లవ్ హోటల్స్: ప్రేమికులకు, కొత్త జంటలకు ఏకాంతం కోసం..

ఫొటో సోర్స్, ALAMY
- రచయిత, చెర్మాయిన్ లీ
- హోదా, బీబీసీ వర్క్‌లైఫ్
ఎక్కువశాతం తల్లిదండ్రులతోనే కలిసి జీవించే హాంకాంగ్ యువతరం వ్యక్తిగత జీవితం, ప్రైవసీ కోసం కొత్తదారులు వెతుక్కుంటోంది.
అప్పుడే కొద్దికొద్దిగా చీకటి పరుచుకుంటోంది. హాంకాంగ్‌కు సమీపంలో ఉన్న విక్టోరియా హార్బర్ దగ్గర ఇద్దరు యూనివర్సిటీ విద్యార్ధులు నియాన్ లైట్లు వెలుగుతున్న ఓ కమర్షియల్ బిల్డింగ్ ముందు నిలబడి ఉన్నారు. వారు కొంచెం ఉద్వేగంతో, కాస్త భయంతో కనిపిస్తున్నారు.
20 ఏళ్ల ‘వాడీ’, 23 సంవత్సరాల ‘మూమూ’ రెండు వారాలుగా డేటింగ్‌లో ఉన్నారు. తెల్లవార్లు ఫోన్‌లో కబుర్లు చెప్పుకునే వారిద్దరూ ఇక తాము విడిగా ఉండలేమన్న భావనకు వచ్చారు.
కానీ హాంకాంగ్‌లో చాలామంది యువతీయువకుల్లాగే వారిద్దరు కూడా తమ అమ్మానాన్నలతో కలిసి ఉంటున్నారు. ఇంటికెళితే వారిద్దరికీ ఏకాంతం అనేది దొరకదు.
ఏకాంతానికి వారిద్దరికీ ఉన్న ఏకైక మార్గం హాంకాంగ్‌లోని లవ్ హోటలే. జపాన్‌లో బాగా ప్రసిద్ధి చెందిన ఈ లవ్ హోటళ్లు 1960ల నుంచి హాంకాంగ్‌లో కూడా నడుస్తున్నాయి.

ఫొటో సోర్స్, ALAMY
గంటకు ఇంత అని డబ్బు చెల్లించి ఈ హోటల్ రూమ్‌లను బుక్ చేసుకోవచ్చు. హాంకాంగ్‌లో ఇలాంటి లవ్ హోటళ్లు సుమారు 300 వరకు ఉన్నాయని హాంకాంగ్ గెస్ట్‌హౌస్ అసోసియేషన్ చైర్మన్ డేవిడ్ లీంగ్ చెప్పారు.
ప్రపంచంలోనే అత్యధిక జనసాంద్రత ఉన్న నగరాల్లో ఒకటైన హాంకాంగ్‌లో ఈ హోటళ్లు ఉన్నంతలో తక్కువ ఖర్చుతో ఏకాంతానికి అవకాశం కల్పిస్తున్నాయి.
60 ఏళ్ల చెంగ్ అనే మహిళ గత 20సంవత్సరాలుగా లవ్ హోటల్‌ను నడిపిస్తున్నారు. 18 గదులున్న ఆమె గెస్ట్‌హౌస్ మాంగాక్ ప్రాంతంలో ఉంటుంది. ఇది చాలా జనసమ్మర్దం ఉన్న ప్రాంతం.
యువతీ యువకులకు ఇంటి దగ్గర ఏకాంతానికి సరైన సౌకర్యం లేకపోవడం చాలా సంవత్సరాలుగా ఇక్కడున్న పెద్ద సమస్య అంటారు చెంగ్. “కొందరు పెళ్లయిన జంటలు కూడా ఏకాంతం కోసం వారాంతాల్లో ఇక్కడికి వస్తుంటాయి. ఇంట్లో కుటుంబ సభ్యులు ఎక్కువమంది ఉండటం, ఇల్లు చిన్నది కావడం దీనికి కారణాలు’’ అన్నారు చెంగ్.
