కరోనావైరస్: ‘దేవతలు శపిస్తే కరోనా కంటే పెద్ద విపత్తు వస్తుంది’.. నేపాల్ మత పెద్దల హెచ్చరికలు

ఫొటో సోర్స్, Reuters
- రచయిత, ఫణీంద్ర దహల్
- హోదా, బీబీసీ నేపాలీ, కఠ్‌మాండూ
కరోనావైరస్ భయంతో వందల ఏళ్ల నాటి ఆచారాలు మానుకోవడం, పండుగలు జరుపుకోకపోవడంపై అక్కడి మతపెద్దలు రుసరుసలాడుతున్నారు.
దైవాగ్రహం వల్ల దేశానికి విపత్తు కలగొచ్చని కొందరు మతపెద్దలు హెచ్చరించారు.
అక్టోబరు, నవంబరు నెలల్లో రానున్న పెద్ద పండగలు దశాయి(దసరా), తిహార్(దీపావళి)కి ముందు కోవిడ్ నిబంధనలు సడలించే అవకాశాలు ఉండకపోవచ్చని అధికారులు చెబుతున్నారు.
హిందూ, బౌద్ధ సంస్కృతులు, జీవన శైలులు ఉన్న నేపాల్‌లో ఈ కరోనా కాలంలో కొన్ని పండుగలు వచ్చాయి. అయితే, రాజధాని కఠ్‌మాండూ సహా దేశంలోని అన్ని ప్రాంతాల్లో ఈ పండుగల సందర్భంగా వివిధ దేవతలకు నిర్వహించే రథయాత్రలు, ఇతర సంప్రదాయ వేడుకలను రద్దు చేయడమో లేదంటే పరిమితంగా చేయడమో జరిగింది.

ఫొటో సోర్స్, BikramVajracharya
గత నెలలో.. దక్షిణ కఠ్‌మాండూలోని ఇంద్ర జాతర రథ యాత్ర సందర్భంగా ప్రజలు లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించడంతో గొడవలు జరిగాయి. ఆ తరువాత పోలీసుల సమక్షంతో తక్కువ మందితో రథయాత్ర నిర్వహించారు.
పంటల దేవుడిగా కొలిచే రథో మచ్ఛీంధ్రనాథ్ రథయాత్రకు నేతృత్వం వహించే ప్రధాన పూజారి కపిల్ వజ్రాచార్య మాట్లాడుతూ.. మతపరమైన కార్యకలాపాలను నియంత్రించడం ప్రభుత్వ బాధ్యతారాహిత్యమని ఆరోపించారు.
''వందల ఏళ్లుగా మా కుటుంబం ఈ పూజలు చేస్తోంది. ఇప్పుడు నేను రథయాత్ర చేయడానికి అనుమతి దొరక్కపోవడం బాధగా ఉంది. నాకు తెలిసి ఇంతకుముందు ఎన్నడూ ఈ రథయాత్ర రద్దవ్వలేదు'' అన్నారు కపిల్.
''దేవతలకు పవిత్రమైన స్థలం నేపాల్. దేవతలు కానీ ఆగ్రహిస్తే మనం కరోనావైరస్ కంటే పెద్ద సమస్యల్లో చిక్కుకుంటాం. మతంపై నేపాల్ ప్రభుత్వం విధిస్తున్న నియంత్రణలను నేను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాను'' అన్నారాయన.

