డిజిటల్ ఎడ్యుకేషన్: ‘డౌట్లు ఉన్నాయా అని అడిగితే పిల్లలు స్పందించట్లేదు.. అసలు వారికి ఆన్‌లైన్ పాఠాలు అర్థం అవుతున్నాయా?’

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, రాజేశ్ పెదగాడి
- హోదా, బీబీసీ ప్రతినిధి
రోజూ మధ్యాహ్నం క్రికెట్ ఆడుకోవడానికి వెళ్లే 14ఏళ్ల కిల్లంపల్లి ప్రసాద్ టీవీ ముందు కూర్చుకున్నాడు. అది క్రికెట్ మ్యాచ్ చూడటానికో లేదా సినిమా చూడటానికో కాదు. చదువుకోవడానికి.
‘‘డీడీ సప్తగిరి ఛానెల్‌లో రోజూ మూడు గంటలకు లెక్కలు చెబుతారు. అవి జాగ్రత్తగా వింటాను. ఆ టీవీలో వచ్చే సారే నాకు హోం వర్క్ కూడా ఇస్తారు. దాన్ని చేసిన తర్వాత మా స్కూల్ టీచర్‌కు పంపుతాను’’అని ప్రసాద్ చెప్పారు.
కరోనావైరస్ వ్యాప్తి నడుమ పరిస్థితులు తలకిందులయ్యాయి. షాపింగ్ మాల్స్, సినిమా థియేటర్లతోపాటు పాఠశాలలూ మూతపడ్డాయి. దీంతో విద్యార్థులకు పాఠాలు చెప్పేందుకు కొత్త విధానాలను ప్రభుత్వాలు అన్వేషించాయి.
ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ పేరుతో కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలూ ప్రత్యేక ప్రణాళికలు సిద్ధంచేశాయి. ప్రైవేటు పాఠశాలలూ టెక్నాలజీ సాయంతో పాఠాలు బోధిస్తున్నాయి.
ఇంతకీ తెలుగు రాష్ట్రాల్లో ఈ ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ ఎలా సాగుతోంది? విద్యార్థులకు ఈ పాఠాలు ఎంత వరకూ చేరుతున్నాయి? టీచర్లు ఏమంటున్నారు?

ఫొటో సోర్స్, Getty Images
ఆంధ్రప్రదేశ్ కొంచెం ముందుగానే..
ఆన్‌లైన్ తరగతులను ఆంధ్రప్రదేశ్ కొంచెం ముందుగానే ప్రారంభించింది. విద్యా వారధి దూరదర్శన్ పేరుతో డీడీ సప్తగిరిలో జులై రెండో వారం నుంచే తరగతులు మొదలయ్యాయి.
తెలంగాణలో మాత్రం ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ సెప్టెంబరు 1 నుంచి మొదలు కాబోతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. డీడీ యాదగిరి, నిపుణ ఛానెళ్లలో ఈ క్లాసులు ప్రసారం కానున్నాయి.
రెండు రాష్ట్రాల్లోని ప్రైవేటు స్కూళ్లు మాత్రం వేసవి సెలవులు పూర్తయిన వెంటనే ఆన్‌లైన్ తరగతులు మొదలుపెట్టాయి.
ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ బడులకు విద్యార్థులు రానప్పటికీ టీచర్లు విధులకు హాజరవుతున్నారు. తెలంగాణలో మాత్రం గురువారం నుంచి టీచర్లు రోజూ రావాలని ప్రభుత్వం సూచించింది.

ఫొటో సోర్స్, Getty Images
పిల్లలు ఏం అంటున్నారు?
టీవీలో వచ్చే పాఠాలు కొన్నిసార్లు సరిగా అర్థం కావడంలేదని, వాటిని మళ్లీ చూడటం ఎలాగో తెలియడం లేదని ప్రసాద్ వివరించాడు. ముఖ్యంగా గణితం, సైన్స్ విషయంలో ఇబ్బందులు ఎదరౌతున్నట్లు తెలిపాడు.
