హిమాలయాల్లో కార్చిచ్చులను ఆపి కరెంటు సృష్టిస్తున్నారు.. ఇలా..

హిమాలయాలు, పైన్ చెట్లు

ఫొటో సోర్స్, Alamy

    • రచయిత, షోమా అభయంకర్
    • హోదా, బీబీసీ ఫ్యూచర్ ప్లానెట్

చలికాలం ముదురుతున్న నవంబరు నెలలో ఒక ఉదయాన నేను ఉత్తరాఖండ్‌లోని పిత్తోర్‌గఢ్ జిల్లా త్రిపురవేది గ్రామంలోని కొండ మార్గంలో డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నాను.

ఆకాశాన్ని తాకేలా కనిపిస్తున్న పొడుగాటి పైన్ చెట్ల మధ్యలోంచి సూరీడు తొంగిచూస్తున్నాడు.

సేంద్రియ రంగులు మాత్రమే వాడి తయారుచేసి చేనేత పట్టు, కాటన్ దుస్తుల కోసం నేను అక్కడకు వెళ్లాను.

స్థానిక చేనేత కార్మికులు రూపొందించిన ఆ వస్త్రాలను అవని అనే సంస్థ విక్రయిస్తోంది.

అక్కడ నా దృష్టిని మరో విషయం ఆకర్షించింది. అది... ఎండిన పైన్ చెట్ల కొమ్మలు, ఆకుల గుట్టలు. ఓ వ్యక్తి ఆ ఎండిన పైన్ కొమ్మలను ఒక మోటారుకు అమర్చిన పెద్ద సిలిండర్‌లో పెడుతున్నాడు.

పైన్ ఆకులతో విద్యుదుత్పత్తి చేస్తున్నారక్కడ.

పైన్

ఫొటో సోర్స్, Alamy

పశ్చిమ హిమాలయ ప్రాంతంలోని ఉత్తరాఖండ్‌‌లో అనేక ఆలయాలు ఉండడంతో ఆ రాష్ట్రాన్ని దేవభూమి అంటారు. ఈ రాష్ట్రానికి టిబెట్, నేపాల్‌తో సరిహద్దులున్నాయి.

మంచు పర్వతాలు, నదులు, అనేక వృక్ష, జంతుజాతుజాలాలున్న ఉత్తరాఖండ్‌ది ప్రత్యేకమైన పర్యావరణ వ్యవస్థ.

ఉత్తరాఖండ్ అంతటా పైన్ అడవులు విస్తారంగా ఉన్నాయి. సుమారు 10 లక్షల ఎకరాల్లో విస్తరించిన ఉన్న ఈ పైన్ అడవులతో అక్కడ కొన్ని ఇబ్బందులూ ఉన్నాయి.

ఎండిన పైన్ ఆకులు నేలరాలి పోగవుతాయి. తేలిగ్గా ఉండే ఇవి ఏమాత్రం అగ్గి రాజుకున్నా అడవిని దహించివేస్తాయి.

ఏటా ఒక్క ఉత్తరాఖండ్ రాష్ట్ర అడవుల్లోనే 13 లక్షల టన్నుల పైన్ ఆకులు నేలరాలుతుంటాయని అంచనా. మార్చి, జూన్ నెలల మధ్య ఎక్కువగా ఈ ఆకులు రాలుతాయి. ఇవి కొండవాలులో పరుచుకుంటాయి. ఇవి ఉత్తరాఖండ్‌లో కార్చిచ్చులకు కారణమవుతున్నాయి.

బయోమాస్ గ్యాసిఫికేషన్ ప్లాంట్

ఫొటో సోర్స్, Rajnish Jain

ఫొటో క్యాప్షన్, బయోమాస్ గ్యాసిఫికేషన్ ప్లాంట్

కార్చిచ్చుల కారణంగా నష్టం జరుగుతుందని.. అటవీ సమతుల్యతను అవి దెబ్బతీస్తాయని జీబీ పంత్ నేషనల్ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్ హిమాలయన్ ఎన్విరానమెంట్‌లో సెంటర్ ఫర్ సోషియో ఎకనమిక్ హెడ్ జీసీఎస్ నేగి అన్నారు.