ఫొటో సోర్స్, BishalKarmacharya
''నేపాల్ ప్రభుత్వం ప్రజల మత విశ్వాసాలు దెబ్బతీసేలా నిర్ణయాలు తీసుకుంటోంది. మతాచారాలు పాటించకపోతే చెడు జరుగుతుందని నేను నమ్ముతాను'' అన్నారు పటాన్‌కు చెందిన 38 ఏళ్ల వ్యాపారి బాబురాజా జ్యాపు.
''పెద్దవాళ్లంతా ఆధ్యాత్మిక ప్రదేశాలకు వెళ్లాలని చాలా ఆశతో ఉన్నారు. ప్రభుత్వం కనుక నియంత్రణలను ఇలాగే కొనసాగిస్తే ప్రజలకు మానసిక సమస్యలు రావడం ఖాయం'' అన్నారాయన.
అయితే చాలామంది మతపెద్దలు, కమ్యూనిటీ లీడర్లు మాత్రం ఈ ఏడాది ఇలాంటి పరిస్థితి తప్పదని.. కరోనావైరస్ రాకుండా జాగ్రత్తలు పాటిచారు, సురక్షితమే అనుకున్న తరువాతే ఎలాంటి మత సంబంధిత కార్యక్రమాలైనా, పండుగలైనా జరుపుకోవాలని అంటున్నారు.
సైన్స్‌ను పాటించండి
కఠ్‌మాండూలోని పాలస్ స్క్వేర్ సమీపంలోని ప్రత్యేక ఆలయంలో ఉండే 'సజీవ దేవత' కుమారి ఆధ్యాత్మిక వ్యవహారాలు చూసే గౌతమ్ శాఖ్య మాట్లాడుతూ కోవిడ్ ప్రోటోకాల్‌కు కట్టుబడి ఉన్నామని.. ఈ ఏడాది వేడుకలు పెద్ద ఎత్తున జరిగే అవకాశాలు లేవని అన్నారు.
''దసరా సందర్భంగా తలేజు ఆలయంలో ఎనిమిది రోజుల పాటు జరగాల్సిన ఉత్సవాల్లో కుమారి అమ్మవారు పాల్గొనడం గురించి మేం ఇంకా ప్రభుత్వంతో మాట్లాడాల్సి ఉంది. గతంలో మాదిరిగా కాకుండా ఈసారి జనం ఉండకపోవచ్చు. అయినప్పటికీ కుమారి అమ్మవారిని ఆలయంలోకి తీసుకెళ్లి రిస్క్ చేయాలనుకోవడం లేదు'' అన్నారు.
''పూజలు సరిగా చేయకపోయినా, ఆచారాలు పాటించకపోయినా చెడు జరుగుతుందని చాలామంది ఆందోళన చెందుతున్నారు. కానీ మనం వాస్తవంలో జీవించాలి. మనం జీవించి ఉంటేనే ఈ పండుగలు, ఆచారాలు అన్నీ నిర్వహించగలం, భవిష్యత్ తరాలకు అందేలా సంస్కృతిని కాపాడుకోగలం'' అన్నారు.
హిందూ దేవత దుర్గాదేవి పునరవతారంగా విశ్వసిస్తూ కుమారి అమ్మవారిని హిందువులు, బౌద్ధులు కూడా పూజిస్తారు.
''లాక్‌డౌన్ అమలులోకి వచ్చినప్పటి నుంచి ఆమెను దర్శించడానికి ఎవరినీ అనుమతించలేదు. మేం నిత్యం పూజాదికాలు జరుపుతున్నాం. కుమారి అమ్మవారి నివాసంలోనూ నిత్య పూజలు జరుగుతున్నాయి'' అన్నారు గౌతమ్.
అమ్మవారి నివాసం 'కుమారి ఘర్'లో ఆమె కోవిడ్ ప్రమాణాల ప్రకారం శానిటైజర్లు వాడుతున్నారని, మాస్క్ ధరిస్తున్నారని గౌతమ్ చెప్పారు.

ఫొటో సోర్స్, keshav p koirala
ప్రజలు పండుగలు, ఆచారాలు గురించి మాట్లాడడం కంటే సైన్స్ ప్రకారం నడుచుకోవడం మంచిదని నేపాల్ సాంస్కృతిక ఐకాన్ సత్య మోహన్ జోషి అన్నారు.
సంస్కృతికి సంబంధించిన అంశాలపై గట్టి పట్టున్న 101 ఏళ్ల జోషి మాట్లాడుతూ గతంలో మహమ్మారులను దేవతల శాపంగా భావించేవారు అన్నారు.
''కఠ్‌మాండూలో ప్రజలు తమ పాపాలు తొలగించాలంటూ ప్రార్థనలు చేస్తారు, నైవేద్యం సమర్పిస్తారు. కానీ, ఇప్పుడది పాతబడిన ఆలోచన.
ప్రార్థనలు చేయడం, సంతర్పణలు పెట్టడం పేరుతో రిస్క్ చేయలేం. అవన్నీ కోవిడ్ వ్యాప్తికి కారణం కావొచ్చు. మన ఆరోగ్య వ్యవస్థను, ఆర్థిక వ్యవస్థను కూడా ఇది దెబ్బతీస్తుంది. అంతర్జాతీయ వైద్యులు చెబుతున్న జాగ్రత్తలు పాటించి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి'' అన్నారు సత్యమోహన్ జోషి.
''ప్రజలను భౌతిక దూరం పాటించాలని.. వ్యక్తిగత క్రమశిక్షణ పాటించాలని ప్రజలను కోరాం'' అన్నారు నేపాల్ హోం మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి చక్ర బహుదూర్ బుద్ధ. ఆయన ప్రభుత్వ నిర్ణయాలను సమర్థించారు.

