ఫిన్‌సెన్ ఫైల్స్: హెచ్‌ఎస్‌బీసీ 'పాంజి' స్కీమ్ కుంభకోణానికి సహకరించిందా?

- రచయిత, ఫిన్‌సెన్ ఫైల్స్ రిపోర్టింగ్ టీమ్
- హోదా, బీబీసీ పనోరమా
ఒక స్కామ్‌కు పాల్పడ్డ మోసగాళ్లు తమ బ్యాంకు నుంచి డబ్బును ప్రపంచంలోని వివిధ ఖాతాలకు తరలిస్తున్నారని తెలిసి కూడా హెచ్‌ఎస్‌బీసీ మౌనంగా ఉందా ? ఇటీవల బైటపడ్డ సీక్రెట్ ఫైళ్లు అవుననే అంటున్నాయి.
2013-2014 మధ్య కాలంలో బ్రిటన్‌కు చెందిన అతిపెద్ద బ్యాంకు ఒకటి అమెరికాలోని తన శాఖ నుంచి సొమ్మును హాంకాంగ్‌లోని హెచ్‌ఎస్‌బీసీ బ్యాంకుకు ట్రాన్స్‌ఫర్ చేసింది.
80 మిలియన్ డాలర్ల ఈ కుంభకోణానికి ఈ బ్యాంకు సహకరించిన వైనం సస్పీషియస్ యాక్టివిటీ రిపోర్ట్స్(SARs- సార్స్) పత్రాలు లీక్ కావడంతో బైటపడింది. ఈ అనుమానాస్పద లావాదేవీలకు సంబంధించిన పత్రాలను ఫిన్‌సెన్ పత్రాలని పిలుస్తున్నారు.
అయితే హెచ్‌ఎస్‌బీసీ మాత్రం అన్ని న్యాయపరమైన విధానాల ద్వారానే ఈ లావాదేవీలు నడిపిపినట్లు చెబుతోంది.
పాంజి స్కీమ్ అనే ఈ స్కామ్ వ్యవహారంలో మనీ లాండరింగ్‌కు పాల్పడిందన్న ఆరోపణపై హెచ్‌ఎస్‌బీసీ బ్యాంకు ఇప్పటికే 1.9 మిలియన్ డాలర్ల జరిమాన కట్టింది. ఇకపై ఇలాంటి కార్యక్రమాలను నిర్వహించబోనని ఇంతకు ముందు తెలిపింది. ఈ మోసగాళ్ల అన్ని ఖాతాలను రద్దు చేస్తామని బ్యాంకుకు చెందిన లాయర్లు వెల్లడించారు.
లీకైన ఈ పత్రాలలో ఇంకా అనేక సంచలన విషయాలు వెలుగు చూశాయి. అమెరికాకు చెందిన ఓ బ్యాంకు ఈ స్కామ్ సూత్రధారులకు చెందిన దాదాపు 1 బిలియన్ డాలర్ల సొమ్మును బదిలీ చేయడానికి సహకరించినట్టు ఈ పత్రాలు పేర్కొంటున్నాయి.
ఫిన్‌సెన్ ఫైల్స్ అంటే ఏంటి?
అనుమానాస్పద లావాదేవీల సమాచారం (SARs-సార్స్) కు సంబంధించి సుమారు 2,657 పత్రాలు లీకయ్యాయి. వీటినే ఫిన్‌సెన్ ఫైల్స్ అంటున్నారు.
అయితే ఈ అనుమానాస్పద లావాదేవీలన్నీ నేరం జరిగినట్లు నిరూపణ కావు. ఆయా లావాదేవీల మీద అనుమానంతో వీటిని పరిశీలించాల్సిందిగా సంబంధిత అధికారులకు బ్యాంకులు నివేదికలు పంపుతాయి. వీటినే ‘సార్స్’ నివేదిక అంటారు.
చట్టం ప్రకారం బ్యాంకులు తమ క్లయింట్లు ఎవరో తెలుసుకుని ఉండాలి. ఖాతాదారుల అక్రమ సొమ్ము గురించి అనుమానం రాగానే ‘సార్స్’ నివేదికలు పంపి ఊరుకుంటే సరిపోదు. వారి నేర కార్యకలాపాలకు ఆధారాలు ఉంటే వారి నగదు బదిలీలు, ఇతర లావాదేవీలను వెంటనే నిలిపేయాలి.
తమ అక్రమ సొమ్మును దాచుకోడానికి కొన్ని అనామక బ్రిటీష్ కంపెనీల పేర్లను, ప్రపంచంలోని అతి పెద్ద బ్యాంకులను మోసగాళ్లు ఎలా వాడుకున్నారో ఈ లీక్స్ ద్వారా బైటపడింది.
