మత ప్రచారకులను రావొద్దంటున్న ఈ బోర్డులు నిజంగానే ఉన్నాయా? అసలు ఇలా బోర్డులు పెట్టొచ్చా?

- రచయిత, దీప్తి బత్తిని
- హోదా, బీబీసీ ప్రతినిధి
"మతం మారితే కన్నతల్లిని మార్చుకున్నట్లే!"
"మత ప్రచారం చేస్తే తన్ని పోలీసులకు అప్పగించబడును"
"ఇలా గ్రామం పొలిమేరలో బోర్డులు పెట్టుకోవాల్సిన దుస్థితి ఎందుకు వచ్చింది. గతంలో కంటే మతమార్పిడులు పెద్ద ఎత్తున జరుగుతున్నాయనడానికి ఇది నిదర్శనం. నేను క్రిస్టియన్లందర్నీ అనడం లేదు. మీలో ఇటువంటివి ఖండించే వారు కూడా ఉన్నారు. కొందరి అత్యుత్సాహం వల్ల మీ మతం మొత్తానికీ చెడ్డ పేరు వస్తుంది" అంటూ సెప్టెంబర్ 22న ట్వీటర్‌లో భీమామణి అనే పేరుతో ఉన్న అకౌంట్ నుంచి పోస్టు వచ్చింది. మతమార్పిడికి వ్యతిరేకంగా కొన్ని గ్రామాల పొలిమేరల్లో పెడుతున్న బోర్డుల ఫొటోలను ప్రస్తావిస్తూ చేసిన పోస్టు ఇది.
ఆ అకౌంటును గమనిస్తే... జనసేన పార్టీ సభ్యత్వం కోసం సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లతోపాటు ఆ పార్టీ వెబ్ సైట్ వివరాలు ఉన్నాయి. జనసేన పార్టీ కార్యక్రమాలకు సంబంధించిన పోస్టులు కూడా ఉన్నాయి.

ఫొటో సోర్స్, Twitter/bhemamani
ఇతర మతాల ప్రచారానికి వ్యతిరేకంగా బోర్డులు ఏర్పాటు చేసిన గ్రామాలవిగా చెబుతూ సోషల్ మీడియాలో చాలా ఫొటోలు ప్రచారమవుతున్నాయి.
ఈ ఫొటోల్లో పొడుగుపాలెం, పొనుగోడు, బార్జిపాడు, నర్సాపూర్ తదితర ఊర్ల పేర్లతో బోర్డులు కనిపించాయి.
కానీ, నిజంగానే ఆ గ్రామాల్లో అలాంటి బోర్డులు ఉన్నాయా? ఉంటే, వాటిని ఎందుకు పెట్టారు? ఎప్పుడు పెట్టారు? లాంటి ప్రశ్నలకు సమాధానాల కోసం బీబీసీ ఆయా గ్రామాల ప్రజలతోనే మాట్లాడింది.

బార్జిపాడు అనే గ్రామం శ్రీకాకుళం జిల్లా పోలాకి మండలంలోని రెహమాన్‌పుర పంచాయతీ పరిధిలో ఉంది.
"ఈ గ్రామంలో అందరూ హిందువులే అయినందున ఇతర మతస్తులు ప్రచారం చేయరాదు. అట్లు కాదని చేసినయడల కఠిన చర్యలు తీసుకొనబడును. ఇట్లు బార్జిపాడు గ్రామ పురజనులు. మతం మారితే కన్నతల్లిని మార్చుకున్నట్లే! జై శ్రీరాం, జైజై శ్రీరాం" అని ఉన్న బోర్డు ఫొటో సోషల్ మీడియాలో కనిపించింది.
బార్జిపాడులో 2019, ఆగస్టులో ఆ బోర్డు ఏర్పాటు చేశారని చెబుతున్న సోమేశ్వరరావు అనే వ్యక్తిని మేం సంప్రదించాం.