కారణం ఏదైనా జనం ఒకచోట చేరితే కరోనావైరస్ సోకే ప్రమాదం ఉందని కఠ్‌మాండూలోని దుకాణదారు హరిశంకర్ ప్రజాపతి అన్నారు.
''నేనైతే మొదట ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇస్తాను. మన ఆరోగ్యం బాగులేకపోతే పండుగలు, పూజలు ఇంకెలా చేస్తాం'' అన్నారాయన.
పద్మ శ్రేష్ఠ అభిప్రాయం వేరేలా ఉంది. ''ప్రభుత్వం భయం సృష్టించింది. ప్రజలు కోపంగా ఉన్నారు. వందల ఏళ్ల నాటి ఆచారాలు పాటించకుండా చేయడం వల్ల ప్రజలు మతం, ప్రభుత్వం రెండింటిపైనా విశ్వాసం కోల్పోతారు'' అన్నారాయన.
కఠ్‌మాండూ శివార్లలో ఉపాధ్యాయుడిగా పనిచేసే విశాల్ కర్మాచార్య మాట్లాడుతూ భద్రతా ప్రమాణాలు పాటిస్తూ పండుగలు జరుపుకొనే అవకాశమివ్వాలన్నారు.
''దేవుడే మన శక్తి. దేవుళ్లు, దేవతలకు చేయాల్సిన పూజలు చేయకపోతే నష్టం జరగొచ్చు'' అంటున్నారు కర్మాచార్య.
సెప్టెంబరు 30 నాటికి నేపాల్‌లో 78 వేల కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 500 మంది కోవిడ్ కారణంగా మరణించారు.
పండుగల సందర్భంగా ప్రజలు సొంతూళ్లకు చేరుకోవడానికి ప్రయాణాలు చేయడం వల్ల వైరస్ మరింత వ్యాపించొచ్చన్న ఆందోళనలున్నాయి.
ఇవి కూడా చదవండి:
- చైనా - రష్యా దేశాలు అమెరికన్ డాలర్‌కు చెక్ పెడుతున్నాయా... డాలర్ పడిపోతే ఎవరికి నష్టం, ఎవరికి లాభం?
- రియా చక్రవర్తిపై బిహార్ డీజీపీ గుప్తేశ్వర్ పాండే వ్యాఖ్యలపై దుమారం
- కరోనావైరస్తో విలవిల్లాడిన వూహాన్ నగరంలో ఇప్పుడు అంబరాన్నంటే సంబరాలు
- వాట్సాప్: అప్డేట్, బ్యాకప్, 2FA, ప్రైవసీ ఫీచర్లను వాడుకోవడం ఎలా?
- ఆనందం కోసం 'సెక్స్'ను ఆశ్రయించకుండా మహిళలు నిగ్రహం పాటించాలని గాంధీ ఎందుకన్నారు?
- వేసవి ఉష్ణోగ్రత 50C చేరితే మన శరీరానికి ఏమౌతుంది?
- తండ్రి అమ్మేశాడు... ముగ్గురితో పెళ్లి... ముగ్గురు పిల్లలు... 16 మంది అత్యాచార నిందితులు
- మనుషులు చేరలేని మహాసముద్రాల లోతుల్లో ప్లాస్టిక్ సంచులు, చాక్లెట్ రేపర్లు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








