అయోధ్య: బాబ్రీ మసీదు తాళాలను రాజీవ్‌గాంధీ తెరిపించారా? అప్పుడు ఏం జరిగింది?

ఫొటో సోర్స్, FRANCIS APESTEGUY
- రచయిత, ఫైసల్ మహమ్మద్
- హోదా, బీబీసీ ప్రతినిధి
‘‘రాజీవ్ గాంధీ ఆదేశాలతో బాబ్రీ మసీదు తాళాలు తెరిచారనడం, ఇందుకోసం షాబానో కేసును వాడుకున్నారనడం... ఇవన్నీ పూర్తి అబద్ధాలు. రాజీవ్ గాంధీకి అసలు అయోధ్యలో 1986 ఫిబ్రవరి 1న జరిగిన విషయం గురించి కూడా కొంచెం కూడా సమాచారం లేదు. అందుకే అప్పుడు మంత్రి పదవి నుంచి అరుణ్ నెహ్రూను ఆయన తొలగించారు’’... రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో అప్పుడు ప్రధానమంత్రి కార్యాలయంలో జాయింట్ సెక్రటరీగా ఉన్న వజాహత్ హబీబుల్లా బీబీసీతో మాట్లాడుతూ చెప్పిన విషయం ఇది.
1986, ఫిబ్రవరి 1న ఫైజాబాద్ జిల్లా జడ్జి కేఎం పాండే, అంతకుముందు రోజు కోర్టులో దాఖలైన ఓ పిటిషన్‌ను విచారిస్తూ 37 ఏళ్లుగా మూసి ఉన్న బాబ్రీ మసీదు గేట్లు తెరవాలని ఆదేశించారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది.
విడాకులు పొందిన షాబానో అనే ముస్లిం మహిళ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును రద్దు చేసేందుకు కాంగ్రెస్ పార్లమెంటులో ఓ చట్టం చేసింది. ముస్లింల బుజ్జగింపు చర్యల్లో భాగంగానే కాంగ్రెస్ ఈ పని చేసిందని విశ్లేషకులు చెబుతారు.
అయితే, దీనికి బదులుగా హిందువులను సంతృప్తిపరిచేందుకు బాబ్రీ మసీదు తాళాలు తెరిపించారని ఆరోపణలున్నాయి. కానీ, ఈ ఆరోపణలు తప్పని హబీబుల్లా అంటున్నారు.
‘‘1986 ఫిబ్రవరి 1న అరుణ్ నెహ్రూ ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి వీర్ బహాదుర్ సింగ్‌తో పాటు లఖ్‌నవూలో ఉన్నారు’’ అని ఆయన చెప్పారు.

ఫొటో సోర్స్, HINDUSTAN TIMES
ఎంజే అక్బర్ పాత్ర
రాజీవ్ గాంధీ ప్రభుత్వం 1986 మేలో ముస్లిం మహిళల (విడాకుల హక్కుల పరిరక్షణ) చట్టం తీసుకువచ్చింది. అంతకుముందు 1985 ఏప్రిల్ 23న షాబానో కేసులో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును రద్దు చేసేందుకు ఈ పని చేసింది.
భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 125 ప్రకారం విడాకులు పొందిన భార్య.. భర్త నుంచి భరణం పొందవచ్చని, ముస్లింలకూ కూడా ఇది వర్తిస్తుందని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది.
షాబానో కేసులో సుప్రీంకోర్టు తీర్పును మార్చేందుకు చట్టం చేయాలని రాజీవ్ గాంధీకి ఎంజే అక్బర్ సలహా ఇచ్చారని హబీబుల్లా అన్నారు. ఎంజే అక్బర్ మోదీ ప్రభుత్వంలో ఇదివరకు విదేశాంగ మంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు.
‘‘రాజీవ్ గాంధీతో నేను బాబ్రీ మసీదు తాళాలు తెరవడం గురించి ప్రస్తావించా. తనకు కోర్టు ఆదేశం వచ్చేవరకూ దీని గురించి సమాచారం లేదని, ఈ విషయమై అరుణ్ నెహ్రూ తనను సంప్రదించనూ లేదని ఆయన చెప్పారు’’ అని హబీబుల్లా అన్నారు.
అప్పట్లో రాజీవ్ గాంధీ ప్రభుత్వంలో అరుణ్ నెహ్రూ కేంద్ర హోంమంత్రిగా ఉన్నారు.

ఫొటో సోర్స్, HINDUSTAN TIMES
‘‘నెహ్రూ-గాంధీ కుటుంబ సభ్యుడు, ‘హెవీవెయిట్ మంత్రి’గా భావించే అరుణ్ నెహ్రూను మంత్రి పదవి నుంచి తొలగించడానికి అదే కారణం. రక్షణ ఒప్పందాలు, ఇతర వ్యవహారాల గురించి ఆయన్ను తొలగించారని జనం అనుకున్నారు’’ అని హబీబుల్లా చెప్పారు.
