తిరుమలలో అన్యమతస్తుల ప్రవేశానికి ‘డిక్లరేషన్’ నిబంధన ఎప్పుడు, ఎలా మారింది? మార్చే అధికారం ఎవరిది?

ఫొటో సోర్స్, YVSubbaReddy/Facebook
- రచయిత, వి శంకర్
- హోదా, బీబీసీ ప్రతినిధి
ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ఆరాధించే తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల ప్రవేశంపై ఆంక్షలు తొలగిస్తూ తాజాగా ప్రకటన వెలువడింది. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి చేసిన ఈ ప్రకటన ఇప్పుడు పెద్ద చర్చకు దారితీస్తోంది.
తిరుమలలో దర్శనం కోసం హిందూయేతరులు కూడా ధృవపత్రం సమర్పించాల్సిన అవసరం లేదని ఆయన ప్రకటించారు. సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న ఈ ధృవపత్రం సమర్పణ అంశంపై తాజా ప్రకటనతో అటు ఆధ్యాత్మిక, ఇటు రాజకీయ వర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ విషయంపై గతంలో కూడా పెద్ద దుమారం రేగింది. 2012 మార్చిలో నాడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న ప్రస్తుత ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ ఆలయంలో దర్శనానికి వెళ్లిన సమయంలో ధృవపత్రం సమర్పించకపోవడం పట్ల విమర్శలు వెల్లువెత్తాయి.
ఆ తర్వాత హిందువులు కాని ఇతర మతస్తులంతా ధృవపత్రం సమర్పించాల్సిందేనని టీటీడీ నిబంధన పెట్టింది. కానీ అమలు చేసే యంత్రాంగం లేకపోవడంతో ఆచరణలో అది కనిపించలేదు. తాజాగా టీటీడీ చైర్మన్ హోదాలో వైవీ సుబ్బారెడ్డి చేసిన ప్రకటన తర్వాత ఈ అంశం మరోసారి తెరమీదకు వచ్చింది.

ఫొటో సోర్స్, Ttd
సుదీర్ఘకాలంగా ఉన్న సంప్రదాయం...
ప్రపంచంలో అత్యధిక సంఖ్యలో భక్తులు, పర్యాటకులు సందర్శించే ఆలయాల్లో తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయం ఒకటి. ఈ ఆలయం నిర్వహణ కోసం స్వత్రంత్యానికి పూర్వమే తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డును ఏర్పాటు చేశారు.
1932లో ప్రత్యేక చట్టం ద్వారా మనుగడలోకి వచ్చిన టీటీడీ ప్రస్తుతం 12 దేవాలయాలను పర్యవేక్షిస్తోంది. తొలుత మద్రాస్ ప్రభుత్వం నియమించిన కమిషనర్ నేతృత్వంలో పాలన సాగింది. ప్రారంభంలో రెండు సలహా మండళ్లు ఏర్పాటు చేశారు. అందులో ఒకటి తిరుమల ఆలయ కార్యకలాపాల సంబంధిత అంశాల కోసం ఏర్పాటు చేస్తే, రెండోది తిరుమల ఆలయ సంబంధిత భూముల పర్యవేక్షణ కోసం సలహా మండలి రైతులతో కలిపి ఉండేది.
స్వతంత్ర్యానంతరం వచ్చిన మార్పులకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ చారిటబుల్ అండ్ హిందూ రెలిజియస్ ఇన్స్టిట్యూషన్ అండ్ ఎండోమెంట్స్ యాక్ట్ (1969), సెక్షన్లు 85 నుండి 91 ప్రకారం టీటీడీ పాలనకు సంబంధించిన నిబంధనలు పొందుపరిచారు. దాని ప్రకారం ధర్మకర్తల సంఖ్యను 5 నుంచి 11కి పెంచారు. హిందూధర్మం ప్రచారం చేయడం ట్రస్ట్ బాధ్యతగా పేర్కొన్నారు.