"మా గ్రామంలో ఇటువంటివి మూడు బోర్డులు ఏర్పాటు చేశాం. గ్రామంలో నాలుగు కుటుంబాలు క్రైస్తవ మతానికి మారారు. అప్పుడు మత ప్రచారకులు ఎక్కువగా వచ్చేవారు. అందుకని బోర్డులు పెట్టాం" అని సోమేశ్వర రావు బీబీసీతో చెప్పారు.
బోర్డులు పెట్టాలన్న నిర్ణయం గ్రామ పెద్దల అంగీకారంతోనే జరిగినట్లు ఆయన తెలిపారు.
మరి బోర్డులు పెట్టడంతో ఏమైనా మార్పు వచ్చిందా అని అడిగిన ప్రశ్నకు... మార్పు వచ్చిందనే సోమేశ్వరరావు బదులిచ్చారు.
"నలుగురిలో ముగ్గురి కుటుంబాలు 'ఘర్ వాపసి' అయ్యాయి. వారు మళ్లీ హిందూ మతంలోకి వచ్చేశారు. దీంతో గ్రామంలో మత ప్రచారకులు రావడం తగ్గింది" అని ఆయన తెలిపారు.
అయితే, ఇప్పుడు ఆ బోర్డులు తాము తొలగించినట్టు ఆయన తెలిపారు.
"సర్పంచ్ ఎన్నికలు రాబోతున్నాయి. అందుకని తీశాం. ఎన్నికల తర్వాత మళ్లీ పెడతాం" అని అన్నారు.
ఈ ఫోటోలను అధికారుల దృష్టికి బీబీసీ తీసుకువెళ్లడంతో, వారు గ్రామంలో విచారణ చేశారు. ఈ వ్యవహారం గురించి శ్రీకాకుళం ఎస్పీ అమిత్ బారదార్ బీబీసీతో మాట్లాడారు.
"బార్జిపాడు గ్రామంలో విచారణ జరిపాం.. సోమేశ్వర రావు అన్న వ్యక్తి ఆ పోస్టర్లు ప్రింటు చేయించినట్టు తెలిసింది. 2014 నుంచి జనవరి 2019 వరకు తెలుగు దేశం పార్టీ సభ్యుడు. 2019 సార్వత్రిక ఎన్నికల ముందు ఈ బోర్డులు ప్రింటు చేయించాడు. కానీ ఈ లోపు ఎన్నికల నియమావళి ఉండటంతో ఆ పోస్టర్లు పెట్టలేదు అని తెలిపాడు. అందులో రెండు పంచి పెట్టినప్పటికి మిగతా పోస్టర్లు తన దగ్గరే పెట్టుకున్నాడు. అతడిది కళింగ కులం. ఆ గ్రామంలో 100కు పైగా కళింగ కులానికి చెందిన కుటుంబాలు ఉన్నాయి. మరో 30 దాకా ఎస్సీ కుటుంబాలు ఉన్నాయి. 2019 జనవరిలో వైఎస్ఆర్‌సీపీలో టికెట్టు ఆశించి మారాడు. తదుపరి విచారణ నిర్వహించి, న్యాయపరమైన అభిప్రాయం తీసుకుని అవసరమైతే కేసు కూడా పెడతాం" అని ఎస్పీ తెలిపారు.
మత విద్వేషాన్ని ప్రేరేపించే కార్యకలాపాలు జిల్లాలో ఎక్కడ జరిగినా, కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు.
మరోవైపు ఈ అంశంపై సోమేశ్వర రావుకు మద్దతుగా, మానవ హక్కుల సంఘాలుగా చెప్పుకుంటోన్న కొందరు మాట్లాడారు. ఆ బోర్డులకూ సోమేశ్వర రావుకూ ఏ సంబంధమూ లేదనీ, రాజకీయ కక్ష సాధించే క్రమంలో సోమేశ్వర రావును ఇరికించడానికి ఈ బోర్డుల ఫోటోలు ఒక వంకగా వాడుకుంటున్నారనీ వారు ఆరోపించారు. ఈ బోర్డులన్నీ గ్రామస్తులే స్వచ్ఛందంగా ఏర్పాటు చేసుకున్నవనేది వారి వాదన.
