పాకిస్తాన్: హిందూ, సిక్కు మహిళలను, పిల్లలను వెంటాడి చంపుతున్నారని ఫోన్ రావడంతో నెహ్రూ కన్నీళ్లు పెట్టుకున్నారు

నెహ్రూ

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, రేహాన్ ఫజల్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

లార్డ్ మౌంట్‌బాటన్ 1947 ఆగస్టు 14 సాయంత్రం కరాచీ నుంచి విమానంలో దిల్లీ వస్తున్నప్పుడు సెంట్రల్ పంజాబ్‌పై కారు మేఘాలు కనిపించాయి. ఆ మేఘాలు జవహర్‌లాల్ నెహ్రూ రాజకీయ జీవితంలో కీలక ఘట్టాన్ని కమ్మేశాయి.

ఆగస్టు 14 సాయంత్రం 17 యార్క్ రోడ్ మార్గంలోని నెహ్రూ ఇంటి ముందు ఓ కారు ఆగింది. దానిలో ఇద్దరు స్వామీజీలు ఉన్నారు. పీతాంబరాలు ధరించిన వారి చేతిలో తంజావూర్ నదీ పవిత్ర జలాలు, విభూది ఉన్నాయి.

వారు వచ్చారని తెలిసిన వెంటనే నెహ్రూ ఇంటి నుంచి బయటకు వచ్చారు. నెహ్రూపై పవిత్ర జలాన్ని వారు చల్లారు. నుదుటిపై విభూది పెట్టారు. ఇలాంటి సంప్రదాయాలను నెహ్రూ ఎప్పుడూ అనుమతించేవారు కాదు. కానీ ఆ రోజు మాత్రం నవ్వుతూ స్వామీజీలను ఏమీ అనలేదు.

కొద్దిసేపటి తర్వాత నుదుటిపై విభూతి కడుక్కుని ఇందిరా గాంధీ, ఫిరోజ్ గాంధీ, పద్మజా నాయుడులతో కలిసి నెహ్రూ భోజనానికి కూర్చుకున్నారు. అదే సమయంలో పక్క గదిలో ఫోన్ మోగడం మొదలైంది.

ఫోన్ లైన్‌ అస్సలు బాగులేకపోవడంతో ఆయనకు ఏమీ సరిగ్గా వినిపించడం లేదు. దీంతో ఏం చెబుతున్నారంటూ నెహ్రూ మళ్లీమళ్లీ అడగాల్సి వచ్చింది. అయితే ఫోన్ పెట్టేసిన తర్వాత ఆయన మొహం తెల్లబోయింది.

నెహ్రూ

ఫొటో సోర్స్, Getty Images

ఆ తర్వాత ఆయన నోటి నుంచి ఎలాంటి మాటా రాలేదు. ఆయన ముఖాన్ని చేతులతో కప్పుకున్నారు. చేతులు తీసిన వెంటనే ఆయన కళ్లలో నీళ్లు కనిపించాయి. ఆ తర్వాత ఫోన్ లాహోర్ నుంచి అని ఆయన ఇందిరకు చెప్పారు.

హిందువులు, సిక్కులు ఉండే ప్రాంతాలకు నీటి సరఫరాను పాకిస్తాన్ కొత్త ప్రభుత్వం నిలిపివేసింది... అదీ ఆ ఫోన్ కాల్ సారాంశం.

‘‘నీటి సరఫరా నిలిపివేయడంతో హిందువులు, సిక్కులు దాహంతో అలమటిస్తున్నారు. నీటి కోసం బయటకు వస్తున్న హిందూ, సిక్కు మహిళలను, పిల్లలను చంపుతున్నారు.

పారిపోవాలని అనుకుంటున్న హిందువులు, సిక్కులను చంపేందుకు కొందరు కత్తులు పట్టుకొని రైల్వే స్టేషన్లలో తిరుగుతున్నారు.

లాహోర్ వీధుల్లో ఇళ్లకు నిప్పు పెట్టార’’ని నెహ్రూకు ఫోన్ చేసిన వ్యక్తి చెప్పారు.

''నా అందమైన లాహోర్ మండిపోతున్పప్పుడు స్వాతంత్ర్య దినోత్సవంపై సంతోషం ఎలా వ్యక్తంచేయాలి? దేశాన్ని ఉద్దేశించి ఎలా ప్రసంగించాలి?''అని నెహ్రూ విచారం వ్యక్తంచేశారు.