''సరిగ్గా మూడు గంటలకు మా క్లాస్ స్టార్ట్ అవుతుంది. దాన్ని జాగ్రత్తగా వినమని టీచర్లు చెప్పారు. అయితే, మధ్యలో నాకు సందేహాలు వస్తుంటాయి. వాటిని పుస్తకంపై రాసుకునేలోపే తర్వాతి అంశం వచ్చేస్తుంటుంది. ఒక్కోసారి కరెంటు పోతోంది''
''టీచర్లను అడగాలంటే ఫోన్ చేయాలి. అయితే, ఫోన్ పట్టుకుని మా నాన్న పనికి వెళ్లిపోతున్నారు. ఆయన వచ్చేసరికే రాత్రి ఎనిమిది దాటుతోంది. ఆ సమయంలో నేను టీచర్లకు ఫోన్ చేస్తే.. ఎత్తడం లేదు. కొందరు టీచర్లు వాట్సాప్ గ్రూప్‌లో ప్రశ్నలు అడగమంటున్నారు. కానీ వారు సమాధానం ఇచ్చేసరికి చాలా ఆలస్యం అవుతోంది. ఈలోగా టీవీలో కొత్త పాఠాలు వచ్చేస్తున్నాయి.''
తమ ఇంట్లో టీవీనే లేదని ఏడో తరగతి చదువుతున్న విశాఖపట్నానికి చెందిన నాగమణి వివరించింది.
''టీవీలు లేని పిల్లలు తమ స్నేహితుల ఇంటికి, లేదా పక్కింటికి వెళ్లాలని టీచర్లు చెప్పారు. మా పక్కింట్లో టీవీ ఉంది కానీ.. వారు మమ్మల్ని రానివ్వరు. మా స్నేహితుల ఇంటికి మా అమ్మ వెళ్లనివ్వదు''అని నాగమణి పేర్కొంది.

టీచర్లు ఏం చేస్తున్నారు?
పిల్లలు ఏమైనా సందేహాలు వ్యక్తంచేస్తే వాటిని తీర్చడానికి సిద్ధంగా ఉండాలని టీచర్లకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సూచించింది. అయితే తమను ఎవరూ సంప్రదించడం లేదని కర్నూలులోని నారాయణపురం జెడ్‌పీహెచ్‌ఎస్ పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తున్న దుబ్బా రామలింగా రెడ్డి తెలిపారు.
''వారానికి ఒకసారి స్కూల్‌కు వెళ్తున్నా. పిల్లలు ఏమైనా డౌట్లతో ఫోన్లు చేస్తారని ఎదురుచూస్తున్నాం. కానీ ఎవరూ ఫోన్ చేయట్లేదు. మేమే పిల్లల తల్లిదండ్రులకు ఫోన్‌చేసి పిల్లలతో మాట్లాడాలని అడుగుతున్నాం''.
''అయితే ఎవరూ సరిగా స్పందిచడం లేదు. మేం చాలాసేపు ఖాళీగానే కూర్చుంటున్నాం. పిల్లలకి పాఠాలు అర్థం అవుతున్నాయో లేదో తెలియడం లేదు''
''ప్రస్తుతం జగనన్న విద్యా కానుక కిట్లు స్కూళ్లకు చేరాయి. వీటికి లేబుళ్లు అతికిస్తున్నాం. పాఠశాలలు తెరచిన వెంటనే వీటిని పిల్లలకు పంపిణీ చేస్తాం''

టీచర్లు ఏం చేయాలని ప్రభుత్వం చెబుతోంది?
- పిల్లలల్ని మూడు వర్గాలుగా విభజించాలి. 1.దూరదర్శన్ ఛానెల్ అందుబాటులో ఉండేవారు, 2.స్మార్ట్‌ఫోన్ లేదా ల్యాప్‌టాప్ అందుబాటులో ఉండేవారు, 3. ఎలాంటి సదుపాయాలూ లేనివారు
- ఎలాంటి సదుపాయాలు లేనివారికి గ్రామ పంచాయతీ లేదా స్థానిక సంస్థల సాయంతో టీవీ అందుబాటులో ఉంచాలి. లేనిపక్షంలో స్మార్ట్‌ఫోన్ లేదా టీవీ అందుబాటులో ఉండేవారి దగ్గరకు వారిని పంపించాలి.
