కరోనావైరస్: ఆంధ్రప్రదేశ్‌లో పాఠశాలలు ప్రారంభించే పరిస్థితి ఉందా.. ప్రభుత్వం విద్యార్థుల ఆరోగ్యం కంటే స్కూల్స్ తెరవడమే ముఖ్యమనుకుంటోందా

పాఠశాల

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, లక్కోజు శ్రీనివాస్
    • హోదా, బీబీసీ కోసం

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు కరోనా పాజిటివ్ రావడంతో తల్లిదండ్రుల్లో ఆందోళన పెరుగుతోంది. అదే సమయంలో పూర్తిస్థాయిలో బడులను ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. నవంబర్ 5 నుంచి అన్ని తరగతుల వారికి పాఠశాలలు తెరిచేందుకు సిద్ధమవుతోంది.

దీంతో తమ పిల్లలను స్కూళ్లకు పంపాలా? వద్దా? అనే మీమాంస తల్లిదండ్రుల్లో మొదలైంది.

గతంతో పోలిస్తే ఏపీలో కరోనా కేసుల సంఖ్య తగ్గినట్లు కనిపిస్తున్నా ప్రతిరోజూ కొత్త కేసులు పెద్ద సంఖ్యలోనే నమోదవుతున్నాయి.

పైగా అన్ని వయసుల వారికి కరోనా పాజిటివ్ రావడం కొంత కలవరపెట్టే విషయం.

అన్‌లాక్ 4.0లో భాగంగా పాఠశాలలను పరిమిత సంఖ్యలో విద్యార్థులతో తెరిచారు. లాక్‌డౌన్‌ ఆంక్షల సడలింపులో భాగంగా… ఆన్‌లైన్‌ క్లాసుల్లో అర్థంకాని విషయాలు తెలుసుకునేందుకు కొందరు విద్యార్థులు స్కూలుకు వచ్చేందుకు వెసులుబాటు కల్పించారు.

9, 10 తరగతుల విద్యార్థులకు సెప్టెంబర్ 21 నుంచి తరగతులు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా పాఠశాలకు హాజరైన విజయనగరం జిల్లాలోని గంట్యాడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని 18 మంది విద్యార్థులకు, దత్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 9 మంది విద్యార్థులకు కరోనా సోకింది.

"పాఠశాలలోని విద్యార్థులతోపాటు సిబ్బందికీ కరోనా పరీక్షలు నిర్వహించాం. విద్యార్థులు, పాఠశాల వాచ్‌మెన్‌ మినహా సిబ్బంది ఎవరికీ కరోనా పాజిటివ్ రాలేదు" అని గంట్యాడ పీహెచ్‌సీ వైద్యాధికారి అప్పలరాజు బీబీసీతో చెప్పారు.

ప్రభుత్వ పాఠశాల

ఈ విషయంపై విజయనగరం జిల్లా డీఈవో జి.నాగమణి బీబీసీతో మాట్లాడుతూ..."గంట్యాడ, దత్తి పాఠశాలల్లోని విద్యార్థులకు కరోనా పాజిటివ్ నిర్ధరణ అయ్యింది. అయితే విద్యార్థులకి కరోనా అని తెలిసిన తర్వాతే ఉపాధ్యాయులు నా దృష్టికి తీసుకుని వచ్చారు. వెంటనే ఉన్నతాధికారులకు విషయం చెప్పాను.

దీంతో ఇకపై తరగతులు నిర్వహించకుండా, సందేహాల నివృత్తి మాత్రమే చేయాలని సూచించారు.

ఇప్పటి వరకు కేవలం 30 నుంచి 35 శాతం విద్యార్థులు హజరవుతున్నారు. నవంబర్‌లో పూర్తిస్థాయిలో పాఠశాలలు ప్రారంభించే విషయంపై మాకు ఎలాంటి సమాచారం లేదు" అని చెప్పారు.

"కరోనా సోకిన విద్యార్థుల తల్లిదండ్రులకు, విద్యార్థులతో ఇటీవల కలిసిన వారిలో లక్షణాలున్న వారికి కోవిడ్ పరీక్షలు నిర్వహించాం. మిగతావారందరినీ హోం ఐసోలేషన్‌లో ఉండాలని సూచించాం.

అయితే పాఠశాలలలోని సిబ్బంది ఎవరికీ కరోనా సోకలేదు కాబట్టి...విద్యార్థులకి కరోనా పాజిటివ్ ఎలా వచ్చిందనేది తెలుసుకుంటున్నాం.

పాఠశాల సిబ్బంది, విద్యార్థులంతా తగిన జాగ్రత్తలు తీసుకుని కరోనా నిబంధనలు పాటించాలి." అని విజయనగరం డీఎంహెచ్‌వో ఎస్వీ రమణకుమారి బీబీసీతో చెప్పారు.