''ఇది సోమేశ్వర రావుపై కక్ష సాధించడం కోసం కొందరు ఆకతాయిలు చేసిన పని. గ్రామంలో అన్ని వర్గాల వారూ సంతోషంగా ఉన్నారు. ఎవరికీ ఏ ఇబ్బందీ లేదు, ఎవరికీ ఏ ఆటకంమూ లేదు.'' అని బీబీసీతో అన్నారు. ఫోకస్ హ్యూమన్ రైట్స్ సంస్థ శ్రీకాకుళం జిల్లా కౌన్సిలర్ ఎం ధనుజయ రావు.

ఫొటో సోర్స్, fb/India sans British
ఇక ఇలాంటి హెచ్చరిక బోర్డులు ఉన్నాయి అని చక్కర్లు కొడుతున్న మరో ఫోటో పొడుగుపాలెం గ్రామానిది. విశాఖపట్టణం జిల్లాలోని ఆనందపురం మండలంలో ఈ ఊరు ఉంది.
"అన్య మత ప్రచారం మా గ్రామంలో నిషేధించడం జరిగింది. దయచేసి సహకరించండి. అతిక్రమించి గ్రామంలో మత ప్రచారం చేస్తే తన్ని పోలీసులకు అప్పగించబడును" అని గ్రామ ప్రజలు తరఫున వేయించినట్టుగా ఉన్న బోర్డు ఫోటో సోషల్ మీడీయాలో షేర్ అయ్యింది.
ఆ గ్రామ ప్రజలతో మాట్లాడితే, ఇప్పుడు ఆ బోర్డు గ్రామంలో లేదని తెలిసింది. ఆ బోర్డు ఎప్పుడు పెట్టారన్న స్పష్టత ఎవరూ ఇవ్వలేదు.
అయితే, ఈ విషయం గురించి ఆ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి బీబీసీతో మాట్లాడారు. 20 ఏళ్ల క్రితం గ్రామ పెద్దలు ఆ బోర్డును ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అయితే, ఆ వ్యక్తి తన పేరును గోప్యంగా ఉంచాలని కోరారు.
"గ్రామంలో ఆంజనేయ స్వామి గుడి ఉంది. దాని బయట ఈ బోర్డు ఉండేది. అప్పట్లో ఊరిలోకి మత ప్రచారకులు ఎక్కువగా వస్తుండేవారు. దీంతో గ్రామ పెద్దలు ఒక నిర్ణయానికి వచ్చి, ఆ బోర్డు పెట్టారు. కానీ 2019లో ఆ బోర్డు గురించి ఎవరో ఫిర్యాదు చేయడంతో పోలీసులు దాన్ని తీయించారు. మత స్వేచ్ఛకు అది ఆటంకం అని చెప్పారు. అప్పుడు ఆ బోర్డు తీసేశాం. అప్పటి దాకా ఎవరికీ లేని బాధ, ప్రభుత్వాలు మారినాక ఎందుకు వచ్చిందో తెలియదు" అని ఆయన అన్నారు.
పొడుగుపాలెం గ్రామం పద్మనాభం పోలీసు స్టేషన్ పరిధిలో ఉంది. ఆ స్టేషన్ పోలీసులను ఈ బోర్డు గురించి బీబీసీ వివరాలు అడిగింది. గ్రామానికి చెందిన ఆ వ్యక్తి చెప్పిన విషయాన్ని, ఆ పోలీసు అధికారి ధ్రువీకరించారు.
"గతంలో ఆ బోర్డు ఉండేది. సంవత్సరం క్రితం ఫిర్యాదు రావడంతో తీసేశాం. ఇప్పుడు అలాంటి బోర్డులు ఆ గ్రామంలో లేవు" అని అన్నారు ఆ పోలీసు అధికారి.
పొనుగోడు గ్రామంలో అలాంటి బోర్డు ఉన్నట్లు చక్కర్లు కొడుతున్న ఫోటోను కూడా బీబీసీ పరిశీలించింది. పొనుగోడు పేరుతో ఆంధ్ర ప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాలో ఓ గ్రామం ఉంది. కానీ, ఆ గ్రామంలో అటువంటి బోర్డు లేదని స్థానికులు దృవీకరించారు.