ఆయన్ను కుదుటపడేలా చేసేందుకు ఇందిర ప్రయత్నించారు. ''మీరు మీ ప్రసంగంపై దృష్టి సారించండి. ఈ రోజు రాత్రి మీరు దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించాలి'' అని ఆమె చెప్పారు. కానీ నెహ్రూ మనసు కకావికలమైంది.

స్వాతంత్ర్యానికి ముందురోజు ఉదయం ఏమైందంటే

ఫొటో సోర్స్, Getty Images

ట్రిస్ట్ విత్ డెస్టినీ

''రిమినిసెన్సెస్ ఆఫ్ నెహ్రూస్ ఏజ్''అనే పుస్తకంలో నెహ్రూ కార్యదర్శి ఎంఓ మథాయ్ ఈ విషయాలను రాసుకొచ్చారు. చాలా రోజుల నుంచీ ప్రసంగం కోసం నెహ్రూ సిద్ధమవుతూ వచ్చారు. నెహ్రూ పీఏ ప్రసంగాన్ని టైప్ చేసి మథాయ్‌కు ఇచ్చినప్పుడు.. డేట్ విత్ డెస్టినీ అని ఒకచోట నెహ్రూ రాయడాన్ని మథాయ్ చూశారు.

డిక్షనరీలో డేట్ అనే పదాన్ని చూశారు. అది ప్రస్తుత పరిస్థితికి సరిపోదని ఆయన భావించారు. ఎందుకంటే అమెరికాలో ఈ పదాన్ని మహిళలు, అమ్మాయిలతో బయటకు వెళ్లడానికి ఉపయోగిస్తుంటారు.

డేట్‌కు బదులు రెండవూ(rendezvous) లేదా ట్రిస్ట్(tryst) పదాలను ఉపయోగించాలని మథాయ్ సూచించారు. అయితే రెండవూ అనే పదాన్ని యుద్ధ సమయంలో రూజ్‌వెల్ట్ వాడేశారని మథాయ్.. నెహ్రూతో అన్నారు.

కొద్దిసేపు ఆలోచించిన తర్వాత నెహ్రూ డేట్ అనే పదాన్ని కొట్టేసి ట్రిస్ట్ అనే పదాన్ని రాశారు. నెహ్రూ మ్యూజియం లైబ్రరీలో నెహ్రూ ప్రసంగ పత్రం ఇప్పటికీ కనిపిస్తుంది.

నెహ్రూ

ఫొటో సోర్స్, Getty Images

ప్రపంచమంతా నిద్రపోతున్నప్పుడు

రాత్రి 11.55 గంటలకు పార్లమెంటు సెంట్రల్ హాల్‌లో నెహ్రూ స్వరం ప్రతిధ్వనించింది. ''చాలా ఏళ్ల క్రితం మనం దేశానికి ఒక మాట ఇచ్చాం. దాన్ని నెరవేర్చే సమయం నేడు వచ్చింది. నేడు మనకొక అవకాశం వచ్చింది. అర్థరాత్రి ప్రపంచ మంతా నిద్రపోతున్నప్పుడు.. భారత్ స్వేచ్ఛా ఊపిరిలూదుతోంది''

నెహ్రూ ప్రసంగానికి అదనంగా చేర్చిన రెండు వాక్యాలు తర్వాతి రోజు పత్రికల్లో కనిపించాయి. ''రాజకీయ కారణాలతో కొంతమంది సోదరసోదరీమణులు మన నుంచి దూరమయ్యారు. వారు స్వాతంత్ర్య వేడుకలు నేడు మనతో జరుపుకోలేకపోతున్నారు. వారు కూడా మనలో భాగమే. వారు ఎవరైనా కావొచ్చు''

సమయం సరిగ్గా 12 కాగానే.. గడియారం గంట కొట్టడం మొదలైంది. ఆ సమయంలో సెంట్రల్ హాల్‌లో ఉన్న ప్రజలంతా కన్నీటి పర్యంతమయ్యారు. మహాత్మా గాంధీకి జై అని వారు నినదించారు.

1960ల్లో ఉత్తర్ ప్రదేశ్ తొలి మహిళా ముఖ్యమంత్రి అయిన సుచేత కృపలానీ అప్పుడు సారే జహాసే అచ్చా, వందే మాతరం పాటలను ఆలపించారు. అక్కడే వున్న ఆంగ్లో-ఇండియన్ నాయకుడు ఫ్రాంక్ ఆంథోనీ పరుగెత్తుకుంటూ వచ్చి నెహ్రూను హత్తుకున్నాడు.