హాంకాంగ్‌లో సంప్రదాయ హోటళ్లకు కొదవలేనప్పటికీ, యువతీ యువకులు ప్రైవేట్‌గా కబుర్లు చెప్పుకోడానికి ఈ హోటళ్లు బాగా ఉపయోగపడుతున్నాయి.
ఇటీవలి కాలంలో సెల్ఫ్ చెక్-ఇన్ అవర్లీ హోటల్స్ అనే కొత్త ట్రెండ్ కూడా మొదలైంది. రిమోట్ చెక్-ఇన్ పేరుతో గంటల పద్దతిలో గదిని బుక్ చేసుకుంటారు.
ఈ రూమ్‌లలో టీవీ, వీడియో గేమ్‌లు అందుబాటులో ఉంటాయి. ప్రైవసీ కోసం తపిస్తున్న యువతీ యువకులను ఈ లవ్ హోటళ్లు విపరీతంగా ఆకర్షిస్తున్నాయి.

ఫొటో సోర్స్, ALAMY
నవతరం-యువజంటలు
ఒకసారి ఈ అవర్లీ హోటల్ సౌకర్యాన్ని అనుభవించాక వాడీ, మూమూ ఇప్పుడు వారంలో రెండు,మూడుసార్లు ఇక్కడికి వచ్చిపోతున్నారు. సంప్రదాయ హోటళ్లకు, అవర్లీ లవ్ హోటళ్లకు మధ్య తేడాపై వారు సోషల్ మీడియాలో రివ్యూలు కూడా రాస్తున్నారు.
“ఇప్పటిదాక మేం ఇలాంటి 90 హోటళ్ల మీద రివ్యూలు రాశాం’’ అని చెప్పుకొచ్చారు మూమూ. వారి సోషల్ మీడియా పేజ్‌కు 20,000మంది ఫాలోయర్లు ఉన్నారు.
ఈ జంట ఇచ్చే రివ్యూలకు ఆదరణ లభించడం గొప్ప విషయమేమీ కాదు. హాంకాంగ్‌లో 15 నుంచి 24 సంవత్సరాల మధ్య వయసున్న యువత ప్రతి 10మందిలో 9మంది తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నారు.
ఇక 25 నుంచి 34 ఏళ్ల వయసున్న వారు ప్రతి 10మంది యూత్‌లో 6గురు పేరెంట్స్‌తో కలిసి జీవిస్తున్నారని 2019లో వెలువడిన హాంకాంగ్ ప్రభుత్వ నివేదికలో ఉంది.
ఏకాంతానికి నగరంలో చోటే దొరకడం లేదని యువతీ యువకులు వాపోతున్నారు. సామాన్యులు భరించగలిగే గృహ వసతి కల్పించే 309 ప్రపంచ మెట్రో నగరాలలో హాంకాంగ్ ఎక్కడో చివర్లో ఉంది.
ఒక మధ్య తరగతి ఉద్యోగి 13,000 హాంకాంగ్ డాలర్ల(రూ.1,22672) నుంచి 19,300 హాంకాంగ్ డాలర్లు ( రూ.1,82143) సంపాదించగలడు. కానీ హాంకాంగ్‌లో సొంతంగా ఇల్లు ఏర్పాటు చేసుకునే శక్తి రావాలంటే యువ ఉద్యోగులకు కొన్ని దశాబ్దాలు పడుతుంది.

ఫొటో సోర్స్, Alamy
“మేం ఇల్లు కొనుక్కోవాలనుకున్నా అది జరిగే పని కాదు. ధరలు ఆకాశంలో ఉంటాయి. అందుకే మేం ఇంకా తల్లిదండ్రులతోనే ఉంటున్నాం. ఒకవేళ కొంత డబ్బు సమకూర్చుకున్నా, ఏళ్ల తరబడి బ్యాంకులకు లోన్లు తీరుస్తూ పోవాలి’’ అన్నారు మూమూ.
