‘ఫెయిర్ అండ్ లవ్లీ’ పేరు మారింది.. శరీరం రంగుపై సమాజం తీరు మారుతుందా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, బ్రిష్తి బసు
- హోదా, బీబీసీ ఫ్యూచర్
ఒక జాతి సమూహంలో శ్వేతవర్ణం వారికి అనుకూలంగా వ్యవహరించే పక్షపాత ధోరణే కలరిజం.
ప్రపంచవ్యాప్తంగా ఎన్నో సమాజాలపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నా, దీని గురించి ఇప్పటి వరకూ పెద్దగా చర్చ జరగలేదు. న్యూజీలాండ్‌లో ఉంటున్న హర్షరీన్ కౌర్, మొదటిసారి తమ పూర్వీకుల స్వస్థలం భారత్‌కు వచ్చినపుడు తమ చర్మం రంగు మార్చుకునేందుకు ఇక్కడి వారిపై ఎంత ఒత్తిడి ఉందో చూసి షాక్ అయ్యారు.
త్వరలో విడుదలయ్యే సినిమాలను ప్రదర్శిస్తూ పెట్టిన పెద్ద పెద్ద హోర్డింగులు, దేశ సినీ పరిశ్రమలో తెల్లగా ఉన్న నటులు, నటీమణులు మాత్రమే పైకి రాగలరని చెబుతున్నాయి. టీవీలో వచ్చే చర్మ సంరక్షణ ఉత్పత్తుల ప్రకటనలు కూడా ఉద్యోగం, భర్త వచ్చే అవకాశాలు తెల్లగా ఉన్న మహిళలకే ఎక్కువని, వారు సంతోషంగా కూడా ఉంటారని ఊదరగొడుతుంటాయి.
“న్యూజీలాండ్‌లో గార్నియర్, లోరియల్ కంపెనీలు తమ ఉత్పత్తులను అలాంటి ప్రచారం చేసుకోవడం నేను ఎప్పుడూ చూళ్లేదు. కానీ భారత్‌లో ఎక్కడ చూసినా ఆ ప్రకటనలే కనిపిస్తున్నాయి” అన్నారు ఇండియన్ ఫెమినిస్ట్ అనే ఇన్‌స్టాగ్రామ్ పేజ్ నడుపుతున్న కౌర్.
ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వెల్లువెత్తడంతో ‘వైట్’, ‘ఫెయిర్‌నెస్’, ‘లైట్’ లాంటి పదాలను తమ చర్మ ఉత్పత్తులన్నింటి నుంచీ, ముఖ్యంగా తమ గార్నియర్ ఉత్పత్తుల నుంచి తొలగిస్తున్నట్లు ఈ ఏడాది జూన్‌లో లోరియల్ సంస్థ ప్రకటించింది. శరీరాన్ని తెల్లబరుస్తాయని చెప్పే ఈ కంపెనీ ఉత్పత్తులను దక్షిణాసియా దేశాల్లో విస్తృతంగా అమ్ముతున్నారు.
జనాభాలో ముదురు రంగు చర్మం వారు ఎక్కువగా దేశంలో ఇదంతా జరుగుతోంది. భూమధ్య రేఖకు దగ్గరగా నివసించే వారికి సూర్యుడి అతినీలలోహిత కిరణాల నుంచి ఇవి తగిన రక్షణను అందిస్తాయంటూ ప్రచారం చేస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
కలరిజం- వివక్ష
ఒకే జాతి సమూహంలో తెల్లగా ఉండే వారికి అనుకూలంగా వ్యవహరించడాన్ని కలరిజం అంటారు. నల్లజాతి సమాజాల్లో విస్తృత చర్చకు కారణమైన ఈ కలరిజం వల్ల ఎంతోమంది మానసిక ఒత్తిడికి గురవుతున్నా, ప్రాణాలు కూడా పోతున్నా.. దక్షిణాసియాలో ఇటీవలి వరకూ దీని గురించి పెద్దగా చర్చ జరగలేదు.