నెహ్రూ

ఫొటో సోర్స్, Getty Images

పార్లమెంటు హౌస్ బయట వర్షంలో వేల మంది భారతీయులు ఎదురుచూస్తున్నారు. నెహ్రూ బయటకు వచ్చిన వెంటనే అందరూ ఆయన చుట్టూ చేరాలని అనుకున్నారు. ఆనాటి ఘట్టాన్ని17ఏళ్ల ఇందర్ మల్హోత్రా ఎప్పటికీ మరచిపోలేదు.

12 గంట కొట్టినప్పుడు అందరితోపాటూ నెహ్రూ కళ్లు కూడా చెమర్చడాన్ని చూసి అతడు ఆశ్చర్యపోయాడు.

ప్రముఖ రచయి కుశ్వంత్ సింగ్ కూడా అప్పుడు అక్కడ ఉన్నారు. ఆయన అన్నీ వదిలేసి లాహోర్ నుంచి అక్కడకు వచ్చారు. ''మేమంతా కన్నీటి పర్యంతమయ్యాం. తెలియనివారు కూడా మమ్మల్ని సంతోషంగా హత్తుకున్నారు''అని బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కుశ్వంత్ సింగ్ చెప్పారు.

స్వాతంత్ర్యానికి ముందురోజు ఉదయం ఏమైందంటే..

ఫొటో సోర్స్, Getty Images

ఖాళీ ఎన్వలప్

అర్థరాత్రి దాటిన తరువాత తొలి భారత గవర్నర్ జనరల్ పదవి చేపట్టాలని లార్డ్ మౌంట్‌బాటన్‌ను జవహర్ లాల్ నెహ్రూ, రాజేంద్ర ప్రసాద్ ఆహ్వానించారు.

వారి అభ్యర్థనకు మౌంట్‌బాటన్‌ సమ్మతించారు. ఆయన పోర్ట్‌వైన్ బాటిల్‌ను తీసుకుని వచ్చినవారికి గ్లాస్‌లో పోసి ఇచ్చారు. ''టు ఇండియా'' అని చీర్స్ పలికారు.

కొంచెం తాగిన వెంటనే గ్లాస్‌ను మౌంట్‌బాటన్ వైపు చూపిస్తూ.. ''ఫర్ కింగ్ జార్జ్ 6''అని ఒక ఎన్వలప్‌ను నెహ్రూ ఇచ్చారు. మరుసటి రోజు ప్రమాణ స్వీకారం చేయబోయే మంత్రుల జాబితా అందులో ఉందని అంతా భావించారు.

నెహ్రూ, రాజేంద్ర ప్రసాద్ అక్కడి నుంచి వెళ్లిపోయిన తర్వాత మౌంట్‌బాటన్ ఆ ఎన్వలప్‌ను తెరచిచూసి నవ్వారు. ఎందుకంటే అది ఖాళీగా ఉంది. హడావుడిలో నెహ్రూ అందులో జాబితా పెట్టడం మరచిపోయారు.

స్వాతంత్ర్యానికి ముందురోజు ఉదయం ఏమైందంటే

ఫొటో సోర్స్, Getty Images

ప్రిన్సెస్ పార్క్‌లో లక్షల మంది..

ఆ మరుసటి రోజు దిల్లీ వీధులు జనాలతో నిండిపోయాయి. సాయంత్రం 5 గంటలకు ఇండియా గేట్ సమీపంలోని ప్రిన్సెస్ పార్క్‌లో మౌంట్‌బాటన్ మువ్వన్నెల జెండాను ఎగురవేశారు. అక్కడకు 30,000 మంది వస్తారని అంచనా వేశారు. నిజానికి అక్కడకు ఐదు లక్షల మంది చేరుకున్నారు.

భారత చరిత్రలో కుంభమేళా మినహా ఇప్పటివరకూ అంత మంది ఒకచోట చేరడం అరుదు. తన జీవితంలో ఎప్పుడూ అంతమంది ఒకచోట చేరటం చూడలేదని బీబీసీ ప్రతినిధి విన్‌ఫోర్డ్ వాన్ థామస్ వ్యాఖ్యానించారు.

