చైనా అప్పుల ఊబిలో అభివృద్ధి చెందుతున్న దేశాలు ఎలా కూరుకుపోతున్నాయి?

ఫొటో సోర్స్, STR/Getty
- రచయిత, సెసిలియా బారియా
- హోదా, బీబీసీ న్యూస్
ఆర్థిక సాయం, వాణిజ్య అవసరాల కోసం రుణాలు ఇవ్వడమనేది ప్రపంచ దేశాల విదేశాంగ విధానంలో ఒక భాగం. అయితే చైనా విషయానికి వచ్చేసరికి ’’రుణ దౌత్యం’’ అనే కొత్త పదం వినిపిస్తుంది.
అభివృద్ధి చెందుతున్న దేశాలకు చైనా ఇస్తున్న రుణాల్లో సగం రహస్య రుణాలే (హిడెన్ క్రెడిట్స్) ఉంటున్నాయని జర్మనీలోని కీల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ద వరల్డ్ ఎకానమీ ప్రొఫెసర్ క్రిస్టోఫ్ ట్రెబెస్క్ వ్యాఖ్యానించారు.
1949 నుంచి 2017 మధ్య ప్రపంచ దేశాలకు చైనా ఇచ్చిన అప్పులను ట్రెబెస్క్‌తోపాటు కార్మెన్ రీన్‌హార్ట్, సెబాస్టియన్ హార్న్ విశ్లేషించారు.
ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో చైనా ఎలాంటి పాత్ర పోషిస్తుంది? అనే అంశాన్ని తెలుసుకునేందుకు వేర్వేరు మార్గాల్లో చైనా ఇచ్చిన రుణాలను వీరు సమగ్రంగా విశ్లేషించారు.
ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లోని సంస్థలకు మిలియన్ల డాలర్ల కొద్దీ అప్పులు ఇవ్వడం ద్వారా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో చైనా గట్టి పట్టు సంపాదించిందని వీరి అధ్యయనంలో తేలింది.
ఈ రహస్య రుణాలను చైనాకు చెందిన భిన్న సంస్థలు ఇచ్చాయి. వీటి వెనుక లక్ష్యాలను తెలుసుకోవడం చాలా కష్టం. ఈ రుణాలు ఎలాంటి అంతర్జాతీయ సంస్థల్లోనూ నమోదుకావు. అందుకే వీటిని హిడెన్ డెట్ లేదా హిడెన్ క్రెడిట్ అని పిలుస్తుంటారు.

ఫొటో సోర్స్, Getty Images
గత 20ఏళ్లలో భారీగా పెరిగిన అప్పులు
గత రెండు దశాబ్దాల్లో ఈ రహస్య అప్పులు భారీగా పెరిగినట్లు అధ్యయనం చెబుతోంది. ప్రస్తుతం ఇవి 20,000 మిలియన్ డాలర్లకుపైనే ఉనాయని అంచనా వేసింది.
చైనా నుంచి అత్యధికంగా రుణాలు పొందిన తొలి 50 దేశాలను పరిశీలిస్తే.. ఈ రుణాలు సగటున ఆయా దేశాల స్థూల దేశీయోత్పత్తి (జీడీపీలో) 15 శాతానికిపైనే ఉన్నాయి. అయితే ఈ సమాచారం 2016 వరకు మాత్రమే అందుబాటులో ఉంది.
ఈ రుణాల్లో ఎక్కువ శాతం చైనా ప్రభుత్వం ఆధీనంలోని చైనా డెవలప్‌మెంట్ బ్యాంక్, ఎక్జిమ్ బ్యాంక్ ఆఫ్ చైనా నేరుగా ఇచ్చాయి. అయితే ఈ రెండింటితోపాటు చాలా పరోక్ష మార్గాల్లోనూ చైనా రుణాలను అందిస్తుంది.
ఆ రుణాలను గణించడం చాలా కష్టం ఎందుకంటే. వీటిలో చాలా వరకు ప్రభుత్వాలతో సంబంధం లేకుండా ఉంటాయి.
ప్రభుత్వ నియంత్రణలోని సంస్థలు, విభాగాలకు ఈ రుణాలు ఎక్కువగా వస్తుంటాయి.
ఈ రుణాలు ఏ స్థాయిలో ఉన్నాయో తెలుసుకోవాలంటే ప్రభుత్వ అవసరాలు, పన్ను రాబడి, దేశ ఆర్థిక స్థిరత్వం లాంటి అంశాలను పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుందని ట్రెబెస్క్ వివరించారు.

