జూల్స్ మిల్లర్: అనారోగ్యమే ఆమెకు అంతర్జాతీయ వ్యాపార సంస్థను స్థాపించేందుకు స్ఫూర్తినిచ్చింది

ఫొటో సోర్స్, ROB NORTHWAY
- రచయిత, సారా ఫిన్లే
- హోదా, బిజినెస్ రిపోర్టర్
‘ద న్యూ కో.’ వ్యవస్థాపకురాలు జూల్స్ మిల్లర్. 2017లో స్థాపితమైన ఆ సంస్థ 2019లో కోటి డాలర్ల ఆదాయం సముపార్జింది.
‘‘నేను చాలా జబ్బు పడ్డాను. అంతర్గత రక్తస్రావమైంది. అలసిపోయాను. ఉబ్బిపోయేదాన్ని. మామూలు జీవితం దాదాపుగా మరచిపోయాను. అప్పుడు.. నేను తిండి గురించి, ఆరోగ్యం గురించి, సప్లిమెంట్ల గురించి ఆలోచించటం మొదలుపెట్టాను’’ అని బీబీసీతో చెప్పారు జూల్స్ మిల్లర్.
అది జరిగింది 2015లో. అప్పుడు జూల్స్ వయసు పాతికేళ్లు. లండన్‌లో నివాసం. ఒత్తిడితో నిండిన జీవితం. ఆమెకు ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ (ఐబీఎస్) అనే రుగ్మత ఉన్నట్లు గుర్తించారు.
ఆ సమస్యను పోగొట్టుకోవటానికి సప్లిమెంట్లు తీసుకోవటం మొదలుపెట్టారు. కానీ ఏవీ పనిచేయలేదు. కొన్నిటివల్ల పరిస్థితి మరింత దిగజారిందని కూడా ఆమె చెప్తారు. తాను వేసుకుంటున్న మాత్రల్లో చాలా వరకూ అసలు అవసరమైన సప్లిమెంట్ల కన్నా వాటిని లావుగా చేయటానికి వాడే అనవసర పదార్థాలే ఎక్కువగా ఉండటం చూసి ఆమె ఆందోళనకు గురయ్యారు.
ఈ పరిస్థితుల్లో ఉంటే మనలో చాలా మందిమి నిరాశకు, ఆందోళనకు, ఆగ్రహానికి గురవుతామేమో. కానీ జూల్స్ దగ్గర ఒక రహస్య ఆయుధం ఉంది. అది ఆమె తాత. ఆయన యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్‌లో రసాయన శాస్త్రవేత్తగా పని చేసేవారు. ఆయన పేరు ప్రొఫెసర్ జార్జ్ మిల్లర్. తాతతో కలిసి ఆహార సప్లిమెంట్ ఫార్ములాలు, పదార్థాల మీద పరిశోధన చేయటం ప్రారంభించారు జూల్స్.

ఫొటో సోర్స్, THE NUE CO
''అప్పుడు చాలా విషయాలు తెలిసివచ్చాయి'' అని ఆమె చెప్తారు. ఇప్పుడామె వయసు 31 సంవత్సరాలు. ''మనకు సాయపడతాయని భావించే పలు ఉత్పత్తుల్లో.. మనకు ఇతరత్రా అనారోగ్య లక్షణాలు కలిగిస్తాయని నిరూపితమైన పదార్థాలు కూడా ఉండేవి'' అని వివరించారు.
జూల్స్ తన తాతతో కలిసి చేసిన పరిశోధనలు.. ఆమెకు తానే సొంతంగా సంపూర్ణ సహజ సప్లిమెంట్ల వ్యాపారం ప్రారంభించేలా స్ఫూర్తినిచ్చాయి. 2017లో ఆమె 'న్యూ' సంస్థను స్థాపించారు. ఇప్పుడు ఆమె వ్యాపారం ఏటా కోటి డాలర్ల ఆదాయం సముపార్జిస్తోంది.
2019తో పోలిస్తే ఈ ఏడాది అమ్మకాలు ఇప్పటివరకూ ఆరు రెట్లు పెరిగాయని కూడా జూల్స్ తెలిపారు. ఇందుకు కారణం కరోనావైరస్ మహమ్మారి నేపథ్యంలో అంతర్లీనంగా ఉన్న అనారోగ్య సమస్యల పట్ల ఎక్కువ మంది జనం ఆందోళన చెందటమేనని ఆమె చెప్పారు.
సగం కొలంబియన్ అయిన జూల్స్ లండన్‌లో పుట్టారు. కానీ ఆమెకు నెలల వయసులోనే ఆమె కుటుంబం కొలంబియా వెళ్లిపోయింది. ఆమె మాతృభాష స్పానిష్. ఆమెకు ఏడేళ్ల వయసు వచ్చాక తన తల్లిదండ్రులతో కలిసి తిరిగి లండన్ వచ్చారు.