షాబానో కేసు హిందూ-ముస్లిం వివాదంగా మారిన సంగతి నిజేమనని హబీబుల్లా కూడా అంగీకరించారు. ‘‘ఎన్నికల ప్రయోజనం కోసం రెండు వర్గాలనూ సంతృప్తిపరిచే విధానాలను పాటించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ పరిష్కారం కనుక్కోవడం చాలా కష్టం’’ అని ‘ద స్టేట్స్‌మాన్’ పత్రికలో నీరజ్ చౌధరీ అప్పట్లో రాశారు.
1984 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 49 శాతం ఓట్లు, 404 సీట్లు వచ్చాయి. బీజేపీకి 8 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి.
రాజీవ్ గాంధీ అప్పుడు కొత్త చట్టం తెచ్చేందుకు కాంగ్రెస్ నాయకురాలు నజ్మా హెప్తుల్లా రాజీ కుదిర్చారని ‘స్క్రోల్’ వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ ఇటీవల పేర్కొన్నారు.
నజ్మా హెప్తుల్లా బీజేపీలో చేరారు. ఆరిఫ్ మహమ్మద్ కూడా ఆ తర్వాత బీజేపీలో చేరారు.
బాబ్రీ మసీదు తాళాలు తెరవడంలో రాజీవ్ గాంధీ పాత్ర ఉందని నెహ్రూ-గాంధీ కుటుంబానికి సన్నిహితుడు, మధ్యప్రదేశ్ మాజీ సీఎం కమల్‌నాథ్ కొన్ని రోజుల క్రితమే వ్యాఖ్యానించారు.

ఫొటో సోర్స్, THE INDIA TODAY GROUP
రాజీవ్ గాంధీపై ఒత్తిడి
రాజీవ్ గాంధీ ప్రభుత్వం ముస్లింలను బుజ్జగిస్తోందన్న భావన అప్పట్లో హిందువుల్లోని ఓ పెద్ద వర్గంలో ఉందని, బాబ్రీ మసీదు విషయంలో ప్రభుత్వం అన్ని వైపుల నుంచి ఒత్తిడి ఎదుర్కొంటూ ఉందని బీబీసీ మాజీ ప్రతినిధి, అయోధ్యకు సంబంధించిన వ్యవహారాలను దగ్గరగా కవర్ చేసిన అనుభవం ఉన్న రామ్‌దత్త్ త్రిపాఠీ అన్నారు.
‘‘రామ మందిర విషయంలో ఏదైనా నిర్ణయం తీసుకోవాలని శంకరాచార్య స్వరూపానంద ఒత్తిడి తెస్తున్నారు. రాబోయే ఏడాది శ్రీరామనవమిలోగా ‘జన్మ స్థానం’ తాళాలు తీయకుంటే తాను ఆత్మహత్య చేసుకుంటానని రామచంద్ర పరమహంస హెచ్చరించారు’’ అని రామ్‌దత్త్ వ్యాఖ్యానించారు.
తాజాగా అయోధ్య రామమందిర భూమి పూజ కార్యక్రమంలో ప్రంసగిస్తూ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్... రామచంద్ర పరమహంసను గుర్తు చేశారు కూడా.
శంకరాచర్య స్వామి స్వరూపానంద 1948లో ఏర్పడ్డ రామ రాజ్య పరిషద్‌కు అధ్యక్షుడిగా పనిచేశారు. 1952 తర్వాత ఆయన ఏర్పాటు చేసిన రాజకీయ పార్టీ ఎన్నికల్లో సాధారణ విజయాలు అందుకుంది. ఆ తర్వాత రామ జన్మభూమి అంశానికి సంబంధించి ఆయన కార్యక్రమాలు చేపట్టారు. స్వరూపానంద పార్టీ జన్‌సంఘ్‌లో విలీనమైనప్పటికీ ఆయన్ను కాంగ్రెస్‌కు సన్నిహితుడిగా భావిస్తారు.
‘‘1986 జనవరి 28న ఫైజాబాద్‌లో స్థానిక న్యాయవాది ఉమేశ్ చంద్ర్ బాబ్రీ గేటు తెరిపించాలని అభ్యర్థిస్తూ కోర్టులో పిటిషన్ వేశారు. ఈ వ్యవహారానికి సంబంధించి పత్రాలన్నీ హైకోర్టులో ఉన్నాయని, వాటిని చూడకుండా దీనిపై ఏ నిర్ణయమూ తీసుకోలేమని చెబుతూ జడ్జి దాన్ని తిరస్కరించారు. కానీ, జనవరి 31న జల్లా జడ్జి కేఎం పాండే ముందు ఉమేశ్ చంద్ర్ అప్పీలు చేశారు. మరుసటి రోజు పాండే ఆదేశాలిచ్చారు’’ అని రామదత్త్ వివరించారు.

