శ్రీలంక ప్రజలు ఆకలి బారిన పడకుండా పనస కాయలే కాపాడుతున్నాయా...

పనస కాయలు

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, జినారా రథ్నాయకే
    • హోదా, బీబీసీ ట్రావెల్

స్వయం సమృద్ధే లక్ష్యంగా బ్రిటిష్ కాలంలో శ్రీలంకలో రైతులు పనస చెట్లు నాటడం మొదలుపెట్టారు. ఇప్పుడు దేశంలో చాలా మంది ఆకలి బారిన పడకుండా ఈ చెట్లే కాపాడుతున్నాయి.

శ్రీలంకలోని కొలంబోకు ఈశాన్యంగా వంద కి.మీ. దూరంలోని కురునెగేల ప్రాంతంలో మా అమ్మ పెరిగింది. ఆమెతోపాటు ఇంట్లో ఎనిమిది మంది ఉండేవారు. 1970ల్లో ఇక్కడ కరవు విళయ తాండవం చేసినప్పుడు భోజనానికి కూడా వారికి కష్టమయ్యేది. మట్టికుండలో ఉడగబెట్టిన పనస కాయలు, గుప్పెడు కొబ్బరి తురుమే వారికి ఆహారం. సహజ సిద్ధమైన కొవ్వులు, పోషకాలుండే ఈ ఆహారమే తిని వారు కడుపు నింపుకొనేవారు.

నేడు స్టార్‌బక్స్ లాంటి కాఫీహౌస్‌లు పనస ర్యాప్‌లు అందిస్తున్నాయి. పిజ్జాహట్ కూడా పిజ్జాలపై పనస ముక్కలను చల్లుతోంది. కాలీఫ్లవర్, క్యాబేజీలు కలిపితే వచ్చే పోషకాలు పనసతో అందుతాయని ద లండన్ ఈవినింగ్ స్టాండార్డ్ పేర్కొంది. మరోవైపు పనసను హాటెస్ట్ ఫుడ్ ట్రెండ్ ఆఫ్ 2017గా పిన్‌టెరెస్ట్ వెల్లడించింది. అంతేకాదు దీన్ని అద్భుత శాకాహారంగా ద గార్డియన్ అభివర్ణించింది.

మా అమ్మకు పనసతో మంచి అనుబంధముంది. చిన్నప్పుడు ఆమె సోదరి చేసిపెట్టే పనస కూరలను తింటూ ఆమె పెరిగింది. కొబ్బరి పాలలో పనసను కలిపి వండే కూర ''కిరి కోస్''అంటే ఆమెకు చాలా ఇష్టం. దీని కోసం పచ్చి పనస కాయలను మా పెద్దమ్మ కోసుకుని వచ్చేది. చిన్నప్పుడు నాకు కూడా ఈ పనస పండంటే చాలా ఇష్టం ఉండేది. పైన పనస పొట్టు(కొహొళ్ల)ను తీసి పసుపుగా ఉండే పనస తొనలను నాకు ఇవ్వడాన్ని మా అమ్మ ఇప్పటికీ గుర్తు చేస్తుంటుంది.

పనస కాయలు

ఫొటో సోర్స్, Nathan Mahendra

ఆ సువాసన నాకు చాలా ఇష్టం. పశ్చిమ దేశాల వారు ఈ వాసనను దుర్వాసనగా చెబుతుంటారు. కానీ నాతోపాటు శ్రీలంక, భారత్‌, మలేసియా అటవీ ప్రాంతానికి సమీపంలో నివసించే ప్రజలకు పనస పళ్లంటే చాలా ఇష్టం ఉంటుంది.

ప్రపంచంలోనే చెట్టు నుంచి వచ్చే అతిపెద్ద పండు పనసే. దీనిపై నుండే తొక్క.. పనస పండే కొద్దీ మారుతుంటుంది. పనస పండినప్పుడు ఇది పసుపు రంగులో ఉంటుంది. పచ్చి పనస కాయలను వంటల్లో ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. పళ్లను మాత్రం నేరుగా తింటారు. మామిడి, యాపిల్ పళ్లను తిన్నట్టే పనస పళ్లనూ తింటుంటారు. పశ్చిమ దేశాల్లో దీన్ని మాంసాహారానికి ప్రత్యామ్నాయంగా చెబుతుంటారు. శతాబ్దాల నుంచి శ్రీలంక ప్రజలను ఆకలి బాధల నుంచి ఈ పండే కాపాడుతోంది.

