ఉత్తరప్రదేశ్ టీచింగ్ స్కాం: ఒకేసారి పాతిక స్కూళ్లలో పనిచేసినట్టు చూపి కోటి జీతం-వాటే ఐడియా టీచర్జీ!

ఫొటో సోర్స్, ASHOK SHARMA
- రచయిత, సమీరాత్మజ్ మిశ్రా
- హోదా, బీబీసీ కోసం
ఉత్తరప్రదేశ్ ప్రాథమిక విధ్యా విభాగాన్ని మోసగించారనే ఆరోపణలతో 25 స్కూళ్లలో ఒకే సమయంలో చదువు చెప్పిన అనామికా శుక్లా అనే ఒక టీచర్ శనివారం కాస్‌గంజ్‌లో అరెస్టు చేశారు.
ఈ మోసానికి సంబంధించి ప్రాథమిక విద్యా విభాగం అనామిక శుక్లాకు నోటీసులు పంపింది. కానీ ఆ నోటీసులకు సమాధానం ఇవ్వడానికి బదులు ఆమె రాజీనామా ఇవ్వడానికి వెళ్లారు. అక్కడ పోలీసులు ఆమెను అరెస్టు చేశారు.
కాస్‌గంజ్, ప్రాథమిక విద్యాధికారి పరిధిలో కేసు నమోదు కావడంతో అనామికా శుక్లాను అరెస్ట్ చేశామని పోలీసులు చెప్పారు.
అయితే, అరెస్టు చేసిన అనామికా శుక్లా, మోసం చేసిన అనామికా శుక్లా ఒకరేనా లేక వేరు వేరా అనే విషయంలో ఇంకా స్పష్టత రాలేదు.
దీనిపై బీబీసీతో మాట్లాడిన కాస్‌గంజ్ ప్రాథమిక విద్యా అధికారి అంజలి అగ్రవాల్ “ఈ విషయం వెలుగులోకి వచ్చిన తర్వాత అనామికా శుక్లా అనే ఈ టీచర్‌కు నోటీసులు పంపించాం. శనివారం ఆమె ఒక వ్యక్తి ద్వారా తన రాజీనామా పంపించారు. అతడిని అడిగితే, ఆమె కూడా వచ్చారని, మా ఆఫీసు బయటే ఉన్నారని తెలిసింది. దాంతో మేం పోలీసులకు సమాచారం ఇచ్చాం. తర్వాత వారు ఆమెను అరెస్టు చేశారు” అని చెప్పారు.
అరెస్ట్ తర్వాత అక్కడ ఉన్న మీడియాతో మాట్లాడిన టీచర్ తన పేరు అనామిక సింగ్ అని చెప్పారు. తర్వాత పోలీసులకు వేరే పేర్లు చెప్పారు. అయితే, పోలీసులు ప్రస్తుతం ఆమెను విచారిస్తున్నారు.
ఒకేసారి ఎక్కువ ప్రాంతాల్లో ఉద్యోగం చేసినట్లు మోసం చేయడం ద్వారా, ఒకే ఏడాదిలో దాదాపు కోటి రూపాయల జీతం తీసుకున్నారని అనామికా శుక్లాపై ఆరోపణలు ఉన్నాయి.

ఫొటో సోర్స్, ASHOK SHARMA
చేరి ఏడాదిన్నరే అయ్యింది
అరెస్టు చేసిన అనామికా శుక్లా కాస్‌గంజ్ జిల్లా ఫరీద్‌పూర్ కస్తూర్బా విద్యాలయలో సుమారు ఏడాదిన్నర నుంచీ సైన్స్ టీచర్‌గా ఉన్నారు.
శుక్రవారం ప్రాథమిక విద్యాధికారి అంజలి అగ్రవాల్ ఆమె జీతం విత్‌డ్రా చేసుకోకుండా అడ్డుకుంటూ నోటీసులు జారీ చేశారు. కస్తూర్బా విద్యాలయాల్లో టీచర్లను కాంట్రాక్టు పద్ధతిలో నియమిస్తారు. ప్రతి నెలా ఆమెకు 30 వేల రూపాయల జీతం వచ్చేది.
ప్రాథమిక విద్యా విభాగం టీచర్ల డేటాబేస్‌ను సిద్ధం చేయడం ప్రారంభించడంతో ఈ బండారం బయటపడింది. అనామికా శుక్లా పేరు 25 స్కూళ్ల జాబితాలో టీచరుగా కనిపించింది.
ఈ సమాచారం తెలీగానే ప్రాథమిక విద్యా విభాగంలో కలకలం రేగింది. వెంటనే మొత్తం జరిగినదానిపై దర్యాప్తు చేయాలని ఆదేశించారు. అనామికా శుక్లా పేరుతో ఉన్న పత్రాల్లో, ఆమె అమేఠీ, అంబేడ్కర్ నగర్, రాయ్‌బరేలీ, ప్రయాగరాజ్, అలీగఢ్ సహా ఒకేసారి 25 స్కూళ్లలో టీచరు ఉద్యోగం చేసినట్లు ఉండడం గుర్తించారు.
అనామికా శుక్లాకు గత 13 నెలలుగా 25 కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల నుంచి సుమారు ఒక కోటి రూపాయల గౌరవ వేతనం చెల్లించారు.

