కరోనావైరస్: తెలంగాణలో పీపీఈ కిట్‌ల పేరుతో ప్రైవేట్ ఆసుపత్రులు దోచుకుంటున్నాయా...

పీపీఈ కిట్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, దీప్తి బత్తిని
    • హోదా, బీబీసీ ప్రతినిధి

కరోనా చికిత్స అందిస్తున్న ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రులు పర్సనల్‌ ప్రొటెక్షన్ ఎక్విప్‌మెంట్(పీపీఈ) కిట్‌ల పేరుతో అదనపు చార్జీల మోత మోగిస్తున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

కరోనా బాధితులకు వైద్యం అందించే వైద్యులు, సిబ్బంది ఈ పీపీఈ కిట్‌లు ఉపయోగిస్తారు.

కేంద్ర ఆరోగ్య శాఖ మార్గదర్శకాల ప్రకారం పీపీఈ కిట్‌లో గాగుల్స్, ముఖానికి వేసుకునే షీల్డ్, మాస్క్, గ్లోవ్స్, గౌను, తలకు కవర్, షూ కవర్ భాగం ఉంటాయి.

కరోనా చికిత్స పొందుతున్న రోగుల నుంచి అధిక బిల్లులు వసూలు చేస్తున్నారని ఫిర్యాదులు వస్తున్నాయి. అందులో ముఖ్యంగా పీపీఈ కిట్‌లకే అధికంగా చార్జీలు ఉన్నాయని ఇప్పటికే కొందరు సోషల్ మీడియాలో తెలంగాణ మంత్రులకు ఫిర్యాదు చేశారు.

అధిక ధరలు వసూలు చేసినందుకు హైదరాబాద్ సోమాజిగూడలోని డెక్కన్ ఆసుపత్రి, బంజారాహిల్స్‌లోని విరించి ఆసుపత్రిపై తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ చర్యలు తీసుకుంది. కరోనా చికిత్స కోసం ఆ ఆసుపత్రులకు ఇచ్చిన చికిత్స అనుమతులను రద్దు చేసింది.

ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రులపై ఇప్పటికే 1091 ఫిర్యాదులు వచ్చినట్టు ప్రజారోగ్య శాఖ డైరక్టెర్ జి. శ్రీనివాస్ 'బీబీసీ తెలుగు'కు తెలిపారు. అందులో 149 ఫిర్యాదులు అధిక చార్జీలకు సంబంధించినవే.

పీపీఈ కిట్

ఫొటో సోర్స్, Getty Images

పీపీఈ కిట్‌లకు ఎంత వసూలు చేస్తున్నారు

ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రులలో కరోనా చికిత్సల ధరలు నిర్ణయిస్తూ జూన్‌‌లో తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఐసీయూలో చికిత్సకు రోజుకు రూ. 7500. వెంటిలేటర్‌పై చికిత్సకు రూ. 9000, ఐసోలేషన్ చార్జీలు రూ. 4000గా నిర్ణయించింది. అయితే, ఇందులో పీపీఈ కిట్‌ల చార్జీలు కలపలేదు.

దీంతో రోగుల నుంచి వసూలు చేస్తున్న బిల్లులో పీపీఈ కిట్‌లపైనే భారీగా వడ్డిస్తున్నారు.

ఉదాహరణకు... యశోదా ఆసుపత్రిలో జులై 4 నుంచి 6 వరకు జనరల్ వార్డులో చికిత్స పోందిన ఒక పేషెం‌ట్ బిల్‌ను బీబీసీ తెలుగు పరిశీలించింది. మొత్తం బిల్లు రూ. 1,80,000. అందులో 4, 5, 6 తేదీలలో రోజుకు రూ. 24,300 పీపీఈ కిట్ చార్జీలుగా వసూలు చేశారు. అంటే రూ. 1,80,000 బిల్లులో రూ. 72,900 కేవలం పీపీఈ కిట్ల చార్జీలే.