శ్రీలంకలో పనస చెట్టును బాత్ గాసా(రైస్ ట్రీ)గా పిలుస్తుంటారు. ఇక్కడ ఎక్కువ మంది అన్నమే తింటారు. బ్రిటిష్ పాలనకు ముందు ఇక్కడ పెద్దపెద్ద రిజర్వాయర్లు, కాలువలు ఉండేవి. రుతు పవనాల్లో వచ్చే వర్షాలను ఇవి ఒడిసిపట్టేవి. వీటి గుండా వచ్చే నీటితో వరిని పండించేవారు. అయితే, 1815లో ఇక్కడ బ్రిటిష్ పాలకులు కాలుమోపారు. అనంతరం ఇక్కడ వరిసాగు కష్టమైంది. క్రమంగా టీ, రబ్బరు, దాల్చిన చెక్కల సాగు పెరిగింది. వీటిని బ్రిటిష్ పాలకులు ఎగుమతి చేసుకునేవారు.

బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటుకు లేవనెత్తిన ఆర్థర్ వీ డయాస్‌ 1915లో జైలు నుంచి విడుదలయ్యారు. ఆయన బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడారు. ఇక్కడ వరి సాగు తగ్గిపోవడంతో ఆహార ధాన్యాల కొరత చుట్టుముట్టే అవకాశముందని ఆయన అప్పట్లోనే అంచనా వేశారు. స్వాత్రంత్య ఉద్యమ సమయంలో శ్రీలంక మధ్య భాగంలో పనస చెట్లను ధ్వంసం చేయడాన్నీ ఆయన గమనించారు. అప్పటికే మొదట ప్రపంచ యుద్ధం నడుమ ప్రపంచంలో చాలాచోట్ల ఆహార ధాన్యాల కొరత ఏర్పడింది. దీంతో దేశ స్వావలంబనే లక్ష్యంగా అందరూ కృషి చేయాలని ఆర్థర్ పిలుపునిచ్చారు.

పనస కాయలు

ఫొటో సోర్స్, Sahid Laskar

''వరి సాగుకు అవసరమైన నీటి ట్యాంకులను ఒక వ్యక్తి నిర్మించలేడు. కానీ పనస చెట్లను నాటగలడు. ఈ విషయాన్ని ఆర్థర్ వెంటనే గ్రహించారు. ఈ పండు శ్రీలంక వాసులను ఆకలి బాధల నుంచి కాపాడగలదని ఆయన భావించారు''అని ఉస్వేతకైయావ పట్టణంలోని సెయింట్ మేరీ మహా విదుహాల యూనివర్సిటీలో చరిత్ర ఉపాధ్యాయుడు దిమిత్ అమరసింఘె వ్యాఖ్యానించారు.

శ్రీలంక వ్యాప్తంగా లక్ష పనస చెట్లను నాటాలనే లక్ష్యంతో ఆర్థర్ ముందుకు వెళ్లారు. ఆయన దీని కోసం మలేసియా నుంచి పనస విత్తనాలు దిగుమతి చేయించారు. మంచి పోషక విలువలుగల విత్తనాలను ఆయన ఎంపిక చేశారు. గ్రామగ్రామాలను ఆయన సందర్శించి ఈ విత్తనాలను అందరికీ ఆయన పంచారు. సుదూర ప్రాంతాల్లో ఉండేవారికి వీటిని కొరియర్ల ద్వారా పంపించారు. కొంతకాలంపాటు ఆయన చేపట్టిన ప్రచారంతో దేశ వ్యాప్తంగా చాలాచోట్ల పనస చెట్లు ఊపిరిపోసుకున్నాయి. అంతేకాదు ఆయన్ను అందరూ కోస్ మామా(అంకుల్ జాక్)అని పిలుచుకొనేవారు.

నేడు ఆర్థర్‌ను అందరూ నేషనల్ హీరోగా పిలుస్తుంటారు. అందరు పిల్లల్లానే నేనూ ఆయన గురించి స్కూలు పాఠ్య పుస్తకాల్లో చదువుకున్నాను. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో బెంగాల్, వియత్నాంలలో కరవు తాండవం చేసినప్పుడు శ్రీలంకలో ఆహార ధాన్యాల కొరతను పూరించడంలో ఈ పనస చెట్లు ప్రధాన పాత్ర పోషించాయి. శ్రీలంకలో పనస చెట్లను ఆకలి తీర్చే చెట్లుగా పిలిచేవారని అమరసింఘె వివరించారు.