ఆ తర్వాత మళ్లీ ఏపీ చారిటబుల్ & హిందూ రెలిజియస్ ఇన్స్టిట్యూషన్స్ & ఎండోమెంట్స్ చట్టాన్ని 1987లో సవరించారు. ట్రస్ట్ బోర్డు సభ్యుల సంఖ్యను గరిష్టంగా 11 నుంచి 15కి పెంచారు. 2006లో చేసిన సవరణలకు అనుగుణంగా ప్రస్తుతం ఈ సంఖ్య 29గా ఉంది. హుండి ఆదాయంలో పుజారులు, వారి వంశపారంపర్యంగా వాటా పొందే హక్కును 1987 లోనే రద్దు చేశారు. ఆ తర్వాత కూడా ఈ చట్టంలో పలుమార్పులు చేశారు.
దీంతో అన్యమతస్తులు వెంకటేశ్వర స్వామి మీద విశ్వాసం ఉందని రాతపూర్వకంగా చెప్పాలనే నిబంధన సంప్రదాయంగా ఉండేది. 2006లో చేసిన చట్ట సవరణలో భాగంగా హిందువులు కానివారు దేవాలయంలోకి ప్రవేశించే ముందు డిక్లరేషన్ ఫారమ్‌లో సంతకం చేయడం తప్పనిసరి చేశారు. వారు తమకు వెంకటేశ్వర స్వామిపై విశ్వాసం ఉందని రాతపూర్వకంగా పేర్కొనాల్సి ఉంటుంది.
ఏపీ రెవెన్యూ ఎండోమెంట్స్ -1 లోని జీఓ ఎంఎస్ నెంబర్ 311 (1990) ప్రకారం ఈ ఆదేశాలు వెలువడినట్టు టీటీడీ అధికారులు చెబుతున్నారు. దానిని టీటీడీ చట్టంలో కూడా రూల్ నెంబర్ 136గా పొందుపరిచారు. నాటి నుంచి పలువురు డిక్లరేషన్ ఇచ్చి ఆలయంలో ప్రవేశించిన దాఖలాలు కూడా ఉన్నాయి. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో ప్రవేశించేముందు ఈ డిక్లరేషన్ సమర్పించాల్సి ఉంటుంది. దానికి సంబంధించిన పత్రాలను టీటీడీ అందిస్తుంది. ఇతర మతస్తులు దానిపై సంతకం చేసి ముందుకెళ్లాల్సి ఉంటుంది.

ఫొటో సోర్స్, Facebook
సోనియా, జగన్ నిరాకరించారు...
సాధారణ భక్తులు దర్శనాలకు వచ్చినప్పుడు వారి వివరాలు సేకరించే యంత్రాంగం లేదు. కానీ ప్రత్యేక దర్శనాలకు వచ్చే వారి వివరాలను నమోదు చేస్తారు. ఆ సందర్భంలో వీఐపీల నుంచి సైతం డిక్లరేషన్ తీసుకున్న ఉదంతాలు ఉన్నాయి.
కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ కూడా 2006లో తిరుమల ఆలయంలో ప్రవేశించే ముందు డిక్లరేషన్ సమర్పించలేదు. స్వతహాగా క్రైస్తవ మత విశ్వాసుడిగా కనిపించే ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మాత్రం గతంలో పలుమార్లు అలా డిక్లరేషన్ ఇవ్వటానికి నిరాకరించారు. కానీ రాష్ట్రపతి హోదాలో తిరుమల దర్శనానికి వచ్చిన అబ్దుల్ కలాం మాత్రం డిక్లరేషన్ ఫారం సమర్పించి ఆలయంలో అడుగుపెట్టారు.
జగన్ 2012 మార్చి నెలలో కడప ఎంపీ హోదాలో దర్శనానికి వెళ్లినపుడు ఈ విషయంలో వివాదం తలెత్తింది. జగన్ నుంచి డిక్లరేషన్ కోసం టీటీడీ అధికారులు ప్రయత్నం చేసిన సమయంలో ఆయన నిరాకరించినట్టు అప్పట్లో ప్రచారం సాగింది.
