భార‌త్‌-నేపాల్‌ సరిహద్దు వివాదం: పది గజాల స్థలం కోసం మొదలైన వివాదం - బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్‌

బిహార్ నేపాల్

ఫొటో సోర్స్, Neeraj priyadarshy

    • రచయిత, నీర‌జ్ ప్రియ‌ద‌ర్శి
    • హోదా, బీబీసీ కోసం

"త‌రాలు గ‌డిచాయి. మేం చిన్న పిల్ల‌ల నుంచి ముస‌లివాళ్లం అయిపోయాం. కానీ ఈ ప్రాంతం రెండు దేశాల మ‌ధ్య స‌రిహ‌ద్దని మేం ఎప్పుడూ అనుకోలేదు. ఇటువైపు వాళ్లు అటు, అటువైపు వాళ్లు ఇటు.. వ‌స్తూ పోతూ ఉంటారు. వారి మ‌ధ్య వ్యాపార సంబంధాలూ ఉన్నాయి. నేడు అన్ని ముగిసిపోయాయి. రాక‌పోక‌లు ఎలాగో స్తంభించిపోయాయి. ఇప్పుడు మాట‌లు కూడా లేకుండా పోయాయి. ఒక‌రినొక‌రు శ‌త్రువుల్లా చూసుకుంటున్నారు."

రెండు దేశాల మ‌ధ్య స‌రిహద్దు వివాదంపై... బిహార్‌లోని మోతిహా‌రి న‌గరానికి 47 కి.మీ.ల దూరంలోని భార‌త్‌-నేపాల్ స‌రిహ‌ద్దుకు స‌మీపంలోని గువాబాడీ గ్రామ కురు వృద్ధుడు ల‌క్ష్మీ ఠాకుర్.. బీబీసీతో మాట్లాడారు.

బిహార్‌లోని తూర్పు చంపార‌న్ స‌రిహ‌ద్దుల్లో లాల్‌ బ‌కేయా న‌ది ప‌రివాహ‌క ప్రాంతంలో భార‌త్ చేప‌డుతున్న ఓ క‌ట్ట నిర్మాణంపై నేపాల్ అభ్యంత‌రం వ్యక్తంచేసింది. త‌మ భూభాగంపై భార‌త్ నిర్మిస్తోంద‌ని నేపాల్ ఆరోపించింది. వివాదం న‌డుమ ఈ నిర్మాణం ప‌నులు ఆగిపోయాయి.

"క‌ట్ట‌కు సంబంధించి 99 శాతం ప‌నులు పూర్త‌య్యాయి. అయితే నేపాల్ అభ్యంత‌రం వ్య‌క్తం చేయ‌డంతో మిగిలిన ప‌నులు మ‌ధ్య‌లోనే ఆపేయాల్సి వ‌చ్చింది. సరిహద్దు స్తంభాలు అటూ ఇటూ కావ‌డం వ‌ల్ల వివాదం చెల‌రేగింది." అని తూర్పు చంపార‌న్ జిల్లా అధికారి క‌పిల్ అశోక్.. బీబీసీతో చెప్పారు.

"స్థానిక స్థాయిలో వివాదాన్ని ప‌రిష్క‌రించేందుకు మేం తొలుత చాలా ప్ర‌య‌త్నించాం. కానీ ఫ‌లితం ద‌క్క‌లేదు. ఇప్పుడు మ‌ళ్లీ కొత్త స‌ర్వే చేప‌ట్టాలి. ఇది అంత‌ర్జాతీయ స‌రిహ‌ద్దుకు సంబంధించిన అంశం. అందుకే దీనికి సంబంధించిన స్థితిగ‌తుల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు రాష్ట్ర‌, కేంద్ర ప్ర‌భుత్వాల‌కు తెలియ‌జేస్తున్నాం. దీనిపై వారే నిర్ణ‌యం తీసుకుంటారు."అని అశోక్ వివ‌రించారు.

