నెహ్రూకు ఆర్మీ చీఫ్‌లంటే అంత భయమెందుకు

ఫొటో సోర్స్, Niyogi book
- రచయిత, రేహాన్ ఫజల్
- హోదా, బీబీసీ కరస్పాండెంట్
ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం కాని సైన్యాన్ని నిర్మించడం ఎలా అన్న ప్రశ్న ఇప్పటికీ తరచుగా వినిపిస్తూనే ఉంటుంది. పౌర ప్రభుత్వం మిలిటరీని అదుపులో పెట్టి దాని సేవలను అత్యున్నత స్థాయిలో వినియోగించుకోవడం సాధ్యమేనా?
పది లక్షలమంది సైన్యం ఉన్నా, వారిలో ఎలాంటి రాజకీయ ఆకాంక్షలు లేకుండా చేసి, అనేక యుద్ధాలు చేయించి, అంతర్గత విషయాలలో వినియోగించుకోగలగడం భారతదేశపు ప్రజాస్వామ్య విజయంగా చెబుతారు.
అలాగని ప్రభుత్వం, సైన్యం మధ్య సంబంధాలు స్నేహపూర్వకంగా ఉన్నాయని అనుకోవడమూ సరైన అభిప్రాయం కాదు.

ఫొటో సోర్స్, AIR MARSHAL K C NANDA CARIAPPA
కరియప్పను ఆర్మీ చీఫ్‌గా చేసేందుకు నెహ్రూ అయిష్టత
జనరల్ కరియప్పను నెహ్రూ మొట్టమొదటి ఆర్మీ చీఫ్‌గా నియమించారు. కానీ ఆయన నెహ్రూ మొదటి ఆప్షన్ కాదు. మొదట నాథూ సింగ్‌కు, తర్వాత రాజేంద్రసింగ్‌కు ఇవ్వాలని భావించినట్లు ఆధారాలున్నాయి.
కానీ తామిద్దరం ఇద్దరూ కరియప్పకు జూనియర్లమని చెప్పి వారు నిరాకరించడంతో ఆయనకే ఆ పదవి ఇవ్వక తప్పలేదు.
స్వతంత్రం వచ్చాక ఆర్మీ చీఫ్ పదవీ కాలం విషయంలో నెహ్రూకు అనేక ఇబ్బందులు తలెత్తాయి. మొదట దీనికి 4 ఏళ్ల పదవీ కాలంగా నిర్ణయించారు. తర్వాత దాన్ని మూడేళ్లకు కుదించారు. దీంతో చాలామంది ఆర్మీ చీఫ్‌లు చాలా చిన్న వయసులోనే పదవీ విరమణ చేయాల్సి వచ్చింది.
నాథూసింగ్ 51, కరియప్ప 53, తోరత్, తిమ్మయ్యలు 55 ఏళ్ల వయసులో పదవీ విరమణ చేశారు.
“ఈ పదవిలో చాలాకాలంపాటు ఉన్న ఆర్మీ చీఫ్ తనను తాను మరింత రిలాక్స్‌గా భావించి రాజకీయ ఆశయాలను పెంపొందించుకునే అవకాశం ఉంటుందని నెహ్రూ భయపడ్డారు’’ అని “ఆర్మీ అండ్ ది నేషన్’’ అనే పుస్తకంలో స్టీవెన్ విల్కిన్సన్ రాశారు.
“వారు దేశానికి తమ సంపూర్ణ శక్తి సామర్ధ్యాలను అందించే వయసులో పదవుల నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఇది చాలా దురదృష్టకరమైన నిర్ణయం. నెహ్రూ వారి అనుభవం నుంచి చాలా ప్రయోజనాలను పొందే అవకాశం ఉంది. చిత్రంగా ఈ వయో పరిమితి నిర్ణయం మళ్లీ పౌర ఉద్యోగులు, వైమానిక, నౌకాదళాల అధిపతులకు వర్తించదు’’ అని తన “ లీడర్‌షిప్ ఇన్ ఇండియన్ ఆర్మీ’’ అనే పుస్తకంలో మాజీ మేజర్ జనరల్ వీకే సింగ్ వ్యాఖ్యానించారు.
