భారత్‌లో 40 ఏళ్ల కిందట చోరీకి గురైన ఆ అరుదైన విగ్రహాలు బ్రిటన్‌లో ఎలా బయటపడ్డాయి?

విగ్రహాలు

ఫొటో సోర్స్, Met Police

దక్షిణ భారత దేశంలో 40 ఏళ్లకు కిందట చోరీకి గురైన మూడు కాంస్య విగ్రహాలు బ్రిటన్‌లో బయటపడ్డాయి. వీటిని భారత అధికారులకు బ్రిటన్ అప్పగించింది. అసలు ఈ విగ్రహాలు ఎలా వెలుగులోకి వచ్చాయో అనే అంశంపై బీబీసీ ప్రతినిధి యోగితా లిమాయే అందిస్తున్న కథనం.

ఈ కాంస్య విగ్రహాలు హిందూ దేవతలైన రాముడు, ఆయన భార్య సీత, సోదరుడు లక్ష్మణుల విగ్రహాలను పోలి వున్నాయి.

ఇవి 15వ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్యానికి చెందినవి. 1978లో తమిళనాడులోని ఆనందమంగళం గ్రామంలో ఇవి చోరీకి గురయ్యాయి. 15వ శతాబ్దంలో విలసిల్లిన ప్రముఖ ప్రపంచ వాణిజ్య కేంద్రాల్లో విజయనగర సామ్రాజ్యమూ ఒకటి.

ఏళ్ల తరబడి పోలీసులు, దౌత్యవేత్తలు, ఓ కళాభిమానుల బృందం చేసిన కృషి వల్ల ఈ విగ్రహాలు వెనక్కి వస్తున్నాయి.

నాలుగేళ్ల క్రితం వీటిలో ఒక విగ్రహం ఫోటో.. బ్రిటిష్ యాంటీక్ డీలర్స్ అసోసియేషన్ వెబ్‌సైట్‌లో కనిపించింది. చోరీ అయిన విగ్రహాలను వెనక్కి తీసుకొచ్చే సంస్థ ఇండియా ప్రైడ్ ప్రాజెక్ట్ సభ్యుడు దీన్ని గుర్తించారు.

కాంస్య విగ్రహాలు

ఫొటో సోర్స్, High Commissioner of India, UK

''అది విజయనగర కాలంనాటి విగ్రహమని మేం గుర్తించాం. అయితే అది రాముడిదో లేక లక్ష్మణుడిదో తేల్చలేకపోయాం. ఎందుకంటే విగ్రహ భంగిమల్లో కొంత తేడాలున్నాయి''అని ఇండియా ప్రైడ్ ప్రాజెక్ట్ కో-ఫౌండర్ ఎస్ విజయ్ కుమార్ తెలిపారు.

దక్షిణ భారత దేశంలోని ఓ చారిత్రక ఆలయాల్లో ఇలాంటి లక్ష్మణుడి విగ్రహం చోరీకి గురైనట్లు ఈ బృందం గుర్తించింది. తాజా విగ్రహ ఫోటోలను అక్కడుండే ఇతర విగ్రహాలతో సరిపోల్చింది.

''అదే శైలిలో విగ్రహాలుండే దేవాలయాలను మేం జల్లెడపట్టాం. అయితే మూడేళ్ల వరకూ మాకు ఎలాంటి స్పష్టమైన సమాచారమూ లభించలేదు''అని విజయ్ కుమార్ చెప్పారు.

గత ఏడాది గ్రూప్‌కు చెందిన వలంటీర్లు.. లండన్‌లోని ఇండియన్ కళాకృతులు అమ్ముతున్న ఓ ప్రదర్శన చూశారు. అక్కడ వారికి కాంస్యంతో తయారుచేసిన మరో విగ్రహం కనిపించింది. అయితే దాని కిరీటం కొంచెం భిన్నంగా ఉంది.

అప్పుడే ఈ కేసు.. ఒకటి రెండు విగ్రహాలది కాదు, మొత్తం విగ్రహాల చోరీకి సంబంధించినదని అర్థమైంది.

దీంతో వారి అన్వేషణ ఆ దిశగా మొదలైంది. దక్షిణ భారత దేశంలోని ఫ్రెంచ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పుదుచ్చేరి ఆర్కైవ్స్‌లో దీనికి సంబంధించి వారికి కీలకమైన ఆధారాలు దొరికాయి.

1958 జూన్ 15న తీసిన ఓ ఫోటో వారికి కనిపించింది. దీనిలో ఆనందమంగళం గ్రామంలో శ్రీ రాజగోపాల స్వామి దేవాలయంలోని విగ్రహాల పూర్తి సెట్ కనిపిస్తోంది.