మరో రోగికి 12 రోజులకు బిల్లు రూ. 332,682 కాగా అందులో రూ. 96,000 కేవలం పీపీఈ కిట్‌ల చార్జీలే.

హైదరాబాద్‌లోని మరో ఆసుపత్రి సెంచురీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో ఒక్క రోజుకే పీపీఈ కిట్‌ ధర రూ. 19,800 వసూలు చేశారు. కాంటినెంటల్ ఆసుపత్రిలో పీపీఈ కిట్ చార్జీ రూ. 1700.

ఇలా ఒక్కో ఆసుపత్రి వేరువేరు ధరలు చార్జీ చేస్తున్నాయి. కొన్ని బిల్లులో చార్జీలు స్పష్టంగా తెలపడం లేదు.

తెలంగాణ ప్రభుత్వం ఆగస్టు 12న దీనికి సంబంధించి ఓ ఉత్తర్వు జారీ చేసింది.

ప్రైవేట్ ఆసుపత్రులు కరోనా చికిత్స అందించడంలో పారదర్శకతను పాటించాలని ప్రజారోగ్య శాఖ హెచ్చరించింది.

పీపీఈ కిట్‌లు, ఎన్ 95 మాస్కులకూ గరిష్ఠ చిల్లర ధర (ఎంఆర్పీ)ను మాత్రమే వసూలూ చేయాలని ఆదేశించింది.

పీపీఈ కిట్లు

ఫొటో సోర్స్, Getty Images

పీపీఈ కిట్‌ల గరిష్ఠ చిల్లర ధర ఎంత?

దీనిపై తెలంగాణ వైద్య సేవలు, మౌలిక సదుపాయాల సంస్థ (టీఎస్ఎంఎస్ఐడీసీ) ఎండీ చంద్రశేఖర్ రెడ్డి బీబీసీ తెలుగుతో మాట్లాడారు. ప్రస్తుతం ప్రభుత్వం పీపీఈ కిట్‌లను రూ. 400కు కొనుగోలు చేస్తునట్టు తెలిపారు.

టెండర్ల ద్వారా కొనుగోలు చేస్తున్నారు. ఈ పీపీఈ కిట్లు ప్రభుత్వ ఆసుపత్రులలో వైద్యులు, సిబ్బంది, పారిశుధ్య కార్మికులు ఉపయోగిస్తారు.

ప్రైవేటు ఆసుపత్రులు వివిధ తయారీదారుల నుంచి పీపీఈ కిట్లను కొనుగోలు చేస్తున్నాయి. హైదరాబద్‌లోని ఓ పీపీఈ కిట్ తయారీ సంస్థతో బీబీసీ తెలుగు మాట్లాడింది. పేరు చెప్పడానికి ఇష్ట పడని ఈ సంస్థ, గత 15 సంవత్సరాలుగా అనేక వైద్య పరికరాలను తయారీ చేస్తోంది. "భారత దేశంలో పీపీఈ కిట్ల తయారీ గతంలో ఎక్కువ లేదు. కరోనా నేపథ్యంలో తయారీ పెరిగింది. మేం కూడా తయారీ ప్రారంభించాం. ఒక్క పీపీఈ కిట్ ధర రూ. 600 నుంచి రూ. 900 ఉంది. ఈ ధరకే ఆసుపత్రులు కొనుగోలు చేస్తున్నాయి" అని తెలిపారు.

మార్చి, ఏప్రిల్‌లో దేశంలో పీపీఈ కిట్ల కొరత ఉండింది. దీంతో చైనా, సింగపూర్‌‌ల నుండి పీపీఈ కిట్లను దిగుమతి చేసుకున్నట్టు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి ఏప్రిల్‌లో ఒక ప్రకటనలో తెలిపారు. అయితే ఇప్పుడు దేశంలో 107 తయారీ సంస్థలు ఉన్నాయి. కేంద్ర ఆరోగ్య శాఖ గుర్తించిన తొమ్మిది ప్రయోగశాలలో ఈ పీపీఈ కిట్ల నాణ్యత పరీక్షంచిన తరువాత ధ్రువీకరిస్తారు. ఈ ధ్రువీకరణ ఉన్న కిట్లనే కొనుగోలు చేయాలి.