మరోవైపు గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం భట్లూరులో 15 మంది చిన్నారులకు ఇటీవల కరోనా సోకింది. ట్యూషన్ చెప్పే మాస్టారుకి కరోనా పాజిటివ్ రావడంతో అక్కడికి వెళ్లిన విద్యార్థులు కరోనా బారినపడ్డారు.

విద్యార్థులంతా ఏడేళ్లలోపు చిన్నారులే. దీంతో అధికారులు విద్యార్థులను క్వారంటైన్ సెంటర్‌కు తరలించారు.

చిన్నారుల తల్లిదండ్రుల్లో కొందరికి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో అధికారులు ఆయా గ్రామాల్లో సహయ చర్యలు చేపట్టారు.

ఆన్‌లైన్ క్లాసులు

అయోమయంలో తల్లిదండ్రులు

చదువుకోవడానికి వెళ్తున్న విద్యార్థులకి కరోనా సోకడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.

"ఇప్పుడున్న పరిస్థితుల్లో కరోనా భయంలో పిల్లల చదువులన్ని వదులుకోవాలో...చదువుల కోసం పంపించి ప్రమాదంలోకి నెట్టాలో అర్థంకాని పరిస్థితి. ప్రభుత్వం ఎన్ని చెబుతున్నా కరోనా నిబంధనలు ప్రజలు పెద్దగా పట్టించుకున్నట్లు కనిపించడం లేదు.

అధికారులు కూడా దీనిపై కఠినంగా వ్యవహరించడం లేదు. దీంతో తప్పు ఎవరిది అని లెక్కలేసుకోవడం, చర్చించుకోవడమే తప్ప మరేమీ చేయలేని గందరగోళ పరిస్థితిలో ఉన్నాం.

అలాగే కరోనా సమయంలో ప్రభుత్వం పాఠశాలలు తెరవడం కూడా అంత మంచిది కాదని నా అభిప్రాయం" అని విజయనగరం జిల్లా గంట్యాడ నివాసి రాజశేఖర్ బీబీసీతో అన్నారు.

‘సమస్యలున్నా... ఆన్‌లైన్ క్లాసులే మేలు’

విశాఖకి చెందిన లక్ష్మి, విజయవాడకి చెందిన దస్తగిరి కూడా ఈ విషయమై బీబీసీతో మాట్లాడారు.

"ఆన్‌లైన్ క్లాసులతో సమస్యలు చాలా ఉన్నాయి. నెట్‌వర్క్ సమస్య, చెప్పింది సరిగా అర్థం కాకపోవడం, పిల్లలకి కంటి సమస్యలు, మెడ నొప్పులు వంటి సమస్యలు రావడం మొదలైనవి.

కానీ కరోనా సమయంలో పాఠశాలలకి పంపడం కంటే ఆన్‌లైన్ క్లాసులే మేలు అనిపిస్తోంది. పిల్లల ప్రాణాలే ముఖ్యం కదా. అయితే ప్రభుత్వం తరగతులు నిర్వహించడంపై సరైన నిర్ణయం తీసుకుని విద్యార్థులకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండేటట్లు చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాం" అని వారు చెప్పారు.

కరోనావైరస్, చిన్నారులు

ఫొటో సోర్స్, Getty Images

పూర్తి స్థాయిలో ప్రారంభమైతే...

కనీస సంఖ్యలో విద్యార్థులతో తరగతులు నిర్వహిస్తేనే కరోనా సోకుతోంది. దీనికి గుంటూరు, విజయనగరం సంఘటనలే ఉదాహరణ.

ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం నవంబర్ 5 నుంచి అన్ని తరగతుల వారికి పాఠశాలలు తెరిచేందుకు సిద్ధమవుతోంది.

ఇప్పటికైతే కరోనా ఇంకా పూర్తిగా నియంత్రణలోకి రాలేదు. నవంబర్ మొదటి వారానికి కూడా నియంత్రణలోకి వచ్చేలా కనిపించడం లేదు. మరి, ఇలాంటి పరిస్థితుల్లో పాఠశాలలు మొదలుపెడితే పిల్లల పరిస్థితి ఏంటి అనే అనుమానం తల్లిదండ్రులందరిలో ఉంది.

కరోనాను సమర్థంగా ఎదుర్కొంటున్నాం

విద్యార్థులకి కరోనా సోకిన విషయం గురించి ఏపీ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని బీబీసీతో మాట్లాడారు.