ఫొటో సోర్స్, HINDUSTAN TIMES
విశ్వహిందూ పరిషద్‌తో ఉమేశ్ చంద్ర్‌కు సంబంధాలున్నాయని ఫైజాబాద్ వాసి, బాబ్రీ మసీదు కేసుకు సంబంధించిన పైరవీకారుడు ఖాలిక్ అహ్మద్ ఖాన్ అన్నారు.
ఈ వివాదాస్పద స్థలం కేసును చాలా కాలంగా పరిశీలించిన అనుభవమున్న న్యాయవాది వేసినట్లుగా ఉమేశ్ చంద్ర్ పిటిషన్ ఉందని రామ్‌దత్త్ అభిప్రాయపడ్డారు.
1984 ఎన్నికల్లో ఆర్ఎస్ఎస్‌తో సంబంధమున్న భారతీయ జనతా పార్టీకి కేవలం రెండు సీట్లు వచ్చాయి. వాజ్‌పేయీ, అడ్వాణీ లాంటి పెద్ద నేతలు ఎన్నికల్లో ఓడిపోయారు.
తీర్పు సమయంలో తనకు అనేక సంకేతాలు కనిపించాయని, ఆ రోజు కోర్టు పరిసరాల్లో ఓ కోతి కూడా ఉందని జడ్జి కేఎం పాండే వ్యాఖ్యానించినట్లు చాలా చోట్ల ప్రచురితమైంది. కేఎం పాండే తన ఆత్మకథలోనూ కోతి గురించి ప్రస్తావించారు.
తాళాలు తెరవడంపై స్థానిక ప్రభుత్వ యంత్రాంగం అభిప్రాయం కూడా కోర్టు తీసుకుందని, వారు ఏ ఇబ్బందీ ఉండదని తెలిపారని కూడా రికార్డుల్లో ఉంది.
దశాబ్దాలుగా కోర్టులో నలుగుతున్న ఇలాంటి ప్రధాన వ్యవహారానికి సంబంధించి, పై నుంచి ఆదేశాలు లేకుండా ఫైజాబాద్ యంత్రాంగం స్వయంగా ఈ నిర్ణయం తీసుకుని ఉండదని విశ్లేషకులు అభిప్రాయపడుతుంటారు.
1949, డిసెంబర్ 23న చట్ట విరుద్ధంగా విగ్రహం పెట్టిన తర్వాత, బాబ్రీకి తాళాలు వేశారు. అప్పటి నుంచి హైకోర్టులో కేసు కొనసాగుతూ వచ్చింది.
ఫైజాబాద్ జిల్లా జడ్డి తీర్పుపై 2010లో లఖ్‌నవూ హైకోర్టులోని ప్రత్యేక ధర్మాసనం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఇది పూర్తి చట్ట విరుద్ధమైన నిర్ణయమని... 1992, డిసెంబర్ 6న మసీదు విధ్వంసానికి అదే ఆరంభమని వ్యాఖ్యానించింది.
షాబానో కేసులో సుప్రీం తీర్పును రద్దు చేసే బిల్లును అప్పట్లో ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ వ్యతిరేకించారు.
‘‘ముస్లిం పర్సనల్ లా బోర్డుతో అంగీకారం కుదిరిందని, షాబానో కేసులో సుప్రీం కోర్టు తీర్పును రద్దు చేసే చట్టాన్ని పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెడతామని 1986 జనవరిలో రాజీవ్ గాంధీ చెప్పారు. అయితే, ఈ నిర్ణయంపై చాలా వ్యతిరేకత వచ్చింది. దీనిపై నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు ఒక బ్యాలెన్సింగ్ యాక్ట్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు. అప్పుడు అయోధ్య అంశం ఉంది. కేంద్ర ప్రభుత్వ ఆదేశంతో ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం వివాదాస్పద స్థలం తాళం తెరించేందుకు ఏర్పాట్లు చేసింది’’ అని ‘ద హిందుస్తాన్ టైమ్స్’ పత్రికలో ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ రాశారు.
అప్పట్లో ఒక దూరదర్శన్ టీవీ ఛానెల్ మాత్రమే ఉంది. తాళాలు తెరిచిన వెంటనే దాని గురించి ప్రసారం చేయడం కూడా కేంద్ర ప్రభుత్వానికి ఈ పూర్తి విషయం గురించి ముందే తెలుసు అనడానికి సంకేతమని విశ్లేషకులు చెబుతుంటారు.

ఫొటో సోర్స్, GETTY IMAGES
40 నిమిషాల్లోనే...
