గ్వాదర్: ఒమన్ నుంచి ఈ ప్రాంతం పాకిస్తాన్‌లో ఎలా కలిసింది? భారత్ మంచి అవకాశం వదులుకుందా?

ఫొటో సోర్స్, AAMIR QURESHI/AFP via Getty Images
- రచయిత, ఫరూఖ్ ఆదిల్
- హోదా, బీబీసీ కోసం
చరిత్రలో గ్వాదర్ పోర్టు ప్రాముఖ్యాన్ని గుర్తించిన దేశాలు రెండే. ఒకప్పుడు బ్రిటన్, తర్వాత పాకిస్తాన్. ఇప్పుడు గ్వాదర్‌కు బ్రిటన్ అంత ప్రాధాన్యం ఇవ్వడం లేదు. 19వ శతాబ్దం తొలినాళ్లలో పరిస్థితులు మాత్రం వేరు.
చారిత్రకంగా, రాజకీయంగా, వ్యూహాత్మకంగా సమాచారాన్ని సేకరించడంలో గ్వాదర్ చాలా కీలకమైన ప్రాంతం. భారత్ నుంచి విడిపోయిన అనంతరం పాకిస్తాన్ దృష్టి దీనిపై పడింది. స్వతంత్ర దేశంగా పాక్ అవతరించిన రెండేళ్లకే ఈ ప్రాంతాన్ని తన ఆధీనంలోకి తీసుకొనేందుకు పాక్ ప్రయత్నించింది.
అరేబియా సముద్రంలోని గ్వాదర్‌పై పాక్ దృష్టి సారించడానికి రెండు కారణాలున్నాయి. వీటిలో మొదటిది ఆర్థిక పరమైన అంశాలు. రెండోది ఆత్మరక్షణ. అయితే, ఈ రెండు లక్ష్యాలు చేరుకోవాలంటే ఒక ప్రధాన రహదారి నిర్మించాలి. దీనికి గ్వాదర్ అడ్డుగోడలా మిగిలిపోయింది.
ఈ అడ్డుగోడను తొలగించాలంటే గ్వాదర్.. పాక్‌లో కలిసిపోవాలి.

ఫొటో సోర్స్, AFP
ఎందుకు అవసరం?
దేశంగా అవతరించిన తరువాత భారీ ఆర్థిక సంక్షోభాన్ని పాక్ చూడాల్సి వచ్చింది. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు చెల్లించేందుకూ తమ దగ్గర నిధులు లేకుండా పోయాయి. వస్తువుల అక్రమ రవాణా ఈ సమస్యను మరింత సంక్లిష్టం చేసింది. మరోవైపు జాతీయ వనరులూ క్రమంగా అడుగంటిపోతూ వచ్చాయి.
ఆ సమయంలో.. స్మగ్లింగ్‌కు గ్వాదర్ చిరునామాగా ఉండేది. ఇది బాగా వెనుకబడిన ప్రాంతం. అప్పటికే అక్కడ ఒక విమానాశ్రయం ఉండేది. అయితే అది పెద్దగా వినియోగంలో ఉండేది కాదు.
1956లో ఇస్మాయిలీ వర్గానికి చెందిన షెహ్‌జాదే అలీ ఖాన్ ఇక్కడ పర్యటించినప్పుడు కొన్ని కార్యకలాపాలు చురుగ్గా జరుగుతున్నట్లు కనిపించాయి. అయితే అదే చివరిసారి. తర్వాత మళ్లీ పరిస్థితి మునుపటికే వచ్చింది.
దేశ భద్రతకు ఎదురవుతున్న సవాళ్లను అర్థం చేసుకోవడానికి పాక్ ప్రభుత్వం ఎన్నో కమిటీలను వేసింది.
ఆ సమీక్షల్లో కొన్ని పాకిస్తాన్ పత్రిక నవా-ఇ-వఖ్త్‌లో 25 సెప్టెంబరు 1958న ప్రచురితం అయ్యాయి.