కరియప్ప, నాథూసింగ్‌లు అనంతర కాలంలో ఎన్నికల్లో పోటీ చేశారు. కానీ ఓడిపోయారు.

ఫొటో సోర్స్, AIR MARSHAL K C NANDA CARIAPPA
నెహ్రూ సలహాదారులు సమర్థులేనా?
నెహ్రూ తన పాలనాకాలంలో ఎక్కువ సమయాన్ని ప్రపంచ వ్యవహారాల కోసం కేటాయించారు. దేశీయ విషయాలపై ఆయనకు దృష్టి తక్కువ. అందుకు భిన్నంగా అప్పటి చైనా అధినేత మావో సే టుంగ్ ఒకట్రెండుసార్లు మాత్రమే దేశీయ వ్యవహరాలను పక్కనబెట్టారు. విదేశీ వ్యవహరాలను పూర్తిగా చౌఎన్ లై చేతిలోనే ఉంచారు.
1962 ఇండో-చైనా యుద్ధం తరువాత ప్రపంచంలో చైనా దౌత్యనీతి మీద విశ్వసనీయత పెరిగింది. పూర్తిగా విదేశీ వ్యవహారాలకు ప్రాధాన్యం ఇచ్చిన నెహ్రూపై మాత్రం విశ్వసనీయత తగ్గింది.
“ నెహ్రూ నాయకత్వంలో ఒక లోపం ఉంది. ఆయన సరైన సలహాదారులను ఎన్నుకోలేదు’’ అని స్టీవెన్ విల్కిన్సన్ తన 'ఆర్మీ అండ్ ది నేషన్' పుస్తకంలో రాశారు.
నెహ్రూ సన్నిహితులైన కృష్ణమీనన్, జనరల్ థాపర్, బీజీ కౌల్ అంచనాలకు తగినట్లుగా పని చేయలేకపోయారు. ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ బీఎన్ మాలిక్‌ను కూడా నెహ్రూ పూర్తిగా విశ్వసించారు.
సైన్యంపై పౌర నియంత్రణను పెంచడమే దీని ఉద్దేశం. దీని ఫలితం, చైనాతో పోరాడటానికి భారత సైన్యం సన్నద్ధంగా లేకపోవడం.

ఫొటో సోర్స్, Photo division
లాల్ బహదూర్ శాస్త్రికి తప్పుడు సలహా
1965లో లాల్ బహదూర్ శాస్త్రి ప్రధానిగా ఉన్న సమయంలో భారతదేశం, పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో అప్పటి ఆర్మీ చీఫ్ జనరల్ చౌదరి భారతీయ సైనికులను బియాస్ నది నుండి వెనక్కి రావాలని ఆదేశించారు.
“జనరల్ చౌదరి తన అధీనంలో ఉన్నవారిని సంప్రదించకుండా ప్రధానమంత్రికి తప్పుడు సలహా ఇచ్చారు. ఆయుధాల నిల్వ తక్కువగా ఉందని, ట్యాంకులు నాశనమవుతున్నాయని చెప్పారు. కానీ వాస్తవం వేరుగా ఉంది" అని అప్పటి రక్షణ మంత్రి యశ్వంతరావు చవాన్‌కు కార్యదర్శిగా, తరువాత భారత కార్యదర్శిగా పని చేసిన ఆర్.డి.ప్రధాన్ తన '1965 వార్ ది ఇన్‌సైడ్ స్టోరీ' పుస్తకంలో రాశారు.
"భారతదేశంకన్నా పాకిస్తాన్ ఎక్కువగా నష్టపోయింది. జనరల్ చౌదరి సలహా మేరకు పాకిస్తాన్ ప్రతిపాదించిన కాల్పుల విరమణను భారత్ అంగీకరించింది” అని ఆయన వెల్లడించారు.
కొంతమంది రక్షణ నిపుణులు ఇది 1965 యుద్ధంలో చేసిన అతి పెద్ద పొరపాటు అంటారు.