ఫైజాబాద్ జిల్లా కోర్టు సాయంత్రం 4.20కి ఆదేశాలివ్వగా, 40 నిమిషాల తర్వాత (5:01కి) వివాదాస్పద స్థలం తాళాలు తెరిచారు. దూరదర్శన్ బృందం అక్కడ సిద్ధంగా ఉంది. సాయంత్రం వార్తల్లో దీన్ని ప్రసారం చేశారు.
ఫైజాబాద్ జిల్లా కోర్టు జడ్జి అన్ని పక్షాలకూ కనీసం తీర్పు కాపీ కూడా ఇవ్వలేదు. జడ్జి కార్యాలయం బాబ్రీ మసీదుకు ఏడు కి.మీ.ల దూరంలో ఉంది. కనీసం తాళాలు ఉన్న అధికారికి కూడా సమాచారం తెలియజేయలేదు. ఆయన్ను పిలవకుండానే తాళాలు పగులగొట్టి తెరిచారు.
ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం జిల్లా జడ్జి నిర్ణయాన్ని పైకోర్టులో సవాలు చేసింది.
షాబానో కేసు తీర్పును రద్దు చేసే చట్టం తెచ్చేందుకు రాజీవ్ గాంధీపై జియా ఉర్ రహమన్ అన్సారీ ఒత్తిడి తెచ్చారని, రాజీనామా చేసేందుకు సైతం సిద్ధపడ్డారని జియా ఉర్ కుమారుడు ఫసీ ఉర్ రహమాన్ ఓ పుస్తకంలో రాశారు.
అయితే, రాజీవ్ గాంధీ వైఖరి మారడంలో జియా ఉర్ రహమన్ అన్సారీ హస్తం ఉందని భావించడం తప్పే అవుతుందని ఆరిఫ్ మహమ్మద్ ‘స్క్రోల్’ వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు.
‘‘స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకూ కమ్యూనిస్టుల నుంచి రైట్ వింగ్ వరకూ అన్ని రకాల భావజాలాలు ఉన్నవాళ్లు కాంగ్రెస్ ఉన్నారు. కశ్మీర్‌కు సంబంధించి ఆర్టికల్ 370 విషయంలోనే కాంగ్రెస్‌లో మాధవ్ రావ్ సింధియా (కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు) నుంచి రాహుల్ గాంధీ వరకూ భిన్నమైన అభిప్రాయలు చూశాం. 1986లోనూ ఇదే పరిస్థితి చూడొచ్చు’’ అని రచయిత, రాజకీయ విశ్లేషకుడు రశీద్ కిద్వాయీ అన్నారు.
ఇవి కూడా చదవండి:
- చిన్న మార్పుతో చైనాను భారీ దెబ్బకొట్టిన ఇండియా
- కరోనా విపత్తు బొగ్గు పరిశ్రమను అంతమొందిస్తుందా
- మేఘాలయ: 'ర్యాట్ హోల్' బొగ్గు గనిలో ఎలా పనిచేస్తారు
- ఆంధ్రప్రదేశ్‌లో బొగ్గు గనులు: తక్కువ లోతులోనే బొగ్గు ఉన్నా ఎందుకు తవ్వట్లేదు?
- భారత్‌లో నాలుగు దశాబ్దాల్లో తొలిసారిగా భారీగా తగ్గిన కర్బన ఉద్గారాలు
- పాకిస్తాన్ కొత్త మ్యాప్ గురించి చైనా ఎందుకు నోరు మెదపలేదు
- భారత్-చైనా సరిహద్దుల్లో భారీ రవాణా సదుపాయాలు ఎందుకు నిర్మిస్తున్నారు?
- చైనా - భారత్ సరిహద్దు సంఘర్షణ: 21వ శతాబ్దపు అతిపెద్ద జగడం ఇదేనా?
- ‘నీకు జీవితంలో తోడు దొరకదని శకుంతల దేవి చెప్పారు.. ఇప్పటికీ ఒంటరిగానే ఉన్నాను’
- కరోనావైరస్ లక్షణాలు ఏమిటి? ఎలా గుర్తించాలి? నన్ను నేను ఎలా కాపాడుకోవాలి?
- కేరళలో ఎయిరిండియా విమాన ప్రమాదం: కోళికోడ్‌లో ల్యాండవుతూ జారడంతో దుర్ఘటన... 17 మంది మృతి
- ఏడుగురు ఫ్రెండ్స్ చనిపోయారు.. నేను చనిపోయినా బాగుండేది’
- అమ్మోనియం నైట్రేట్ అంటే ఏమిటి.. అది ఎంత ప్రమాదకరం
- 'నా భర్త నన్ను కొడుతుంటే అందరూ ఇది
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