స్కూల్ చదువు పూర్తయ్యాక బర్మింగామ్ యూనివర్సిటీలో ఫిలాసఫీ అభ్యసించారు. ఆ తర్వాత లండన్‌లోనే అడ్వర్టైజింగ్ రంగంలో పనిచేశారు. న్యూ సంస్థను స్థాపించటానికి ముందు.. డిటాక్స్ కిచెన్ సంస్థలో శాకాహారం విభాగానికి ఆమె బిజినెస్ డవలప్‌మెంట్ అధిపతిగా ఉన్నారు.

ఫొటో సోర్స్, THE NUE CO
న్యూ సంస్థను స్థాపించేటపుడు తను నిర్భయంగా మొదలుపెట్టానని జూల్స్ చెప్తారు. ''ఒకవేళ మరొక వ్యాపారమేదైనా ప్రారంభించి ఉన్నట్లయితే నాకు అంత ధీమా ఉండేది కాదని నేను అనుకుంటాను. నేను చాలా పెంకితనంగా ఉండేదాన్ని. నాకు తెలియని విషయాలు ఏమిటనేది రాసుకునే దానిని.. వాటికి జవాబులు ఎవరికి తెలిసి ఉండవచ్చో రాసుకుని.. వారికి ఈమెయిల్స్ పంపించేదానిని'' అని ఆమె వివరించారు.
అలా ఫ్యాషన్ రిటైల్ సంస్థ నెట్-ఎ-పోర్టర్ వ్యవస్థాపకురాలు నటాలీ మాసెనెట్, అమెరికాకు చెందిన ఫిట్‌నెస్ సంస్థ ఈక్వినాక్స్ అధిపతి హార్వీ స్పెవాక్‌లకు కూడా ఆమె ఈమెయిల్స్ పంపించారు. వారు సమాధానం ఇస్తూ తమ సలహాలు అందించారు.
న్యూ సంస్థ తొలి ఉత్పత్తి 'డిబ్లోట్'. ఐబీఎస్‌ను నయం చేయటానికి ఉపయోగపడే సప్లిమెంట్ అది. అది తనకు పనిచేసినట్లు జూల్స్ గుర్తించారు. ఆ తర్వాత వైటమిన్ సప్లిమెంట్లు, ఇటీవలి కాలంలో చర్మ చికిత్సలకు ఉపయోగపడే ఉత్పత్తులు ఈ సంస్థ తయారు చేసింది.
ఈ కంపెనీ మొదట కేంబ్రిడ్జ్‌లో మొదలైంది. కానీ తొలి సంవత్సరంలోనే న్యూయార్క్‌కు మారింది. ఆహార సప్లిమెంట్లకు అతిపెద్ద మార్కెట్ అమెరికా అని.. కాబట్టి ఆ అవకాశాన్ని ఉపయోగించుకోవటానికి సంస్థ ప్రధాన కార్యాలయాన్ని అమెరికాకు మార్చామని జూల్స్ చెప్తారు.
''అమెరికాలో దాదాపు 80 శాతం మంది వైటమిన్లు కానీ, ఇతర సప్లిమెంట్లు కానీ తీసుకుంటుంటారు. బ్రిటన్ వాసులు వీటిని ఇంకా అంతగా ఇష్టపడరు'' అని ఆమె పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
అంతర్జాతీయంగా ఈ సప్లిమెంట్ల రంగం దూసుకుపోతోంది. 2018లో 125 బిలియన్ డాలర్లుగా ఉన్న వార్షిక అమ్మకాలు 2026 నాటికి 210 బిలియన్ డాలర్లకు పెరుగుతాయని ఒక నివేదిక అంచనా వేసింది.
న్యూ 2017లో తన వెబ్‌సైట్ ద్వారా అమ్మకాలు ప్రారంభించింది. కానీ ఇప్పుడు అనేక రిటైల్ సంస్థలు ఈ ఉత్పత్తులను విక్రయిస్తున్నాయి. న్యూయార్క్‌లో న్యూకు ఒక సొంత రిటైల్ షాపు కూడా ఉంది.
ఈ వ్యాపారినికి మొత్తంగా 1,15 కోట్ల డాలర్ల పెట్టుబడులు లభించాయి. కన్జ్యూమర్ గూడ్స్ దిగ్గజం యూనిలివర్ కూడా ఇందులో పెట్టుబడులు పెట్టింది. అయితే.. జూల్స్, ఆమె భర్త చార్లీ గోవర్‌లే అతి పెద్ద వాటాదారులుగా ఉన్నారు. సంస్థ చీఫ్ ఆఫరేటింగ్ ఆఫీసర్ ఉద్యోగం ఆయన చేస్తోంటే.. జూల్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్నారు.
న్యూ కంపెనీ తన ఉత్పత్తుల్లో కచ్చితంగా ఏమి ఉంటుందనేదే మాట్లాడుతుందని.. అది చాలా మంచి విషయమని బ్రిటిష్ న్యూట్రిషనల్ థెరపిస్ట్ కారొలీన్ పేటన్ చెప్తారు.
