మొజాంబిక్: నగ్నంగా పరుగెడుతున్న మహిళపై 36 రౌండ్లు కాల్పులు జరిపారు.. ఎవరు.. ఎందుకలా చంపేశారు?

మొజాంబిక్ వీడియోలో సాయుధులు
ఫొటో క్యాప్షన్, మొజాంబిక్ వీడియోలో సాయుధులు

సోషల్‌ మీడియాలో ఒక వీడియో షేర్ అవుతోంది. ఇందులో తుపాకులు పట్టుకున్న నలుగురు ఒంటిపై దుస్తులు లేకుండా పరుగులు తీస్తున్న మహిళను వెంబడిస్తున్నారు. ఆ వీడియోలో వాళ్లు ఆమెను కొడుతున్నారు.

కాసేపటి తర్వాత వారు ఆమెపై బుల్లెట్ల వర్షం కురిపించారు. ఆ మహిళ అక్కడికక్కడే చనిపోయింది.

ఘటన జరిగింది ఇక్కడే

ఫొటో సోర్స్, Google maps

ఈ ఘటన ఎక్కడ జరిగింది?

ఇది ఏ ప్రాంతంలో జరిగింది? దీన్ని తెలుసుకోవడం కోసం బీబీసీ, మరికొందరు ప్రయత్నించారు. ఆన్‌లైన్ టూల్స్ ఉపయోగించి ఇదెక్కడ జరిగిందో గుర్తించారు.

అంతర్యుద్ధంతో అల్లాడుతున్న ఉత్తర మొజాంబిక్‌ ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు తేలింది. వాళ్లు నడుస్తున్న రోడ్డు ఓవాసీ అనే చిన్న పట్టణానికి కొద్ది దూరంలో ఉంది. అక్కడున్న బిల్‌బోర్డులు (సైన్‌బోర్డులు) అదే విషయాన్ని చెబుతున్నాయి.

ఆ ప్రాంతంలో మూడు చెట్లు, తెలుపు రంగు రేకులున్న షెడ్డు కనిపిస్తున్నాయి. ఈ ప్రాంతం ఎక్కడిది అన్న విషయంలో ఎలాంటి అనుమానం లేదు.

ప్రభుత్వ బలగాలు

ఫొటో సోర్స్, AFP

ఎప్పుడు జరిగింది?

అక్కడ నిలబడ్డ మనుషుల నీడల కోణాన్ని చూస్తే అది ఏప్రిల్ లేదా సెప్టెంబర్‌ నెలల్లో జరిగి ఉంటుందనిపిస్తోంది. అయితే ఈ వీడియో సెప్టెంబర్‌నాటిది అనడానికి మరికొన్ని ఆధారాలున్నాయి.

ఎందుకంటే ఆ సమయంలో తిరుగుబాటుదారులను అణచివేసేందుకు సైన్యం అక్కడే ఉంది. ఎండిపోయినట్లు కనిపిస్తున్న గడ్డి సెప్టెంబర్‌నాటిదే అనేందుకు సాక్ష్యంగా కనిపిస్తోంది.

యూనిఫాం, ఇతర ఆనవాళ్లను బట్టి వారు మొజాంబిక్ సైనికులను గుర్తించారు
ఫొటో క్యాప్షన్, యూనిఫాం, ఇతర ఆనవాళ్లను బట్టి వారు మొజాంబిక్ సైనికులుగా గుర్తించారు

ఎవరా సాయుధులు?

ఈ దారుణ హత్యకు పాల్పడింది ఎవరు ? ఆ మహిళ చేసిన తప్పేంటి ?

వీడియోలో కనిపించిన రోడ్డు ఖాళీగా ఉంది. పరిస్థితిని చూస్తుంటే, అక్కడున్న వాళ్లంతా పారిపోగా, ఆ మహిళ అక్కడ చిక్కుకుపోయినట్లు కనిపిస్తోంది.

“వారు వేసుకున్న దుస్తులను బట్టి ఆ హంతకులు ఎవరో గుర్తించవచ్చు. వారు వేసుకున్న డ్రెస్‌ మొజాంబిక్‌ సైన్యం యూనిఫాంలా ఉంది. నల్ల రంగు బూట్లు, భుజం మీద కనిపించే చిహ్నాలు చూస్తే అవి సైనికులవే అన్నట్లుంది” అన్నారు డేవిడ్‌ మత్సిన్హే.

ఆయన ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌లో పరిశోధకుడిగా పని చేస్తున్నారు.

వాళ్లు మాట్లాడిన మాటలు కూడా సైనికులే అన్న అనుమానాలను బలపరుస్తున్నాయి.

“నువ్వు అల్‌-షబాబ్‌ గ్రూప్‌లో పని చేస్తావు కదూ’’ అంటూ వారు ప్రశ్నించడాన్ని బట్టి చూస్తే, ఆమె తిరుగుబాటుదారు అన్న అనుమానంతో కాల్చినట్లు అర్థమవుతోంది.