ఫొటో సోర్స్, ASHOK SHARMA
మొత్తం డబ్బు ఒకరి దగ్గరికే చేరిందా?
అయితే ఈ డబ్బంతా ఒకే బ్యాంక్ అకౌంటులో పడిందా లేక వేరు వేరు ఖాతాల్లోకి చెల్లింపులు జరిగాయా అనేది ఇంకా స్పష్టం కాలేదు. ప్రస్తుతానికి దీనిపై దర్యాప్తు జరుగుతోంది.
“వేతనం అయితే ఈ విద్యాలయం నుంచే తీసుకుంటున్నారు. మిగతా ప్రాంతాల్లో ఇదే పేరుతో పనిచేస్తున్న టీచర్ల వేతనం కూడా ఆమె అకౌంటులోకే వచ్చిందా, లేదా అనేది తెలుసుకోడానికి ప్రయత్నిస్తున్నాం. 25 ప్రాంతాల్లో పనిచేస్తున్నట్లు పత్రాల్లో ఉన్న అనామికా శుక్లా ఈమేనా, లేక ఆ పేరుతో వేరే ఎవరైనా ఉన్నారా? అనేది కూడా తెలుసుకుంటున్నాం. మాకు ఆన్‌లైన్ వెరిఫికేషన్ సమయంలో లభించిన డాక్యుమెంట్స్ లో ఆధార్ కార్డు మీద ఆమె పేరు ఒక్కటే ఉంది. తండ్రి పేరు కూడా ఒకటే ఉంది. డాక్యుమెంట్స్ లో ఉన్న ఫొటో చాలా మసకగా ఉంది” అని కాస్‌గంజ్ బీఎస్ఏ అంజలి అగ్రవాల్ చెప్పారు.
అరెస్ట్ తర్వాత అనామికా శుక్లా మీడియాతో మాట్లాడుతూ ఉద్యోగం పొందడానికి ఒక వ్యక్తి తనకు సాయం చేశాడని, అతడు తనకు లక్ష రూపాయలు కూడా ఇచ్చాడని చెప్పారు.
కాస్‌గంజ్‌లో స్థానిక జర్నలిస్ట్ అశోక్ శర్మ “ఈమె మోసం చేసిందని ఆరోపణలు వస్తున్న ఆ అనామికా శుక్లా కాకపోతే, నోటీసులకు సమాధానం ఇవ్వకుండా రాజీనామా ఎందుకు చేయాలని అనుకుంటుంది” అంటున్నారు.
అయితే ప్రాథమిక విద్యా అధికారికి వాట్సాప్ ద్వారా ఎవరో అనామికా శుక్లా పేరుతో పంపిన రాజీనామా శుక్రవారం రాయ్‌బరేలీలో చర్చనీయాంశమైంది. కానీ దానిని అధికారికంగా ధ్రువీకరించడానికి ఎలాంటి సోర్సు లేకుండాపోయింది.
ప్రాథమిక విద్యా విభాగంలోని కొంతమంది కుమ్మక్కై ఇది చేసుండవచ్చని, ఎందుకంటే ఎవరైనా ఒక టీచర్ ఒంటరిగా ఇంత పెద్ద ఫ్రాడ్ చేయలేరని సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
ఈ మోసం గురించి తెలీగానే కేసు నమోదు చేయాలని, దోషులు ఎవరో తెలుసుకోడానికి కఠిన దర్యాప్తు చేయాలని ప్రాథమిక విద్యా మంత్రి సతీష్ ద్వివేది ఆదేశించారు.
ఇక అరెస్టైన అనామికా శుక్లా విచారణ పూర్తి అయ్యాకే అసలు విషయం వెలుగులోకి రానుంది.
ఇవి కూడా చదవండి:
- నా కళ్లతో చూశాను.. ఒక్కొక్కరు చనిపోతుంటే బోటులోంచి సముద్రంలోకి విసిరేశారు
- అమెరికా అంతటా విస్తరిస్తున్న ఆగ్రహ జ్వాలలు - ‘‘ఊపిరి ఆడటం లేదు... చచ్చిపోతున్నాం’’
- కరోనావైరస్లో వందల సంఖ్యలో కొత్త మ్యుటేషన్లు: పరిశోధనలో ఉన్న వ్యాక్సీన్లు పనికి రాకుండా పోతాయా?
- నేను స్మోకింగ్ ఎలా మానేశానంటే: ‘పొగంగేట్రం’ నుంచి ఉపసంహారం దాకా
- కరోనావైరస్: ముంబయి మహానగరాన్ని కోవిడ్-19 ఎలా ధ్వంసం చేసింది
- స్వాల్బార్డ్‌కి సుస్వాగతం: ఇది అందరిదీ.. వీసా లేకున్నా ఎవరైనా రావొచ్చు, ఉండొచ్చు
- రెండో ప్రపంచ యుద్ధంలో బాంబుదాడుల నుంచి బతికి బయటపడ్డ మొసలి ఇప్పుడు మృతి
- జాక్ మా: కరోనావైరస్ను కట్టడి చేయాలని, చైనా ప్రతిష్ఠను పునరుద్ధరించాలని ప్రయత్నిస్తున్న మహా కోటీశ్వరుడు
- ఓ వైపు యుద్ధం - మరోవైపు కరోనావైరస్.. తీవ్ర ప్రమాదంలో కామెరూన్ ప్రజలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