ఆ ఫోటోను గూగుల్‌లో రివర్స్ సెర్చ్ చేస్తే, 2016 మార్చిలో ట్విటర్‌లో "మత ప్రచారకుల ప్రవేశాన్ని నిషేధించిన మొదటి గ్రామం నల్లగొండ జిల్లాలోని పొనుగోడు " అంటూ చేసిన ఓ ట్వీట్ బయటపడింది.
తెలంగాణ రాష్ట్రంలోని నల్లగొండ జిల్లాలోని కనగల్ మండలంలో ఈ పొనుగోడు గ్రామం ఉంది. అక్కడి పోలీసు అధికారులను మేం ఈ విషయమై ఆరా తీశాం.
అలాంటి బోర్డు ఇదివరకు ఆ గ్రామంలో ఉండేదని నల్లగొండ జిల్లాకు చెందిన ఓ పోలీసు అధికారి ధ్రువీకరించారు.
"ప్రస్తుతం ఆ బోర్డు మా పోలీసు స్టేషన్ లోనే ఉంది. దాదాపు రెండు సంవత్సరాల క్రితం దాన్ని తొలగించాం'' అని ఆయన వివరించారు.

ఫొటో సోర్స్, Twitter/Jaihindrayudu
భారత దేశ పౌరులందరికీ తమకు ఇష్టమైన మత విశ్వాసాలను పాటించే హక్కు ఉందని అన్నారు సామాజిక కార్యకర్త డీవీ రామకృష్ణా రావు.
"ఉన్న విశ్వాసాన్ని కాదనుకుని, ఇంకొక విశ్వాసాన్ని ఎంచుకొని, అందులోకి మారే హక్కు, తమ విశ్వాసాలను ప్రచారం చేసుకునే హక్కు మన రాజ్యాంగం ప్రతి ఒక్కరికీ కల్పించింది. ఫలానా వారు మా గ్రామంలోకి రావద్దంటూ, ఇలా గ్రామ సరిహద్దుల్లో బోర్డులు పెట్టడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం.. రాజ్యాంగ విలువలకు వ్యతిరేకంగా, ఆ స్ఫూర్తిని తొక్కి వేస్తూ మత విశ్వాసాలపై ఇలా శాసనాలు వేయడం ప్రజాస్వామ్య వ్యవస్థకు నష్టం చేస్తాయి" అని ఆయన అన్నారు.
ఈ మూడు, నాలుగు దశాబ్దాల్లోనే ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయన్నది అందరూ ఆలోచించాల్సిన విషయమని ఆయన అభిప్రాయపడ్డారు.
"మనిషి, మనిషి అభివృద్ధి కేంద్రంగా ఉండాల్సిన రాజకీయాలు, రాజకీయార్థిక విధానాలు మన దేశంలో తలకిందులుగా ఉన్నాయి. మన పాలక వర్గాలు సామ్రాజ్యవాద అనుకూల విధానాలతో, దోపిడీ వర్గాల ప్రయోజనాలకు అనుకూలంగా సాగుతూ... ప్రజలను కుల,మత విశ్వాసాల ఆధారంగా విభజించి ఉంచడంలో భాగంగా ఇవన్నీ నడుస్తున్నాయి" అని రామకృష్ణా రావు అన్నారు.
లౌకిక స్ఫూర్తికి విరుద్ధమైన ఇలాంటి పరిణామాలను ఎదుర్కోకపోతే, సమాజం చాలా నష్టపోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
ఇక ఈ హెచ్చరిక బోర్డుల విషయమై ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పోలీస్ డీజీపీ గౌతం సవాంగ్ కూడా బీబీతో మాట్లాడారు. రాష్ట్రంలో ఇలాంటి బోర్డుల ఎక్కడా లేవని ఆయన అన్నారు.