భారత్ నేపాల్

ఫొటో సోర్స్, Neeraj priyadarshy

ఫొటో క్యాప్షన్, వ‌ర‌ద నీటిని నియంత్రించే చ‌ర్య‌ల్లో భాగంగా ఈ క‌ట్ట‌కు ప్ర‌స్తుతం మ‌రమ్మ‌తులు నిర్వ‌హిస్తున్నారు.

లిపులేఖ్‌, లిపియాధురా, కాలాపానీల‌ను త‌మ భూభాగంలో క‌లిపి చూపిస్తూ రూపొందించిన కొత్త మ్యాప్‌కు నేపాల్ పార్ల‌మెంటు జూన్ 13న ఆమోదం తెల‌ప‌డంతో ఈ తాజా వివాదం చెల‌రేగింది.

కొత్త మ్యాప్‌తోపాటు కొత్త పౌర‌స‌త్వ చ‌ట్టానికీ నేపాల్ పార్ల‌మెంటు ఆమోదం తెలిపింది. దీంతో గొప్ప‌గా చెప్పుకొనే రోటీ-బేటీ సంబంధాలు దెబ్బ‌తిన్నాయి. ఇది కూడా రెండు దేశాల మ‌ధ్య వివాదాల‌ను మ‌రింత పెంచింది. కొత్త చ‌ట్టం ప్ర‌కారం.. నేపాల్ పౌరుణ్ని పెళ్లిచేసుకున్న భార‌త యువ‌తికి.. నేపాల్‌లో ఏడేళ్లు ఉంటేనే పౌర‌స‌త్వం ల‌భిస్తుంది.

తూర్పు చంపార‌న్‌లో లాల్ బ‌కేయా న‌ది ప‌రివాహ‌క ప్రాంతంలో జ‌రుగుతున్న క‌ట్ట నిర్మాణం ప‌నులు జూన్ 15 నుంచి ఆగిపోయాయి.

ఇక్క‌డ‌ ప‌నుల‌ను వెంట‌నే ఆపేయాల‌ని బిహార్‌లోని జ‌ల వ‌న‌రుల శాఖ ఇంజినీర్ ర‌న్‌బీర్ ప్ర‌సాద్‌కు నేపాల్‌కు చెందిన రౌతాహ‌ట్ జిల్లా సీడీవో బ‌సుదేవ్‌ ఘిమ్రే చెప్పిన‌ట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా ఓ వార్త ప్ర‌చురించింది. బ‌సుదేవ్‌, భ‌ద్ర‌తా అధికారుల‌తో క‌లిసి ఘ‌ట‌న స్థలానికి వ‌చ్చిన‌ట్లు పేర్కొంది.

స‌రిహద్దు స్తంభాలు 346/6, 346/7ల మ‌ధ్య ఈ క‌ట్ట నిర్మాణం జ‌రుగుతోంద‌ని, ఇది "నో మ్యాన్స్ ల్యాండ్" అని నేపాల్ అధికారులు చెబుతున్నారు.

బుధ‌వారం మ‌ధ్యాహ్నం మేం అక్క‌డికి చేరుకునే స‌రికే క‌ట్ట నిర్మాణం ఆగిపోయింది. ఈ క‌ట్ట‌ 2.5 కి.మీ. పొడ‌వుంది.

ప్ర‌స్తుతం ప‌నులు ఆగిపోయిన ప్రాంతానికి ఒక‌వైపు భార‌త్‌కు చెందిన బ‌లువా గువాబాడీ, మ‌రోవైపు నేపాల్‌కు చెందిన బంజ్‌రాహా గ్రామాలు ఉన్నాయి.

గువాబాడీ గ్రామం క‌ట్ట‌కు చాలా ద‌గ్గ‌ర‌గా ఉంది. క‌ట్ట‌కు ఆనుకొని కొన్ని ఇళ్లు కూడా ఉన్నాయి. క‌ట్ట‌పై తాళ్ల‌తో క‌ట్టేసిన‌ కొన్ని ప‌శువులూ క‌నిపిస్తాయి.