''సప్లిమెంట్లలో తాము కోరుకుంటున్న పోషక పదార్థాలు కాకుండా ఇంకా ఏమేం ఉంటాయనేది చాలా మందికి తెలియదు. ఈ విషయంలో ఇంకా ఎక్కువ స్పష్టత ఉండటం ఈ రంగానికి మేలు చేస్తుంది. తక్కువ ఖర్చయ్యే ఉత్పత్తులకు ఎప్పుడూ మార్కెట్ ఉంటుంది. కానీ స్వచ్ఛత కోసం కొంత ఎక్కువ చెల్లించటానికి కొందరు ఇష్టపడతారు'' అని ఆమె వివరించారు.

ఫొటో సోర్స్, THE NUE CO
కానీ.. ఈ ఆహార సప్లిమెంట్లు ఎంత అవసరం?
అవసరమైనంతగా సూర్యరశ్మి లభించకపోయినట్లయితే వైటమిన్ డి మాత్రలు తీసుకోవాలని బ్రిటన్ నేషనల్ హెల్త్ సర్వీస్ సలహా ఇస్తోంది. ఎందుకంటే మన శరీరం వైటమిన్ డిని సూర్యరశ్మి నుంచి తయారు చేస్తుంది. అది తగినంత లేకపోతే ఈ వైటమిన్ తగ్గే అవకాశముంది.
అయినా.. చాలా ఇతర వైటమిన్లు, మినరళ్లు పొందటం కోసం సరైన ఆహారం తీసుకోవటం ఉత్తమం కదా?
''సాధారణంగా సమతుల ఆహారం, వివిధ రకాల ఆహారం తీసుకోవటం ద్వారా.. మనకు అవసరమైన వైటమిన్లు, మినరళ్లు, ఇతర పోషకాలతో పాటు.. ఫైబర్, పాలీఫినాల్స్ వంటి సహజ బయోయాక్టివ్ కాంపౌండ్లు తగినంత మోతాదుల్లో లభించాలి. సప్లిమెంట్ల అవసరం రాకూడదు. అలాగే ఆరోగ్యవంతమైన ఆహారానికి సప్లిమెంట్లను ప్రత్యామ్నాయంగా ఉపయోగించరాదు'' అని బ్రిటిష్ న్యూట్రిషన్ ఫౌండేషన్ అధికార ప్రతినిధి ఒకరు వివరించారు.
''అయినాకానీ.. గర్భధారణకు ముందు, గర్భందాల్చిన తొలి నాళ్లలో ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్లు తీసుకోవాలని సిఫారసు చేయటం వంటి ఉదంతాలు కూడా ఉంటాయి'' అని పేర్కొన్నారు.
అయితే.. మనకు ఏ సప్లిమెంట్లు పనిచేస్తాయనేది తెలుసుకోవటం ముఖ్యమంటారు జూల్స్. జనం తమ మానసిక ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాలని చెప్తూ న్యూ సంస్థ గత ఏడాది ఒక ప్రచార కార్యక్రమం కూడా నిర్వహించింది. ''మీరు నిజంగా ఎలా ఉన్నారు?'' అనేది ఆ ప్రచారం శీర్షిక. విస్తృత ఆరోగ్య రంగం కేవలం ప్రజల శారీరక ఆరోగ్యం మీదే దృష్టి కేంద్రీకరించటం ద్వారా తప్పు చేస్తోందని అందులో పేర్కొంది.
''మీరు మీ శరీరాలతో మాట్లాడండని మేం చెప్తున్నాం. ప్రతి ఒక్కరి ప్రయాణం.. నాలాగానే.. వ్యక్తిగతమైనది'' అని జూల్స్ చెప్పారు.
భవిష్యత్తు ప్రణాళికల గురించి చెప్తూ.. కొత్త ఉత్పత్తులు తయారవుతున్నాయని ఆమె తెలిపారు. ''అందం, ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం అనే ముఖ్యమైన విషయాల గురించి మా చర్చను కొనసాగించాలని కోరుకుంటున్నాం'' అని చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- వంట నూనెల్లో ఏది ఆరోగ్యానికి మంచిది.. ఆలివ్ నూనె గుండెకు మేలు చేస్తుందా
- కోవిడ్-19 నుంచి కోలుకున్నా అనారోగ్యం ఎందుకు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- భారత్-చైనా వివాదం: హాట్‌లైన్ అంటే ఏంటి? దీనిని ఉపయోగించే అధికారం ఎవరిది?
- భారత్-చైనా ఘర్షణలు ప్రధాని మోదీ "స్టార్టప్ ఇండియా" కలలపై ప్రభావాన్ని చూపుతున్నాయా?
- ఫాతిమా షేక్: తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రి బాయి ఫూలేతో కలిసి పనిచేసిన ఈమె ఎవరు?
- కరోనావైరస్: వ్యాక్సీన్ ముందుగా ఎవరికి అందుతుంది? పేద దేశాలకు ఎవరు ఇస్తారు? ఎలా ఇస్తారు?
- కరోనావైరస్ లక్షణాలు ఏమిటి? పిల్లల్లో ఎటువంటి లక్షణాలు కనిపిస్తాయి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








