పోర్ట్‌ రాయల్: చరిత్రలో ‘అత్యంత దుర్మార్గపు నగరం’ ఎందుకైంది? సముద్రంలో ఎలా మునిగిపోయింది?

పోర్ట్‌రాయల్

ఫొటో సోర్స్, peeterv/Getty Images

    • రచయిత, జేమ్స్ మార్చ్
    • హోదా, బీబీసీ ట్రావెల్

నేడు అదొక మత్స్యకార గ్రామం. కానీ ఒకప్పుడు భూమిపై అత్యంత దుర్మార్గపు నగరంగా దీనికి పేరుండేది. ఇంతకీ ఈ నగరానికి ఏమైంది? ఇది చరిత్రలో ఎలా కలిసిపోయింది?

20 జనవరి 2020 ఉదయం 8.09 గంటలకు జమైకా వాసులు ఎన్నడూ ఊహించని పరిణామం చోటుచేసుకుంది. నలబై ఏళ్లలో తొలిసారి కింగ్‌స్టన్‌లోని చరిత్రాత్మక పోర్ట్‌ రాయల్ తీరంలో ఓ నౌక ఆగింది. ఆ నౌక పేరు మరెల్లా డిస్కవరీ-2. దీనిలో నుంచి 2,000 మంది నవ్వుతూ దిగారు. కొత్తగా నిర్మించిన నీటిపై తేలియాడే వంతెనపై నుంచి నడుస్తూ వీరు ద్వీపంలోకి ప్రవేశించారు.

కింగ్స్‌టన్ నగరానికి, అక్కడ ప్రజలకు ఇది గర్వకారణం. దీని గురించి ఎప్పటి నుంచో వారు కథలుకథలుగా చెప్పుకొంటున్నారు. రాజకీయ వివాదాలతోపాటు అభివృద్ధిలో వెనుకబాటు తదితర కారణాలతో ఈ పరిణామం వాయిదా పడుతూ వచ్చింది. తాజా ఘటనతో పోర్ట్‌ రాయల్ చరిత్రలో కొత్త అధ్యాయానికి నాంది పడింది. పోర్ట్‌ రాయల్ చరిత్ర జమైకా వాసులకు బాగా తెలుసు.

కింగ్స్‌టన్ నగరానికి అనుకొని ఉండే 29 కిలోమీటర్ల పొడవైన ఇసుక తిన్నెలకు చివర్లో కనిపించే గ్రామమే పోర్ట్‌ రాయల్. 17వ శతాబ్దంలో దీనికి చాలా చెడ్డ పేరు ఉండేది. దీన్ని భూమిపై అత్యంత దుర్మార్గమైన నగరంగా చాలా మంది పిలిచేవారు.

పోర్ట్‌రాయల్

ఫొటో సోర్స్, Alamy

స్పెయిన్ నియంత్రణలో..

వ్యూహాత్మకంగా కీలకమైన ఈ ప్రాంతం 150 ఏళ్లకు పైనే స్పెయిన్ ఆధీనంలో ఉంది. అనంతరం 1655లో దీనిపై బ్రిటన్ దండయాత్ర చేసింది. ఇది వాణిజ్య కేంద్రంగా మారిపోయింది. కానీ ఈ ప్రాంతాన్ని రక్షించే మానవ వనరులు బ్రిటన్ దగ్గర లేవు. దీంతో స్థానికంగా పేరుమోసిన సముద్రపు దొంగలు, ప్రైవేటు వ్యక్తులతో అప్పటి గవర్నర్ ఎడ్వర్డ్ డోయ్‌లీ ఓ ఒప్పందం కుదుర్చుకున్నారు.

బానిసలు, చక్కెర, కలప విక్రయాలకు పోర్ట్‌ రాయల్ కేంద్రంగా ఉండేది. డబ్బులతో పాటు మద్యం, సెక్స్‌కు ఇది నిలయంగా ఉండేది. ఇక్కడ 25 శాతం వరకూ భవనాలు.. బార్లు లేదా వ్యభిచార గృహాలుగా ఉండేవి. ఇక్కడి సముద్రపు దొంగల జల్సాల గురించి అందరూ కథలు కథలుగా చెప్పుకొనేవారు.