బిహార్ నేపాల్

ఫొటో సోర్స్, Neeraj priyadarshy

ఫొటో క్యాప్షన్, స‌రిహద్దుకు 9.1 మీట‌ర్లు అటూ, 9.1 మీట‌ర్ల‌కు ఇటూ ఉన్న ప్రాంతాన్ని నో మ్యాన్స్ ల్యాండ్‌గా ప‌రిగ‌ణిస్తారు.

మ‌రోవైపు నేపాల్‌కు చెందిన బంజ్‌రాహా.. స‌రిహ‌ద్దుకు కొంచెం దూరంలో ఉంది. నో మెన్స్ ల్యాండ్‌కు దాదాపు 25 మీట‌ర్ల దూరంలో దుకాణాలు, ఇళ్లు క‌నిపిస్తున్నాయి.

నిబంధ‌న‌ల ప్రకారం.. స‌రిహద్దుకు 9.1 మీట‌ర్లు అటూ, 9.1 మీట‌ర్ల‌కు ఇటూ ఉన్న ప్రాంతాన్ని నో మ్యాన్స్ ల్యాండ్‌గా ప‌రిగ‌ణిస్తారు.

స‌రిహ‌ద్దుల‌పై స్తంభాల‌ను వేశారు. కానీ త‌మ‌ద‌ని నేపాల్‌ చెబుతున్న ప్రాంతంలో స్తంభం ఉండాల్సిన చోట లేదు.

"నేపాల్ ప‌రిపాల‌నా విభాగం అభ్యంత‌రాలు లేవ‌నెత్తిన వెంట‌నే రెండు దేశాల స్థానిక‌ ప్ర‌తినిధులు సంయుక్తంగా స‌ర్వే చేప‌ట్టారు. అప్పుడు వివాదం స‌ద్దు మ‌ణిగింది. లాక్‌డౌన్ త‌ర్వాత ప‌నులు మొద‌లుపెట్టిన‌ప్పుడు నేపాల్ మ‌ళ్లీ అభ్యంత‌రాలు వ్య‌క్తం చేసింది. దీంతో ప‌నులు ఆపేయాల్సి వ‌చ్చింది." అని అశోక్ వివ‌రించారు.

నేపాల్ చెబుతున్న‌ట్లుగా నో మ్యాన్స్ ల్యాండ్లో ఈ క‌ట్ట నిర్మాణం జ‌రుగుతోందా?

"దీని గురించి నేనేమీ చెప్ప‌లేను. స‌ర్వే పూర్తయితే అన్ని విష‌యాలు తెలుస్తాయి." అని అశోక్ వివ‌రించారు.

అయితే తొలి ద‌శ‌లో స్థానిక స్థాయిలో చేప‌ట్టిన స‌ర్వే ప్ర‌కారం.. స‌రిహ‌ద్దుల్లో స్తంభాలు లేక‌పోవ‌డంతో ఏర్పాటుచేసిన‌ వెదురు క‌ర్ర‌లు క‌ట్ట‌కు 9.1 మీట‌ర్ల కంటే త‌క్కువ దూరంలోనే ఉన్నాయి.

"ఇక్క‌డి నుంచి ప‌ది గజాలు కొల‌వండి. మీకు రెండు గ‌జాలు అటూఇటూగా ఉంటుంది. గ‌తంలో కొన్ని సార్లు వ‌ర‌ద‌లు వ‌చ్చాయి. దీంతో స్తంభాలు అటూఇటూ అయ్యుంటాయి. గ్రామ ప్ర‌జ‌ల భూ వివాదం అయ్యుంటే ఎప్పుడో స‌ద్దుమ‌ణిగేది. కానీ ఇది దేశాల మ‌ధ్య స‌రిహ‌ద్దు వివాదం." అని ల‌క్ష్మీ ఠాకుర్ వ్యాఖ్యానించారు.