''ఇక్కడి నుంచి పాకిస్తాన్ భూభాగంలోని చివరి ప్రాంతమైన గ్వాటర్ వరకు అరేబియా తీరం వెంబడి రోడ్డు మార్గాన్ని నిర్మించాలని పాక్ ప్రణాళికలు రచిస్తోంది. దేశ భద్రతతోపాటు స్మగ్లింగ్‌ను నియంత్రించేదుకు ఇది చాలా అవసరం. అయితే దీనిలో అతిపెద్ద సవాల్ ఏమిటంటే.. గ్వాదరే. ఎందుకంటే దీనిపై పాక్‌కు పూర్తి నియంత్రణ లేదు''అని ఓ వార్తలో పేర్కొన్నారు.
''అందుకే 1949లోనే గ్వాదర్‌ను తమ నియంత్రణలోకి తీసుకోవాలని పాక్ ప్రభుత్వం దృష్టిపెట్టింది''

ఉచితంగా వచ్చిందా?
పాక్ ప్రయత్నాలు 1958లో ఫలించాయి. ఆనాడు ఒమన్‌తో పాక్ ఓ నిర్ణయాత్మక ఒప్పందం కుదుర్చుకుంది. చర్చల్లో బ్రిటన్ కూడా సాయం చేసింది. ఒమన్‌లో బ్రిటన్‌కు సైనిక స్థావరం ఉండటంతోపాటు ఒకప్పుడు ఈ ప్రాంతం తమ ఆధీనంలో ఉండేది కనుక బ్రిటన్ క్రియాశీల పాత్ర పోషించింది.
ఇలా అభివృద్ధికి నోచుకోని గ్వాదర్ ఓడరేవు ప్రాంతం పాక్‌లో కలిసింది. గ్వాదర్‌ను తమ దేశంలో కలుపుకుంటున్నట్లు పార్లమెంటు వేదికగా పాక్ ప్రధాన మంత్రి ఫిరోజ్ ఖాన్ ప్రకటించారు.
గ్వాదర్‌ను పాక్‌కు ఉచితంగానే ఒమన్ సుల్తాన్ అల్ హజరత్ సయీద్ బిన్ తైమూర్ అలీ ఇచ్చారని ఆయన చెప్పారు. అయితే, భాష, భౌగోళిక లక్షణాలు, చరిత్ర పరంగా ఎప్పుడూ ఈ ప్రాంతం పాక్‌లో కలిసే ఉండేదని అన్నారు.
మరోవైపు గ్వాదర్‌ను పశ్చిమ పాక్‌లో భాగంగా పరిగణిస్తున్నట్లు రాజ్యాంగానికి సవరణ చేస్తూ ఆర్టికల్ 104ను పాక్ తీసుకొచ్చింది. గ్వాదర్ ప్రాంతానికి ప్రత్యేక ప్రతిపత్తి కల్పించడంతోపాటు అక్కడి ప్రజలకు పాక్ ప్రజలతో సమానంగా పౌరసత్వం ఇచ్చింది.
ఈ ప్రకటన తర్వాత పాక్ ప్రజలు వేడుకలు చేసుకున్నారు. మరోవైపు గ్వాదర్ వాసులూ సంబరాలు చేసుకున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఘన స్వాగతం
ఒమన్ నుంచి అధికారికంగా గ్వాదర్‌ను తమలో కలుపుకొనేందుకు కరాచీ నుంచి సముద్ర మార్గం గుండా పాక్ ప్రభుత్వ క్యాబినెట్ కార్యదర్శి ఆగ్రా అబ్దుల్ అహ్మద్ ఇక్కడకు వచ్చినప్పుడు స్థానికులు ఘన స్వాగతం పలికారు.
పెద్దమొత్తంలో నావికులు, మత్స్యకారులు నడుము లోతు నీళ్లలోకి దిగి ఆయన్ను ఆహ్వానించారు. ఆ మరుసటి రోజు అబ్బుల్ హమీద్‌కు సంబంధిత పత్రాలను బ్రిటిష్ కౌన్సిల్ జనరల్ అప్పగించారు. అనంతరం గ్వాదర్ పరిపాలక భవనంపై పాక్ జెండాను ఎగురవేశారు.
