భారత్-చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు: సరిహద్దుల్లో విధులకు వెళుతూ చైనా సైనికులు కన్నీరు పెట్టుకున్నారా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, శృతి మీనన్ , ఉపాసన భట్
- హోదా, బీబీసీ రియాలిటీ చెక్
భారత్-చైనా సరిహద్దుల్లో చోటుచేసుకున్న ఘర్షణల్లో 20 మంది భారత సైనికులు మరణించినప్పటి నుంచి రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు తలెత్తుతూనే ఉన్నాయి.
బలగాలను సరిహద్దుల నుంచి ఉపసంహరించుకొనేందుకు రెండు దేశాల మధ్య చర్చలు జరుగుతున్నప్పటికీ, అక్కడ నెలకొన్న పరిస్థితుల గురించి మాత్రం సోషల్ మీడియాలో తప్పు దారి పట్టించే వార్తలు విపరీతంగా ప్రచారం అవుతున్నాయి. వాటిలో కొన్నింటిని బీబీసీ పరిశీలించింది.

వాదన: సరిహద్దుల్లో విధులు నిర్వర్తించేందుకు వెళ్తూ కన్నీరు పెట్టుకున్న చైనా సైనికులు
వాస్తవం: తప్పుదారి పట్టించేందుకు సందర్భం లేకుండా వాడుతున్న వీడియో ఇది
ట్విటర్‌లో షేర్ అవుతున్న ఈ వీడియోను కొన్ని తైవాన్ మీడియా సంస్థలు సెప్టెంబరులో ప్రచురించాయి. అనంతరం ఇది భారత్‌లో వైరల్ అయింది. సరిహద్దుల దగ్గరకు పంపిస్తున్నారనే కారణంతోనే చైనా సైనికులు కన్నీరు పెట్టుకుంటున్నారంటూ ఎగతాళి చేస్తూ ఈ వీడియోను షేర్ చేస్తున్నారు.
ఈ వీడియోను ఇప్పటికే 300,000 సార్లకుపైనే నెటిజన్లు వీక్షించారు. దీన్ని జీ న్యూస్ లాంటి టీవీ ఛానెల్ కూడా ప్రసారం చేసింది.
ఈ వీడియోలో జవాన్లు ఒక మినీ బస్సులో ప్రయాణిస్తూ మాండరిన్ భాషలో ఇంటి జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చే ఒక పాటను పాడుతున్నారు. ఆ సైనికులు భుజంపై ధరించిన ఎరుపు, పసుపు రంగు కండువా లాంటి వస్త్రాలపై "గౌరవంతో సైన్యంలో చేరండి " అనే నినాదం రాసి ఉంది.
అయితే, వారు భారత సరిహద్దుల దగ్గరకే వస్తున్నారనడానికి ఎలాంటి ఆధారాలు లేవు.
బస్సులో ఉన్నవారు ఫుయాంగ్ నగరంలో ఇంగ్ ఝౌ జిల్లా నుంచి కొత్తగా సైన్యంలోకి చేరిన సైనికులని చైనా మీడియా సంస్థలు పేర్కొన్నాయి. వారు వారి కుటుంబ సభ్యులకు వీడ్కోలు చెబుతూ భావోద్వేగాలకు లోనయ్యారని రాశారు.
ఈ సైనికులంతా సైనిక సదుపాయాలకు వెళ్తున్నారని, అందులో అయిదుగురు సైనికులు టిబెట్ ప్రాంతంలో పని చేసేందుకు అంగీకరించారని ఒక స్థానిక చైనా మీడియా సంస్థ.. సెప్టెంబరు 15న 'వి చాట్' అనే చైనా మెసేజింగ్ యాప్‌లో రాసుకొచ్చింది.
కానీ, వారందరినీ ఉద్రిక్తతలు నెలకొన్న భారత చైనా సరిహద్దుల దగ్గరకు పంపిస్తున్నట్లు ఎక్కడా ప్రస్తావించలేదు.
కొత్తగా నియమితులైన సైనికులు తమ కుటుంబ సభ్యులకు వీడ్కోలు పలుకుతూ ఉన్న చిత్రాలను భారత్-చైనా మధ్యనున్న సరిహద్దు గొడవలతో పోల్చి తైవాన్ మీడియా తప్పుడు ప్రచారం చేసిందని, చైనా అధికారిక మీడియా సంస్థ గ్లోబల్ టైమ్స్ సెప్టెంబరు 22న ప్రచురించిన కథనంలో ఆరోపించింది.