ఫొటో సోర్స్, Niyogi books
పొరపాట్లను పరస్పరం పట్టించుకోని సైన్యం, రాజకీయ నాయత్వం
ఈ పోరాటంలో చాలాసార్లు భారత వైమానిక దళం తన సొంత సైనికులపై బాంబులు వేసింది. స్నేహపూర్వక కాల్పులకు అనేక ఉదాహరణలు ఉన్నాయి.
“అప్పటి ప్రభుత్వం వివాదాలను పెద్దవి చేయడంపై ఆసక్తి చూపలేదు. సామరస్యంగా పని చేయమని ఒత్తిడి కూడా చేయలేదు ’’ అని “ది అబ్సెంట్ డైలాగ్‌లో " అనే పుస్తకంలో అనిత్ ముఖర్జీ రాశారు.
1965, 1971 యుద్ధాలతోపాటు భారతదేశం-శ్రీలంక సైనిక కార్యకలాపాలలో అర్జున్ తారాపూర్ విస్తృతంగా పనిచేశారు. “ రాజకీయ నాయకత్వం అతి పెద్ద వైఫల్యం ఏంటంటే సైనిక చర్యలు దేశ రాజకీయ లక్ష్యాలను ఎలా సాధించగలవు అన్నది ఆలోచించలేకపోవడం' అని తన పుస్తకం “స్ట్రాటజీస్ ఆఫ్ స్టేల్‌మేట్ ఎక్స్‌ప్లెయినింగ్ ఇండియాస్ మిలిటరీ ఎఫెక్టివ్‌నెస్’’లో రాశారు.
“రాజకీయ నాయకత్వం సైనిక వ్యవహారాలపై ఆసక్తి చూపకపోవడం వల్లే 1965 యుద్ధం నిర్ణయం లేకుండా ముగిసింది’’ అని మరో సైనిక చరిత్రకారుడు శ్రీనాథ్ రాఘవన్ అభిప్రాయపడ్డారు.
ఆర్మీ చీఫ్ జనరల్ చౌధరి, లెఫ్టినెంట్ జనరల్ హర్‌బక్ష్ సింగ్‌కు మధ్య ఆర్మీ ఆపరేషన్‌ల విషయంలో అనేక విభేదాలు పొడచూపాయన్నది అందరికీ తెలిసిన విషయమే. కానీ రాజకీయ నాయకత్వం వారిద్దరి మధ్య విభేదాలను తగ్గించడానికి ప్రయత్నించలేదు.

ఢాకా ఆక్రమణపై సైన్యానికి సమాచారం లేదు
గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని, డీపీ ధార్‌ను విధాన ప్రణాళిక కమిటీ చైర్మన్‌గా నియమించారు. దౌత్య, సైనిక చర్యలను పునరుద్ధరించడమే ఆయన నియామకం ప్రధానోద్దేశం.
ఆయనకు, ఆర్మీ చీఫ్ శ్యామ్ మానెక్ షాకు మధ్య ఉన్న అద్భుతమైన సమన్వయం కారణంగా పని సులభమైంది.
1947–48 కశ్మీర్ యుద్ధంలో ఇద్దరూ కలిసి పని చేశారు. ఇవన్నీ ఉన్నా 1971 యుద్ధంలో కూడా వివాదాలు తప్పలేదు.
“ఢాకాను ఆక్రమించాలని మాకు ఆర్మీ హెడ్ ఆఫీస్ నుంచి ఆదేశాలు రాలేదు’’ అని తూర్పు నౌకాదళం చీఫ్ జనరల్ జేఎఫ్‌ఆర్ జాకబ్ బీబీసీతో అన్నారు.
“ ప్రవాసంలో ఉన్న బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని తిరిగి నియమించడానికి తూర్పు పాకిస్తాన్‌లోని ఒక పెద్ద ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోవడం ఏకైక లక్ష్యం” అని ఆయన చెప్పారు.
1971 యుద్ధం అధికారిక చరిత్రను రాసిన ఎస్.ఎన్ ప్రసాద్ “ ప్రమాదవశాత్తుగానీ లేదంటే కొన్ని కారణాల వల్ల భారతదేశపు యుద్ధ ప్రణాళిక పాకిస్తాన్‌కు లీకయింది.