ఈ ఘటనను పాక్ చరిత్రాత్మక విజయంగా, భారత్ ఓటమిగా పాక్ మీడియా వ్యాఖ్యానించింది.
ఈ అంశంపై రోజ్‌నామా జంగ్ పత్రికలో రెండు ద్వారాలు తెరిచి ఉంచినట్లు కనిపించే కార్టూన్‌ను కూడా ప్రచురించారు.
దీనిలో ఒక ద్వారాన్ని గోవాగా పేర్కొన్నారు. దీని నుంచి భారత్ బయటకు వెళ్తున్నట్లు చూపించారు. రెండో ద్వారాన్ని గ్వాదర్‌గా, దీనిలో నుంచి పాక్ లోపలకు వెళ్తున్నట్లు చూపించారు.
ఈ తరహా సంబరాలు పాక్‌లో రెండు వారాల పాటు కొనసాగాయి. ప్రపంచ ప్రఖ్యాత టైమ్ మ్యాగజైన్‌లో సెప్టెంబరు 22, 1958న ఓ కథనం కూడా ప్రచురితమైంది.
అయితే, గ్వాదర్‌ను పాక్ ఉచితంగా తీసుకోలేదని, దీని కోసం రూ. 4 కోట్ల 20 లక్షలు చెల్లించిందని పేర్కొన్నారు.
ఈ ప్రాంతం నుంచి చమురును వెలికితీస్తే.. దీనిలో కొంత ఆదాయాన్ని ఒమన్ సుల్తాన్‌కు ఇస్తామని పాక్ అంగీకరించినట్లు టైమ్ పేర్కొంది.
ఈ వార్తను పాక్ మీడియాలో ప్రధానంగా ప్రస్తావించారు. తమ దేశ ప్రభుత్వం నిజాలను చీకట్లో దాచిపెట్టి ప్రజలను తప్పుదారి పట్టించే ప్రకటనలు చేస్తోందని పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
భారత్ ఉద్దేశం ఏమిటంటే..
తాజా పరిస్థితుల నడుమ పాక్ ప్రభుత్వం కొన్ని రోజులు మౌనంగా ఉండిపోయింది. కానీ 24 అక్టోబరు 1958న పశ్చిమ పాక్ గవర్నర్ నవాబ్ ముజఫర్ ఖల్‌బాష్ స్పందించారు. ఒక విధానపరమైన ప్రకటనను ఆయన విడుదల చేశారు.
దీంతో టైమ్ మ్యాగజైన్ వార్తపై చర్చకు తెరపడి.. సరికొత్త అంశం వెలుగులోకి వచ్చింది. అదే గ్వాదర్‌పై భారత్ ఆసక్తిగా ఉందనే విషయం. ''నిజమే గ్వాదర్‌ను తీసుకొనేందుకు పాక్ ఆ డబ్బులు చెల్లించింది''అని ప్రకటనలో గవర్నర్ పేర్కొన్నారు.
''ఎందుకంటే గ్వాదర్‌పై భారత్ కూడా ఆసక్తి కనబరిచింది. ఒమన్ సుల్తాన్‌కు కొంత డబ్బులు ఇస్తామని భారత్ చెప్పింది. పాక్ ఇచ్చేదాని కంటే ఎక్కువ ఇస్తామని అంది. తమ తరఫున మాట్లాడేందుకు కొన్ని మిత్ర దేశాలను భారత్ వెనకేసుకొని వచ్చింది''
గ్వాదర్‌లో ఎక్కువ మంది హిందువులు ఉంటారు కాబట్టి.. ఈ ప్రాంతం తమకే చెందుతుందని భారత్ వాదిస్తూ వచ్చిందని ఆయన పేర్కొన్నారు. అయితే పాక్ విడుదల చేసిన అధికారిక గణాంకాల ప్రకారం.. అప్పటి గ్వాదర్ జనాభా 20,000. అందులో హిందువుల జనాభా కేవలం వెయ్యి మాత్రమే అని వివరించారు.