వాదన: చైనా లౌడ్ స్పీకర్ల నుంచి వస్తున్న సంగీతానికి భారత సైనికులు డాన్స్ చేస్తున్నట్లు కనిపిస్తున్న వీడియో
వాస్తవం: సరిహద్దుల్లో స్పీకర్ల గురించి ప్రస్తావనే లేని ఒక పాత వీడియో ఇది
చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ భారత్ సరిహద్దుల దగ్గర లౌడ్ స్పీకర్లను ఏర్పాటు చేసి, సైనికుల దృష్టి మళ్లించేందుకు పంజాబీ పాటలను ప్లే చేస్తోందనే వార్తలు సెప్టెంబరు 16న రెండు దేశాల మీడియాల్లోనూ కనిపించాయి.
భారత సైనికులు 24 గంటలూ కాపలా ఉండే ప్రాంతంలో చైనా సైన్యం లౌడ్ స్పీకర్లను ఏర్పాటు చేసిందని మీడియా రిపోర్టులు పేర్కొన్నాయి.
సైన్యమే ఈ విషయాన్ని ధృవీకరించిందని పేర్కొంటూ రెండు దేశాల మీడియా సంస్థలు వార్తలను ప్రచురించాయి. అయితే ఈ వార్తల్లో దానికి సంబంధించిన వీడియోలు కానీ, ఫోటోలు కానీ లేవు. భారత సైన్యం కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించలేదు.
భారత్‌లోని సోషల్ మీడియా యూజర్లు.. పంజాబీ సంగీతానికి డ్యాన్స్ చేస్తున్న భారత సైనికుల పాత వీడియోలను షేర్ చేస్తున్నారు. అయితే, సరిహద్దుల్లో గతంలోనే లౌడ్ స్పీకర్లు వినియోగించినట్లు సమాచారం ఉంది.
సెప్టెంబరులో షేర్ చేసిన ఒక వైరల్ వీడియోలో ఐదుగురు సైనికులు ఒక పంజాబీ పాటకు డాన్స్ చేస్తున్నట్లుగా కనిపించారు. దీనికి 88,000కిపైగా వ్యూస్ వచ్చాయి. ఆ వీడియోలో లద్దాఖ్‌లో ఉన్న భారత్-చైనా సరిహద్దులను చూడవచ్చని సోషల్ మీడియా యూజర్ రాశారు.
అయితే, రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసినప్పుడు ఆ వీడియో జులైలో చిత్రీకరించిందని తేలింది.
ఆ వీడియో ఎక్కడ తీశారో కచ్చితంగా చెప్పలేకపోయినప్పటికీ, అప్పటి వార్తా కథనాలను బట్టి ఆ వీడియో భారత్-పాక్ సరిహద్దుల దగ్గర తీసినది అని తెలుస్తోంది.

వాదన: చైనా ఏర్పాటు చేసిన భారీ స్పీకర్ వలన గాయపడిన భారత సైనికులు
వాస్తవం: సరిహద్దుల్లో మ్యూజిక్ ప్లే చేయడానికే స్పీకర్ ఏర్పాటు చేసినట్లు ఆధారాలేమీ లేవు
లౌడ్ స్పీకర్ల గురించి ఇంతకు ముందు వచ్చిన సమాచారానికి ఇది కాస్త భిన్నంగా ఉంది. భారత సైనికులు ఉండే ప్రాంతాల్లో గగ్గోలు పెట్టే సంగీతాన్ని ప్లే చేసి సైనికుల ఆరోగ్యానికి హాని కలుగ చేయడం, సైనికులను గాయపరిచడం తదితర లక్ష్యాలతో ఈ భారీ పరికరాలను వాడతారని చెబుతూ ఒక వీడియోని చైనా ట్విటర్‌లో షేర్ చేశారు.
ఈ వీడియోని ఇప్పటికే 2,00,000 సార్లు చూడగా ఇది ఒక భారతీయ న్యూస్ ఛానెల్లో కూడా ప్రసారమైంది.
అయితే, ఈ వైరల్ వీడియో మార్చి 2016లో మొబైల్ హెచ్చరిక సైరెన్ గురించి తెలిపే ఒక చైనా సంస్థ తయారు చేసిన యూ ట్యూబ్ వీడియో అని తేలింది. అత్యవసర సమయాల్లో ఉపయోగించే భద్రతా పరికరాలను తయారు చేసే ఒక సంస్థ ఈ వీడియోని నిర్మించింది.