బజ్‌ఫీడ్ న్యూస్ అనే సంస్థకు అందిన ఈ ‘సార్స్’ లీక్ సమాచారం ఇంటర్నేషనల్ కన్షార్షియం ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్స్ (ICIJ-ఐసీఐజే)కు చేరింది. బీబీసీ కోసం పనోరమ వీటిని పరిశోధిస్తోంది. గతంలో ఐసీఐజే సంస్థ పనామా పేపర్స్, పారడైజ్ పేపర్స్‌ను బైటపెట్టి, ప్రసిద్ధ వ్యక్తుల రహస్య ఖాతాలను ప్రపంచానికి వెల్లడించింది.
“అక్రమ సొమ్మును బ్యాంకులు ఎలా ట్రాన్స్‌ఫర్ చేస్తున్నాయో ఫిన్‌సెన్ పత్రాలతో బైటపడింది. ఈ కళంకిత సొమ్మును నిరోధించడానికి ఏర్పాటు చేసిన వ్యవస్థ పనికి రాకుండా పోయింది’’ అన్నారు ఈ ఐసీఐజేకు ఫెర్గస్ షీల్.
2000 సంవత్సరం 2017 వరకు సాగిన లావాదేవీలకు సంబంధించి లీకైన ఈ ‘సార్స్’ పేపర్లు అమెరికాకు చెందిన ఫైనాన్షియల్ క్రైమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ నెట్‌వర్క్ (FinCEN-ఫిన్‌సెన్)కు సమర్పించారు. ఈ ట్రాన్సాక్షన్ల విలువ 2 ట్రిలియన్ డాలర్లు ఉంటుందని అంచనా
ఈ పత్రాలు లీక్ కావడం అమెరికా జాతీయ భద్రతకు ముప్పని, ఈ నివేదికలు ఇచ్చిన వారి రక్షణ ప్రమాదంలో పడే అవకాశం ఉందని ఫిన్‌సెన్ ఆందోళన వ్యక్తం చేసింది. అయితే మనీలాండరింగ్ చట్టాలను పూర్తి స్థాయిలో సంస్కరించాల్సిన అవసరం ఉందని ఆ సంస్థ పేర్కొంది.
అక్రమ డబ్బు తరలింపు, మనీలాండరింగ్ వ్యవహారాలకు అడ్డుకట్ట వేసేందుకు కంపెనీ రిజిస్ట్రేషన్ వ్యవస్థలో ప్రక్షాళన చేపట్టాలని యూకే కూడా నిర్ణయించింది.

ఫొటో సోర్స్, Facebook
అసలు ‘పాంజీ’ స్కామ్ అంటే ఏంటి?
హెచ్‌ఎస్‌బీసీకి సమాచారం అందిన ఆ స్కామ్‌ను డబ్ల్యూసీఎం777 (WCM777) అని పిలుస్తారు. 2014లో ఈ స్కామ్ కాలిఫోర్నియాకు చెందిన ఇన్వెస్టర్ రెనాల్డో పాచీకో హత్యకు కారణమైంది. అతన్ని దుండగులు రాళ్లతో కొట్టి చంపినట్లు పోలీసులు గుర్తించారు.
“ఈ స్కీమ్‌లో చేరినవాళ్లంతా ధనవంతులవుతారు’’ అంటూ ప్రచారం జరిగిన ఈ పథకంలో రెనాల్డో భాగస్వామి అయ్యారు. మరికొందరిని చేర్పించేందుకు ప్రయత్నాలు చేశారు. అయితే పాచికో పరిచయం చేసిన ఒక మహిళ ఈ పథకంలో చేరి 3,000 డాలర్లు నష్టపోయారు. ఆగ్రహించిన ఆ మహిళ రెనాల్డోను కిరాయి హంతకులతో చంపించినట్లు పోలీసులు గుర్తించారు.
“అతను ఇతరులను ధనవంతులను చేస్తానని చెప్పి అతనే స్కామ్‌లో కూరుకుపోయాడు. చివరకు అతని జీవితానే ఫణంగా పెట్టాల్సి వచ్చింది. పాంజి స్కీమ్‌కు అతను బలైపోయాడు’’ అని ఈ హత్య కేసును విచారించిన అధికారి క్రిస్ పాజికో వ్యాఖ్యానించారు.
ఈ స్కామ్ స్కీమ్‌లో చేరితే ఏంటి లాభం?