''నగదు ఇస్తామని చెప్పడం, దౌత్య పరమైన సంప్రదింపులు విఫలం అవ్వడంతో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలని భారత్ చివరగా కోరింది. ఆ ప్రజాభిప్రాయ సేకరణలో భారత అధికారులనూ భాగస్వామ్యం చేయాలని ప్రధాన మంత్రి ఫిరోజ్ ఖాన్‌కు భారత ప్రభుత్వం ఓ లేఖ కూడా రాసింది''అని నవాబ్ వివరించారు.
''భారత్ ప్రతిపాదనను పాక్ తిరస్కరించింది. అంతేకాదు భారత్ ప్రయత్నాలనూ వమ్ముచేసింది''

ఫొటో సోర్స్, Getty Images
భారత్‌కు ఆస్తకి ఎందుకు?
ఈ చరిత్ర చాలా ఆసక్తికరంగా ఉంటుంది. జనవరి 1947లోనే ఈ కథ మొదలైంది.
గ్వాదర్ తమ దేశంలో మారుమూల కరవు ప్రాంతమని ఒమన్ సుల్తాన్ భావించేవారు. పాలనలో వారికి చాలా ఇబ్బందులు కూడా ఎదురయ్యేవి.
దీంతో భారత ప్రభుత్వానికి ద పర్షియన్ గల్ఫ్ రెసిడెన్సీ బహ్రెయిన్ నుంచి ఓ లేఖ వచ్చింది. ఈ ప్రాంతాన్ని అమ్మేయాలని ఒమన్ సుల్తాన్ భావిస్తున్నట్లు దానిలో పేర్కొన్నారు.
ఈ ప్రాంతంపై ఎప్పటి నుంచో బ్రిటన్ చాలా ఆస్తకిగా ఉండేది. దీంతో గ్వాదర్ కొనుగోలు అంశాన్ని పరిశీలనలోకి తీసుకుంది. అయితే రెండో ప్రపంచ యుద్ధం నడుమ బ్రిటన్‌కు తలనొప్పులు ఎక్కువయ్యాయి. దీంతో తమ నిర్ణయాన్ని వాయిదా వేసుకోవాల్సి వచ్చింది.

ఫొటో సోర్స్, Reuters
అసలు ఒమన్‌లో ఎలా కలిసింది?
పాక్ ప్రభుత్వ రిపోర్టుల ప్రకారం.. కలాత్ సంస్థానం ఆధీనంలో ఎప్పుడూ గ్వాదర్ లేదు. ఈ ప్రాంతం సికిందర్-ఇ-ఆజం కాలం నుంచీ మక్రాన్‌లో భాగంగా ఉందని బ్రిటిష్ పర్యటక మేజర్ జనరల్ సర్ చార్లెస్ మ్యాట్ కీఫె మెక్ గ్రెగర్ రాసిన పుస్తకం వాండెరింగ్ ఇన్ బలూచిస్తాన్‌లో పేర్కొన్నారు.
బలూచ్ రాజుల గొడవల నడుమ మక్రాన్‌కు చెందిన గచ్కీ రాజులు కలాత్ సంస్థానానికి సామంత రాజులుగా ఉండేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే, మక్రాన్ అంతర్గత వ్యవహారాల్లో కలాత్ జోక్యం చేసుకోదని స్పష్టంచేసింది.
ఆ తర్వాత వారసత్వ పోరులో ఓడిపోయిన ఒమన్ సుల్తాన్ షెహ్‌జాద్ సయీద్.. ఈ ప్రాంతానికి వచ్చారు.
1783లో మక్రాన్‌లోని మిర్వారీ వర్గానికి చెందిన జక్ అనే గ్రామానికి ఆయన వచ్చారు. ఆ వర్గానికి అధిపతి అయిన దాద్ కరీమ్ మిర్వారీ ఆయన్ను కలాత్ రాజు దగ్గరకు తీసుకెళ్లారు. తనకు సైనికపరమైన సాయం చేయాలంటూ సయీద్.. కలాత్ రాజును కోరారు. అయితే ఒమన్ అంతర్యుద్ధంలో జోక్యం చేసుకోకూడదని కలాత్ రాజు భావించారు. అందుకే గ్వాదర్ ప్రాంతాన్ని అమానత్ కింద సయీద్‌కు ఇచ్చారు. ఒకవేళ వారసత్వ పోరులో గెలిస్తే.. దీన్ని గచ్కీ రాజులకు వెనక్కి ఇచ్చేయాలని సూచించారు. బలూచిస్తాన్ అధికారిక పత్రాలు కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించాయి.