అప్పటి ప్రముఖ నావికుల్లో ఒకరైన కెప్టెన్ హెన్రీ మోర్గన్ లాంటి వారు స్పానిష్ పోర్టులపై దాడులు చేసి.. వచ్చిన డబ్బులతో ఇక్కడ జల్సాలు చేసేవారు.

''సముద్రపు దొంగలు నచ్చింది చేసేవారు. వీరిని జమైకా పరిరక్షకులుగా అందరూ భావించేవారు. అధికారులకు కూడా వేరే మార్గం ఉండేది కాదు. వారిని గౌరవించడం తప్పనిసరైంది''అని స్థానిక చరిత్రకారుడు పీటర్ గోర్డన్ వివరించారు.

''ఈ నగర సంపదకు మూలం ఆ దుర్మార్గులే. వారు నచ్చింది చేసేవారు. ఇక్కడ బార్లు, వేశ్యాగృహాలు, చర్చిలు ఒకే సంఖ్యలో ఉండేవి. అంటే పరిస్థితి ఎలా ఉండేదో అర్థంచేసుకోవచ్చు'' అని పేర్కొన్నారు.

పోర్ట్‌రాయల్

ఫొటో సోర్స్, North Wind Picture Archives/Alamy

ఒక్కసారిగా శిథిలం

అయితే, 1692 జూన్ 7న పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. ఈ నగరాన్ని భారీ భూకంపం కుదిపేసింది. దీంతో 2,000 మందికి పైగా మరణించారు.

''పోర్ట్‌ రాయల్ నగరంపై భూకంపం తీవ్రమైన ప్రభావం చూపింది. ఇక్కడి భూభాగం విస్తీర్ణం 52 ఎకరాల వరకూ ఉండేది. కానీ.. భూకంపంతో మూడింట రెండొంతుల భూభాగం నీటిలో మునిగిపోయింది. భవనాలన్నీ శిథిలమయ్యాయి. గోడలు తమపైన కూలడంతో చాలా మంది మరణించారు. ఇక్కడి జనాభాలో సగం మంది మరణించినట్లు అంచనాలున్నాయి'' అని జమైకా నేషనల్ హెరిటేజ్ ట్రస్టులోని టెక్నికల్ విభాగం డైరెక్టర్ సెల్వేనియస్ వాల్టర్స్ తెలిపారు.

ఇంత భయానకమైన చరిత్రగల పోర్ట్‌ రాయల్ గురించి బయటివారికి తెలియకపోవడం కొంచెం ఆశ్చర్యంగానే అనిపిస్తుంది. అయితే, నీటికింద చెక్కు చెదరకుండా ఉన్న ఈ సముద్రపు దొంగల నగరం ప్రత్యేకమైనది. 17వ శతాబ్దం నాటి ప్రజల జీవితాలను ఇది కళ్లకుకడుతోంది.

''నీటిలో మునిగిన చారిత్రక ప్రాంతాల్లో చెక్కుచెదరని నగరంగా దీన్ని భావిస్తుంటారు. ఈ ప్రాంతంలో ఇలాంటిది ఒకటే ఉందని చెబుతుంటారు. జమైకాకు మాత్రమే కాదు.. ప్రపంచం మొత్తానికి ఇది చాలా ముఖ్యమైనది. దీన్ని మనం పరిరక్షించాలి'' అని వాల్టర్స్ అన్నారు.

పోర్ట్‌రాయల్

ఫొటో సోర్స్, Atlantide Phototravel/Getty Images

ప్రపంచ గుర్తింపు కోసం

దీన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. పెద్దగా బయటి ప్రపంచానికి పరిచయంలేని ఈ ప్రాంతం గుర్తింపును స్థానికులు స్వాగతిస్తున్నారు.