కానీ ఈ ఏడాది మేలో జార్జి ఫ్లాయిడ్ హత్యతో ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు, వర్ణవివక్షకు వ్యతిరేకంగా పెద్దఎత్తున చర్చలు జరిగాయి. ఇవి దక్షిణాసియా దేశాల్లో, విదేశాల్లోని ఆ దేశాల వారిలో ఒక సామాజిక జాగృతిని తీసుకొచ్చాయి..
నెట్‌ఫ్లిక్స్ లో కొత్తగా వచ్చిన ఇండియన్ మాచ్‌మేకింగ్ అనే రియాలిటీ సిరీస్‌లో కథానాయకురాలి గురించి కూడా పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. ప్రపంచమంతా తిరిగే ఈ భారత మహిళ.. తన ఖాతాదారులు పెళ్లి చేసుకోడానికి తెల్లగా ఉన్న యువతీయువకులనే వెతుకుతుంటారు. వారికే అధిక ప్రాధాన్యం ఇస్తుంటారు. వారి రంగును కచ్చితంగా అవసరమైన ఒక అర్హతగా చూస్తుంటారు.
ఈ ఆందోళనలతో, పాప్ కల్చర్‌లోని వివక్షాపూరిత వైఖరి బహిర్గతమైన నేపథ్యంలో ఈ వర్ణ వివక్షను వ్యతిరేకించే గొంతులు పెరిగాయి.
ఫెయిర్ & లవ్లీ
కలరిజంపై విమర్శల సమయంలో దీనిపై కొన్ని సంస్థలు స్పందించాయి. ప్రముఖ చర్మ సంరక్షణ ఉత్పత్తి ఫెయిర్ & లవ్లీని తయారు చేసే యూనీలీవర్ తాము తయారు చేసే అన్ని చర్మ సంరక్షణ ఉత్పత్తుల నుంచి ‘ఫెయిర్ నెస్’, ‘వైటెనింగ్’, ‘లైటెనింగ్’ అనే పదాలను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఫెయిర్ & లవ్లీ బ్రాండ్ పేరును గ్లో & లవ్లీగా మార్చింది.
తమ బ్రాండ్‌లో మార్పులు ఇప్పటికే జరుగుతున్నాయని, కానీ, ఇటీవలి ఘటనలు వెలుగుచూసిన తర్వాత వాటిని వేగవంతం చేశామని సంస్థ ప్రతినిధి చెప్పారు.
ఫెయిర్ అండ్ లవ్లీని, కంపెనీ ఉత్పత్తులను పూర్తిగా వెనక్కు తీసుకోవాలని విస్తృతంగా పిటిషన్లు వచ్చాయి. అంతేకాదు వర్ణ వివక్షను విమర్శిస్తూనే మార్కెట్లో వాటి అమ్మకాలు కొనసాగించి ఏడాదికి 256 మిలియన్ యూరోల లాభాలు సంపాదించిన కంపెనీ సీఈఓ అలన్ జోప్‌పై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి.
దీని పేరును పేరును గ్లో & లవ్లీగా మార్చడంతో కంపెనీని కొంతమంది నుంచి ప్రశంసలు కూడా లభించాయి. కానీ, ఇది సరిపోదని, ఆ ఉత్పత్తులు షాపుల్లో ఇంకా అలాగే ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
'గ్లో' పదంపై విమర్శలు
“ఇది వేరేగా ఉందేమో నాకు తెలీదు. ఎందుకంటే నేను గుర్తించదగిన బ్రాండ్లలో ఇది ఒకటి కాబట్టి నేను వారిని అభినందిస్తున్నాను. కానీ గ్లో & లవ్లీ పేరు వినగానే నాకు నిరుత్సాహం కలిగింది. ఎందుకంటే ‘గ్లో’ అంటే ‘లైటెనింగ్’ అని మరోలా చెప్పినట్టే కదా” అంటారు వెర్మాంట్ యూనివర్సిటీ సోషియాలజీ ప్రొఫెసర్ నిక్కీ ఖన్నా.
జాతి సంబంధాలు, కలరిజం గురించి ఆమె 20 ఏళ్లకు పైగా అధ్యయనం చేస్తున్నారు.