ఔషధ మూలికలు, ఇతర అవసరాలుగా ఉపయోగించే 1800 రకాల మొక్కలకు ఇక్కడి అటవీ ప్రాంతం ఆలవాలం.

కానీ, కార్చిచ్చులు ఈ ప్రాంతాన్ని ఆ మొక్కల మనుగడకు అననుకూలంగా మార్చేస్తున్నాయి.

"దేశీయ మొక్కలు, చెట్లు పర్యావరణపరంగా, సామాజికంగా ఎంతో విలువైనవి. అవి భూ, జల సంరక్షణలో ఎంతో కీలకం. ఫలితంగా అడవి స్థానికులకు తిండి, ఇతర అటవీ ఉత్పత్తులను అందివ్వడమే కాకుండా జీవివైవిధ్యాన్ని కాపాడుతుంది'' అంటారు నేగి.

విద్యుదుత్పత్తి తరువాత వ్యర్థాలు

ఫొటో సోర్స్, ShomaAbhayankar

ఫొటో క్యాప్షన్, పైన్ ఆకులతో విద్యుదుత్పత్తి తరువాత మిగిలే వ్యర్థాలలో కార్బన్ ఎక్కువగా ఉంటుంది. దీన్ని బొగ్గులా మలచి వంట చెరకుగా వినియోగిస్తారు.

ఉత్తరాఖండ్‌లోని కుమావూ ప్రాంతం బేరినాగ్‌లో అవని సంస్థ ఉంది. సోలార్ ఇరిగేషన్ నేపథ్యం ఉన్న మేనేజ్‌మెంట్ కన్సల్టెంట్ రజనీశ్ జైన్, ఆయన భార్య గ్రాఫిక్ డిజైనర్ రష్మి 1999లో దీన్ని స్థాపించారు.

ఏటా కార్చిచ్చులు అడవులను నాశనం చేయడంతో పాటు అక్కడి ప్రజల జీవితాలపైనా ప్రభావం చూపిస్తుండడంతో ఏదైనా చేయాలనుకున్నారు వారు.

కార్చిచ్చులకు కారణమవుతున్న పైన్ ఆకులతో విద్యుదుత్పత్తి అవకాశాల గురించి రజనీశ్ వెతికారు.

పైన్ ఆకులను విద్యుదుత్పత్తికి వాడితే కార్చిచ్చులు తగ్గడంతో పాటు మరెన్నో లాభాలుంటాయని.. వంటచెరకు ఇబ్బందులు, వలసలు వంటి అన్ని సమస్యలనూ తీర్చొచ్చని భావించారు.

బయోమాస్ గ్యాసిఫికేషన్ పద్ధతిలో పైన్ ఆకులతో విద్యుత్ తయారుచేయడంపై దృష్టిపెట్టారు.

పైన్ ఆకులు

ఫొటో సోర్స్, Rajnish jain

విద్యుదుత్పత్తిలో ఈ రకమైన సాంకేతికత 1994 నుంచి భారత్‌లో పెరగనారంభించింది. బెంగళూరులోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌‌కు చెందిన దాసప్ప అనే ఇంజినీర్ తన బృందంతో కలిసి స్విట్జర్లాండ్ కేంద్రంగా పనిచేస్తున్న ఇంజినీరింగ్ సంస్థ దాసాగ్ సహకారంతో బయోమాస్ గ్యాసిఫయర్లను మెరుగుపరిచే పని మొదలుపెట్టారు.