దీంతో పాకిస్తానీలు తమ సొంత రక్షణ విధానాన్ని రూపొందించుకున్నారు. అయితే ఢాకాను రక్షించుకోడానికి వారి దగ్గర పెద్దగా వనరులు లేవు. ఇదే తర్వాత భారత సైన్యానికి కలిసొచ్చింది’’ అని వెల్లడించారు.
“ఢాకాను ఆక్రమించాలన్న ఆదేశాలు భారత సైన్యానికి చివరి నిమిషం వరకు రాలేదు. 1971 డిసెంబర్ 11న ఢాకాను ఆక్రమించుకోవాలని ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ముగ్గురు ఆర్మీ చీఫ్‌లకు లిఖిత పూర్వక ఆదేశాలు ఇచ్చారు" అని 1971 యుద్ధం అధికారిక చరిత్రలో రాశారు.
" వెస్ట్రన్ ఫ్రంట్‌పై కార్యాచరణలో స్పష్టత లేకపోవడం, వ్యూహాత్మక ప్రణాళికలో గందరగోళం కారణంగా భారతదేశం చంబా ప్రాంతంలో చాలా భూమిని కోల్పోయింది. మౌంట్ బాటన్ సలహా మేరకు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ నియామకంపై ఇందిరాగాంధీ ఆలోచించడం ప్రారంభించారు” అని అధికారిక చరిత్రలో రాశారు.
ఈ పదవిపై జనరల్ మానెక్‌షా తన సానుకూల అభిప్రాయం వెల్లడించారు. కానీ ఎయిర్ చీఫ్ మార్షల్ పీసీ లాల్ దీన్ని తీవ్రంగా వ్యతిరేకించారు.
“ పీసీ లాల్ వ్యతిరేకత చాలామంది రాజకీయ నాయకులకు ఊరటనిచ్చింది. ఎందుకంటే ఇప్పటికే సైన్యంపై తమకున్న నియంత్రణను డిస్ట్రబ్ చేయడం వారికి ఇష్టం లేదు. ఈ పదవి వల్ల పౌర ప్రభుత్వాలకు సైన్యం మీద పట్టు తగ్గుతుంది. చివరకు ఈ వ్యవహారంలో మానెక్ షాకు ఈ పదవి దక్కలేదు. సీనియర్ అయిన ఎస్.కె.సిన్హాను కూడా పట్టించుకోలేదు’’ అని విల్కిన్సన్ తన “ఆర్మీ అండ్ ది నేషన్’’ పుస్తకంలో రాశారు.
జనరల్ కృష్ణారావు పదవీ విరమణ తరువాత, జనరల్ ఎస్.కె. సిన్హా అత్యంత సీనియర్ జనరల్. కానీ ఇందిరా గాంధీ జనరల్ ఎ.ఎస్. వైద్యను ఆయన స్థానంలో కొత్త చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్‌ను చేశారు. జయప్రకాష్ నారాయణ్‌తో జనరల్ సిన్హా సన్నిహితంగా ఉన్నందుకే ఇది జరిగిందని చెప్పుకుంటారు.
“ఒకసారి నేను పట్నా నుండి దిల్లీ వెళుతున్నాను. యాదృచ్ఛికంగా జేపీ సీటు, నా సీటు పక్క పక్కనే ఉన్నాయి. మేము మాట్లాడుకున్నాం. ఆయన నాకు అప్పటికే తెలుసు. ఆయన దిగుతుండగా నేను ఆయన బ్రీఫ్‌కేస్ పట్టుకున్నాను’’ అని జనరల్ ఎస్.కె. సిన్హా ఆత్మకథ ' ఛేంజింగ్ ఇండియా - స్ట్రెయిట్ ఫ్రమ్ హార్ట్”లో రాశారు

ఫొటో సోర్స్, Manas publication
“ జనరల్ యూనిఫాం ధరించి నా బ్రీఫ్‌కేస్ మోస్తూ కనిపించడం మంచిది కాదు అని జేపీ అన్నారు. నేను జనరల్‌ను మాత్రమే కాదు, మీకు మేనల్లుడిని అని నేను అన్నాను. ఆయన నవ్వుతూ ఆయన బ్రీఫ్‌కేస్‌ను నాకు వదిలేశారు. విమానాశ్రయం బయటకు వచ్చాక ఆయన సూట్‌కేస్ కోసం వచ్చిన వ్యక్తికి దాన్ని అప్పగించి, ఆయనకు నమస్కారం చేసి వచ్చాను’’ అని సిన్హా తన ఆత్మకథలో రాశారు.