గ్వాదర్‌ను తమలో కలుపుకోవడానికి పాక్ సమర్పించిన ధ్రువపత్రాల్లో అఫ్గాన్ హజీ అబ్దుల్ ఘనీ రాసిన ఓ కథనాన్ని ప్రస్తావించారు.
ఈ ప్రాంతంపై హాజీ అబ్బుల్ ఘనీ ఆసక్తి అప్పటి బ్రిటిష్ ప్రభుత్వ దృష్టికి అద్దం పడుతోంది.
1939లో గ్వాదర్‌పై అఫ్గానిస్తాన్ దండెత్తినప్పుడు.. కలాత్‌లోని బ్రిటిష్ రెసిడెంట్ జనరల్ ఒక అఫ్గాన్ పౌరుడి సాయంతో ఈ నివేదికను తయారు చేశారు. దీన్ని 1939లో ఆసియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్ ప్రచురించింది. మక్రాన్‌లో గ్వాదర్ భాగమని, ఇది గచ్కీ బలూచ్‌లకు చెందినదని నివేదికలో పేర్కొన్నారు.
గ్వాదర్, ఛాబహార్‌లు రెండు బలూచ్ ప్రాంతాలని, ఈ రెండూ మక్రాన్‌లో భాగమని నివేదిక పేర్కొంది. ఈ ప్రాంతం ఆధీనంలో ఉంటే పర్షియన్ గల్ఫ్‌పై నిఘా పెట్టి ఉంచొచ్చని దానిలో వివరించారు. గ్వాదర్ ప్రాముఖ్యతను బ్రిటిష్‌వారికి అర్థమయ్యేలా చెప్పడంలో ఈ నివేదిక ప్రముఖ పాత్ర పోషించింది.
జనవరి 1947లో ఒమన్ సుల్తాన్.. బ్రిటిష్ ప్రభుత్వం ద్వారా గ్వాదర్‌ను అమ్మకానికి పెట్టారు. భారత్ దీనిపై ఆసక్తి చూపడంతో పాకిస్తాన్ చారిత్రక ఆధారాలను కూడబెట్టడం మొదలుపెట్టింది.

భారత్ కరెన్సీ వాడుకలో
ఆసియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్ ప్రచురించిన నివేదికలో భారత్ ఎందుకు ఆసక్తి చూపుతుందో రెండు కారణాలు చెప్పారు.
అప్పటి పత్రికల సమాచారం ప్రకారం.. ఈ ప్రాంతం అక్రమ రవాణాకు పాల్పడే వారికి నిలయం. కొందరు స్మగ్లర్ల నెట్‌వర్క్ కరాచీ నుంచి గ్వాదర్ వరకూ ఉండేది. బంగారం, ఆహార పదార్థాలు, ఇతర విలువైన వస్తువులను వీరు పాక్ నుంచి విదేశాలకు తరలించేవారు.
పాక్‌లో గ్వాదర్ చేరడంతో ఈ కార్యకలాపాలు మరింత పెరిగాయి. అప్పట్లో చవకైన విదేశీ వస్తువులను పర్యటకులు ఎక్కువగా ఇక్కడే కొనేవారు. కరాచీ నుంచి గ్వాదర్‌కు వెళ్లడానికి సముద్ర మార్గంలో కేవలం రూ.23 మాత్రమే తీసుకునేవారు. కానీ అక్రమ కార్యకలాపాలు పెరగడంతో ఈ మొత్తం రూ.300కు చేరింది.