అల్‌-షబాబ్‌ అనేది ఆ ప్రాంతంలో తిరుగుబాటుకు నాయకత్వం వహిస్తున్న ఒకానొక ఇస్లామిక్‌ గ్రూప్‌

“ఈ వీడియోలోని వ్యక్తులు పోర్చుగీసు భాషలో మాట్లాడుతున్నారు. చూడటానికి సైనికుల్లా ఉన్నారు. తిరుగుబాటుదారులు స్వాహిలి మాట్లాడతారు ’’ అన్నారు హ్యూమన్‌ రైట్స్‌ వాచ్‌లో పని చేస్తున్న జెనైదా మచాడో. “కొంతమంది అరబిక్‌, మకువా, మకొండే భాషలు కూడా మాట్లాడతారు” అని ఆమె వివరించారు.

స్థానిక మీడియా ఒక అనుమానిత సైనికుడిని గుర్తించిది. కానీ ఆ తర్వాత అతను హత్యకు గురయ్యారు.

మొజాంబిక్‌ ప్రభుత్వం దీనిపై విచారణ జరుపుతామని ప్రకటించింది. అయితే ఈ వీడియో నకిలీదని, కొందరు కావాలనే దాన్ని మార్చి ఆన్‌లైన్‌లో ఉంచారని ఆ దేశ ప్రభుత్వం అనుమానిస్తోంది.

నిజానికి అది అసాధ్యం కూడా కాదు. ఈ ఏడాది ప్రారంభంలో తిరుగుబాటుదారులు సైన్యానికి చెందిన సామగ్రిని దోచుకున్నారు.

సైన్యం దుస్తులు ధరించి, తుపాకులు పట్టుకుని పట్టణాలను ఆక్రమించుకునే ప్రయత్నం చేశారు.

సైన్యానికి మా రక్షణ కన్నా అయిల్ కంపెనీల రక్షణే చాలా ముఖ్యమని ప్రజలు ఆరోపిస్తున్నారు

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్, సైన్యానికి మా రక్షణ కన్నా అయిల్ కంపెనీల రక్షణే చాలా ముఖ్యమని ప్రజలు ఆరోపిస్తున్నారు

ఇలా ఎందుకు చేశారు ?

కాల్చింది, చనిపోయింది ఎవరైనా, ఎలాంటి వారైనా ఈ వీడియో భయానకమైన వీడియో అని చెప్పక తప్పదు. అయితే మొజాంబిక్‌లో ఇలాంటివేమీ కొత్తకాదు. ఈ తరహా వీడియోలు ఎన్నో ఆన్‌లైన్‌లో కనిపిస్తుంటాయి.

మనుషులను హింసిస్తున్నట్లు, చంపుతున్నట్లు సైనికులు, తిరుగుబాటుదారులు ఎవరికి వారు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.

ఒక వీడియోలో ఆర్మీ దుస్తుల్లో ఉన్న ఓ వ్యక్తి బతికి ఉన్న మరో వ్యక్తిని స్మశానం వైపు లాక్కెళ్తుండడం కనిపిస్తుంది.

ప్రజలను రెచ్చగొట్టడానికి ఇస్లామిక్‌ తిరుగుబాటుదారులు ఉద్దేశపూర్వకంగానే ఇలాంటి వీడియోలను తయారు చేస్తుంటారనే అనుమానాలు కూడా ఉన్నాయి.

ఉద్యమిస్తున్న ప్రజలను, తిరుగుబాటుదారులను భయపెట్టడానికి కొందరు సైనికులు కూడా ఇలాంటి హింసాత్మక వీడియోలను తయారు చేస్తుంటారని చెబుతున్నారు.

ఈ ప్రాంతంలో హింస రోజురోజుకు పెరుతుండటంతో లక్షలమంది ప్రజలు దేశం విడిచిపారిపోతున్నారు.

మొజాంబిక్‌ తీర ప్రాంతంలో పెద్ద ఎత్తున గ్యాస్‌ నిక్షేపాలు ఉన్నట్లు తేలడంతో అక్కడ పెద్దపెద్ద నిర్మాణాలు చేపట్టి గ్యాస్‌ వెలికితీత పనులు చేస్తున్నారు. అయితే తిరుబాటుదారులు అక్కడ పని చేస్తున్న సంస్థలను భయపెట్టడానికి ప్రయత్నిస్తున్నాయి.

“బాధిత ప్రజలతో మాట్లాడినప్పుడు, సైన్యానికి మా రక్షణ కన్నా అయిల్ కంపెనీల రక్షణే చాలా ముఖ్యమని వాపోయారు. భద్రతపై ప్రజలకు భరోసా కల్పించడంలో ప్రభుత్వం విఫలమైంది’’ అన్నారు మచాడో.

ఏది ఏమైనా ఈ వీడియోలో ఉన్నది ఎవరు, ఎందుకు ఒక మహిళను చంపారు అన్నదానిపై మిస్టరీ కొనసాగుతూనే ఉంది. ఇలాంటి వివాదాలు ఎన్ని ఉన్నా మొజాంబిక్‌లో హింస కొనసాగుతూనే ఉంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)