“గ్లో అనే పదం మార్చినా, ఏళ్ల తరబడి వారి ఉత్పత్తిని కొనేలా ఆకర్షిస్తున్నది మాత్రం, దానిపై ఆ తెల్లగా(ఒక మహిళ) మెరిసే ఫొటోనే. మనం మళ్లీ రీప్యాకేజింగ్ చూడాలని నా కోరిక. రీప్యాకేజింగ్ అంటే ఈ ఉత్పత్తిని పూర్తిగా తొలగించడం అని నా ఉద్దేశం” అన్నారు నిక్కీ ఖన్నా.
కలరిజం పరిణామాలు
దీనిపై ఇంకా చాలా పరిశోధనలు జరగాల్సి ఉన్నా.. కలరిజం వల్ల కలిగే నష్టాలను ఎన్నో అధ్యయనాలు వెలుగులోకి తెచ్చాయి. వాటిలో మానసిక ఆరోగ్యంపై చూపే ప్రభావం ఒకటి.
ఉదాహరణకు ఆసియన్-అమెరికన్ మహిళల్లో నిరాశకు, వర్ణ వివక్షకు మధ్య పరస్పర సంబంధముందని ఒక అధ్యయనం తేల్చింది.
“చారిత్రకంగా చాలా సమాజాలు ‘నలుపు’ను అశుభంగా భావిస్తాయి. వారు (ముదురు రంగు చర్మం ఉన్న వారు) మురికిగా ఉంటారని, పెద్దగా చదువుకోరని చాలా అర్థాలు తీస్తారు. జనం దానిని కాలక్రమేణా లోలోపల, బయట తమ సమూహాల్లో ప్రచారం చేశార”ని ఆరిజోనా స్టేట్ యూనివర్సిటీ సైకాలజీ కౌన్సిలింగ్ ప్రొఫెసర్, ఈ అధ్యయన రచయితల్లో ఒకరైన అలీసియా ట్రాన్ చెబుతున్నారు.
“దక్షిణాసియా సమాజంలోని కుల వ్యవస్థ, సామాజిక సోపాన క్రమంలో దీనికి ఒక సుదీర్ఘ చరిత్ర ఉంది”.
భారత్‌లో పెళ్లి సంబంధాలు
ఇండియన్ మ్యాచ్‌మేకింగ్‌లో చూపించినట్లే రంగుల ఆదర్శాలను అమలుచేసే పాత తరం ప్రముఖ వ్యక్తీకరణల్లో వివాహం ఒకటి. దక్షిణాసియా సమాజాల్లో తల్లిదండ్రులు తమ పిల్లలు పెద్దవారు కాగానే, అమ్మాయిలు ఉన్న కుటుంబాల వారిని కలిసి వివాహ ఏర్పాట్లు చేయడం సర్వ సాధారణం. పెద్దలు ఒక జంటను ఆమోదించినప్పుడు మాత్రమే ఆ యువ జంట కలిసి జీవితం గడపగలుగుతుంది.
అయితే ఇటీవల చాలామంది యువతీయువకులు ప్రేమ పెళ్లిళ్ల దారిలో వెళ్తున్నారు. అలా తమకు నచ్చిన భాగస్వాములను ఎన్నుకుంటున్నారు. దీనికోసం వారు కొన్నిసార్లు తమ కుటుంబాలకు విడిపోయే ప్రమాదం కూడా వస్తోంది.
ముదురు రంగు చర్మం ఉన్న అబ్బాయిలతో పోలిస్తే తెల్లగా ఉన్న అబ్బాయిలకే తమ కూతుళ్లను ఇవ్వడానికి అమ్మాయిల తల్లులు ప్రాధాన్యం ఇస్తారని భారత్‌లో పెద్దలు కుదిర్చిన వివాహాలపై జరిగిన ఒక అధ్యయనంలో తేలింది.

ఫొటో సోర్స్, Getty Images
పెళ్లి ప్రకటనలు
ఇక్కడ కనిపించేవి ఏమాత్రం ఆశ్చర్యంగా అనిపించవు. వార్తాపత్రికల్లో వివాహ ప్రకటనల్లో తెల్లగా ఉన్న అమ్మాయిలకే ప్రాధాన్యం ఇవ్వడం మనం దశాబ్దాలుగా చూస్తూనే ఉన్నాం. అబ్బాయిలను ఆకర్షించేందుకు ఈ ప్రకటనల్లో తరచూ తెల్లగా ఉన్న మహిళలనే హైలైట్ చేస్తుంటారు.