వెంటనే యూకేలోని భారత హైకమిషన్‌ను సంస్థ ఆశ్రయించింది. 2019 సెప్టెంబరులో దీనికి సంబంధించిన సమాచారాన్ని అక్కడి మెట్రోపాలిటన్ పోలీసులకు భారత అధికారులు అందించారు. ఆ విగ్రహాలని విక్రయించకుండా ఆపాలని వారు కోరారు.

కాంస్య విగ్రహం

ఫొటో సోర్స్, NGA

ఫొటో క్యాప్షన్, భారత్‌లో చోరీకి గురైన ఈ విగ్రహాన్ని2014లో ఆస్ట్రేలియా వెనక్కి ఇచ్చింది

''మేం ఆ విగ్రహాలు అమ్ముతున్న డీలర్‌ను గుర్తించాం. విచారణలో ఆయన మంచి వ్యక్తిలానే అనిపించారు. ఆయన ఎలాంటి నేరమూ చేయనట్లు దర్యాప్తులో తేలింది''అని పోలీసులు తెలిపారు.

భారత్‌లో తమిళనాడు పోలీసుల్లోని విగ్రహాల విభాగానికి చెందిన డిటెక్టివ్‌లు ఆనందమంగళం గ్రామానికి వెళ్లారు.

దీంతో ఆ విగ్రహాలు చోరీకి గురయ్యాయని స్థానికులు ధ్రువీకరించారు. దీనిపై లిఖిత పూర్వత ఆధారాల కోసం స్థానిక పోలీస్ స్టేషన్ రికార్డులతోపాటు మరికొన్ని దస్త్రాలను అధికారులు పరిశీలించారు.

ఈ ఏడాది జనవరిలో వారు వెతుకుతున్న ఆధారాలు లభించాయి.

1978 నవంబరు 24కు ముందు రోజు రాత్రి ఈ విగ్రహాలు చోరీకి గురైనట్లు ఓ ఫిర్యాదు వారికి కనిపించింది.

1988లో ఈ కేసుకు సంబంధించి ముగ్గురిని దోషులుగా నిర్ధారించినట్లు కోర్టు రికార్డులూ వారికి లభించాయి,

ఈ ముగ్గురు దోషులకూ తొమ్మిది నెలల జైలు శిక్ష విధించినట్లు తమిళనాడు పోలీసు వర్గాలు బీబీసీకి తెలిపాయి. ఆ విగ్రహాలను గుర్తుతెలియని వ్యక్తులకు విక్రయించానని ప్రధాన నిందితుడు పేర్కొన్నారు. అయితే ఈ విగ్రహాలు బ్రిటన్‌కు ఎలా చేరాయో అంతుచిక్కని మర్మంగానే మిగిలిపోయింది.

ఆ విగ్రహాలు అక్కడి విగ్రహాల చిత్రాలతో సరిపోలాయని తెలిసిన వెంటనే వాటిని అమ్మకానికి పెట్టిన వ్యక్తి స్వచ్ఛంద ఇచ్చేందుకు ముందుకు వచ్చాని మెట్రోపాలిటన్ పోలీసులు తెలిపారు.

అంతేకాదు, ఆయన దగ్గర అదే సెట్‌కు చెందిన మరో రెండు విగ్రహాలు కూడా కనిపించాయి.

విగ్రహాలు

కరోనావైరస్ వ్యాప్తి నడుమ ఈ విగ్రహాల అప్పగింత కొద్దిగా ఆలస్యమైంది. ఈ నెల 15న ఇవి భారత అధికారుల చెంతకు చేరాయి.

మరికొన్ని రోజుల్లో వీటిని భారత్‌కు తిప్పి పంపిస్తామని బ్రిటన్‌లోని భారత హైకమిషన్ అధికారులు తెలిపారు.

అయితే, ఇప్పటికీ ఈ సెట్ అసంపూర్ణంగానే ఉంది.

దీనిలో నాలుగోది హనుమంతుడి విగ్రహం. ఇది సింగపూర్‌లోని ఒక మ్యూజియంలో ఉన్నట్లు భావిస్తున్నామని భారత అధికారులు.. బీబీసీకి తెలిపారు.

ఈ విగ్రహాలను అమ్మడం ద్వారా కొన్ని మిలియన్ డాలర్లు వచ్చి ఉండొచ్చని అధికారులు వివరించారు.

''అవి వెలకట్టలేని విగ్రహాలు. అవి కేవలం కళాకృతులు మాత్రమే కాదు. వాటిని చాలా మంది భక్తితో కొలిచేవారు. కళాకృతులను కొనేవారు ఈ విషయాన్ని గమనించాలి''అని విజయ్ కుమార్ వ్యాఖ్యానించారు.

''భక్తితో కొలిచే ఈ విగ్రహాలను ఇలా ప్రదర్శనకు పెడుతుంటే.. వీటిని పరిరక్షించేవారు ఎంతో బాధపడతారు''

(పరిశోధనలో సాయం చేసినవారు శాలూ యాదవ్)

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)