దంపతులకు ఇంట్లో ప్రైవసీ దొరికినా తల్లిదండ్రులు ఉండే గదికీ, వారి గదికీ మధ్య సన్నని గోడ మాత్రమే ఉంటుంది. ఇది జంటలకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి.
హాంకాంగ్‌లో 70% ఇళ్లు శృంగారానికి అనుకూలంగా ఉండవని సెక్స్ ఎడ్యుకేషన్‌పై పని చేసే స్టికీ-రైస్ అనే ఎన్జీవో 2018లో జరిపిన ఓ సర్వేలో తేలింది. అందుకే కొందరు దంపతులు నెలకు ఐదుసార్ల వరకు ఈ లవ్ హోటల్స్‌కు వెళుతుంటారని ఆ సర్వే పేర్కొంది.
“లవ్ హోటల్స్‌కు వెళ్లడం తప్ప యువ జంటలకు వేరే మార్గం లేదు’’ అన్నారు చైనీస్ యూనివర్సిటీ ఆఫ్ హాంకాంగ్‌లో పని చేసే సోషియాలజీ ప్రొఫెసర్ డాక్టర్ సుసానే చోయ్.
“ఇతర దేశాలలో ఇంటి అద్దెలు తక్కువగా ఉంటాయి. కొనుక్కోవడానికి ఇళ్లు కూడా తక్కువ ధరలో దొరుకుతాయి. అందుకే అక్కడి యువతీ యువకులు స్వేచ్ఛగా ఉండగలుగుతారు. కానీ హాంకాంగ్‌లో పరిస్థితి అలా లేదు’’ అన్నారు సుసాన్
డిజిటల్ మార్గం
75 లక్షల జనాభా ఉన్న హాంకాంగ్‌లో ఇలాంటి అవర్లీ హోటళ్లు దొరకడం కూడా కష్టమే. యువతీ యువకులు హోటల్ దొరక్క అసహనానికి గురవుతుంటారని లవ్ హోటల్ నిర్వహిస్తున్న జెన్‌సెన్ అనే మహిళ వెల్లడించారు.
“కొన్ని లవ్ హోటళ్లు ఎక్కువ ఛార్జీలు వసూలు చేస్తాయి. కొన్ని హోటళ్లలో ప్రవేశానికి గంటల తరబడి లైన్లో నిలబడాల్సి వస్తుంది. తెలిసిన వాళ్లు ఎవరైనా చూస్తే అది ఇంకా ఇబ్బందికరంగా ఉంటుంది” అన్నారు జెన్‌సెన్. ఆమె తన యూనివర్సిటీ మిత్రులతో కలిసి 2018లో ఈ హోటల్‌ను ప్రారంభించారు.
చాలామంది ఈ సెల్ఫ్ చెక్-ఇన్ హోటళ్లను ఆన్‌లైన్‌లో బుక్ చేసుకుంటుంటారు. జెన్‌సెన్ నడుపుతున్న హోటల్‌కు వచ్చేవారిలో 90%మంది 30 ఏళ్లలోపు వారేనట. వీళ్లలో చాలామంది సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల ద్వారా బుకింగ్‌లు, డిజిటల్‌గా పేమెంట్లు జరిపి హోటల్ రూమ్‌లను కన్ఫర్మ్ చేసుకుంటుంటారు.
భర్త వేన్, అత్తమామలతో కలిసి ఓ ఇంట్లో కాపురం చేస్తున్న 27 ఏళ్ల గ్రేస్‌కు ప్రైవసీ దొరకడంగా కష్టంగా ఉండేది.