అనంతరం 2014లో కూడా ఆయన ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత హోదాలో దర్శనం చేసుకున్న సమయంలో కూడా డిక్లరేషన్ సమర్పించిన దాఖలాలు లేవు. 2017లో దర్శనాలకు వెళ్లిన సమయంలో కూడా అలాగే చేశారు. సీఎం హోదాలో గత ఏడాది ఆయన తిరుమల వెళ్లినపుడు సైతం డిక్లరేషన్ సమర్పించలేదనే విమర్శలు వచ్చాయి.
ఎన్నికల్లో పోటీ చేసిన సమయంలో జనరల్ అభ్యర్థులు తమ కుల, మత అంశాలను ప్రస్తావించాల్సిన అవసరం లేదు. దాంతో జగన్ ఎన్నడూ తాను ఫలానా మతస్తుడిగా పేర్కొన లేదు. కాబట్టి ఆయన కుటుంబం క్రైస్తవ మతాన్ని అనుసరించినా రికార్డుల ప్రకారం హిందూమతస్తులుగానే ఉండే అవకాశం ఉందని, కాబట్టి ఆయన డిక్లరేషన్ సమర్పించాల్సిన అవసరం లేదనే వాదన కూడా ఉంది.

ఫొటో సోర్స్, Ttd
నాటి గవర్నర్ జోక్యంతో నిబంధనలు కఠినతరం
2012 నాటి పరిణామాలతో నాటి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ జోక్యం చేసుకున్నారు. నిబంధనలు కఠినతరం చేసి ఖచ్చితంగా అమలు చేయాలని ఆయన టీటీడీని ఆదేశించారు. దాంతో 2014లో నాటి కాంగ్రెస్ ఎమ్మెల్యే జయసుధ దర్శనానికి వెళ్లిన సమయంలో డిక్లరేషన్ తప్పనసరి అంటూ టీటీడీ అధికారులు ఒత్తిడి చేయడం కూడా వివాదానికి దారితీసింది.
వైఎస్ జగన్ విషయంలో ఉదాసీనంగా వ్యవహరించి తనను మాత్రం ఒత్తిడి చేశారంటూ అప్పట్లో జయసుధ విమర్శలు చేయడం విశేషం. ఆ తర్వాత కూడా జగన్ విషయంలో టీటీడీ అధికారులు డిక్లరేషన్ నిబంధన అమలు చేయడానికి సిద్ధపడలేదు. కొన్నిసార్లు టీటీడీ సిబ్బంది చొరవ తీసుకుని ఆయన డిక్లరేషన్ కోరినప్పటికీ నిరాకరించినట్టు ప్రకటించారు.
హిందూ మతంపై దాడిగా చూడాలి: ఎ.వి.రమణ
తిరుమల ఆలయంలో హిందూయేతరులు ప్రవేశించేముందు డిక్లరేషన్ సమర్పణ తప్పనిసరి చేసినప్పటికీ పర్యవేక్షణకు ప్రత్యేక ఏర్పాట్లు లేకపోవడం ప్రధాన లోపమని పలువురు చెబుతున్నారు.
టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు ఎ.వి.రమణ ఈ అంశంపై బీబీసీతో మాట్లాడుతూ.. ‘‘హిందూధర్మ ప్రచారం ప్రధాన బాధ్యతగా ఉన్న టీటీడీలో నిబంధనల అమలులో లోపం జరుగుతోంది. డిక్లరేషన్ ప్రక్రియ అవసరం లేదంటూ కొత్త వాదన తీసుకురావడం హిందూ మతంపై దాడిగా భావించాలి. భక్తుల మనోభావాలు దెబ్బతీస్తున్నారు’’ అని ఆరోపించారు.