1970ల్లో ద్రవ్యోల్బణం, కరవు, ఆహార ధాన్యాల కొరత శ్రీలంకను అతలాకుతలం చేశాయి. 1974లో అప్పటి శ్రీలంక ప్రధాన మంత్రి సిరిమావో బండారునాయకె చేసిన వ్యాఖ్యలతో న్యూయార్క్ టైమ్స్ ఓ ఆర్టికల్ ప్రచురించింది. దేశ ఆర్థిక పరిస్థితి పూర్తిగా అడుగంటిందని, నేడు బతకడానికే తాము పోరాటం చేయాల్సి వస్తోందని ఆయన చెప్పినట్లు కథనంలో పేర్కొన్నారు.

పనస కాయలు

ఫొటో సోర్స్, Getty Images

అయితే, 1900ల్లో ఆర్థర్ చేపట్టిన ప్రచారంతో చాలా మంది తమ ఇంటి వెనుక భాగాల్లో పనస చెట్లను వేయడం మొదలుపెట్టారు. 70ల నాటికి ఇవి పెద్దపెద్ద చెట్లుగా మారి ఆహార సంక్షోభం నుంచి ప్రజలను గట్టెక్కించాయని అమరసింఘె వివరించారు.

''మా అమ్మమ్మ సుసంపన్న కుటుంబం నుంచి వచ్చారు. అయితే వారానికి కేవలం రెండు కేజీల బియ్యం కొనుక్కోవడానికి మాత్రమే ప్రభుత్వం వారికి అనుమతించేది. ఆ సమయంలో పనస పళ్లే అందరి ఆకలి తీర్చేవి''అని అమరసింఘె చెప్పారు.

కోవిడ్-19 వ్యాప్తికి కట్టడి వేయడమే లక్ష్యంగా నెలలపాటు విధించిన కర్ఫ్యూలోనూ చాలా మందికి పనస చెట్లే ఆధారమయ్యాయని అమరసింఘె వివరించారు. కరోనావైరస్ వ్యాప్తి మొదలైన తొలి నాళ్లలో ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరువయ్యేందుకు కొంత సమయం పట్టింది. ఆ సమయంలో ప్రజల దగ్గర నిధులు, ఆహార ధాన్యాలు అడుగంటాయి. దీంతో 1970ల్లో మా అమ్మ కుటుంబం చేసినట్లే.. చాలా మంది పనస కాయలను ఉడగబెట్టి తిన్నారు.

అయితే, పనస కేవలం ఆకలి తీర్చే పండు మాత్రమే కాదు. శ్రీలంకకు ఈ పనస కాయలతో ప్రత్యేక అనుబంధముంది. ఇక్కడ పనసతో చాలా రకాల వంటలు చేస్తుంటారు. వీటిని అందరూ ఇష్టపడి తింటుంటారు కూడా. పిక్కలు కూడా రాని చిన్న చిన్న పనస కాయలతో పోలస్ అంబులా అనే కూర వండుతారు. అయితే ఈ వంట చేయడానికి కాస్త ఎక్కువ సమయమే పడుతుంది. దీన్ని మట్టి కుండలో ఆరు గంటలకుపైనే ఉడకబెడతారు. చిన్న మంటపై కొన్ని గంటలపాటు ఉడకబెట్టిన అనంతరం కొబ్బరి పాలు, లవంగాలు, దాల్చిన చెక్క, చింతపండు తదితర దినుసులు కలిపి దీన్ని వండుతారు.

పనస కాయలు

ఫొటో సోర్స్, Nathan Mahendra

పండిన పనస తొనలను కొద్దిగా ఉప్పు చల్లుకొని తింటారు. పనస పిక్కలనూ వృథాగా పోనివ్వరు. వాటిని ఉడకబెట్టి తింటుంటారు. వీటిని అన్నం, కొబ్బరి తురుము కలిపి కోస్ అటా కాలు పోల్ మాలువాగా పిలిచే వంట వండుతారు. మా అమ్మకు పనస పిక్కలు చాలా ఇష్టం. బొగ్గులపై వాటిని కాల్చి ఆమె తింటుండేది. వీటితో మా నాన్న చేసే ఓ వంటకం నాకు చాలా ఇష్టం. పనస పిక్కలను వేపి.. కొబ్బరి తురుము, పంచదార, మిరియాలు కలిపి ఉండలుగా చేస్తారు. అవి కరకరలాడుతూ చాలా బావుంటాయి. నేను ఇంట్లో ఉండేటప్పుడు సాయంత్రం పూట టీతోపాటు నాన్న ఇవి చేస్తుంటారు.