- పిల్లల కోసం ప్రభుత్వాలు ప్రత్యేక వర్క్‌షీట్లు తయారుచేశాయి. ఇవి అందరికీ అందేలా చూడాలి.
- పరిసరాల్లోని చదువుకున్న యువతతో పిల్లల్ని అనుసంధానించాలి.
- శానిటైజేషన్, మరుగుదొడ్ల నిర్వహణ, తాగునీటి సరఫరా తదితర అంశాల విషయంలో సన్నద్ధం అయ్యేందుకు గ్రామ పంచాయతీతో సమన్వయం కావాలి.
- పిల్లల దగ్గర ఏఏ వసతులు ఉన్నాయో ఉపాధ్యాయులు గుర్తించి ప్రణాళికలు సిద్ధంచేయాలి.
- దూరదర్శన్ షెడ్యూల్‌పై ముందుగానే పిల్లలకు, వారి తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వాలి.
- ప్రతిక్లాస్ తర్వాత వర్క్‌షీట్‌ను పిల్లలందరూ పూర్తిచేసేలా జాగ్రత్త వహించాలి.
- టెక్నాలజీని ఉపయోగించడంపై టీచర్లతోపాటు పిల్లలకు, పిల్లల తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలి. అవసరమైతే మళ్లీ మళ్లీ అవగాహన కల్పించాలి.
- ఉపాధ్యాయులు రెండు నుంచి మూడు గంటలు మాత్రమే ఆన్‌లైన్ పాఠాలు చెప్పాలి.
- తరగతుల వారీగా విద్యార్థులతో వాట్సాప్ లేదా ఇతర ఇన్‌స్టెంట్ మెసేజింగ్ గ్రూప్‌లను ఏర్పాటు చేయాలి. పిల్లలు మరీ చిన్నవారు అయితే, వారి తల్లిదండ్రులతో గ్రూప్‌ను ఏర్పాటు చేయాలి.
- సిలబస్‌ను పూర్తిచేయడానికి తొందర పడకూడదు. పిల్లలకు కొత్త అంశాలు నేర్పించడంపై దృష్టి సారించాలి.
- పిల్లలు ఎక్కువసేపు డిజిటల్ పరికరాలను వాడితే అనారోగ్యానికి గురయ్యే అవకాశాలున్నాయి. అందుకే వయసుకు తగిన స్థాయిలో టైమ్ టేబుల్‌ను రూపొందించాలి.
- పిల్లలు, వారి తల్లితండ్రుల నుంచి ఫీడ్‌బ్యాక్ తెలుసుకోవడం కోసం వారానికి ఒకసారి ప్రధాన ఉపాధ్యాయులు ప్రత్యేక సమయం కేటాయించాలి.
- తల్లితండ్రులకు సరైన అవగాహన లేకపోతే.. ఇరుగుపొరుగు వారు, వాలంటీర్ల సాయంతో ప్రత్యామ్నాయాలను పరిశీలించాలి.
అయితే, వీటిపై చాలా మంది టీచర్లకు అవగాహన ఉండటం లేదు. కొందరైతే దూరదర్శన్ చూడమని చెప్పి వదిలేస్తున్నారు. ఈ విషయంలో ప్రైవేటు స్కూళ్లు కొంత మెరుగ్గా ఉన్నాయి.
‘‘మేం జూమ్‌లో క్లాసులు చెబుతున్నాం. మా విద్యార్థుల్లో 70 శాతం మందికి స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. మిగతావారికి కూడా ఇంట్లో ఎవరో ఒకరి దగ్గర స్మార్ట్‌ఫోన్లు ఉన్నాయి. రోజూ 40 నిమిషాలు నిడివి ఉండే క్లాసులు ఐదు వరకు చెబుతున్నాం. సందేహాలు నివృత్తి చేసేందుకు మరో గంట అదనంగా కేటాయిస్తున్నాం’’అని హైదరాబాద్‌లోని ఓ కార్పొరేట్ స్కూల్‌లో పదో తరగతికి గణితం బోధిస్తున్న కోలా భారతి చెప్పారు.
