కరోనా టైమ్‌లో పిల్లల్నికంటే ‘బేబీ బోనస్’- దంపతులకు సింగపూర్ సర్కార్ ఆఫర్

ఫొటో సోర్స్, Getty Images
కరోనా మహమ్మారి కాలంలో భవిష్యత్తు గురించి ఆందోళన మరిచి, పిల్లలను కన్నవారికి భారీ నగదు బహుమతి ఇస్తామని సింగపూర్ ప్రభుత్వం ప్రకటించింది.
ఒకవైపు కరోనా కష్టాలు, మరోవైపు ఉద్యోగాలు పోతాయేమోన్న భయాలు చుట్టుముట్టడంతో చాలామంది దంపతులు సంతానం కనాలన్న ఆలోచనను పక్కనబెడుతున్నారని సింగపూర్ ప్రభుత్వం గుర్తించింది. అందుకే పిల్లల్నికంటే బహుతులు ఇస్తామని ప్రకటించింది.
సంతానాన్ని కన్నవారికి ఎంత మొత్తం బహుమతిగా ఇస్తారన్నదానిపై ఇప్పటి వరకు స్పష్టత లేకపోయినా, పిల్లల్నికన్న దంపతులకు ఇప్పటికే అందిస్తున్న ప్రోత్సాహకాలకు ఈ నజరాన అదనమని చెబుతున్నారు.
ప్రపంచంలో అతి తక్కువ సంతానోత్పత్తి రేటు ఉన్న దేశాలలో సింగపూర్ ఒకటి. జనాభాను పెంచుకోవడానికి దశాబ్దాలుగా సింగపూర్ ప్రయత్నిస్తూనే ఉంది.
అయితే పొరుగున ఉన్న ఇండోనేసియా, ఫిలిప్పీన్స్ దేశాలలో లాక్‌డౌన్ వేళలో విపరీతంగా గర్భధారణలు జరిగినట్లు గణాంకాలు చెబుతుండగా, అందుకు భిన్నంగా సింగపూర్‌లో ప్రెగ్నెన్సీ కేసులు పడిపోయాయి.
“కోవిడ్ కారణంగా చాలామంది దంపతులు సంతానోత్పత్తిని వాయిదా వేసుకున్నారని మాకు అందిన రిపోర్టులు చెబుతున్నాయి’’ అని సింగపూర్ ఉపప్రధాని హెంగ్ స్వీ కీట్ సోమవారంనాడు అన్నారు.
ప్రభుత్వం ప్రకటించిన ఈ బహుమానానికి సంబంధించిన వివరాలు, విధివిధానాలు త్వరలో వెల్లడిస్తానని హెంగ్ తెలిపారు.

ఫొటో సోర్స్, Reuters
ఇప్పటికే అర్హులైన దంపతులకు బేబీ బోనస్‌గా 10,000 సింగపూర్ డాలర్ల( సుమారు రూ.5.3లక్షలు) విలువైన ప్రయోజనాలను సింగపూర్ ప్రభుత్వం అందిస్తోంది.
2018లో సింగపూర్‌లో సంతానోత్పత్తి రేటు అత్యల్ప స్థాయికి చేరుకుంది. ప్రభుత్వ గణాంకాల ప్రకారం ఒక్కో మహిళ సంతానాన్ని కనే రేటు 1.14కు పడిపోయింది.
చాలా ఆసియా దేశాలలో కూడా సంతానోత్పత్తి రేటు తగ్గుతుండగా, కరోనా మహమ్మారి కాలంలో అది మరింత దిగజారింది.
ఈ ఏడాది ఆరంభంలో చైనాలో అత్యల్ప సంతానోత్పత్తి రేటు నమోదైంది. ఆ దేశం రిపబ్లిక్‌గా అవతరించిన 70 ఏళ్ల తర్వాత నమోదైన అతి తక్కువ సంతానోత్పత్తి రేటు ఇది. వన్ చైల్డ్ పాలసీలో మార్పులు చేసిన తర్వాత కూడా బర్త్ రేట్ తగ్గిపోవడం ఆశ్చర్యం కలిగింది.

సంతాన విప్లవం
సింగపూర్ పొరుగున ఉన్న దేశాలలో పరిస్థితులు అందుకు భిన్నంగా కనిపిస్తున్నాయి. ఈ ఏడాది చివరిదాకా కోవిడ్ నిబంధనలు ఇలాగే కొనసాగితే ఫిలిప్పీన్స్‌లో అవాంఛిత గర్భాల సంఖ్య గతంలో నమోదైన 2.6 మిలియన్లకు అదనంగా అందులో సగం కేసులు నమోదు అవుతాయని యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ వెల్లడించింది.
“మహమ్మారి సమయంలోనే ఇది జరిగే అవకాశం ఉంది’’ అని ఫిలిప్పీన్స్ లో పని చేస్తున్న ఐక్యరాజ్యసమితి అధికారి ఒకరు తెలిపారు.
సుమారు 10.8 కోట్ల జనాభాతో ఆగ్నేయాసియాలో అత్యధిక జనాభా ఉన్న దేశాలలో ఫిలిప్పీన్స్ రెండోస్థానంలో నిలుస్తోంది. ఇప్పటిదాకా సుమారు 3లక్షల కరోనా పాజిటివ్ కేసులు ఇక్కడ నమోదయ్యాయి.
“కరోనా మహమ్మారి సమయంలో పిల్లలు, తల్లుల సంగతి అంతా మర్చిపోయారు. ఇప్పుడు వారి గురించి ఆలోచించాల్సిన సమయం వచ్చింది’’ అన్నారు ఫిలిప్పీన్స్ సెనెటర్ రిసా హోంటివెరోస్.
కరోనా వైరస్‌పై పోరాటం చేసే టాస్క్‌ఫోర్స్‌లో మహిళల సంఖ్యను పెంచాలని ఆమె డిమాండ్ చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
- సౌదీ అరేబియా: టర్కీని బహిష్కరించాలని ఎందుకు అనుకుంటోంది?
- లవ్ హోటల్స్: ప్రేమికులకు, కొత్త జంటలకు ఏకాంతం కోసం..
- బైపోలార్ డిజార్డర్: ఆత్మహత్యకు పురిగొల్పే మానసిక వ్యాధి
- మత ప్రచారకులను రావొద్దంటున్న ఈ బోర్డులు నిజంగానే ఉన్నాయా? అసలు ఇలా బోర్డులు పెట్టొచ్చా?
- అమెరికా డాలర్ కనుమరుగవుతుందా? చైనా డిజిటల్ యువాన్ రాజ్యం చేస్తుందా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








