ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం: ఇంకా ఐసీయూలోనే ఉన్న బాలు.. పరిస్థితి నిలకడగా ఉందన్న వైద్యులు

ఫొటో సోర్స్, SPBalu/FB
ప్రముఖ సినీ నేపథ్య గాయకుడు ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం ఇంకా ఐసీయూలోనే ఉన్నారని చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రి వెల్లడించింది.
కోవిడ్-19తో ఆసుపత్రిలో చేరిన ఆయన ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని.. డాక్టర్లు ఆయన పరిస్థితిని నిత్యం పరిశీలిస్తున్నారని ఎంజీఎం హెల్త్ కేర్ అసిస్టెంట్ డైరెక్టర్ అనురాధా భాస్కరన్ ఒక ప్రకటనలో తెలిపారు.

ఫొటో సోర్స్, Mgm healthcare
కాగా గురువారం రాత్రి నుంచి బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం క్షీణించింది. కోవిడ్ లక్షణాలతో ఆయన ఆగస్ట్ 5న ఆస్పత్రిలో చేరారు.
ఆయన ఆరోగ్యం గురువారం హఠాత్తుగా క్షీణించడంతో ఐసీయూలోకి మార్చినట్లు ఎంజీఎం ఆసుపత్రి వర్గాలు ఇంతకుముందు తెలిపాయి.

ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో బాలసుబ్రహ్మణ్యంను వైద్య నిపుణుల బృందం నిరంతరం పర్యవేక్షిస్తోందని ఎంజీఎం హాస్పిటల్ ఒక ప్రకటన విడుదల చేసింది.
ఏఎన్ఐ వార్తా సంస్థ కూడా ఈ విషయా న్ని ధ్రువీకరించింది. గురువారం రాత్రి ఆయన ఆరోగ్యం విషమించిందని ఏఎన్ఐ ట్వీట్ చేసింది.

బాలసుబ్రహ్మణ్యం ప్రస్తుతం లైఫ్ సపోర్ట్ మీద ఉన్నారని, ఆయన రక్త పోటు, గుండె వేగాన్ని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నామని వైద్యులు తెలిపారు.
కోవిడ్ లక్షణలాతో ఆస్పత్రిలో చేరిన తరువాత ఆయన ఒక వీడియో కూడా సోషల్ మీడియాలో షేర్ చేశారు. కోవిడ్ లక్షణాలు స్వల్పంగా కనిపించడంతో ఆస్పత్రిలో చేరానని ఆయన ఆ వీడియోలో తెలిపారు.
"గత రెండు మూడు రోజులుగా అసౌకర్యంగా అనిపిస్తూ వచ్చింది. ఛాతీ కూడా బిగుసుకుపోయినట్లు అనిపించింది. జలుబు, జ్వరం కూడా రావడంతో దీన్ని తేలికగా తీసుకోకూడదని నేను వెంటనే ఆస్పత్రిలో చేరాను. కరోనా లక్షణాలు నాలో స్వల్పంగానే ఉన్నాయని డాక్టర్లు చెప్పారు. ఇంటివద్దే ఐసోలేషన్లో ఉండి మందులు తీసుకోవచ్చని సూచించారు. కానీ, నా కుటుంబ సభ్యులు ఆందోళన చెందడంతో ఆస్పత్రిలో చేరాను. కొన్ని రోజులు విశ్రాంతి తీసుకుంటాను. ఈ సమయంలో ఎవరూ కాల్ చేయవద్దు, నేను అటెండ్ కాలేను" అని బాలు వీడియోలో కోరారు.
ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం త్వరగా కోలుకోవాలని నాతోపాటు సంగీతాభిమానులందరూ కోరుకోవాలని సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ ట్వీట్ చేశారు.

ఈ లెజెండరీ గాయకుడు తన అద్భుతమైన గాత్రంతో మనకెంతో ఆనందాన్ని పంచాడని చెప్పిన రెహమాన్, ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
రెహమాన్‌తో పాటు భారతీయ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు శేఖర్ కపూర్, బోనీ కపూర్, హారిస్ జయరాజ్, అనిరుధ్ తదితరులు ఎస్పీ బాలు త్వరగా కోలుకోవాలని ప్రారర్థిస్తున్నామంటూ ట్వీట్లు చేశారు.
బాలసుబ్రహ్మణ్యం సోదరి, గాయని ఎస్.పి వసంత శుక్రవారం రాత్రి ఒక ఆడియో రికార్డ్ చేసి విడుదల చేశారు. "ఇప్పుడే (బాలసుబ్రహ్మణ్యం కుమారుడు) చరణ్‌తో మాట్లాడాను. అన్నయ్య ఆరోగ్యం స్థిరంగా ఉందని చెప్పారు. ఎవరూ కంగారు పడాల్సిన అవసరం లేదు. మీ అందరి ప్రార్థనలే ఆయనకు కొండంత అండ. ఆయనకు చాలా విల్ పవర్ ఉంది. తప్పకుండా ఇంటికి తిరిగి వస్తారు" అని వసంత ఆ రికార్డ్ ద్వారా తెలిపారు.
ఇవి కూడా చదవండి:
- పాకిస్తాన్‌కు భారత్ కంటే ఒక రోజు ముందే స్వాతంత్ర్యం వచ్చిందా? అసలు నిజం ఏంటి?
- లాక్డౌన్లో భారత పురుషులు ఇంట్లో ఒళ్లు వంచి పనిచేశారా?
- తన కుమార్తెకు కరోనా వ్యాక్సిన్ ఇచ్చామన్న పుతిన్... ఇంతకీ ఆమె ఎవరు? ఏం చేస్తారు?
- భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు... మహాత్మాగాంధీ ఎక్కడ ఏం చేస్తున్నారు?
- కమలా హ్యారిస్ ఎవరు? జో బిడన్ ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఆమెనే ఎందుకు ఎంచుకున్నారు?
- చైనా నుంచి దిగుమతులు తగ్గితే.. చైనాకు భారత ఎగుమతులు పెరిగాయి.. ఎందుకు?
- ఇండియా, ఇరాక్, బ్రిటన్, ఆస్ట్రేలియా.. అన్ని చోట్లా అమ్మోనియం నైట్రేట్ టెన్షన్
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








