విజయవాడ కనకదుర్గ ఫ్లై ఓవర్ నిర్మాణానికి 9 ఏళ్లు ఎందుకు? ఈ క్రెడిట్ ఎవరిది?

- రచయిత, శంకర్ వి.
- హోదా, బీబీసీ కోసం
విజయవాడ వాసులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న కనకదుర్గ ఫ్లైఓవర్ ప్రారంభం మళ్లీ వాయిదా పడింది. ఫ్లైఓవర్ పనుల్లో మొదటి నుంచీ అనేక ఆటంకాలు ఎదురవుతూనే ఉన్నాయి. ఎట్టకేలకు నగర వాసుల సౌకర్యార్థం ఈనెల 18 నుంచి ఫ్లైఓవర్‌పై రాకపోకలకు అనుమతిస్తున్నట్టు ఎంపీ కేశినేని నాని ఇటీవల ప్రకటన చేశారు. అయితే ప్రారంభాన్ని మళ్లీ వాయిదా వేసినట్లు అధికారులు తెలిపారు.
అయితే, విజయవాడ-హైదారాబాద్ ప్రధాన మార్గంలో ఎన్‌హెచ్-65పై పూర్తయిన ఈ ఫ్లైఓవర్ నిర్మాణం ఘనత తమదంటే తమదేనని ప్రస్తుత పాలక, ప్రతిపక్షాలు ప్రచారం చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో దశాబ్దకాలానికి పైగా జరిగిన ఆలస్యానికి ఆయా పార్టీల నేతలు బాధ్యత వహించాలని విజయవాడ వాసులు పేర్కొంటున్నారు.
ఘనత ఏమిటంటే..
విజయవాడ నగరం పరిధిలో ఇంద్రకీలాద్రికి, కృష్ణా నదికి మధ్యలో ఈ కనకదుర్గ ఫ్లైఓవర్‌ను సిద్ధం చేశారు. కుమ్మరిపాలెం వద్ద ప్రారంభమై రాజీవ్ గాంధీ మున్సిపల్ పార్క్ వద్ద ఇది ముగుస్తుంది, ప్రకాశం బ్యారేజీతో పాటు టెంపుల్ రోడ్, కెనాల్ రోడ్ మీదుగా సాగుతుంది.
స్పైన్-వింగ్స్ టెక్నాలజీతో దేశంలోనే పొడవైన ఫ్లైఓవర్‌గా దీన్ని చెబుతున్నారు. ఇప్పటికే దిల్లీ, ముంబయిలలో ఇదే తరహాలో ఫ్లైఓవర్ల నిర్మాణం జరిగింది. అయినా పొడవు రీత్యా కనకదుర్గ ఫ్లైఓవర్‌ది ప్రథమ స్థానంగా ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు చెబుతున్నారు.
ఈ ఫ్లైఓవర్ పొడవు 2.60 కిలోమీటర్లు కాగా, మొత్తం అప్రోచ్ రోడ్డులతో కలిపి 5.29 కిలోమీటర్లు ఉంటుంది.
కనకదుర్గ ఫ్లైఓవర్‌పై నాలుగు వరుసల రోడ్డు నిర్మించారు. మొత్తం 47 పిల్లర్లపై ఈ ఫ్లై ఓవర్‌ను నిర్మించారు. అందులో ఆరు భారీ వై పిల్లర్లు ఉన్నాయి. పిల్లర్స్ కోసం భూమిలో 417 పైల్స్‌ను నిర్మించారు. అలాగే, 667 స్పైన్స్ నిర్మించారు. ఈ స్పైన్స్‌తో 46 స్పాన్ బ్లాక్స్‌లను నిర్మించారు. ఈ స్పైన్స్‌కు 1,406 రెక్కలను అమర్చారు. 47 సింగిల్ పిల్లర్స్ మీదనే ఆరు వరసలతో ఈ ఫ్లై ఓవర్‌ను నిర్మించారు. సింగిల్ పిల్లర్ల మధ్యలో స్పైన్స్ సమూహమైన స్పాన్ ఉంటుంది. దీనికి రెండు వైపులా రెక్కలను జతచేసి ఐరన్‌తో స్ర్టెచ్చింగ్ చేశారు.

పెరిగిన నిర్మాణ వ్యయం
ఈ ఫ్లైఓవర్ నిర్మాణ పనులకు రూ. 282.4 కోట్లను అంచనా వ్యయంగా ప్రకటించారు. నవంబర్ 22, 2015లో నిర్మాణ పనులు ప్రారంభించారు. ఏడాది వ్యవధిలో పనులు ప్రారంభించాలని గడువు విధించారు. ఈ ప్రాజెక్ట్ పనుల కోసం ఎల్ అండ్ టీ , సోమా కంపెనీలు పోటీపడగా చివరకు సోమా ఎంటర్ ప్రైజెస్ లిమిటెడ్ సంస్థకు అవకాశం వచ్చింది.
