: మహిళలు కాళ్లు కనిపించేలా బట్టలు ధరించకూడదా?
- పాకిస్తాన్‌తో యుద్ధానికి భారత సైన్యంలోని ముస్లిం రెజిమెంట్ నిరాకరించిందా? Fact Check
- కరోనావైరస్ లక్షణాలు ఏమిటి? పిల్లల్లో ఎటువంటి లక్షణాలు కనిపిస్తాయి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- తెలంగాణ కొత్త రెవెన్యూ చట్టం: మీ భూమి మీదేనని అధికారికంగా చెప్పేది ఎవరు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