చైనాకు చెందిన ‘మింగ్ షు’ అనే వ్యక్తి ఈ పథకాన్ని అమెరికాలో ప్రారంభించారు. అయితే అతని గురించి ఎవరికీ పెద్దగా సమాచారం తెలియదు. తాను ఎం.ఏ వరకు చదువుకున్నానని మింగ్ షు చెప్పుకునేవారు. లాస్ ఏంజెలెస్‌లో ఉంటూ, తనను తాను డాక్టర్ ఫిల్‌గా ప్రకటించుకున్న ఆయన, ఒక మత ప్రచారకుడిగా పని చేస్తుండేవారు.
తాను ప్రపంచ స్థాయి ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకును నడుపుతున్నానని, దాని పేరు వరల్డ్ క్యాపిటల్ మార్కెట్ అని, ఇందులో పెట్టుబడి పెడితే 100 రోజుల్లో 100% పెట్టుబడి తిరిగి వస్తుందని ప్రచారం చేశారు. దాని పేరే డబ్ల్యూసీఎం 777 పాంజి స్కీమ్.
సెమినార్లు నిర్వహించడం, యూట్యూబ్‌లో వెబినార్‌లు, ఫేస్‌బుక్‌ల ద్వారా ఈ స్కీమ్ గురించి మింగ్ షు ప్రచారం చేశారు. క్లౌడ్ కంప్యూటింగ్‌లో షేర్లను అమ్మడం ద్వారా 80మిలియన్ డాలర్లు సేకరించాడు.
ఆసియాతోపాటు లాటిన్ అమెరికా దేశాలకు చెందిన అనేకమంది పెట్టుబడిదారులు అతని పథకంలో భాగస్వాములయ్యారు. తనకున్న క్రైస్తవ మత ప్రచారకుడి గుర్తింపును అడ్డుపెట్టుకుని అమెరికా, పెరు, కొలంబియాలాంటి దేశాలలోని పేదలను కూడా ఈ పథకంలో భాగస్వాములను చేశారు మింగ్ షు. యూకేతోపాటు అనేక దేశాలలో తన కార్యకలాపాలను విస్తరించారు.
డబ్ల్యూసీఎం 777 స్కామ్ గురించి ప్రజలను హెచ్చరించామని, అలాగే హెచ్‌ఎస్‌బీసీ బ్యాంకుకు కూడా ఈ కేసు వివరాలను తెలిపామని కాలిఫోర్నియా విచారణాధికారులు వెల్లడించారు.
కొలరాడో, మసాచుసెట్స్ తదితర ప్రాంతాలలో ఈ పథకంలో ప్రజలను చేర్పించడానికి ప్రయత్నించిన వారిపై చర్యలు తీసుకున్నామని అధికారులు వెల్లడించారు.
తన బ్యాంకు ద్వారా ఈ మోసపూరిత డబ్బు బయటకు వెళుతోందన్న విషయం హెచ్‌ఎస్‌బీసీ గుర్తించింది. కానీ 2014లో ఆ బ్యాంకులో డబ్ల్యుసీఎం777 ఖాతాలను అమెరికా అధికారులు మూసివేసే వరకు వాటి లావాదేవీలను కొనసాగించినట్లు లీకైన పత్రాలలో తేలింది. కానీ అప్పటికే ఆ డబ్బు ఎక్కడికి చేరాలో అక్కడికి చేరింది.

‘సార్’ నివేదికలో ఏముంది?
2013 అక్టోబర్ 13 హెచ్‌ఎస్‌బీసీ తొలిసారి ‘సార్’ నివేదికను పంపింది. తమ బ్యాంకు నుంచి సుమారు 6 మిలియన్ డాలర్ల సొమ్ము హాంకాంగ్‌లోని అక్రమార్కుల ఖాతాలోకి వెళ్లినట్లు తెలిపింది.
ఈ లావాదేవీలకు స్పష్టమైన లక్ష్యంగానీ, చట్టపరమైన అవసరంగానీ, వ్యాపార కోణంగానీ కనిపించడం లేదని, ఇవి కచ్చితంగా పాంజి స్కీమ్‌కు సంబంధించినవే అయ్యుంటాయని బ్యాంకు అధికారులు ఆ రిపోర్టులో పేర్కొన్నారు.
మళ్లీ 2014 ఫిబ్రవరిలో రెండవ ‘సార్’ నివేదికను పంపి, 15.4 మిలియన్ డాలర్ల సొమ్ము అనుమానాస్పద లావాదేవీ జరిగినట్లు తెలిపింది. ఇది కూడా పాంజి స్కీమ్‌కు సంబంధించింది కావొచ్చని అనుమానం వ్యక్తం చేసింది.