అయితే నిర్మాణ పనుల జాప్యం కారణంగా చివరకు ప్రాజెక్ట్ వ్యయం పెరుగుతూ వచ్చింది. మొత్తం వ్యయం రూ.447.80 కోట్లుగా ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో భూ సేకరణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ వ్యయం రూ.114.59 కోట్ల కేటాయింపులు కూడా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ వాటాగా రూ.333.21 కోట్లు వెచ్చించారు.
చివరకు ఈ ఏడాది ఆగస్టు నాటికి పనులు పూర్తయ్యాయి. సెప్టెంబర్ మొదటి వారంలో దీన్ని ప్రారంభించాల్సి ఉండగా మొదటిసారి మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మృతితో వాయిదా పడింది. ఆ తర్వాత సెప్టెంబర్ 18న ప్రారంభించాల్సి ఉండగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి కరోనా సోకడంతో రెండోసారి వాయిదా వేశారు.
విజయవాడ-హైదారబాద్ మార్గంలో ఈ ఫ్లైఓవర్ అందుబాటులోకి వస్తే పలు సమస్యలకు పరిష్కారం లభిస్తుందని అందరూ ఆశిస్తున్నారు. అయితే నిర్మాణంలో సమస్యలు, తీవ్ర జాప్యం కారణంగా విజయవాడ వాసులు ట్రాఫిక్ కష్టాలను చవిచూడాల్సి వచ్చింది.
ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of YouTube ముగిసింది
దశాబ్ద కాలంగా పలు వివాదాల్లో..
ఈ ఫ్లైఓవర్ ప్రారంభం నుంచి వివాదాల మయంగానే ఉంది. తొలుత ఫ్లైఓవర్ నిర్మాణానికి పలు అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. అదే సమయంలో నిర్మాణ పనులు ప్రారంభించాలని ఆందోళనలు కూడా జరిగాయి.
2012లోనే అప్పటి విపక్ష నేత హోదాలో చంద్రబాబు విజయవాడ ఫ్లైఓవర్ కోసం ఆందోళనకు దిగారు. ఆయన ధర్నాకి పోటీగా నాటి విజయవాడ ఎంపీ, కాంగ్రెస్ నేతగా ఉన్న లగడపాటి రాజగోపాల్ కూడా నిరసనకు దిగారు. ఆనాటి లగడపాటి ఆందోళనలో ప్రస్తుతం వైఎస్ జగన్ క్యాబినెట్‌లో మంత్రిగా ఉన్న నాటి విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, జోగి రమేష్ తదితరులు కూడా పాల్గొన్నారు.
ఫ్లైఓవర్ నిర్మాణం ప్రారంభించకపోవడం పట్ల చంద్రబాబు ఆందోళనకు దిగారు. భూసేకరణలో నష్టపోతున్న వారికి తగిన పరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. చంద్రబాబు, టీడీపీ నేతల తీరుకి వ్యతిరేకంగా నాటి కాంగ్రెస్ నేతలు లగడపాటి నేతృత్వంలో పోటీ ధర్నా చేపట్టారు.

జాప్యానికి నేతలంతా కారణమే
చివరకు ఆంధ్రప్రదేశ్ విభజన అనంతరం 2015లో ఈ ఫ్లైఓవర్ నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. భూసేకరణ సహా వివిధ సమస్యల పరిష్కారానికే 5 ఏళ్లకు పైగా సమయం పట్టింది. అయితే పనులు ప్రారంభించిన ఏడాదిలోగా ఫ్లైఓవర్ పూర్తి చేస్తామని ఆనాడు సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. కానీ అది సాధ్యం కాలేదు. చివరకు ఆపసోపాల తర్వాత ఐదేళ్లకు పైగా సమయం తీసుకుని ఈ ప్రాజెక్ట్‌ని కాంట్రాక్ట్ సంస్థ పూర్తి చేసింది.
ఓ ఫ్లైఓవర్ నిర్మాణానికి ఇంత ఎక్కువ సమయం తీసుకోవడం పట్ల విజయవాడ వాసులు కూడా అసహనం వ్యక్తం చేశారు. పలుమార్లు వివిధ పార్టీలు ఆందోళనకు కూడా దిగాయి.