‘‘స్మార్ట్‌ఫోన్ లేనివారి కోసం ప్రత్యేకంగా వీడియో రికార్డింగ్ క్లాసులను సిద్ధంచేస్తున్నాం. వీటిని విద్యార్థుల తల్లిదండ్రులు, లేదా సన్నిహితులకు పంపిస్తున్నాం. టెక్స్ట్ బుక్స్ వెనుక ఉండే ఎక్సర్‌సైజ్‌లు చేయిస్తున్నాం’’అని ఆమె వివరించారు.

పరిస్థితి ఇదీ
ఆన్‌లైన్ ఎడ్యుకేషన్‌లో భాగంగా పిల్లలకు ఇచ్చేందుకు రెండు రాష్ట్రాల్లోని ఎస్‌సీఈఆర్‌టీలు ప్రత్యేక వర్క్‌షీట్లు తయారుచేశాయి. ఇవి డిజిటల్ విద్యలో కీలక పాత్ర పోషిస్తాయని వీటిని తయారుచేసిన ఎస్‌సీఈఆర్‌టీ సీనియర్ అధికారిని తెహ్‌సీన్ సుల్తానా తెలిపారు.
''డిజిటల్ ఎడ్యుకేషన్‌లో అన్ని అంశాలనూ పరిగణలోకి తీసుకున్న ఈ వర్క్‌షీట్లను తయారుచేశాం. ఇవి ఉపాధ్యాయులు అందరికీ పంపించాం''అని ఆమె వివరించారు.
అయితే, వీటిని విద్యార్థులకు ఎలా చేరవేయాలో తెలియడంలేదని తెలంగాణ, మహబూబాబాద్‌లోని చోక్లా తండా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు చుంచు శ్రీశైలం అన్నారు.
''వర్క్‌షీట్లు పంపించారు. వాటిని బాగా తయారుచేశారు. అయితే వీటిని పిల్లలకు ఇవ్వాలంటే ప్రింటౌట్లు తీయాలి. లేదా డిజిటల్ రూపంలో పంపించాలి. ఇక్కడ 60 శాతం మందికే స్మార్ట్‌ఫోన్లు ఉన్నట్లు లెక్కల్లో తెలిసింది. అయితే అవి కూడా తల్లిదండ్రుల దగ్గర ఉంటాయి. వీరు ఫోన్లు పట్టుకొని పనికి వెళ్లిపోతారు''
''ప్రింటౌట్లు తీయడమనేది ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. ఒక్కో సబ్జెక్టుకు 80 పేజీల వరకూ వర్క్‌షీట్‌లో ఉన్నాయి. ఒక్కో క్లాసులో 20 మంది వరకు ఉంటారు. నాలుగు సబ్జెక్టులకూ ఇన్నేసి పేజీలు ఇవ్వాలంటే చాలా కష్టం. ఎందుకంటే మాకు ఏడాదికి ఖర్చు పెట్టేందుకు రూ.15,000 మాత్రమే ఇస్తారు. స్వాతంత్ర్య, గణతంత్ర దినోత్సవాలకు జెండా ఎగురవేసేందుకు, పారిశుద్ధ్య పనులకు ఈ మొత్తం ఖర్చవుతోంది''.
''ఇక్కడ చాలా మంది పిల్లలు పుస్తకాలు కొనుక్కోవడానికే డబ్బులుండవు. ఇక డిజిటల్ విద్య అంటే గగనమే''

లోపం ఎక్కడుంది?
ప్రధానోపాధ్యాయుడు శ్రీశైలం చెప్పిన అంశాలతో తాను ఏకీభవిస్తున్నట్లు సెంటర్ ఫర్ ఎడ్యుకేషన్ అండ్ సోషల్ స్టడీస్ (సీఈఎస్ఎస్) మాజీ అధిపతి, విద్యా హక్కుల నిపుణుడు నారాయణ, విద్యావేత్త రమేశ్ పట్నాయక్ వివరించారు.