"ఇలాంటి ప్రయత్నాలు ఎవరైనా చేసినా, దానికి పోలీసు అధికారుల మద్దతు ఉండదు. ప్రస్తుత పరిస్థితుల్లో మతం గురించి చాలా తప్పుడు కథనాలు అల్లుతున్నారు. వాటి కోసం ఇలాంటి బోర్డుల ఫోటోలను సేకరించి, ఉపయోగించుకుంటున్నారు. ఇదంతా సందేహాస్పదంగా ఉంది. ఇటువంటివి ఏమైనా ఉంటే పరిశీలించి, తగిన చర్యలు తీసుకుంటాం" అని సవాంగ్ చెప్పారు.
‘‘ఈ విషయంలో ప్రత్యేకమైన చట్టం కానీ, సెక్షన్లు కానీ లేవు. కానీ ఈ తరహా బోర్డుల ఏర్పాటును ప్రస్తుతం ఉన్న నేరపూరిత బెదిరింపు, రెండు వర్గాల మధ్య చిచ్చు పెట్టడం, ద్వేషాన్ని పెంచేలా చేయడం వంటి నేరాల కింద నమోదు చేయవచ్చు. కానీ ప్రస్తుతం రాష్ట్రంలో అలాంటి బోర్డులు ఏమీ లేవు. మేం (పోలీసులం) చాలా చురుగ్గా వ్యవహరిస్తున్నాం. సోషల్ మీడియాలో ఇలాంటి బోర్డుల ఫోటోలు పెట్టిన వారిపై కూడా విచారించి ఐపీసీ 153ఎ కింద కేసులు పెడతాం. పాత బోర్డులను ఫోటోలు తీసి ప్రస్తుత రాజకీయాలకు అనుగుణంగా వాడుతున్నారు’’ అని బీబీసీతో చెప్పారు డీజీపీ గౌతమ్ సవాంగ్.
ఇటువంటి బోర్డులు రాజ్యాంగం ఇచ్చిన మత స్వేచ్ఛకు ఆటంకం కలిగిస్తాయని చెప్పారు సీనియర్ న్యాయవాది పట్టాభి.
‘‘మతాన్ని మార్చాలని తీవ్ర ప్రయత్నాలు చేయడమూ నేరమే. అదే సందర్భంలో ఇలాంటి బోర్డులు కూడా నేరమే’’ అన్నారాయన.
ఇవి కూడా చదవండి:
- చాలా మతాలు అంతరించినా క్రైస్తవం ఎలా విస్తరించింది?
- ‘క్రైస్తవ మత ప్రచారకుడిని చంపిన అండమాన్ ఆదిమజాతి ప్రజలు’
- చైనాలో చర్చిలపై ఉక్కుపాదం... ప్రశ్నార్థకంగా మారిన మత స్వేచ్ఛ
- బొప్పాయి పండుతో అబార్షన్ ఎలా చేయాలో నేర్పిస్తున్నారు
- ప్రపంచంలో విదేశాలపై ఆధారపడని ఏకైక ‘దేశం’ ఇదేనా?
- పుండ్లలోని చీముతో ప్రమాదకరంగా ఆ వ్యాక్సీన్ ఎక్కించేవారు, అది లక్షల మంది ప్రాణాలు కాపాడింది
- భారతదేశంలో కోవిడ్ మరణాలు 1,00,000 దాటాయి... ఈ మరణాలకు కారణాలేమిటి?
- ‘బందిపోటు’ పోలీసులు.. హత్యలు, దోపిడీలతో చెలరేగిపోతున్నారు
- కరోనావైరస్ లక్షణాలు ఏమిటి? పిల్లల్లో ఎటువంటి లక్షణాలు కనిపిస్తాయి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- చైనాలో మహిళలకు మాత్రమే పరిమితమైన రహస్య భాష... నుషు
- కరోనావైరస్: వ్యాక్సీనా, హెర్డ్ ఇమ్యూనిటీనా... ఏది వస్తే మేలు?
- ఓ డొక్కు టీవీ ఊరు మొత్తానికీ ఇంటర్నెట్ రాకుండా చేసింది.. ఎలాగంటే...
- మీ పాత టీవీ, రేడియో అమ్మితే రూ. 10 లక్షలు.. ఏమిటీ బేరం
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