అయితే ఈ ప్రాజెక్ట్ జాప్యానికి దాదాపుగా అన్ని పార్టీల నేతలు కారణమేనని విజయవాడకు చెందిన సీనియర్ జర్నలిస్ట్ ఎన్ రమేష్ వ్యాఖ్యానించారు. ఆయన బీబీసీతో మాట్లాడుతూ ''తొలుత కాంగ్రెస్ ప్రభుత్వంలో వైఎస్సార్ కాలం నాటి ప్రతిపాదన ఇది. ఆ తర్వాత ఆప్రాంతాన్ని ఖాళీ చేయించడానికే చాలా సమయం తీసుకున్నారు. చివరకు నష్టపరిహారం చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధపడిన తర్వాత కూడా ఆలస్యం చేశారు. పనులు ప్రారంభించిన తర్వాత కూడా నత్తనడకన సాగుతున్నా పెద్దగా పట్టించుకోలేదు. విపక్షంలో ఉన్నప్పుడు విమర్శలు చేసిన టీడీపీ, తాను అధికారంలో ఉన్న కాలంలో కూడా ఫ్లైఓవర్ పూర్తి చేయలేకపోయింది. అప్పట్లో టీడీపీని తప్పుబట్టిన నేతల్లో దాదాపుగా అందరూ ప్రస్తుతం వైఎస్సార్సీపీలో ఉన్నారు. కానీ తాము అధికారంలో ఉన్న కాలంలో ఫ్లైఓవర్ పనులు ఎందుకు చేపట్టలేకపోయారో వారి దగ్గర సమాధానం ఉండదు. ఇలా దాదాపుగా అన్ని పార్టీల నేతల వైఖరి దీనికి ప్రధాన కారణం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలా, అధికారంలో ఉంటే మరోలా వ్యవహరించడం వారికి ఆనవాయితీ. ఇక్కడ కూడా అదే కనిపించింది''అని ఆయన వ్యాఖ్యానించారు.

నిధుల కొరత ..
ఫ్లైఓవర్ పూర్తి కాకపోవడానికి చాలా కారణాలున్నాయని ఆర్‌అండ్‌బీలో ఈఈగా పనిచేసిన ఎస్ మల్లిఖార్జున రావు అభిప్రాయపడ్డారు. ఆయన బీబీసీతో మాట్లాడుతూ ''తొలుత నిర్వాసితులకు నష్టపరిహారం కోసం నిధుల కేటాయింపు ఆలస్యమైంది. ఆ తర్వాత సోమా సంస్థ కాంట్రాక్ట్ తీసుకున్నప్పటికీ సకాలంలో నిధులు విడుదల కాలేదు. అయినప్పటికీ ఎస్‌ఈ జాన్ మోషే వంటి అధికారులు అవిరాళంగా కృషి చేశారు. ఆ తర్వాత కాంట్రాక్ట్ సంస్థ ఇక్కట్లలో పడింది. ఓ సందర్భంలో వారు ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంటారని కూడా భావించారు. కానీ చివరకు వారు ఈ ప్రాజెక్ట్‌ని పూర్తి చేసేందుకు శ్రమించారు. ప్రభుత్వం నుంచి అవసరమైన నిధులు వెంటనే వచ్చి ఉంటే ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ అందుబాటులోకి వచ్చి ఉండేది''అంటూ వ్యాఖ్యానించారు.
క్రెడిట్ గేమ్ ఆడుతున్న పార్టీలు
ఫ్లైఓవర్ ఘనత తమదంటే తమదేనంటూ ప్రస్తుత అధికార, ప్రతిపక్షాలు ప్రచారం చేసుకుంటున్నాయి. టీడీపీ హయాంలో పూర్తి చేయలేకపోయిన ఫ్లైఓవర్‌ని తాము ఏడాదిన్నరలో అందుబాటులోకి తీసుకొచ్చామని వైసీపీ చెప్పుకుంటుంది. అదే సమయంలో చంద్రబాబు ముందుచూపే ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తి చేసేందుకు దోహదపడిందని టీడీపీ ప్రచారం మొదలెట్టింది. తమ హయాంలో 95 శాతం పనులు పూర్తయిన దానికి ఏడాదిన్నర సమయం తీసుకోవడం ప్రస్తుత పాలకుల వైఫల్యానికి నిదర్శనం అంటూ టీడీపీ విమర్శిస్తోంది. బీజేపీ నేతలు కూడా తమ ప్రభుత్వం చేసిన నిర్మాణం అంటూ ప్రచారం చేస్తున్నారు.

తమ కృషి వల్లే ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తయిందని, దానికి కేంద్ర ఉపరితల రవాణా మంత్రి నితిన్ గడ్కరీకి, విజయవాడ నగర ప్రజలకు కృతజ్ఞతలు చెప్పాలని ఎంపీ కేశినేని నాని వ్యాఖ్యానించారు. అయితే ఈ ఫ్లైఓవర్‌ని త్వరగా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి కృషి చేసిన సీఎం జగన్ ప్రయత్నానికి అభినందనలు చెప్పాలంటూ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ వ్యాఖ్యానించారు.