మౌంట్‌బాటన్ వాహనం ముందుకు కదల్లేనంతగా జనాలు అక్కడకు చేరుకున్నారు. జెండా ఆవిష్కరించే చోట నుంచి వలయాకారంలో ప్రజలు గుమిగూడారు.

కనీసం గాలి కూడా చొరబడలేనంత దగ్గరదగ్గరగా ప్రజలు కూర్చుకున్నారు. రోడ్డుకు రెండువైపులా వారిని నిలువరించేందుకు తాళ్లు కట్టారు.

అక్కడకు జనాల దెబ్బకు మౌంట్‌బాటన్ గుర్రం కిందపడిందని ''ద అమెరికన్ విట్‌నెస్'' పుస్తకంలో ఫిలిప్ టాల్బొట్ రాసుకొచ్చారు.

స్వాతంత్ర్యానికి ముందురోజు ఉదయం ఏమైందంటే

ఫొటో సోర్స్, Getty Images

పమేలా హైహీల్స్

మౌంట్‌బాటన్ 17 ఏళ్ల కుమార్తె పమేలా కూడా ఆ సమయంలో అక్కడకు వచ్చారు. ఆమెను చూసి ''జనాల మధ్య నుంచి ప్లాట్‌ఫాం మీదకు వచ్చేయ్''అని నెహ్రూ అరిచారు.

''ఎలా రావాలి? నేను హైహీల్స్ వేసుకున్నాను''అని ఆమె అరవగా.. చెప్పులు చేత్తో పట్టుకుని వచ్చేయ్ అని నెహ్రూ చెప్పారు. చరిత్రలో నిలిచిపోయే ఈ రోజున ఇలా చేస్తానని ఎప్పుడూ అనుకోలేదని పమేలా ఆ తరువాత రాసుకొచ్చారు.

‘ఇండియా రిమెంబర్డ్’ పుస్తకంలో పమేలా ఈ విషయాలు రాశారు. ''చెప్పులు తీయడం నా వల్ల కాదని చేతులు ఎత్తేశాను. నెహ్రూ నా చేయి పట్టుకొని పైకిలాగారు. చెప్పులు వేసుకొని జనాల తలలపై నుంచి నడుచుకుంటూ వచ్చేయ్ అని నెహ్రూ అన్నారు. ఎవరూ ఏమీ అనుకోరు. నా చెప్పులు వారికి గుచ్చుకుంటాయని అన్నాను. పిచ్చిదానా.. చెప్పులు చేత్తో పట్టుకుని నడుచుకుంటూ రా అన్నారు''అని ఆమె వివరించారు.

పమేలా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, పమేలా

మొదట నెహ్రూ జనాల తలలపై నడుచుకుంటూ స్టేజ్ మీదకు వచ్చారు. ఆయన్ను చూసిన తర్వాత ఆమె కూడా చేతితో చెప్పులు పట్టుకుని జనాల తలలపై నుంచి నడుచుకుంటూ వచ్చారు. అప్పటికే అక్కడకు సర్దార్ పటేల్ కుమార్తె మనీబెన్ పటేల్ చేరుకున్నారు.

''వేదిక చుట్టూ వేల మంది మహిళలు కూడా చేరారు. అక్కడ కొంత మంది తమ శిశువులకు పాలు కూడా పడుతున్నారు. పిల్లలు జనంతో తప్పిపోకుండా ఉండాలని కొందరు భయపడుతున్నారు. ఇంకొంత మంది పిల్లల్ని పైకి ఎగరేసి పట్టుకుంటున్నారు. ఒక్క క్షణంలో ఇలా వందల మంది పిల్లలు గాల్లో కనిపిస్తున్నారు. వాటిని చూసిన పమేలా ఆశ్చర్యంలో మునిగిపోయారు. దేవుడా ఇక్కడ పిల్లల వర్షం పడుతుందా అని ఆమె అనుకుంది'' అని ఫ్రీడమ్ ఎట్ మిడ్‌నైట్ పుస్తకంలో డొమినిక్ లాపియర్, లారీ కాలిన్స్ రాశారు.

స్వాతంత్ర్యానికి ముందురోజు ఉదయం ఏమైందంటే

ఫొటో సోర్స్, Getty Images

బగ్గీ నుంచే సెల్యూట్

మరోవైపు మౌంట్‌బాటన్ తన బగ్గీలోనే ఉండిపోయారు. ఆయన బయటకు రాలేకపోయారు. అక్కడి నుంచే నెహ్రూను ఆయన పిలిచారు. ''బ్యాండ్ వాళ్లు ఇరుక్కుపోయారు. జెండాను ఆవిష్కరించేద్దాం''అని చెప్పారు.