“ మేం ఎలాంటి శబ్దాలు చేయడానికీ (శృంగారం సమయంలో) వీలుండేది కాదు. ఎందుకంటే మా ఇల్లు చాలా చిన్నది. లవ్ హోటళ్లలో ఇతర రూముల నుంచి సెక్స్‌కు సంబంధించిన శబ్దాలు వస్తుంటాయి. కానీ వాళ్లు ఎవరో తెలియదు కాబట్టి ఇబ్బంది ఉండదు’’ అన్నారు వేన్
వేన్, గ్రేస్ జంట అప్పుడప్పుడు సెల్ఫ్ చెక్-ఇన్ లవ్ హోటళ్లకు వెళ్లి వస్తుంటారు. అక్కడ పని చేసేవారు కూడా చాలామంది యువకులే కాబట్టి తమను అర్ధం చేసుకుంటారని అంటారు వారు. అయితే ఇది కేవలం సెక్స్ కోసమే అనుకోవడం కూడా సరి కాదంటారు.

ఫొటో సోర్స్, Alamy
“ఆ హోటల్ రూముల్లో వీడియోగేమ్, నెట్‌ప్లిక్స్‌లాంటి ఎంటర్‌టైన్‌మెంట్ అందుబాటులో ఉంటుంది. భార్యా భర్తలకు కాస్త ఏకాంతం దొరుకుతుంది. మిగతా సంప్రదాయ హోటళ్లలో నెట్‌ఫ్లిక్స్ కావాలంటే మొబైల్‌లోనే చూసుకోవాలి” అన్నారు వేన్.
వాడీ, మూమూ జంటకు కూడా ఇలాంటి సౌకర్యాలున్న హోటళ్ల వివరాలు చెప్పమని యువ జంటల నుంచి ఇన్‌స్టాగ్రాంలో మెసేజ్‌లు వస్తుంటాయి.“ కొందరు హోటల్లో కిచెన్, బాత్‌టబ్ సౌకర్యం ఉందా ? అని ఎంక్వైరీ చేస్తుంటారు. పెద్దవాళ్ల అభిప్రాయాలకు భిన్నంగా తమదైన ప్రైవేట్ జీవితాన్ని గడపాలని ఈ తరం యువతీయువకులు కోరుకుంటున్నారు’’ అన్నారు వాడీ.
“మేం హోటల్ రూమ్ తీసుకున్నప్పుడల్లా కలిసి వంట వండుకోవాలనుకుంటాం. బైట తినడం కూడా ఖరీదైన వ్యవహారమే’’ అంటారు వాడీ. 20 ఏళ్ల వయసున్న కొన్ని జంటలు కూడా గుట్టుచప్పుడు కాకుండా తమ హోటల్‌కు వచ్చి గడుపుతుంటారని హోటల్ యజమానురాలు చెంగ్ వెల్లడించారు.
లవ్ హోటళ్లపై కోవిడ్-19 ఎఫెక్ట్
ఫిబ్రవరి నుంచి తీవ్రరూపం దాల్చిన కరోనాతో హాంకాంగ్‌లోని లవ్ హోటళ్లలో ఆక్యుపెన్సీ రేట్ బాగా పడిపోయింది. 25 అంతస్తులున్న తమ హోటల్‌లో కేవలం రెండు, మూడు రూములను మాత్రమే రెంట్‌కు ఇచ్చిన సందర్భాలున్నాయని హాంకాంగ్ గెస్ట్‌హౌస్ అసోసియేషన్ ఛైర్మన్ డేవిడ్ లీంగ్ వెల్లడించారు. వైరస్ కారణంగా అవర్లీ లవ్ హోటళ్లలో 70% బిజినెస్ దెబ్బతిందని లీంగ్ తెలిపారు.
ఇప్పుడు కరోనా మూడో వేవ్ నడుస్తోంది. అంతకు ముందు తమ వ్యాపారం 80% దాకా దెబ్బతిందని హోటల్ యజమానురాలు చెంగ్ వెల్లడించారు. మూడింట రెండువంతుల వ్యాపారాలు మూతపడ్డాయి. ప్రభుత్వం సబ్సిడీల ద్వారా హోటల్ పరిశ్రమను ఆదుకోవాలని చెంగ్ అన్నారు.