ఈ వీడియోలో కనిపించే 4. 6 టన్నుల బరువుండే సైరన్ ప్రకృతి వైపరీత్యాల సమయంలో, ఇతర అత్యవసర పరిస్థితుల్లో సాధారణ ప్రజల కోసం వాడే పరికరమని సంస్థ వెబ్ సైటులో రాసినట్లు తెలుస్తోంది.
ఇది మ్యూజిక్ ప్లే చేసేందుకు వాడే లౌడ్ స్పీకర్ కాదని అర్ధమవుతోంది. ఈ సైరన్‌ని చైనా సైన్యం సరిహద్దుల దగ్గర వాడుతుందని చెప్పడానికి కూడా ఎలాంటి ఆధారాలు లేవు.
అలాగే, ఆ ప్రాంతంలో ఉన్న భారతీయ సైనికులకు ఈ పరికరం వల్ల వినికిడి సమస్యలు ఉత్పన్నమైనట్లు కూడా ఎలాంటి ఆధారాలు లేవు.

వాదన: సరిహద్దు ఉద్రిక్తతల నడుమ భారత భద్రతా సిబ్బంది ప్రయాణిస్తున్న బస్సుకు ప్రమాదం
వాస్తవం : ఈ ప్రమాదం సరిహద్దు ప్రాంతంలో జరగలేదు
చైనాలో ఒక ట్విటర్ యూజర్ సెప్టెంబరు 21వ తేదీన ఈ వీడియో పోస్టు చేశారు. దీనిలో ఒక నదిలో సగం మునిగిపోయిన సైన్యానికి చెందిన బస్సు, దగ్గరలో నిలబడి చూస్తున్న సైనికులు కనిపిస్తున్నారు.
ఆ వీడియోపై లద్దాఖ్ ప్రాంతంలో ఆత్మహత్యలు చేసుకునేందుకు ప్రయత్నిస్తున్న భారతీయ సైనికులు అని రాసి పోస్టు చేశారు.
ఈ వీడియోను 5000 సార్లు వీక్షించారు. ఈ వీడియో నిజమైనదే కానీ.. ఇది భారత్-చైనా సరిహద్దుల దగ్గర చిత్రించిన వీడియో కాదు. ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపుర్ జిల్లాలో సెప్టెంబరు నెలలో ఒక నదిలో సైనికుల బస్సు మునిగిపోయినప్పటి వీడియో ఇది.
ఆ సమయంలో భారతీయ మీడియా బస్సు మునిగిన ఘటన గురించి వార్తలను ప్రచురించింది. అయితే, ఆ ఘటనలో మరణాలేవీ చోటు చేసుకోలేదు.
ఈ వార్తను బీబీసీ మానిటరింగ్ వారి సౌజన్యంతో రాశాం.
ఇవి కూడా చదవండి:
- బొప్పాయి పండుతో అబార్షన్ ఎలా చేయాలో నేర్పిస్తున్నారు
- ప్రపంచంలో విదేశాలపై ఆధారపడని ఏకైక ‘దేశం’ ఇదేనా?
- పుండ్లలోని చీముతో ప్రమాదకరంగా ఆ వ్యాక్సీన్ ఎక్కించేవారు, అది లక్షల మంది ప్రాణాలు కాపాడింది
- భారతదేశంలో కోవిడ్ మరణాలు 1,00,000 దాటాయి... ఈ మరణాలకు కారణాలేమిటి?
- ‘బందిపోటు’ పోలీసులు.. హత్యలు, దోపిడీలతో చెలరేగిపోతున్నారు
- కరోనావైరస్ లక్షణాలు ఏమిటి? పిల్లల్లో ఎటువంటి లక్షణాలు కనిపిస్తాయి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- చైనాలో మహిళలకు మాత్రమే పరిమితమైన రహస్య భాష... నుషు
- కరోనావైరస్: వ్యాక్సీనా, హెర్డ్ ఇమ్యూనిటీనా... ఏది వస్తే మేలు?
- ఓ డొక్కు టీవీ ఊరు మొత్తానికీ ఇంటర్నెట్ రాకుండా చేసింది.. ఎలాగంటే...
- మీ పాత టీవీ, రేడియో అమ్మితే రూ. 10 లక్షలు.. ఏమిటీ బేరం
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