మూడవ ‘సార్’ నివేదికలో డబ్ల్యూసీఎం 777తో అనుబంధం ఉన్న సంస్థ నుంచి 9.2 మిలియన్ డాలర్ల లావాదేవీ జరిగినట్లు పేర్కొంది. దీనిపై కొలంబియా ప్రెసిడెంట్ విచారణకు ఆదేశించారని కూడా వెల్లడించింది.
హెచ్‌ఎస్‌బీసీ ఏం చేసింది?
మెక్సికో డ్రగ్ వ్యాపారుల మనీలాండరింగ్‌కు సహకరించిందన్న ఆరోపణల నుంచి బైటపడ్డ కొద్ది నెలలకే ఈ పాంజి స్కీమ్ బైటపడింది. దీనితో తమ బ్యాంకింగ్ విధానాలలో మార్పులు చేర్పులు చేసుకుంటామని హెచ్‌ఎస్‌బీసీ ప్రకటించింది.
2011 నుంచి 217 మధ్య కాలంలో 1.5 బిలియన్ డాలర్ల నుంచి 900 మిలియన్ డాలర్ల విలువైన అక్రమ డబ్బుకు సంబంధించిన లావాదేవీలు హెచ్‌ఎస్‌బీసీ దృష్టికి వచ్చాయని జర్నలిస్టుల కన్సార్షియం ఐసీఐజే విశ్లేషించింది.
అయితే ఈ ఖాతాల కస్టమర్లు ఎవరు, అంతిమంగా ఈ డబ్బు ఎవరికి చేరింది అన్న విషయం చెప్పడంలో హెచ్‌ఎస్‌బీసీ విఫలమైంది. అయితే అనుమానిత ఖాతాల సమాచారం బ్యాంకులు వేరెవరికీ ఇవ్వకూడదు.
“2012 నుంచి మా బ్యాంకు ఖాతాలన్నింటినీ అక్రమాలకు తావివ్వకుండా నడిపిస్తున్నాం. 2012 తర్వాత మా బ్యాంకు అత్యంత సురక్షితమైన బ్యాంకుగా పేరు తెచ్చుకుంది. దాదాపు 60 కేసులకు సంబంధించి మా వంతు సహకారం అందించాం’’ అని ఆ బ్యాంకు ప్రకటించుకుంది. అమెరికా చట్టాలకు అనుగుణంగానే పని చేస్తున్నామని, అధికారులకు సహకరిస్తున్నామని హెచ్‌ఎస్‌బీసీ స్పష్టం చేసింది.
ఈ స్కామ్ సూత్రధారి మింగ్ షు ను చైనా అధికారులు 2017లో అరెస్టు చేశారు. అయితే తన వ్యాపారం గురించి బ్యాంకు తనను ఏమీ అడగలేదని మింగ్ షు చైనా నుంచి ఐసీఐజే మాట్లాడుతూ చెప్పారు. డబ్ల్యుసీఎం 777ను పాంజి స్కీమ్‌గా పేర్కొనడం సరికాదని, 400 ఎకరాలలో తాను స్థాపించబోయే మతపరమైన నిర్మాణాన్ని అడ్డుకోడానికి సెక్యూరిటీస్ అండ్ ఎక్స్‌చేంజ్ కమీషన్ కుట్రపూరితంగా వ్యవహరింస్తోందని మింగ్ షు ఆరోపించారు.

ఫొటో సోర్స్, Handout
అసలు 'పాంజి' స్కీమ్‌కు ఆ పేరు ఎలా వచ్చింది?
అమెరికాలో పేరుమోసిన ఆర్ధిక నేరగాడు చార్లెస్ పాంజి పేరు మీద ఈ పాంజి స్కీమ్‌కు పేరు వచ్చింది. దీనిలో పెట్టుబడులు పెడితే పెద్ద ఎత్తున రాబడి ఉంటుందని చెబుతారు. పెట్టిన పెట్టుబడి మీద రాబడి లేకున్నా, కొత్త ఇన్వెస్టర్ల నుంచి వచ్చిన సొమ్మును పాత పెట్టుబడిదారులకు ఇవ్వడం మొదలుపెట్టారు.
ఇలా పాత ఇన్వెస్టర్లకు డబ్బులు ఇవ్వడానికి కొత్త ఇన్వెస్టర్లను ఆకర్షించాల్సిన అవసరం ఉంది. ఈలోగానే ఈ సంస్థ నిర్వాహకులు కొంత డబ్బును తమ ఖాతాల్లోకి మళ్లించుకుంటారు. కొత్త పెట్టుబడిదారులు రాకపోతే పాంజి స్కీమ్ కుప్పకూలుతుంది.