‘‘తెలంగాణలో మధ్నాహ్య భోజన పథకం నిలిపివేయడంతో మిగిలిన నిధులను వర్క్‌షీట్ల ప్రింటింగ్‌కు, ఆన్‌లైన్ ఎడ్యుకేషన్‌కు వాడుండాలి. చాలా ప్రైవేటు స్కూళ్లు ఏప్రిల్ నుంచే బోధన మొదలుపెట్టాయి. ప్రభుత్వ పాఠశాలలు మాత్రం ఇప్పుడిప్పుడే ఆన్‌లైన్ క్లాసులు ప్రారంభిస్తున్నాయి. దీంతో రెండు వర్గాల విద్యార్థుల మధ్య వ్యత్యాసం మరింత పెరుగుతోంది’’అని నారాయణ అన్నారు.
మరోవైపు వర్క్‌షీట్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు తాంబులాలు ఇచ్చాం తన్నుకు చావండి అనేటట్లుగా వ్యవహరిస్తున్నాయని విద్యావేత్త రమేశ్ పట్నాయక్ వ్యాఖ్యానించారు.
‘‘విద్య వ్యాపారంగా మారినప్పటి నుంచి ప్రైవేటు, ప్రభుత్వం పేరుతో విద్యార్థులు రెండు వర్గాలుగా విడిపోయారు. ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ ఈ వ్యత్యాసాన్ని మరింత పెంచుతోంది’’అని ఆయన వివరించారు.
''1వ తరగతి నుంచి ఆరో తరగతి వరకు 18 లక్షల వర్క్ బుక్స్‌ను ప్రచురించాం. వాటిని స్కూళ్లకు పంపించాం. వాటిని పిల్లలు ఉపయోగిస్తున్నారు కూడా. ఏడో తరగతి నుంచి పదో తరగతి పిల్లలకు కూడా వర్క్ బుక్స్‌ను ప్రచురించాం. అవి రావట్లేదని ఎవరు చెబుతున్నారో అర్థం కావట్లేదు. నేను గ్రామాలకు వెళ్లి చూశాను. అక్కడ విద్యార్థులు వర్క్‌బుక్స్‌ను ఉపయోగిస్తున్నారు''అని ఆంధ్రప్రదేశ్ విద్యా శాఖ కమిషనర్ చిన వీరభద్రుడు చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్ లక్షణాలు: ఏమిటి? ఎలా గుర్తించాలి? నన్ను నేను ఎలా కాపాడుకోవాలి?
- న్యూజీలాండ్‌లో 'జీరో' కరోనావైరస్ కేసులు ఎలా సాధ్యమయ్యాయి?
- భారత్ - చైనా ఉద్రిక్తతలు: లద్దాఖ్‌లో క్షణక్షణం... భయం భయం
- 'ప్రేమించి గర్భవతి అయిన కూతురిని తల్లిదండ్రులే చంపేశారు'
- నా కళ్లతో చూశాను.. ఒక్కొక్కరు చనిపోతుంటే బోటులోంచి సముద్రంలోకి విసిరేశారు
- అమెరికా అంతటా విస్తరిస్తున్న ఆగ్రహ జ్వాలలు - ‘‘ఊపిరి ఆడటం లేదు... చచ్చిపోతున్నాం’’
- నేను స్మోకింగ్ ఎలా మానేశానంటే: ‘పొగంగేట్రం’ నుంచి ఉపసంహారం దాకా
- కరోనావైరస్: ముంబయి మహానగరాన్ని కోవిడ్-19 ఎలా ధ్వంసం చేసింది
- స్వాల్బార్డ్‌కి సుస్వాగతం: ఇది అందరిదీ.. వీసా లేకున్నా ఎవరైనా రావొచ్చు, ఉండొచ్చు
- ఓ వైపు యుద్ధం - మరోవైపు కరోనావైరస్.. తీవ్ర ప్రమాదంలో కామెరూన్ ప్రజలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