ఈ పనస వంట గదికి మాత్రమే పరిమితం కాదు. ''ఇన్ని ఉపయోగాలుండే చెట్టు మరొకటి లేదంటే అతిశయోక్తి లేదు''అని ఫార్మసిస్టు దివానీ వెతిథరాజే పేర్కొన్నారు. సమయం దొరికినప్పుడు ఆమె స్థానికంగా దొరికే దినుసులతో వంటలు చేస్తుంటారు. ''పనస చెట్లను కలప కోసం ఉపయోగిస్తుంటారు. పనస ఆకులు, పువ్వులకు ఆయుర్వేదంలో ప్రత్యేక స్థానముంది. మధుమేహంపై చికిత్సలో వీటిని వాడుతుంటారు. పనసలో ఫైబర్‌తోపాటు విటమిన్ సీ కూడా పుష్కలంగా దొరుకుతుంది''అని ఆమె వివరించారు.

పనస పిండిని కేకుల తయారీలోనూ ఉపయోగిస్తానని ఆమె వివరించారు. అంతేకాదు పనసతో చిప్స్‌ కూడా తయారుచేస్తారని చెప్పారు. మొదట్లో పనస వంటకాలు కేవలం ఇళ్లకు మాత్రమే పరిమితం అయ్యేవి. అయితే నేడు పెద్ద పెద్ద రెస్టారెంట్ల చైన్లకూ ఇవి విస్తరించాయి.

పనస కాయలు

ఫొటో సోర్స్, Getty Images

''ఒకరోజు మాకు చిన్న పనసకాయ దొరికింది. దీంతో కట్లెట్‌ను తయారుచేయాలనే ఆలోచన వచ్చింది. వీటిని శాకాహార అతిథులకు ఇవ్వొచ్చని అనుకున్నా''అని కొలంబోలో ప్రముఖ రెస్టారెంట్ ఉపాలి బై నవాలోకాలో పనిచేసే వంటల నిపుణుడు వసంత రణసింఘె తెలిపారు. చిల్లీ సాస్‌తో కట్లెట్లను ఆయన వడ్డించారు. దీంతో ఈ రెస్టారెంట్లో ఇది ప్రత్యేక వంటకంగా మారిపోయింది.

పెద్దపెద్ద రెస్టారెంట్లలో పనస కాయలను ఎలా ఉపయోగిస్తున్నారో తెలుసుకోవాలనే కుతూహలంతో నేను చిక్ కొలంబో రెస్టారెంట్‌ను సందర్శించాను. అక్కడ వేపిన పనసకాయ ముక్కలను మామిడి, అవకాడో ముక్కలతో కలిపి ఇచ్చారు. ''శ్రీలంకలో పుట్టడంతో పనస రుచులు, ఉపయోగాల గురించి నాకు బాగా తెలుసు. ఆ రుచులను నేను ఆస్వాదిస్తుంటాను కూడా''అని రెస్టారెంట్‌ను స్థాపించిన షానా దండెనీయ తెలిపారు. కొన్నేళ్లు బ్రిటన్‌లో గడిపిన అనంతరం మళ్లీ ఆమె శ్రీలంకకు వచ్చేశారు. ''నాకు తెలిసినంత వరకూ స్థానికంగా దొరికే సూపర్ ఫుడ్‌లలో పనస కూడా ఒకటి''.

పనస బర్గర్‌ను తమ మెనూలో పెట్టాలని భావిస్తున్నట్లు ఆమె వివరించారు. ''చిన్న మంటపై వండితే ఇది చాలా బావుంటుంది. పంది మాంసం కంటే రుచిగా ఉంటుంది''

నేను మా అమ్మమ్మతో మాట్లాడినప్పుడు.. మా పెద్దమ్మ ఇంటికి రావాలని, పనస వంటకాలను మళ్లీ రుచి చూడాలని ఆమె ఆహ్వానించారు. మా పెద్దమ్మ చేసేలా నేను వండలేను. అయితే కావాల్సినప్పుడల్లా వెళ్లి అక్కడ రుచి చూడగలను. మా నాన్న కూడా మంచి పనస వంటలు వండుతారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)