పెళ్లిళ్ల వెబ్‌సైట్లు కూడా అందులో నమోదయ్యే యూజర్లు ‘ఫెయిర్’, ‘వీటిష్’ నుంచి ‘డస్కీ’(నల్లగా) వరకూ వివరణ ఉన్న ఒక స్కేలు ఉపయోగించి తమ చర్మం రంగును ఎంట్రీ చేయాలని అడుగుతుంటాయి. తర్వాత చర్మం రంగును ఒక ఫిల్టర్‌గా ఉపయోగించి యూజర్లు తమకు కాబోయే జీవిత భాగస్వామి ఏ రంగులో ఉండాలో ఎంచుకునేలా చేస్తారు.
స్కిన్ ఫిల్టర్స్
“న్యూస్ పేపర్ చర్మం రంగును ఫిల్టరింగ్ మెకానిజంలో ఒకటిగా ఉపయోగించాయి. మేం కూడా అదే చేశాం. యూజర్స్ పెరిగి, కంపెనీ అభివృద్ధి చెందిన తర్వాత, నాలుగైదేళ్ల క్రితం స్కిన్ ఫిల్టర్లకు తీసేయాలని మేం నిర్ణయించాం” అని షాదీ.కాం మార్కెటింగ్ డైరెక్టర్ అధీష్ ఝవేరీ చెప్పారు.
కానీ, ఈ స్కిన్ టోన్ ఫిల్టర్ వెబ్‌సైట్‌లో పాక్షికంగా ఇప్పటికీ ఉంది. ఇక్కడ యూజర్లకు ప్రత్యేకంగా ఒక రంగు వారిని వెతకడానికి అవకాశం లేకపోయినా, యూజర్లు ఇంటర్‌ఫేస్‌లో చర్మం రంగు ఎంచుకోవడం మాత్రం ఇప్పటికీ అలాగే ఉంది.
ఈ విషయం ఉత్తర అమెరికాలోని దక్షిణాసియా మహిళల ఫేస్‌బుక్ గ్రూప్‌కు తెలీగానే వారు వెంటనే దానిని షాదీ.కామ్ దృష్టికి తీసుకువస్తూ ఒక పిటిషన్ వేశారు.
“మేం 24 గంటల్లోపే 1,500 సంతకాలు సేకరించాం. దాంతో, షాదీ.కాం ఆ ఫిల్టర్‌ను తొలగించాలని నిర్ణయించింది” అని ఈ పిటిషన్ వేసిన డల్లాస్ వాసి హేతల్ లఖానీ చెప్పారు.
అంతా మారుతోంది
గత దశాబ్దం వరకూ కలరిజంను దక్షిణాసియా సమాజాల్లో పెద్దగా పట్టించుకోకపోయినా, సోషల్ మీడియా, ఇంటర్నెట్ ఇప్పుడు దానిని మారుస్తున్నాయి.
ఖన్నా ఇటీవలి పుస్తకం ‘వైటర్: ఆసియన్ అమెరికన్ వుమెన్ ఆన్ స్కిన్ కలర్ అండ్ కలరిజం’ అనేది అమెరికాలో దక్షిణాసియాకు చెందిన కొంతమంది మహిళలు వర్ణవివక్షపై రాసిన వ్యాసాల సంకలనం.
ఈ పుస్తకం పరిశోధనలో తన అనుభవాలను పంచుకున్న ఆమె “డిజిటల్ ల్యాండ్ స్కేప్ ఇప్పుడు వర్ణవివక్ష లాంటి అంశాలపై చర్చను ఎలా మార్చేస్తోందో చెప్పడానికి ఇది ఒక మంచి ఉదాహరణ” అన్నారు.