''పోర్ట్‌ రాయల్ ప్రజలు తమ చరిత్ర గురించి చాలా గర్వపడుతుంటారు'' అని గోర్డన్ వివరించారు. ''జమైకా జనాభాలో ఎక్కువ మంది ఆఫ్రికా నుంచి వచ్చిన బానిసలే ఉండేవారు. కానీ, కాలక్రమేణా వారు చాలా నైపుణ్యాలు సంపాదించారు. పోర్ట్‌ రాయల్‌లో చాలా మంది నిపుణులు ఉండేవారు. వారి గురించి ఇప్పటికీ చెప్పుకుంటున్నారు'' అని ఆయన తెలిపారు.

''జమైకాలో ప్రతి ఒక్కరూ పోర్ట్‌ రాయల్ చరిత్ర తెలుసుకుంటారు. ప్రతి పిల్లాడు.. జీవితంలో ఒకసారి పోర్ట్‌ రాయల్‌కు వెళ్లాలని అనుకుంటాడు'' అని ఇక్కడి పట్టణాభివృద్ధి కార్పొరేషన్ మేనేజర్ హెథర్ పినోక్ వివరించారు.

''హానరింగ్ ద పాస్ట్, విజనింగ్ ద ఫ్యూచర్'' అనే నినాదం.. పోర్ట్‌ రాయల్ 2020 ప్రాజెక్ట్ వెబ్‌సైట్‌లో కనిపిస్తోంది. ఇక్కడ ఒక ప్రయాణికుల నౌక ఆగడం గొప్ప విషయమే అయినప్పటికీ.. చేయాల్సింది చాలా ఉంది.

పోర్ట్‌రాయల్

ఫొటో సోర్స్, Mladen Antonov/Getty Images

ఇప్పటికీ అలానే..

ఇప్పుడు కేవలం కొన్ని బార్లు, నిశ్శబ్దమైన వీధులు ఇక్కడ కనిపిస్తున్నాయి. చార్లెస్ కోటలో నల్లని ఫిరంగులను ఇప్పటికీ మనం చూడొచ్చు. 1907 కింగ్స్‌టన్ భూకంపం తర్వాత 45 డిగ్రీల కోణంలో వంగిన గిడ్డీ హౌస్‌ను చూసేందుకు సందర్శకులు వస్తుంటారు. అయితే, సందర్శకులకు విడిది ఇచ్చేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలు ఇక్కడ లేవు.

నీటిలో మునిగిన నగర అందాలను చూసేందుకు స్కూబా డైవింగ్ చేయాలంటే జమైకా ప్రభుత్వ అనుమతి తప్పనిసరి. దాన్ని తెచ్చుకోవడం తేలికే. కానీ, చరిత్రకు అద్దం పట్టేలా ఈ నగరానికి జీవం పోయడం అంత సులభం కాదు.

''ఈ మొత్తం ప్రాంతాన్ని సున్నితమైన పర్యావరణ ప్రాంతంగా గుర్తించారు. అందుకే ఏమైనా చేయాలంటే చాలా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి'' అని పినోక్ వ్యాఖ్యానించారు.

పగడపు దిబ్బలు, అంతరించిపోతున్న సముద్రపు జీవులకు ఈ ప్రాంతం నిలయం. ఇక్కడ సముద్రపు కాలుష్యం, సముద్రపు నీటిలో లవణీయత పెరగడం, విపరీతంగా చేపల వేట తదితర చర్యలకు 2030 లోగా కళ్లెం వేయాలని ప్రణాళికలు సిద్ధంచేశారు. ఈ లక్ష్యాలు ఎంత వరకూ సాధించగలరో చూడాలి.

కోవిడ్-19 నడుమ సందర్శకుల సంఖ్య మరింత పడిపోయినప్పటికీ.. ఇక్కడ అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయి. 2021 నాటికి ఇక్కడ వసతులు మెరుగుపడటంతో వచ్చే ప్రయాణికుల సంఖ్యా పెరిగే అవకాశముంది. దీంతో ప్రపంచ పటంలో ఈ నగరానికి ప్రత్యేక చోటు లభించొచ్చు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)