"విజయనగరం, గుంటూరుల్లో కరోనా సోకిన విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించేలా చర్యలు తీసుకున్నాం. రానున్న రోజుల్లో ఏ విద్యార్థికైనా కరోనా సోకితే వారితోపాటు వారి తల్లిదండ్రులకూ కరోనా పరీక్షలు చేయాలని డీఎంహెచ్‌ఓలను ఆదేశించాం.

ఒకవేళ కరోనా సోకిన విద్యార్థులకు ఎలాంటి లక్షణాలు లేకపోతే హోం క్వారంటైన్‌లో ఉండాలని సూచించాం. కరోనా సోకకుండా అన్ని పాఠశాలల్లో మాస్కులు, శానిటైజర్లను కచ్చితంగా వినియోగించేలా అవగాహన కల్పించాలని జిల్లాల డీఈవోలకి, డీఎంహెచ్ఓలకి ఆదేశాలు ఇచ్చాం’’ అని ఆయన చెప్పారు.

‘‘పాఠశాలలకు వస్తున్న విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఇతర సిబ్బంది తప్పక కోవిడ్ నిబంధనలు పాటించాలి. ఏమాత్రం లక్షణాలు కనిపించినా విద్యార్థి, సిబ్బంది అన్న తేడాలేకుండా ఎవరికైనా వెంటనే కోవిడ్ పరీక్షలు నిర్వహించాలి. ఇప్పటికే హోమ్ క్వారంటైన్‌లో ఉన్న విద్యార్థులకు మెడికల్ కిట్స్ అందించాం. పాఠశాలలు ప్రారంభించే తేదీని ఇంకా ఖరారు చేయలేదు. దీనిపై ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకుంటారు. ఇప్పటికే రాష్ట్రంలో కరోనాని సమర్థంగా ఎదుర్కొన్నాం. భవిష్యత్తులో కూడా కరోనాని నియంత్రించేందుకు అన్ని ఏర్పాట్లు చేశాం" అని ఆళ్ల నాని అన్నారు.

పాఠశాల

‘ప్రారంభించడమే మంచిది’

"కరోనాకి ముగింపు ఎప్పుడో చెప్పలేం. అలాగని విద్యా సంవత్సరాన్నీ నష్టపోలేం. ద్యార్థుల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని పాఠశాలలు ప్రారంభించడం మంచిదే’’ అని అని ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవి సిద్దార్థ్ అన్నారు.

‘‘ఉదయం నుంచి సాయంత్రం వరకు కాకుండా...రోజుకి మూడు నుంచి నాలుగు గంటలు పాటు మధ్యలో కొద్దిగా విరామం ఇస్తూ తరగతులు చెప్పడం మంచిది. విద్యార్థులు పాఠశాలకు రాకపోయినా ఆటపాటలతో బయటే కాలాన్ని గడిపేస్తున్నారు. కరోనాని కూడా పట్టించుకోవడం లేదు. ఉపాధ్యాయులందరూ రోజూ పాఠశాలలకి హాజరవుతున్నారు.

విద్యార్థులను ముందు తక్కువ సంఖ్యలో తీసుకుని... క్రమక్రమంగా పెంచుకుంటూ సాధారణ తగరతులు నిర్వహించే విధంగా చూడాలి" అని ఆయన సూచించారు.

‘పాఠశాలలకు శానిటైజర్లు, మాస్కులు పంపిణీ చేయలేదు’

"పాఠశాలలు ప్రారంభించేందుకు ప్రయత్నాలు చేస్తున్న ప్రభుత్వం వాటిలో కనీసం శానిటైజర్లు, మాస్కులు కూడా పంపిణీ చేయలేదు. విజయవాడలోని సత్యనారాయణపురం ప్రాంతంలో నాలుగు ప్రభుత్వ పాఠశాలలకు ఎస్ఎఫ్ఐ బృందం వెళ్లి పరిశీలించింది.

విద్యార్థుల్లో సగం కంటే ఎక్కువ మంది మాస్కులు పెట్టుకోలేదు. మాస్కులు పెట్టుకోమని విద్యార్థులకి అక్కడి సిబ్బంది ఎవరు చెప్పినట్లు కూడా మేం చూడలేదు’’ అని ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బీబీసీతో అన్నారు.

‘‘విద్యా సంవత్సరం ప్రారంభించడం మంచిదే. ముఖ్యంగా కరోనా సోకని ప్రాంతాల్లోని పాఠశాలలను ముందుగా ప్రారంభించాలి. అలాగే కొందరికి ఆన్‌లైన్ ద్వారా, మరికొందరికి పాఠశాలల్లో బోధన చేయాలి. ఈ విధానాన్ని రోటేట్ చేయాలి. ఇలాంటి చర్యల ద్వారా కరోనాని వ్యాప్తి చెందకుండా చూడవచ్చు’’ అని అభిప్రాయపడ్డారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)