సోషల్ మీడియా ప్రచారం
ఖన్నా 2017లో ఫేస్‌బుక్‌లో స్పందనలు కోరడం ద్వారా తన ఈ ప్రాజెక్ట్ ప్రారంభించారు. “నా సోషల్ నెట్‌వర్క్ అవతల ఉన్న మహిళల అభిప్రాయాలు కూడా తెలుసుకునేందుకు సోషల్ మీడియా నాకు ఎంతో సాయం చేసింది” అన్నారు.
కలరిజం అనేది ఆసియలో, విదేశాల్లో ఉంటున్న ఆసియా ప్రజలకు ఒక సమస్య అన్న విషయం చాలామందికి తెలీకపోవడం చూసి మొదట ఆశ్చర్యపోయానని ఖన్నా చెప్పారు.
కానీ ‘డార్క్ ఈజ్ బ్యూటిఫుల్’, ‘#brownisbeautiful’ లాంటి సోషల్ మీడియా ప్రచారాల పుణ్యమా అని అది కాలంతోపాటూ మారింది. ఇలాంటి ప్రచారాల వల్ల ముదురు రంగు చర్మం ఉన్న దక్షిణాసియా వారు తమ అనుభవాలను పంచుకోవడం, నిశ్శబ్దం వీడడం, తమ సమాజాల్లో రంగు గురించి మాట్లాడుకోవడాన్ని మార్చడంలాంటివి ప్రారంభించారు.
ఇలాంటి శతాబ్దాల పురాతన నమ్మకాలను ధ్వంసం చేయడంలో సోషల్ మీడియా కీలక పాత్ర పోషిస్తుందని ట్రాన్ అంగీకరిస్తున్నారు. ముఖ్యంగా వర్ణవివక్షను ప్రశ్నించే భావనలున్నవారిని, ముఖ్యంగా యువతను సోషల్ మీడియా దగ్గర చేసింది. దీనివల్ల కలరిజం, జాత్యహంకారాల విషయంలో తరాల అంతరాలను ఈ యువతరం గుర్తించింది. అంతేకాదు ఇలాంటి వాటిని జీర్ణించుకోలేని వారిని తిరస్కరించాలని కూడా భావిస్తోంది.
“ఈ చిన్న సంభాషణలు, ఈ చిన్న ప్రతిస్పందనలు చాలా పెద్ద భాగంగా మారుతాయి. అవి చివరికి మన సమాజాల్లో చొచ్చుకుపోయిన తరతరాల పక్షపాతాలను, అధిగమించడానికి సహాయపడతాయి” అంటారు ట్రాన్.
ఇవి కూడా చదవండి:
- మెనోపాజ్ తరువాత రుతుస్రావం క్యాన్సర్‌కు సంకేతమా
- గర్భిణులు కుంకుమ పువ్వు కలిపిన పాలు తాగితే.. పిల్లలు ఎర్రగా పుడతారా?
- దేవతలు తెల్లగానే ఎందుకుండాలి?
- అందం కోసం వాడే క్రీములతో అనర్థాలెన్నో
- ఒక్క సంవత్సరంలోనే 600 సార్లు అతిక్రమణలకు పాల్పడిన చైనా..
- ఏడు నెలల గర్భంతో ఉన్న భార్యను తీసుకుని 1200 కిలోమీటర్లు స్కూటీపై ప్రయాణం
- తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య ఆర్టీసీ బస్సుల రాకపోకలు మొదలయ్యేది ఎప్పుడు?
- 10 కి.మీ దూరంలో భారతీయ మహిళ మృతదేహం.. తీసుకురావాలంటే 2291 కి.మీ. ప్రయాణించాలి
- అక్షరాస్యతలో బిహార్ కంటే వెనుకబడ్డ ఆంధ్రప్రదేశ్.. అసలు కారణాలేంటి?
- హిమాలయాల్లో కార్చిచ్చులను ఆపి కరెంటు సృష్టిస్తున్నారు.. ఇలా..
- ఫిన్సెన్ ఫైల్స్: హెచ్ఎస్బీసీ 'పాంజి' స్కీమ్ కుంభకోణానికి సహకరించిందా?
- సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ 50 కలలు.. భౌతిక శాస్త్ర ప్రయోగాలు, విశ్వం, ప్రకృతి గురించి కన్న కలల్లో నెరవేరనివి ఎన్నంటే..
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)