బ్యాండ్ మోగించే వారి చుట్టూ చాలా మంది చేరారు. దీంతో వారు కనీసం తమ చేయి కూడా కదపలేని స్థితికి చేరుకున్నారు. స్టేజ్ మీద ఉండేవారికి అదృష్టవశాత్తు మౌంట్‌బాటన్ స్వరం వినిపించింది. అప్పుడు మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. బగ్గీ నుంచే నిలబడి మౌంట్‌బాటన్ సెల్యూట్ చేశారు.

మౌంట్‌బాటన్‌కీ జై.. అంటూ జనాలు గట్టిగా అరిచారు. భారత చరిత్రలో ఓ బ్రిటిష్ వ్యక్తిని ఇలా కొనియాడటం ఇదే తొలిసారి. విక్టోరియా రాణి లేదా ఆమె సంతానం ఎవరికీ దక్కని గౌరవం ఇది.

స్వాతంత్ర్యానికి ముందురోజు ఉదయం ఏమైందంటే

ఫొటో సోర్స్, Getty Images

స్వాగతించిన హరివిల్లు

ఆ మధుర క్షణంలో ప్లాసీ యుద్ధం, 1857నాటి అరాచకాలు, జలియన్ వాలాబాగ్ రక్త చరిత్ర అన్నింటినీ భారత ప్రజలు కాసేపు మరిపోయారు. జెండా పైకి వెళ్లిన వెంటనే ఆకాశంలో హరివిల్లు విరిసింది. భారత స్వాతంత్య్రానికి ప్రకృతి కూడా స్వాగతం పలికినట్లయింది.

లక్షల మంది పిక్నిక్‌కు వెళ్లినట్టు హాయిగా ఉత్సాహంగా గడపడాన్ని చూస్తూ ఆలోచనల్లో మునిగి తేలుతూ మౌంట్‌బాటన్ తన అధికారిక గృహానికి చేరుకున్నారు.

మరోవైపు జన సందోహంలో బగ్గీ చక్రాల కింద చిక్కుకుని అలసిపోయిన ముగ్గురు మహిళల్ని మౌంట్‌బాటన్, ఎడ్వినా తమతో తీసుకెళ్లారు. ఇంగ్లండ్ రాణి, రాజులు కూర్చుండే నల్లని చర్మంతో చేసిన కవర్‌పై కూర్చుని ఆ ముగ్గురు మహిళలూ ప్రయాణించారు.

అదే బండిలో చోటు లేకపోవడంతో నెహ్రూ వెనుకన ఆనుకుని ఉండే సపోర్ట్‌పై కూర్చున్నారు.

స్వాతంత్ర్యానికి ముందురోజు ఉదయం ఏమైందంటే

ఫొటో సోర్స్, Getty Images

వెలుగుల్లో దిల్లీ

ఆ మరుసటి రోజు.. మౌంట్‌బాటన్‌కు అత్యంత సన్నిహితుడు అలాన్ క్యాంప్‌బెల్‌తో చేతులు కలుపుతూ ఇలా అన్నారు. ''ఎట్టకేలకు 200 ఏళ్ల తర్వాత భారత్‌ను బ్రిటన్ గెలిచింది''

ఆ రోజు దిల్లీ వెలుగులీనింది. కనాట్‌ప్లేస్, ఎర్రకోట తదితర ప్రాంతాల్లో కాషాయం, తెలుపు, ఆకుపచ్చ వర్ణాల్లో వెలుగులు విరిజిమ్మాయి. ఆ రోజు రాత్రి ఇప్పటి రాష్ట్రపతి భవన్ అయిన గవర్నమెంట్ హౌస్‌లో 2500 మందికి మౌంట్‌బాటన్ ఆతిథ్యమిచ్చారు.

కనాట్‌ ప్లేస్‌లోని సెంట్రల్ పార్క్‌లో ప్రముఖ హిందీ సాహిత్యకారుడు కర్తార్ సింగ్ దుగ్గల్ తన ప్రేయసి ఆయేషా జాఫరీని తొలిసారి ముద్దుపెట్టుకున్నారు. కర్తార్ సింగ్ ఒక సిక్కు. ఆయేషా ఒక ముస్లిం.

ఆ తర్వాత ఎంతమంది వ్యతిరేకించినా వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)