“మరుసటి రోజు నేను అప్పటి ఆర్మీ చీఫ్ జనరల్ టీఎస్ రైనాను కలవడానికి వెళ్లాను. మీరు జేపీతో చాలా సన్నిహితంగా ఉన్నారని నాకు తెలిసింది అని ఆయన అన్నారు.
మరో సందర్భంలో అప్పటి ఎయిర్‌ఫోర్స్ చీఫ్ నన్ను పలకరించి ఆ వృద్ధుడు ఇంకా బతికే ఉన్నాడా అని అడిగారు.
ఆయన అడిగిన విధానం, భాష నచ్చలేదు. భగవంతుడి దయవల్ల భారతదేశపు గొప్ప వ్యక్తి ఇంకా బతికే ఉన్నారు అని నేను చెప్పాను’’ అని సిన్హా తన పుస్తకంలో రాశారు.
ఆయన మర్చిపోయినా కాలం దీన్ని మర్చిపోలేదు. దీని ఫలితాన్ని అనుభవించాల్సి వచ్చినప్పుడు జనరల్ సిన్హా ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయకుండా రాజీనామా చేశారు.
రాజీవ్‌కు నచ్చని జనరల్ సుందర్జీ
రాజీవ్ గాంధీ కాలంలో అరుణ్ సింగ్ రక్షణ శాఖ సహాయ మంత్రిగా పని చేశారు. ఆయన తన ముగ్గురు ఆర్మీ చీఫ్‌లు, జనరల్ సుందర్జీ, అడ్మిరల్ తహ్లియాని, ఎయిర్ చీఫ్ మార్షల్ డెన్నిస్ లా ఫోంటెన్‌లతో చక్కని సమన్వయంతో పని చేశారు. ఆ సమయంలో తమకు సరైన ప్రాధాన్యం ఇవ్వడం లేదని బ్యూరోక్రసీ భావించడం ప్రారంభించింది.
పాకిస్తాన్ సరిహద్దులోని 'బ్రాస్‌స్టాక్స్' విన్యాసాలలో రక్షణ విషయాలను నిర్ణయించే భారతదేశ సామర్థ్యంలో అనేక లోపాలు బయటపడ్డాయి. ఈ విషయంలో ప్రధానమంత్రి రాజీవ్‌గాంధీని కూడా సైన్యం పట్టించుకోలేదని కొందరు ఆరోపించారు.
జనరల్ సుందర్జీని భారతదేశపు అత్యుత్తమ, ప్రతిష్టాత్మక, వివాదాస్పద జనరల్ అని చాలామంది అభివర్ణించారు.
“జనరల్ దీపేందర్ సింగ్ చెప్పినదాని ప్రకారం మామూలు రోజుల్లోనే ప్రధానికి, ఆర్మీ చీఫ్‌కు మధ్య సమన్వయం లేదు. అలాంటిది అత్యవసర పరిస్థితుల్లో కూడా అలాగే ఉంటే పరిణామాలు దారుణంగా ఉంటాయి.’’ అని “షాకింగ్ డిస్‌క్లోజర్స్’’ పేరుతో ఏజీ నురాని 'ఫ్రంట్‌లైన్' మేగజైన్‌లో రాశారు.