భార‌త్ ఒప్పందాన్ని ఉల్లంఘించింది - నేపాల్‌

ప్ర‌స్తుతం నేపాల్‌లోకి భార‌తీయుల‌ ప్ర‌వేశంపై నిషేధం ఉన్న‌ప్ప‌టికీ... స‌రిహ‌ద్దుకు ఇటువైపు భార‌తీయుల‌తో మాట్లాడుతున్న మ‌మ్మ‌ల్ని చూసి స‌రిహ‌ద్దుకు అటువైపు మార్కెట్‌లో కూర్చున్న నేపాలీలు పిలిచారు.

వారు భార‌తీయుల‌తో సంబంధాల గురించి మాట్లాడడం మొద‌లుపెట్టారు. నేపాల్ వైపు వాద‌న‌ను భార‌త్ మీడియా స‌రిగా చూపించ‌డంలేద‌ని వారు ఆరోపించారు.

వారి వాద‌న గురించి మేం అడిగిన‌ప్పుడు.. బంజ్‌రాహా గ్రామ పెద్ద బిగు షా మాట్లాడారు.

"వారు క‌ట్ట నిర్మించుకోవ‌చ్చు. దానితో మాకు ఎలాంటి స‌మ‌స్యాలేదు. అయితే మా వైపు నుంచి కూడా వారు ఆలోచించాలి. ఎందుకంటే వ‌ర్షాకాలంలో వ‌ర‌ద నీరు మావైపు కొట్టుకొస్తే ఏం చేయాలి? ఎక్క‌డికి పోవాలి?"

భారత్ నేపాల్

ఫొటో సోర్స్, Neeraj priyadarshy

ఫొటో క్యాప్షన్, ప‌నులు ఆగిపోయిన ప్రాంతానికి ఒక‌వైపు గువాబాడీ(భార‌త్‌కు), మ‌రోవైపు బంజ్‌రాహా(నేపాల్‌) ఉన్నాయి.

"క‌ట్ట నుంచి నీరు విడుద‌ల చేసేందుకు రెండు పాయ‌లు(ఛానెళ్లు) నిర్మించేందుకు అంగీకారం కుదిరింది. కానీ ఇప్పుడు ఒకటి కూడా నిర్మించ‌లేదు. పైగా క‌ట్ట ఎత్తు చాలా ఎక్కువ‌గా ఉంది. వ‌ర్షాలు ఎక్కువ‌గా ప‌డితే మా ప‌రిస్థితి ఏమ‌వుతుంది?" అని బిగు ప్ర‌శ్నించారు.

ఈ ఒప్పందం, ఛానెళ్ల నిర్మాణంపై మోతిహారి సీనియ‌ర్‌ విలేఖ‌రి చంద్ర‌భూష‌ణ్ పాండే కూడా మాట్లాడారు.

"స్థానిక స్థాయిలో స‌ర్వే చేప‌ట్టిన‌ప్పుడు భూమి విష‌యంలో రెండు వైపులా అంగీకారం కుదిరింది. అయితే ఆ ఒప్పందంలో మ‌రొక విష‌యం కూడా ఉంది. అదేమిటంటే నీటి ప్ర‌వాహం కోసం ఛానెల్ ఏర్పాటు. క‌ట్ట అయితే నిర్మించారు. కానీ ఛానెల్ మాత్రం ఏర్పాటు చేయ‌లేదు. నాకు తెలిసినంత వ‌ర‌కు దీనిపైనే నేపాల్ ఎక్కువ‌గా అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తోంది.గువాబాడీలో స‌రిహ‌ద్దు స్తంభాలు క‌నిపించ‌కుండా పోవ‌డ‌మూ వారికి అవ‌కాశంగా ల‌భించింది."అని ఆయ‌న అన్నారు.

వ‌ర‌ద నీటిని నియంత్రించే చ‌ర్య‌ల్లో భాగంగా ఈ క‌ట్ట‌కు ప్ర‌స్తుతం మ‌రమ్మ‌తులు నిర్వ‌హిస్తున్నారు.