వారు పైన్ ఆకులతోనే కాదు ఊక, వరిగడ్డి, ఆకులు, కొబ్బరి పీచు వంటి వ్యవసాయ వ్యర్థాలతో విద్యుదుత్పత్తి చేశారు. ఆక్సిజన్ తగ్గించిన వాతావరణంలో ఈ వ్యర్థాలను 1,000 డిగ్రీల ఫారన్‌హీట్ కంటే ఎక్కువ వేడి చేస్తారు. అప్పుడు కార్బన్ మోనాక్సైడ్, మీథేన్, హైడ్రోజన్‌, ఇతర వాయువులు వెలువడతాయి.

ఈ వాయువుల నుంచి ధూళి, తారు వేరు చేసి మండించి విద్యుదుత్పత్తి చేస్తారు.

ఆ తరువాత దాసప్ప ఆ డిజైన్‌ను మరింత అభివృద్ధి చేసి పేటెంటు పొందారు. కర్ణాటకలో ప్రస్తుతం ఇలాంటివి 30 యూనిట్లు పనిచేస్తున్నాయి. ''వ్యవసాయ, అటవీ వ్యర్థాలు పుష్కలంగా ఉన్న భారత దేశంలో శిలాజ ఇంధనాలతో పోల్చితే పర్యావరణంపై తక్కువ ప్రతికూల ప్రభావం, తక్కువ ఖర్చుతో విద్యుదుత్పత్తి చేసే మార్గం ఇది'' అంటారు దాసప్ప. అమెరికా, స్విట్జర్లాండ్, జపాన్‌లోనూ ఈ బయోమాస్ గ్యాసిఫికేషన్ విధానం వాడుక ఎక్కువగానే ఉంది.

అయితే, 2007లో తాను పైన్ ఆకులతో ఈ విధానంలో విద్యుదుత్పత్తి చేయొచ్చని ప్రతిపాదించినప్పుడు ఉత్తరాఖండ్ అధికారులు, ప్రభుత్వం నుంచి వ్యతిరేకత వచ్చిందన్నారు రజనీశ్. ''వాళ్లే కాదు గ్రామస్థులూ దీనిపై ఆసక్తి చూపించలేదు. నాకు బుర్ర లేదనుకున్నారు'' అని అప్పటి పరిస్థితులను గుర్తు చేసుకున్నారు రజినీశ్.

అయితే, ఈ ఆలోచన వోల్కార్ట్ ఫౌండేషన్ అనే స్విట్జర్లాండ్ స్వచ్ఛంద సంస్థను ఆకట్టుకుంది. వారు ఈ ప్రాజెక్టులో పెట్టుబడులు పెట్టారు. దీంతో 2009లో ఆయన ప్రపంచంలోనే మొట్టమొదట 9 కిలోవాట్ల సామర్థ్యమున్న పైన్ ఆకుల విద్యుత్కేంద్రం ప్రారంభించారు. ఇప్పుడా పవర్ ప్లాంట్ అవని వర్క్‌షాప్‌కు విద్యుత్ అందిస్తోంది. అంతేకాదు.. విద్యుదుత్పత్తి చేయగా మిగిలిన వ్యర్థాలు వంట చెరకుగా పనికొస్తున్నాయి.

ఈ విజయంతో రజనీశ్ ఇలాంటి మరికొన్ని కార్యక్రమాలు చేపట్టి ప్రభుత్వ సంస్థల నుంచీ మద్దతు పొందగలిగారు. తన ప్రయత్నం వల్ల గ్రామస్థులకు జీవనోపాధి లభించడంతో పాటు కార్చిచ్చులూ తగ్గుతాయని రజనీశ్ గట్టిగా నమ్మారు.