నగరవాసుల అసంతృప్తి
నిర్మాణ దశలో సుదీర్ఘ కాలయాపన జరగడం, ఆ తర్వాత పనులు కూడా వేగంగా సాగకపోవడంతో నగర వాసులు కొంత అసహనానికి గురయ్యారు. ఎట్టకేలకు పూర్తి చేసినందుకు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. విజయవాడ కృష్ణలంకకి చెందిన ఖాజా రఫీ బీబీసీతో మాట్లాడారు. ''వివిధ పార్టీల నేతల మాటలు ఎలా ఉన్నా.. మాకు సమస్య మాత్రం తీరడం లేదు. చాలాకాలంగా ఎదురుచూస్తున్నాం. ఈ ఫ్లైఓవర్ ప్రారంభమైతే ట్రాఫిక్ సమస్య తీరుతుంది. ముఖ్యంగా హైదరాబాద్ వైపు వెళ్లే వారికి పెద్ద సమస్య తీరినట్టే భావించాలి'' అని ఆయన వ్యాఖ్యానించారు.
‘సకాలంలో ఒక్క ఫ్లై ఓవర్ కట్టలేని వాళ్లు రాజధాని కడతారా’
విజయవాడ నగర వాసుల కల లాంటి ఫ్లైఓవర్ పై క్రెడిట్ గేమ్‌కి పాలక, ప్రతిపక్షాలు సిగ్గుపడాలని మాజీ కార్పొరేటర్ చిగురుపాటి బాబూరావు వ్యాఖ్యానించారు.
‘‘పుష్కర కాలం క్రితం ప్రతిపాదించి, తొలుత ఫ్లైఓవర్ నిర్మాణ స్థలం మీద వివాదం సృష్టించారు. దాని చుట్టూ పెద్ద కథ నడిపారు. చివరకు అంతా ఖరారయిన తర్వాత నిర్మాణ పనులకు నిధులు కేటాయించడం, పనులు సకాలంలో జరపడంలో కాంగ్రెస్, తెలుగుదేశం ప్రభుత్వాలు రెండూ విఫలమయ్యాయి. నేతల అవినీతికి భయపడి కాంట్రాక్ట్ సంస్థలు తప్పుకున్న అనుభవం కూడా ఉంది. చివరకు జగన్ ప్రభుత్వం కూడా 90 శాతం పైగా పూర్తయిన ఫ్లైఓవర్ ప్రారంభానికి ఏడాదిన్నర సమయం తీసుకుంది. ఇలాంటి నేతలంతా మళ్లీ తమదంటే తమదే గొప్ప అని చెప్పుకుంటున్నారు. ఒక్క ఫ్లైఓవర్ నిర్మాణానికే ఇన్నేళ్లు పడితే ఇక రాజధాని ఎప్పుడు కడతారు..వీళ్లు రాష్ట్రాభివృద్ది చేస్తారంటే జనం ఎలా నమ్మాలి. ఇప్పటికైనా పూర్తయిన ఫ్లైఓవర్‌ని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలి’’ అని ఆయన బీబీసీతో అన్నారు.
ఇవి కూడా చదవండి:
- స్వదేశంలో కంటే విదేశాలకు అప్పులు ఇవ్వడానికే చైనా బ్యాంకుల మొగ్గు
- చైనా అప్పుల ఊబిలో కూరుకుపోయిన దేశాలివే..
- హైదరాబాద్‌ను వరదల నుంచి కాపాడిన మోక్షగుండం విశ్వేశ్వరయ్య
- భారత పార్లమెంటు కొత్త భవనాన్ని నిర్మించనున్న టాటా ప్రాజెక్ట్స్... విమర్శకులు ఏమంటున్నారు?
- హుస్సేన్‌సాగర్‌లో దూకి ఆత్మహత్యకు ప్రయత్నించిన 114 మందిని ఈయనే కాపాడారు
- నరేంద్ర మోదీకి 70ఏళ్లు: ఆయన ముందున్న సవాళ్లు ఏమిటి? ప్రపంచం ఆయన్ను ఎలా చూస్తోంది?
- కరోనావైరస్ లక్షణాలు ఏమిటి? పిల్లల్లో ఎటువంటి లక్షణాలు కనిపిస్తాయి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- #విమెన్ హావ్ లెగ్స్: మహిళలు కాళ్లు కనిపించేలా బట్టలు ధరించకూడదా?
- కోవిడ్-19 నుంచి కోలుకున్నా అనారోగ్యం ఎందుకు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- లౌంగీ బూయియా: బిహార్‌లో మరో మౌంటెయిన్ మ్యాన్... మూడు కిలోమీటర్ల కాలువను ఒక్కరే తవ్వేశారు
- పరకాలను దక్షిణాది జలియన్‌వాలాబాగ్ అని ఎందుకు అంటారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