‘‘ఇతర మతాలకు చెందిన వారు ఆలయంలోకి ప్రవేశించేముందు డిక్లరేషన్ ఫారమ్‌లో సంతకం చెయ్యడం సంప్రదాయంగా వస్తోంది. కొండ పై అన్యమత ప్రచారం, ఆర్టీసీ టికెట్లపై జెరూసలెం యాత్ర ప్రచారం వెలుగుచూశాయి. ఇప్పుడు ఏకంగా శ్రీవారి సొమ్ము కొట్టేయాలని కుట్రపన్నారు. ప్రభుత్వ బాండ్ల ద్వారా అధిక వడ్డీ అంటూ శ్రీవారి సొమ్ము కాజెయ్యాలని ప్రయత్నిస్తున్నారు’’ అని ఆయన విమర్శించారు.

ఫొటో సోర్స్, YVSubbareddy/Facebook
ప్రత్యేకంగా డిక్లరేషన్ అవసరం లేదని.. తర్వాత స్వరం మార్చిన టీటీడీ చైర్మన్
ప్రస్తుతం కోవిడ్ కారణంగా తిరుమలలో దర్శనాలకు వస్తున్న వారి సంఖ్య చాలా స్వల్పంగా ఉంది. సగటున రోజుకి 9,000 దరిదాపుల్లో ఉంటోంది. కానీ మార్చి నెలకు ముందు సాధారణ రోజుల్లో కూడా సుమారు 60,000 వరకూ ఉండేది. కొన్ని సందర్భాల్లో దాదాపు లక్ష మంది వస్తుంటారు. అలాంటి సమయంలో అందరి భక్తుల వివరాలు మతాల ఆధారంగా సేకరించడం సాధ్యమయ్యే పనికాదని టీటీడీ చెబుతోంది.
వీఐపీలు, రాజకీయ నేతలంతా ప్రత్యేక దర్శనాలకు వచ్చే సమయంలో తప్పనిసరిగా డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అంటున్నారు. ఆయన బీబీసీతో మాట్లాడుతూ.. ‘‘అన్యమత ప్రచారం గురించి కొందరు పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారు. అలాంటి వాటికి అవకాశం లేదు. పూర్తిగా నిరోధించాం. టీటీడీలో అన్ని రకాల నిబంధనలు అమలు చేస్తున్నాం. ప్రస్తుతం కోవిడ్ కారణంగా కొన్ని సమస్యలు తలెత్తినా భక్తులకు సదుపాయాల విషయంలో లోటు రాకుండా చూస్తున్నాం’’ అని చెప్పారు.
‘‘ప్రత్యేక పరిస్థితుల్లోనే బ్రహ్మోత్సవాలు కూడా జరుపుతున్నాం. డిక్లరేషన్ అనేది స్వచ్ఛందంగానే ఉండేది. కానీ ఆ తర్వాత దానిని తప్పనిసరి చేశారు. ప్రస్తుతం సాధారణ భక్తులకు ఎటువంటి డిక్లరేషన్ తీసుకోవడం లేదు. వీఐపీల విషయంలో కూడా ఈ నిబంధన అవసరం లేదని భావిస్తున్నాం. అందుకే స్వామి మీద భక్తితో దర్శనాలకు వచ్చే వారందరూ నిబంధనలు పాటించాలి. నిష్టతో వ్యవహరించాలి. టీటీడీ విధించిన అన్ని సూత్రాలు పాటించాలి. అలాంటప్పుడు డిక్లరేషన్‌తో పనిలేదని భావించి, ఆలయంలోకి ప్రవేశించే అవకాశం కల్పించాలని అనుకుంటున్నాం’’ అని ఆయన వివరించారు.
స్వరం సవరించిన టీటీడీ చైర్మన్
అన్యమస్తుల డిక్లరేషన్ అంశంలో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్వరం మారింది. డిక్లరేషన్ తీసేయాలని తాను అనలేదంటూ ఆయన ప్రకటన చేశారు.