2011లో ఆయన అవని బయో ఎనర్జీ అనే స్వచ్ఛంద సంస్థ ఒకటి స్థాపించారు. ఉత్తరాఖండ్ ప్రభుత్వ విద్యుత్ సంస్థతో ఒప్పందం చేసుకుంది. రాష్ట్రాలు తమ విద్యుత్ అవసరాలలో కొంత పునరుత్పాదక ఇంధన వనరుల నుంచి సమకూర్చుకోవాలన్న జాతీయ విధానం ప్రకారం ఆ ఒప్పందం జరిగింది. 2014లో ఉత్తరాఖండ్ పునరుత్పాదక ఇంధనాభివృద్ధి సంస్థ పైన్ ఆకుల నుంచి గ్యాసిఫికేషన్ విధానంలో విద్యుదుత్పత్తి విధానాన్ని అమలులోకి తెచ్చింది.

అయితే, ఈ ప్రాజెక్టును పెద్ద ఎత్తున చేపట్టడానికి అవరోధాలున్నాయి. పైన్ ఆకులను పెద్ద ఎత్తున సేకరించడానికి ఇక్కడి భౌగోళిక పరిస్థితులు అంత అనుకూలం కాదు. నిటారైన కొండ ప్రాంతాల్లో యంత్రాల సహాయంతో పైన్ ఆకులు సేకరించే వీలు లేదు. ఒక కిలోవాట్ పర్ అవర్ విద్యుదుత్పత్తికి 1.5 కిలోల పైన్ ఆకులు అవసరం. ఆలెక్క 120 కిలోవాట్ పర్ అవర్ ప్రాజెక్టు స్థాపించాలంటే పెద్దమొత్తంలో పైన్ అవసరం. దీంతో 10 నుంచి 25 కిలోవాట్ల చిన్న ప్లాంట్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు.

అయితే, ఈ సేకరణకు మొదట్లో గ్రామీణ మహిళలు సంశయించారు. కానీ, కిలోకు రూ. 2 ఇవ్వడానికి నిర్ణయించి రజనీశ్ వారిని ఒప్పించారు. అది వారికి ఆదాయ మార్గంగా మారింది.

మూడేళ్లుగా ఈ పనిలో ఉన్న ఆశాదేవి మాట్లాడుతూ.. ''నేను మొదటి ఏడాది రూ. 8 వేలు సంపాదించాను. ఆ డబ్బుతో పాల కోసం ఒక గేదెను కొన్నాను. ఈ ఏడాది నెలకు రూ. 17,000 సంపాదించాను. ఈ డబ్బుతో ఇంట్లో మరో గది నిర్మించాం. వచ్చే ఏడాది వంట గది కట్టుకుంటాం'' అన్నారు.

ప్రస్తుతంలో కుమావూ ప్రాంతంలోని వివిధ గ్రామాల్లో 25 కిలోవాట్ల పవర్ ప్లాంట్లు 7 ఉన్నాయి. 10 కిలోవాట్ల ప్లాంట్లు 5 ఉన్నాయి. మరో 40 ఏర్పాటుకు సిద్ధమవుతున్నాయి.

ఇవి గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఊతమివ్వడమే కాకుండా కార్చిచ్చులనూ నివారిస్తున్నాయని రజనీశ్ అన్నారు. నిత్యం ఎండిన పైన్ ఆకులను సేకరిస్తుండడంతో ఈ ప్రాంతంలో ఇటీవల కాలంలో ఒక్క కార్చిచ్చూ లేదని రజనీశ్ చెబుతున్నారు.

కార్చిచ్చుల కారణంగా నాశనమయ్యే సంప్రదాయక ఔషధ మొక్కలు మళ్లీ పెరుగుతున్నాయని.. ఈ పరిస్థితులు ఇలాగే కొనసాగితే మరికొన్ని స్థానిక మొక్క జాతులూ తిరిగి మనుగడలోకొస్తాయని జీపీఎస్ నేగి అన్నారు.

ఈ ఏడాది కఫాల్, బే బెర్రీ మొక్కలు త్రిపురవేదిలో ఎక్కడికక్కడ కనిపిస్తున్నాయని.. గోల్డెన్ హిమాలయన్ రాస్‌బెర్రీ, హిమాలయన్ ఓక్ కూడా పెరుగుతున్నాయని చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)