ఫొటో సోర్స్, Getty Images
ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో చైనా చోటు
2020 రెండో త్రైమాసికంలో చైనా వృద్ధి రేటు 3.2 శాతంగా ఉంది.
ప్రపంచ రుణ దాతగా చైనా స్థానం గత రెండు దశాబ్దాలుగా బలపడుతూ వస్తోంది. అదే సమయంలో చైనా తమ ఆర్థిక వ్యవస్థ ద్వారాలను మరింతగా తెరుస్తూ వస్తోంది.
చైనాలో ఆర్థిక వ్యవస్థ వృద్ధి బాటలో నడవడంతోపాటు అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో చైనా పాత్ర పెరుగుతూ వస్తోంది.
ప్రపంచంలో అతిపెద్ద ప్రభుత్వ రుణ దాతగా చైనా నేడు అవతరించింది. ఏ ప్రభుత్వమూ చైనా ఇచ్చే స్థాయిలో రుణాలు ఇవ్వడం లేదు అని ట్రెబెస్క్ పేర్కొన్నారు.
2018 సమాచారం ప్రకారం.. చైనాకు ప్రపంచ దేశాలు 5 ట్రిలియన్ డాలర్లకుపైనే రుణపడి ఉన్నాయి. ఇది ప్రపంచ జీడీపీలో ఆరు శాతం. 20 ఏళ్ల క్రితం ఇది ఒక శాతంగా ఉండేది.
అమెరికా సహా అన్ని రకాల దేశాలకూ చైనా అప్పులు ఇస్తున్నప్పటికీ.. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో చైనా ప్రాబల్యం ఎక్కువగా ఉంది. అమెరికాలో అయితే కేవలం బ్యాంకుల ద్వారా ట్రెజరీ బాండ్లను చైనా కొనుగోలు చేస్తోంది.
పేద, అభివృద్ధి చెందుతున్నదేశాలకు చైనా ఇచ్చే రుణాలు.. ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్), మరే ఇతర ప్రభుత్వం ఇచ్చే రుణాల కంటే ఎక్కువే.

ఫొటో సోర్స్, Reuters
అప్పుల తీసుకుంటున్న దేశాలివే..
చైనా నుంచి భారీగా అప్పులు తీసుకున్న తొలి పది దేశాల్లో జిబౌటీ, టొంగా, మాల్దీవులు, డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, కిర్గిజిస్తాన్, కాంబోడియా, నైజర్, లావోస్, జాంబియా, సమోవా ఉన్నాయి.
చైనా నుంచి ఎక్కువగా అప్పులు తీసుకున్న తొలి 50 దేశాలను తీసుకుంటే.. వీటి అప్పులు జీడీపీలో 2005లో ఒక శాతం కంటే తక్కువే ఉండేవి. అయితే 2017లో ఇవి సగటున 15 శాతానికి మించి పోయాయి.
ఈ దేశాల విదేశీ అప్పుల్లో 40 శాతం చైనా నుంచి వచ్చినవే. లాటిన్ అమెరికా దేశాలైన వెనెజువెలా, ఈక్వెడార్, బొలివియా కూడా చైనా అప్పుల ఊబిలో కూరుకుపోయిన దేశాల్లో ఉన్నాయి.
అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో పెరుగుతున్న చైనా ఆధిపత్యం గురించి ఎవరూ పెద్దగా పట్టించుకోవడంలేదని ట్రెబెస్క్ వివరించారు.
’’అప్పుల విషయంలో చైనాను ఓ ప్రపంచ శక్తిగా మారిందని మనం అసలు ఊహించుకోం’’ అని ఆయన అన్నారు.
’’చైనా రుణాలు అభివృద్ధి చెందుతున్న దేశాలపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. వీటి పరిణామాలను పూర్తి స్థాయిలో అంచనా వేసేందుకు ఈ దిశగా మరింత పరిశోధన జరగాలి.’’
ఇవి కూడా చదవండి:
- ‘నేను ఆక్స్ఫర్డ్ కరోనావైరస్ వ్యాక్సీన్ వేయించుకున్నా.. ఇప్పుడు నేనేం చేస్తానంటే..’
- ‘చైనా తరఫున అమెరికాలో గూఢచర్యం చేస్తున్నా’ - సింగపూర్ పౌరుడు
- చైనా - భారత్ మధ్య 45 ఏళ్లుగా లేనంత గొడవలు ఇప్పుడెందుకు?
- స్వదేశంలో కంటే విదేశాలకు అప్పులు ఇవ్వడానికే చైనా బ్యాంకుల మొగ్గు
- టిబెట్‌ను చైనా ఎప్పుడు, ఎలా తన ఆధీనంలోకి తీసుకుంది?
- చైనా, ఇరాన్‌ల సీక్రెట్ డీల్: భారత్‌కు ఎంత నష్టం
- కృత్రిమ దీవులు నిర్మిస్తామన్న చైనా కంపెనీలు.. అక్కర్లేదన్న పసిఫిక్ దేశం తువాలు
- హాంకాంగ్ ప్రజల నిరసనలకు కారణమైన మర్డర్ స్టోరీ.. ఎందుకింత వివాదాస్పదమైంది? హోటల్లో ఆ రాత్రి ఏం జరిగింది
- చైనాకు హాంకాంగ్ ‘తలనొప్పి’.. మకావు మాత్రం ‘మచ్చుతునక’..
- హాంగ్‌కాంగ్ సెక్యూరిటీ లా: వివాదాస్పద చట్టానికి చైనా ఆమోదం... వెల్లువెత్తిన ఆగ్రహం
- చైనాపై అమెరికా, బ్రిటన్ కీలక చర్యలు.. అదే బాటలో ఆస్ట్రేలియా, జపాన్, తైవాన్, కెనడా
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