ఈమేరకు టీటీడీ పీఆర్‌ఓ విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. ‘‘ముఖ్యమైన పర్వదినాలలో రోజుకు 80 వేల నుంచి లక్ష మంది కూడా స్వామివారి దర్శనానికి వస్తారు. వీరిలో వివిధ మతాలకు చెందినవారు ఉంటారు. వారందరినీ డిక్లరేషన్ తప్పనిసరిగా ఇవ్వాల్సిందేనని అడగలేము కదా? అని మాత్రమే నేను మాట్లాడాను. ప్రతిపక్ష నేత టీటీడీకి సంబంధించిన విషయాల మీదే ఆరోపణలు చేసినందువల్ల మీరు వివరణ ఇవ్వాలని మీడియా సోదరులు అడగడంతో నేను ఈ విషయాల గురించి మాట్లాడాను’’ అని వివరించారు.
‘‘వైఎస్ జగన్ విపక్షనేత హోదాలోనూ, సీఎంగానూ తిరుమల దర్శనాలకు వచ్చారు. వేంకటేశ్వరస్వామివారి మీద ఆయనకు అపారమైన భక్తివిశ్వాసాలు ఉన్నాయనడానికి ఇంతకంటే ఆధారాలు అవసరం లేదు. అందువల్లే ఆయన డిక్లరేషన్ ఇవ్వాల్సిన పనిలేదని చెప్పాను తప్ప డిక్లరేషన్ తీసేయాలని నేను చెప్పలేదని పునరుద్ఘాటిస్తున్నాను’’ అని సుబ్బారెడ్డి పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, Ttd
‘‘అనవసర వివాదం.. అనుమానాలకు తావిస్తోంది...’’
తిరుమలలో సుదీర్ఘకాలంగా డిక్లరేషన్ వాలంటరీగా సాగుతున్నప్పటికీ ఇప్పుడు దానిని అవసరం లేదని చైర్మన్ ప్రకటించడం అనవసర వివాదానికి దారితీస్తోందని తిరుపతికి చెందిన కార్మిక నేత కందరాపు మురళి వ్యాఖ్యానించారు.
ఆయన బీబీసీతో మాట్లాడుతూ.. ‘‘తిరుమలకు ఇతర మతస్తులు అనేక మంది వస్తూ ఉంటారు. దర్శనాలకు కూడా వెళతారు. డిక్లరేషన్ అనేది వాలంటరీ. విశ్వాసం ఉన్న వాళ్లే దర్శనాలకు రావడం, ఆలయంలో ప్రవేశించడం చాలాకాలంగా ఉంది. ఇప్పుడు దానిని కొనసాగించడానికి ఎవరికీ అభ్యంతరం లేదు. అలాంటి సమయంలో డిక్లరేషన్ అవసరం లేదంటూ చైర్మన్ ప్రకటన చేయడం సందేహాలకు తావిస్తోంది. వివాదాలకు ఆజ్యం పోసేందుకు ఇలాంటి ప్రయత్నం చేస్తున్నారా? అని అనుమానించాల్సి వస్తోంది’’ అని పేర్కొన్నారు.
‘‘చైర్మన్‌కి అలాంటి అధికారం లేదు...’’
తిరుమల ఆలయంలో దర్శనాలకు సంబంధించిన నిబంధనలు మార్చేసే అధికారం చైర్మన్‌కి లేదని టీటీడీ అర్చకుడిగా పనిచేసి రిటైర్ అయిన వాసు దీక్షితులు చెప్తున్నారు.