“సుందర్జీకి ప్రధానమంత్రికి ఎందుకు చెడిందో నాకు తెలియదు. కానీ మీరు ఒకసారి ఆయనతో మాట్లాడవచ్చు కదా అని నేను సుందర్జీతో అన్నాను. “ఆయన అసలు నా మాట వినరు’’ అని సుందర్జీ తెలిపారు’’ అని నురానీ తన కథనంలో వెల్లడించారు
కార్గిల్ యుద్ధంలో సైన్యంపై వాజపేయీ ఆంక్షలు
వాజపేయీ హయాంలో అణు పరీక్షలు జరిగినప్పుడు ముగ్గురు ఆర్మీ చీఫ్‌లకు చివరి నిమిషంలో సమాచారం అందింది. వైస్ అడ్మిరల్ హరీందర్ సింగ్‌ను డిప్యూటీ చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా చేసే విషయంలో ప్రభుత్వాన్ని వ్యతిరేకించినందుకు నేవల్ చీఫ్ అడ్మిరల్ భగవత్‌ను పదవి నుంచి తొలగించారు.
కార్గిల్ యుద్ధ సమయంలో నియంత్రణ రేఖను దాటవద్దని వాజపేయీ ఆదేశాల వల్ల భారత సైన్యం చాలా నష్టపోయింది.
“మొదట్లో ఆర్మీ చీఫ్‌లు ఈ ఆంక్షలను పాటించారు. కాని యుద్ధం ముందుకు సాగుతున్న సమయంలో ఈ నిర్ణయాలపై వ్యతిరేకత వినిపించింది. జాతీయ భద్రతా సలహా బోర్డుపై వారు ఒత్తిడి పెంచారు. కానీ వాజపేయా తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. టోలోలింగ్ యుద్ధంలో గెలిచిన తరువాత ఈ నియంత్రణల ఒత్తిడి కాస్త తగ్గింది’’ అని ఫోర్ క్రైసిస్ అండ్ పీస్ ప్రాసెస్’’ అన్న పుస్తకంలో పి.ఆర్.చారి, స్టీఫెన్ కోహెన్ రాశారు.

ఫొటో సోర్స్, Getty Images
సియాచిన్ సమస్యపై ప్రభుత్వానికి మద్దతివ్వని సైన్యం
మన్మోహన్‌సింగ్ కాలంలో సియాచిన్ సమస్యను పరిష్కరించడానికి భారతదేశం, పాకిస్తాన్‌లు చాలా దగ్గరగా వచ్చాయి. అయితే సైన్యం వ్యతిరేకత కారణంగా పరిష్కారం కుదరలేదు.
సైన్యం నుంచి వ్యతిరేకతను ఊహించినా, సియాచిన్‌లో పనిచేసిన జనరల్స్ అందరితోనూ సమావేశం ఏర్పాటు చేశారని ఏజీ నురాని ‘టాకెటివ్ జనరల్స్’ పేరుతో "ఫ్రంట్‌లైన్' మేగజైన్ కథనంలో రాశారు. సియాచిన్ నిస్సైనికీకరణపై ఆయన వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు.
అయితే ప్రభుత్వ ఉద్దేశాలను జనరల్ జేజే సింగ్ వ్యతిరేకించారు. “ జనరల్ జేజే సింగ్ మొదట్లో ఈ ప్రతిపాదనకు సంసిద్ధంగానే ఉన్నారు. కానీ కేబినెట్లో కొందరు సభ్యులు, జాతీయ భద్రతా సలహాదారు ఎం.కె.నారాయణన్ కూడా దీనికి వ్యతిరేకంగా ఉండటంతో ఆయన కూడా మనసు మార్చుకున్నారు’’ అని “ ది కౌటిల్య టు 21 సెంచురీ’’ అనే పుస్తకంలో శ్యామ్ శరణ్ రాశారు.
2012లో అప్పటి ఆర్మీ చీఫ్ జనరల్ వి.కె.సింగ్ బర్త్ సర్టిఫికెట్ వ్యవహారం వివాదాస్పదమైంది. ఆయన ఈ విషయాన్ని సుప్రీంకోర్టు వరకు తీసుకెళ్లారు. తాము జోక్యం చేసుకోలేమని కోర్టు చెప్పడంతో ఆయన తన పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారు.
తన పదవి ముగిసిన తర్వాత ఆయన బీజేపీలో చేరి ఎంపీగా గెలిచి మంత్రి అయ్యారు.