స‌రిహ‌ద్దుల్లో క‌ట్ట నిర్మాణం, మ‌ర‌మ్మ‌తుల‌కు సంబంధించి నేపాల్ ఇలా మూడుచోట్ల‌ అభ్యంత‌రాలు వ్య‌క్తం చేసింద‌ని బిహార్ జ‌ల వ‌న‌రుల శాఖ మంత్రి సంజ‌య్ కుమార్ ఝా వెల్ల‌డించారు.

"ఏటా వ‌ర‌ద నీటి నియంత్ర‌ణ చ‌ర్య‌ల్లో భాగంగా క‌ట్ట‌లకు మ‌ర‌మ్మ‌తు ప‌నులు నిర్వ‌హిస్తుంటారు. కానీ ఇదివ‌ర‌కు నేపాల్ ఎప్పుడూ ఇలా అభ్యంత‌రాలు లేవ‌నెత్త‌లేదు. ఎప్పుడూ ఇలాంటి చ‌ర్య‌లు తీసుకోలేదు."

పూర్వీ చంపారన్

ఫొటో సోర్స్, Neeraj priyadarshy

ఇదివ‌ర‌కు ఇలా వ‌చ్చే అభ్యంత‌రాల‌ను స్థానిక స్థాయిలో అధికారులు చ‌ర్చ‌ల‌తో ప‌రిష్క‌రించేవార‌ని నిపుణులు చెబుతున్నారు.

"ఇలాంటి క‌ఠిన‌మైన వైఖ‌రిని నేపాల్ ఇదివ‌ర‌కెప్పుడూ తీసుకోలేదు. ఈ క‌ట్ట‌ను ఇదివ‌ర‌కే నిర్మించారు. ప్ర‌తి ఏటా వ‌ర‌ద‌ల‌కు ముందుగా మ‌ర‌మ్మ‌తులు జ‌రుగుతుంటాయి." అని స‌రిహ‌ద్దు గ్రామం చంద‌న్‌బారూలో నివ‌సిస్తున్న అక్రమ్‌.. బీబీసీతో చెప్పారు.

ఛానెల్‌ను నిర్మించ‌క‌పోవ‌డం వ‌ల్లే నేపాల్ అభ్యంత‌రాలు వ్య‌క్తంచేస్తున్న‌ట్లు అనిపిస్తోంద‌ని అక్ర‌మం వివ‌రించారు. "వ‌ర‌ద‌ల విధ్వంసం కోసం వారు భ‌య‌ప‌డుతున్నారు. గ‌తంలో వ‌చ్చిన‌ వ‌ర‌ద‌ల్లో ఈ ప్రాంతం మొత్తం మునిగిపోయింది. తాజా క‌ట్ట వ‌ల్ల భార‌త్‌వైపు ప్ర‌జ‌లు సుర‌క్షితంగా ఉండే అవ‌కాశం ఉంది. కానీ ఛానెల్ ఏర్పాటు చేయ‌క‌పోవ‌డంతో నేపాల్ వైపు ప్ర‌జ‌లు ముంపు ముప్పు బారిన ప‌డుతున్నారు."

ఇక్క‌డ ఛానెల్‌ ఎందుకు క‌ట్ట‌ట్లేదు? అని ప్ర‌శ్నించ‌గా.. "ఆ బాధ్య‌త జ‌ల వ‌న‌రుల శాఖ‌పై ఉంది. లాక్‌డౌన్ వ‌ల్ల ప‌నులు ఆగిపోవ‌డంతో ఛానెల్ నిర్మాణం జ‌ర‌గ‌లేదు." అని అశోక్ వివ‌రించారు.

నేపాల్ వైపు ప్ర‌జ‌లు మాతో చాలా మాట్లాడారు. తాగ‌డానికి టీ కూడా ఇచ్చారు. అయితే మేం కెమెరా, మైక్ బ‌య‌ట‌కు తీసిన‌ప్పుడు నేపాలీ భ‌ద్ర‌తా సిబ్బంది అడ్డుకున్నారు. ఏమీ మాట్లాడొద్ద‌ని అక్క‌డి వారికి వారి భ‌ద్ర‌తా సిబ్బంది సూచించారు. "టీ తాగి వెళ్లిపోండి" అని మాకు చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)