ఆయన బీబీసీతో మాట్లాడుతూ.. ‘‘ఎండోమెంట్ చట్టం ప్రకారం 14వ చాప్టర్ లో టీటీడీకి సంబంధించిన వివరాలుంటాయి. దాని ప్రకారం తిరుమలకు వచ్చే భక్తుల సదుపాయాల కల్పన, దానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకునే అధికారం టీటీడీకి ఉంది. కానీ ప్రస్తుతం చైర్మన్ ఏకపక్ష ప్రకటన మాత్రమే చేశారు. దానిని పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు’’ అని పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, Ttd
‘‘నిబంధనలను మార్చాలంటే జీవో సవరించాలి. జీవోలో డిక్లరేషన్ గురించి స్పష్టంగా ఉంది. కనీసం టీటీడీ బోర్డులో కూడా చర్చ జరిగినట్టు లేదు. అలాంటప్పుడు చైర్మన్ వ్యక్తిగత అభిప్రాయంగానే పరిగణించాలి. దానికి ప్రాధాన్యత అవసరం లేదు. చట్టంలో మార్పులు చేసే వరకూ డిక్లరేషన్ సమర్పించాల్సిందే. అందరికీ సాధ్యం కాదని భావిస్తున్నప్పుడు సమాజంలో అందరికీ చిరపరిచితులుగా ఉన్న వీఐపీల వరకూ కఠినంగా వర్తింపజేయాలి’’ అని ఆయన వ్యాఖ్యానించారు.
‘‘సోనియాగాంధీ దర్శనానికి వచ్చినప్పుడు కూడా నాటి కార్యనిర్వహణాధికారి ఈ డిక్లరేషన్ కొరకు గట్టిగా పట్టుబట్టి కొందరు నేతల ఆగ్రహానికి గురయ్యాడు. ఈనాడు అకస్మాత్తుగా ఈ మార్పు తీసుకురావాల్సిన అవసరం ఏమి వచ్చిందో టీటీడీ అధ్యక్షుడు చెప్తే బాగుంటుంది’’ అని కోరారు.
ఆలయ కార్యక్రమాల్లో రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రే వస్త్రాలు సమర్పించాలని ఎక్కడా లేదని.. నమ్మకం లేని నాడు ఆ కార్యక్రమాన్ని దేవాదాయ శాఖ మంత్రి నిర్వహించవచ్చునని టీటీడీ మాజీ ఈఓ, బీజేపీ నాయకుడు ఐ.వై.ఆర్.కృష్ణారావు వ్యాఖ్యానించారు.
ఈ అంశంపై టీటీడీ ఈవో వివరణ కోసం బీబీసీ ప్రయత్నించింది. పీఆర్ఓ టి.రవి మాత్రం స్పందించారు.
‘‘రాజకీయంగా వస్తున్న విమర్శలపై ఓ విలేకరి ప్రశ్నించడంతో ఆయన సమాధానం చెబుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. టీటీడీ చట్టాన్ని ఇంకా పరిశీలించాల్సి ఉంది. నిబంధనల ప్రకారం డిక్లరేషన్ తొలగించే వీలుందా లేదా అనేది పరిశీలిస్తాము. చట్టానికి అనుగుణంగానే తదుపరి చర్యలు ఉంటాయి’’ అని చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- 40 ఏళ్ల కిందట చోరీ అయిన సీతారామ లక్ష్మణుల విగ్రహాలు బ్రిటన్‌లో ఎలా దొరికాయి?
- మోదీకి మీడియా అంటే భయమా? ఇంటర్వ్యూల్లో ఆయన తీరు ఎలా ఉంటుంది?
- నరేంద్ర మోదీ: ఆర్ఎస్ఎస్ సాధారణ కార్యకర్త నుంచి ‘అసాధారణ బ్రాండ్’గా ఎలా మారారు?
- "ఈ దేశంలో పౌరులు కాదు, తమ ఓటర్లు మాత్రమే ఉండాలని ప్రభుత్వం కోరుకుంటోంది"
- #విమెన్ హావ్ లెగ్స్: మహిళలు కాళ్లు కనిపించేలా బట్టలు ధరించకూడదా?
- సైన్యంపై క్రమశిక్షణ చర్యలు ఎందుకు? భద్రతా దళాలు పరిధిని దాటి ప్రవర్తించాయా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లోనూ సబ్‌స్క్రైబ్ చేయండి.)