కానీ, నాణ్యత పరీక్షించే ప్రయోగశాలలు తగినన్ని లేకపోవడంతో ధ్రువీకరణకు సమయం పడుతోందని హైదరబాద్‌లోని ఒక పీపీఈ కిట్‌ల తయారీ సంస్థ అధికారి.

''ధ్రువీకరణ లేకుండా తక్కువ ధరకే పీపీఈ కిట్‌లను ప్రయివేటు ఆసుపత్రులు కొంటున్నాయ''ని ఆయన చెప్పారు.

నియంత్రించలేరా...

అన్ని వైద్య పరికరాల గరిష్ఠ చిల్లర ధరలను 'డ్రగ్స్ ప్రైస్ కంట్రోల్ ఆర్డర్ (డీపీసీఓ) -2013' నిబంధనల ప్రకారం నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ (ఎన్‌పీపీఏ) పర్యవేక్షిస్తుందిని కేంద్రం ఏప్రిల్ నెలలో స్పష్టం చేసింది. ఏడాది కాలంలోనే వైద్య పరికరాల ఎంఆర్‌పీ 10 శాతం, అంతకంటే ఎక్కువ పెరిగితే దాన్ని నియంత్రించే అధికారం ఎన్‌పీపీఏకు ఉంటుంది.

నేషనల్ లిస్ట్ ఆఫ్ ఎసెన్షియల్ మెడిసన్స్(ఎన్‌ఎల్‌ఇఎం) -2015‌లో షెడ్యూల్డ్ మెడికల్ పరికరాల ధరలను ఎన్‌పిపిఎ నియంత్రణలో తీసుకోచ్చింది. సర్జికల్ మాస్కుల ధరలనూ నియంత్రించారు.

కానీ పీపీఈ కిట్లు షెడ్యూల్డ్ కాదని అంటున్నారు ఎన్‌పీపీఏ అధికారులు. "మేం కేవలం ధరలను నియంత్రిస్తాం. పీపీఈ కిట్ల ధరను కేవలం పర్యవేక్షించగలం. అది షెడ్యూల్డ్ లిస్టులో లేనందున ధర నియంత్రించలేం" అని వివరించారు ఎన్‌పీపీఏ అధికారి ఎన్ఐ చౌదరి.

ఎన్‌పీపీఏ నియంత్రణలో లేకపోవడంతో ఎవరు పడితే వారు పీపీఈ కిట్లను తయారు చేస్తున్నారని అంటున్నారు హైదరబాద్‌కు చెందిన తయారీదారు. "నాణ్యతపైనా నియంత్రణ లేదు. పీపీఈ కిట్లను కూడా షెడ్యూల్డ్ మెడికల్ పరికరాల జాబితాలో చేరిస్తే దీని తయారీ నాణ్యత పాటించేలా చేయొచ్చు. ధరలపైనా నియంత్రణ ఉంటుంది" అని ఆయన అన్నారు.

షెడ్యూల్డ్ మెడికల్ పరికరాల జాబితాలో లేకపోవడంతో బీమా సంస్థలు వీటిని కవర్ చేయడంలేదంటున్నారు భారత వైద్య పరికరాల తయారీ పరిశ్రమల సంఘం సభ్యులు రాజీవ్ నాథ్.

కాగా బీబీసీ దీనిపై ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాల సంఘంతో మాట్లాడింది. మార్కెట్ ధరల ప్రకారమే తాము బిల్లు వేస్తున్నామని పేరు చెప్పడానికి ఇష్టపడని అసోసియేషన్ ప్రతినిధి ఒకరు చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)