''గ్వాదర్ పాక్‌లో చేరే సమయంలో.. విలువైన వస్తువులు, విదేశీ దుస్తులతో ఇక్కడి మార్కెట్లు కళకళలాడేవి. కానీ ఒక్కసారిగా ఇదంతా అదృశ్యమైంది. ఎందుకంటే ఈ మార్కెట్లలో ఎక్కువగా హిందూ వ్యాపారులే ఉండేవారు. వీరంతా క్రమంగా ఇక్కడి నుంచి తరలి వెళ్లిపోయారు''అని పర్యటకులు వివరించేవారు. ఒమన్‌లో భాగమైనప్పటికీ ఇక్కడ వాణిజ్యమంతా భారత కరెన్సీలోనే జరిగేదని వారు చెప్పేవారు.
మొదట్లో పాక్ ప్రభుత్వం అన్ని రకాలు వాణిజ్య కార్యకలాపాలు సాధారణంగానే సాగుతాయని ప్రకటించింది. కానీ అక్రమ రవాణా పెరగడంతో ప్రభుత్వం ఆంక్షలు విధించాల్సి వచ్చింది.
అయినప్పటికీ, అక్రమ కార్యకలాపాలు కొనసాగుతూ ఉండేవి. ఎందుకంటే వీటిని ఆపాలంటే తీరానికి అనుకొని ప్రధాన రహదారి అనివార్యమని వారికి అర్థమైంది.
కానీ, ప్రధాన రహదారి నిర్మాణానికి ఒమన్ అడ్డుగోడగా నిలిచింది. ఈ అడ్డుగోడ పాక్‌లో గ్వాదర్ కలవడంతో తొలగిపోయింది.
1958లో ప్రచురించిన టైమ్ మ్యాగజైన్ కథనంలో రెండు విషయాలను ప్రముఖంగా ప్రస్తావించింది. వీటిలో మొదటిది గ్వాదర్ కోసం పాక్ చెల్లించిన మొత్తం. రెండోది ఇక్కడ ఒక విమానాశ్రయం, నౌకాశ్రయాలను నిర్మించాలని పాక్ తీసుకున్న నిర్ణయం.
ఈ ప్రతిపాదన దాదాపు అర్ధ శతాబ్దం తర్వాత పూర్తికానుంది. బహుశా అందుకే భారత రచయిత కార్తిక్ నంబి ఇలా రాసుకొచ్చారు.
''విభజన జరిగిన తర్వాత కూడా గ్వాదర్‌ను అమ్మడానికి భారత్‌ను ఒమన్ సంప్రదించింది. కానీ భారత ప్రభుత్వం దీనిపై అంత ఆసక్తి కనబరచలేదు. అప్పుడే సుల్తాన్ పాక్‌ను సంప్రదించారు. ముందు చూపు లేకపోవడంతో భారత నాయకులు ఒక మంచి అవకాశాన్ని చేజార్చుకున్నారు''.
ఇవి కూడా చదవండి:
- కోకాకోలా, మొసలిపేడ, పంది పేగులు... గర్భం రాకుండా పూర్వం వీటితో ఏం చేసేవారో తెలుసా?
- కొళాయి నీళ్లలో మెదడును తినేసే సూక్ష్మజీవులు.. ఆ నీళ్లు వాడొద్దంటూ అధికారుల వార్నింగ్
- కశ్మీర్ సమస్య పరిష్కారం కానిదే దక్షిణాసియాలో శాంతి అసాధ్యం: ఐక్యరాజ్యసమితిలో ఇమ్రాన్ ఖాన్
- ఐక్యరాజ్యసమితి అంటే ఏమిటి? అది ఏం చేస్తుంది?
- బంగారం వ్యాపారానికి ప్రొద్దుటూరు ఎలా కేంద్రంగా మారింది? ఈ ఊరిని రెండో ముంబై అని ఎందుకు అంటారు?
- ఓ డొక్కు టీవీ ఊరు మొత్తానికీ ఇంటర్నెట్ రాకుండా చేసింది.. ఎలాగంటే...
- వాడి పడేసిన 3 లక్షల కండోమ్‌లు రీసైకిల్ చేసి విక్రయించే ప్రయత్నం...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