ఈ కథనం రాసేనాటికి హాంకాంగ్‌లో వైరస్ వేవ్ మూడోదశ చివర్లో ఉంది. భౌతిక దూరం పాటించాలంటూ హాంకాంగ్ వ్యాప్తంగా కఠిన నిబంధనలు అమల్లో ఉన్నాయి.
2013లో విజృంభించిన సార్స్ ప్రభావం చూసిన వాళ్లు కాబట్టి హాంకాంగ్ ప్రజలు ప్రభుత్వం విధించిన నిబంధనలను విధిగా పాటిస్తున్నారు. కరోనాను కట్టడి చేసినందుకు హాంకాంగ్‌కు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు కూడా వచ్చింది.
అయితే ఇంత తీవ్రమైన నిబంధనలు ఉన్నప్పటికీ కొన్ని సెల్ఫ్ చెక్-ఇన్ లవ్ హోటళ్ల వ్యాపారం మాత్రం బాగానే కొనసాగింది.

ఫొటో సోర్స్, Megumi Lim
మొదట్లో అంటే జనవరి, ఫిబ్రవరి నెలల్లో వ్యాపారం బాగా పడిపోయిందని, అయితే మార్చి వచ్చేసరికి వ్యాపారం మళ్లీ పుంజుకుందని, అంతకు ముందుకన్నా రెట్టింపు కస్టమర్లు రావడం మొదలైందని ఫోర్‌ట్రెస్ హిల్ నంబర్-7 అనే హోటల్ నడుపుతున్న మహిళా వ్యాపారి ‘ఈ’ వెల్లడించారు. మూడో వేవ్ ప్రారంభంలో కూడా వ్యాపారం బాగానే సాగిందని ఆమె అన్నారు.
రెస్టారెంట్లు మూసేయడంతో రూమ్‌కే డిన్నర్ తెప్పించే ఏర్పాట్లు చేయడంతో కస్టమర్లు మరింత ఎంజాయ్ చేశారని లవ్ హోటల్ నిర్వహిస్తున్న జెన్‌సెన్ వెల్లడించారు
ఒకపక్క మహమ్మారి ప్రపంచాన్ని ఊపేస్తున్న సమయంలో కూడా యువతీ యువకులు ఈ లవ్ హోటళ్ల కోసం ఎగబడ్డారంటే హాంకాంగ్‌వాసులు ఏకాంతం కోసం ఎంతగా తపించి పోతున్నారో అర్ధం చేసుకోవచ్చు.
కష్టపడి సంపాదించిన డబ్బు ఖర్చవుతున్నా, చిన్నిచిన్ని ఆనందాల కోసం వారు ఎంతైనా ఫరవాలేదు అన్నట్లు వ్యవహరించడం చూడొచ్చు.
ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్ను ఎదుర్కొనేందుకు WHO చెప్పిన అయిదు ఆహార చిట్కాలు
- విటమిన్-డి తీసుకుంటే వైరస్ రాకుండా కాపాడుతుందా
- 2 వేల సంవత్సరాలు నిల్వ ఉండే ఆహార పదార్థాలు ఉన్నాయా?
- చనిపోయిన భార్య 'సజీవ' ప్రతిరూపంతో గృహప్రవేశం... జీవిత భాగస్వామిపై ప్రేమను చాటుకున్న తెలుగు పారిశ్రామికవేత్త
- మహిళల భావప్రాప్తి కోసం ఫ్రాన్స్ రాకుమారి మేరీ బోనపార్టీ చేసిన ప్రయోగాలేంటి?
- ఇంతకూ బిర్యానీ హైదరాబాద్‌ది కాదా?
- నమ్మకాలు - నిజాలు: అలర్జీలు ఆడవాళ్లకేనా?
- నమ్మకాలు-నిజాలు: ప్రసవమైన వెంటనే తల్లికి మంచినీళ్లు తాగించకూడదా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