లీక్‌లలో బైటపడ్డ విషయమేంటి?
అంతర్జాతీయ బ్యాంకు జేపీ మోర్గాన్ కూడా రష్యాలోని ఒక మాఫియా డాన్‌కు 1 బిలియన్ డాలర్ల డబ్బు చేరేందుకు సహకరించిందని ఈ ఫిన్‌సెన్ పత్రాలలో వెల్లడైంది. సెమియన్ మొగిలివీచ్ అనే మాఫియా డాన్ ఆయుధాల అమ్మకం, డ్రగ్స్ సరఫరాలో ఆరితేరిన వ్యక్తి.
అతను బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థల్లో లావాదేవీలు నిర్వహించడానికి వీలు లేదు. కానీ 2015లో అతని ఖాతా క్లోజ్ అయిన తర్వాత అంతకు ముందు ఆ ఖాతా ద్వారా లండన్ ఆఫీసుల నుంచి సొమ్ము ఎలా ట్రాన్స్‌ఫర్ అయిందో జేపీ మోర్గాన్ ‘సార్’కు ఇచ్చిన నివేదికలో పేర్కొంది.
ఏబీఎస్‌ఐ( ABSI) ఎంటర్‌ప్రైజెస్ అనే రహస్య ఆఫ్‌షోర్ సంస్థ 2002-2013 మధ్య కాలంలో మనీ ట్రాన్సాక్షన్ జరపుకోవడానికి జేపీ మోర్గాన్ సహకరించిందని, ఆ సమయంలో ఆ సంస్థ యజమానులెవరో కూడా బ్యాంకు దగ్గర వివరాలు లేవని ఈ లీక్ పత్రాలలో బైటపడింది.
ఇలా ఐదేళ్ల కాలంలో జేపీ మోర్గాన్ సంస్థ ఆ కంపెనీకి సుమారు 1.02 బిలియన్ డాలర్ల సొమ్మును ట్రాన్స్‌ఫర్ చేసి పెట్టిందని ఈ పేపర్లలో బైటపడింది.
ఏబీఎస్‌ఐ కంపెనీ, రష్యా మాఫియాడాన్ సెమియన్ మొగ్లివీచ్‌కు సంబంధించిన కంపెనీలకు మాతృ సంస్థ అని ‘సార్’ గుర్తించింది. మొగ్లివీచ్ ఎఫ్‌బీఐ టాప్ టెన్ మోస్ట్ వాంటెడ్ లిస్టులో ఉన్నాడు.
“మేం చట్టపరమైన అన్ని నిబంధనలను పాటిస్తున్నాం. ఆర్ధిక నేరగాళ్లపై ప్రభుత్వం తీసుకునే అన్నిచర్యలలో సహకరిస్తున్నాం” అని జేపీ మోర్గాన్ ఒక ప్రకటనలో పేర్కొంది.
కానీ ఫిన్‌సెన్ పత్రాలలో పెద్దపెద్ద బ్యాంకులు కూడా ఆర్ధిక నేరగాళ్లు సులభంగా తమ డబ్బును ట్రాన్స్‌ఫర్ చేసుకోడానికి సహకరించినట్లు తేలింది. ఈ ఆర్ధిక నేరాలకు యూకే ఎలా కేంద్రంగా మారిందో, ఇక్కడి వ్యవస్థలు ఎంత బలహీనంగా ఉన్నాయో కూడా ఈ పత్రాలతో బైటపడింది.
బజ్‌ఫీడ్ న్యూస్ సంస్థ తనకు లభించిన ఈ రహస్య పత్రాలను ఇంటర్నేషనల్ కన్షార్షియం ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్స్ (ఐసీఐజే)తో షేర్ చేసుకుంది. బీబీసీ తరఫున పనోరమా దీనిపై పరిశోధన సాగిస్తోంది.
ఇవి కూడా చదవండి:
- ప్రపంచంలో తొలి టీకా ప్రచారాన్ని భారత రాణులే చేపట్టారా?
- భారత మహిళలు గృహహింసను ఎందుకు భరిస్తారు?
- కరోనావైరస్తో కరువు బారిన పడనున్న 50 కోట్ల ప్రజలు - ఐక్య రాజ్య సమితి నివేదిక
- కరోనావైరస్ వ్యాక్సీన్ తయారీలో చైనా ముందడుగు... కార్మికులపై టీకా ప్రయోగాలు
- కోవిడ్ చికిత్సకు హెల్త్ ఇన్సూరెన్స్ కార్డు పని చేస్తుందా? హాస్పిటల్ నిరాకరిస్తే ఏం చేయొచ్చు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