ఫొటో సోర్స్, Twitter/Anurag Thakur
సైన్యంతో రాజకీయాలపై విమర్శలు
నరేంద్ర మోదీ ప్రభుత్వంలో ప్రవీణ్ బక్షి, పీఎం హరీజ్ అనే ఇద్దరు సీనియర్లను కాదని, జనరల్ బిపిన్ రావత్‌ను చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్‌గా నియించారు. ఆయన పదవీ కాలం ముగిసిన తర్వాత భారతదేశపు మొట్టమొదటి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్‌గా నియమించారు.
ఇప్పటి వరకు ఉన్న సంప్రదాయం ప్రకారం సైన్యంలో పని చేస్తున్న జనరల్స్ రాజకీయ ప్రకటనలకు దూరంగా ఉంటారు. కానీ ప్రస్తుత కాలంలో చాలామంది జనరల్స్ తమ అధికార పరిధిని దాటి రాజకీయ నిర్ణయాలపై బహిరంగంగా అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
స్వాతంత్ర్యం వచ్చిన 73 ఏళ్ల తరువాత కూడా ఎంతో చక్కగా ఉన్న భారత సైన్యం పైనా, మిలిటరీ నిష్పాక్షికతపైనా ఇప్పుడు సందేహాలు వినిపిస్తున్నాయి.
2019 బాలకోట్ దాడి తరువాత ఎన్నికల ప్రచారంలో సైనికుల ఫోటోలు, చిహ్నాలను ఉపయోగించవద్దని ఎన్నికల సంఘం అన్ని రాజకీయ పార్టీలకు ఒక లేఖ పంపింది. కానీ క్షేత్ర స్థాయిలో దాన్ని నియంత్రించలేకపోయింది. ఒక ముఖ్యమంత్రి సైన్యాన్ని ఏకంగా మోదీ సైన్యం అని అభివర్ణించారు.
ఇవి కూడా చదవండి:
- కృష్ణా, గోదావరి పరవళ్లు.. దశాబ్దం తర్వాత మళ్లీ నిండుకుండల్లా ప్రాజెక్టులు
- కరోనావైరస్: బ్రెజిల్లో లక్ష దాటిన కోవిడ్ మరణాలు... భారత్ కూడా అలాంటి తప్పులే చేస్తోందా?
- ఇంటి పనులు చేయడం లేదా? అయితే ఇది చదవండి!
- మహిళల ఆరోగ్యం: ఇంటిపని చేయడం వ్యాయామం కిందకు వస్తుందా?
- 'మోదీజీ, మా ఆయన ఇంటి పనిలో సాయం చేయడం లేదు, మీరైనా చెప్పండి...'
- కరోనావైరస్: వర్క్ ఫ్రమ్ హోమ్ బాటలో కంపెనీలు.. ఇంటి నుంచి ఒంటరిగా పనిచేయటం ఎలా?
- వంట చేశాడు... ఇల్లు ఊడ్చాడు... హింసించే భర్త మనిషిగా మారాడు
- ప్రపంచంలోనే అత్యంత చల్లని కంప్యూటర్... ఇది శత్రు విమానాల్ని అటాక్ చేస్తుందా?
- నిజాయితీగా పన్ను చెల్లించేవారికి కొత్త ప్రయోజనాలు ఉంటాయన్న మోదీ
- కరోనావైరస్: తెలంగాణ, బీహార్, గుజరాత్, యూపీలలో టెస్టులు పెంచాలి - ముఖ్యమంత్రుల సదస్సులో మోదీ
- ముస్లిం పెళ్లి కూతురు, క్రైస్తవ పెళ్లి కొడుకు... హిందూ సంప్రదాయంలో పెళ్లి
- #HisChoice: అవును... నేను హౌజ్ హస్బెండ్‌ని
- కమలా హ్యారిస్ ఎవరు? జో బిడన్ ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఆమెనే ఎందుకు ఎంచుకున్నారు?
- ఇండియా, ఇరాక్, బ్రిటన్, ఆస్ట్రేలియా.. అన్ని చోట్లా అమ్మోనియం నైట్రేట్ టెన్షన్
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








