అయోధ్య ఉద్యమ మంత్రం తెలుగు రాజకీయాల్లో ఎందుకు పనిచేయదు

అయోధ్య

ఫొటో సోర్స్, SANKET WANKHADE

    • రచయిత, జింకా నాగరాజు
    • హోదా, బీబీసీ కోసం

1992 నవంబరు నెలాఖరు నాటికే అయోధ్యకు దాదాపు 20వేల మంది కరసేవకులు చేరుకున్నారు. ఆ సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతోంది. డిసెంబరు 6 నాటికి అక్కడ గుమికూడిన వారి సంఖ్య దాదాపు 2 లక్షల దాకా ఉంటుందని మీడియా అంచనా వేసింది. ఇందులో ఎక్కువ మంది మహారాష్ట్ర, అంధ్రప్రదేశ్, గుజరాత్, కర్నాటక, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల నుంచి వచ్చారు. చిత్రమేమిటంటే ఒక్క ఆంధ్రప్రదేశ్‌ మినహా, మిగతా రాష్ట్రాలన్నీ క్రమంగా రామ మందిర ఉద్యమాన్ని ప్రారంభించిన భారతీయ జనతా పార్టీ (బీజేపీ) వశమయ్యాయి. మసీదు కూల్చివేతలో శిక్షణ ఇచ్చి కొన్ని వేల మంది కరసేవకులను పంపినా.. అప్పటి నుంచి ఇప్పటి దాకా తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ పాగా వేయలేకపోతోంది.

అయోధ్య రామ మందిరాన్ని రాజకీయ నినాదం చేస్తూ బీజేపీ నాయకుడు ఎల్‌కే అడ్వాణీ చేసిన రథయాత్ర ప్రభావం ఇక్కడ కనిపించ లేదు. బాబ్రీ మసీదు కూల్చేసిన ప్రభావమూ ఇక్కడ కనిపించలేదు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రభావమూ కనిపించడం లేదు. అందుకే ఇపుడు సాకారమవుతున్న అయోధ్య రామాలయం కూడా తెలుగు రాష్ట్రాల్లో బీజేపీకి రాజకీయ లబ్ధి చేకూరుస్తుందా అనేది అనుమానమే.

బీజేపీ వశీకరణ విద్య దక్షిణ భారత దేశం మీద పని చేయకపోవడానికి ఇక్కడి రాజకీయ, సాంస్కృతిక పరిణామాలే కారణం అనిపిస్తుంది. అయోధ్య రామ మందిర ఉద్యమం వెనక బలమైన హిందూ మతావేశం ఉన్నమాట నిజమే. అయితే, ఇది తెలుగు వారిని ఉత్తేజ పరచలేక పోయింది.

తెలుగు నేల ప్రతి అంగుళమూ మొన్నమొన్నటి దాకా నవాబుల పరిపాలనలోనే ఉంది. స్వాతంత్ర్యం వచ్చాక నయానో భయానో భారత సమాఖ్యలో కలసిపోయిన సంస్థానాల్లో తెలుగు ప్రాంతాల సంస్థానాలు రెండున్నాయి. ఇందులో ఒకటి నైజాంకాగా, రెండోది బనగానపల్లె సంస్థానం. ఇవి కాకుండా కర్నూలు, ఆదోని, సిద్ధవటం.. ఇలా ఎన్నో ప్రాంతాలు ముస్లింల ఏలుబడిలోనే ఉండేవి. విజయనగర సామ్రాజ్యం పతనమయ్యాక ఈ ప్రాంతాలన్నీ నవాబుల వశమయ్యాయి. అంతెందుకు, చాలా కాలం తిరుపతి, తిరుమల ఆలయాలన్నీ టిప్పు సుల్తాన్ పరిపాలనలో ఉండేవి. ఆయన కప్పం చెల్లించుకోలేక తిరుపతిని ఈస్టిండియా కంపెనీ కైవసం చేశారు.

ఆ రోజుల్లో రాజ్యం ముస్లింలది, స్థానిక జమీందారులంతా హిందువులు. అయినా తెలుగు సమాజంలో ఎప్పుడూ హిందూ ముస్లిం వైషమ్యాలు రాలేదు. బ్రిటిష్ పాలనలో ఉన్న మద్రాసు ప్రెసిడెన్సీలో ఈ గొడవ రాలేదు. నైజాం పాలనలో ఉన్న తెలంగాణలో ఎలాంటి తకరారు లేదు.

భూమిపూజలో మోదీ

ఫొటో సోర్స్, Getty Images

తెలుగువారికి భద్రాద్రి తర్వాతే ఏ రాముడైనా

అంతేనా? అంటే కాదు, ఇంకా ఉంది. హిందూ ముస్లిం అనుబంధం బాగా పెరిగిందనే చెప్పాలి. దీనికొక ఉదాహరణగా హైదరాబాద్‌లో జరిగిన ఒక సంఘటనని చాలా మంది చూపిస్తారు.

హైదరాబాద్‌లోని అత్తాపూర్‌లో ఓ రామాలయం (రామ్ బాగ్) ఉంది. దీనిని 1812లో నిర్మించారు. ఆ రోజుల్లో నిజాం ప్రభుత్వంలో ఒక ఉన్నతోద్యోగి రాజా భవానీ పెర్షాద్ ఈ ఆలయం నిర్మించారు. ఆలయంలో రాముడు, సీత, లక్ష్మణుల విగ్రహాలను ప్రతిష్ఠించే కార్యక్రమానికి భవానీ పెర్షాద్ నవాబ్ మూడో సికందర్ జాను ఆహ్వానించారు. నవాబు ఈ కార్యక్రమానికి రావడమే కాదు, ఆలయ నిర్వహణకు ఒక జాగీరు కానుకగా ఇచ్చారు. ఆలయం ఆలనాపాలనా చూసే అర్చకులకు రోజుకు రెండు రుపాయల చొప్పున జీతాలు మంజూరు చేశారు. దీని కోసం రూ.2093.50 పైసలను ఫిక్స్‌డ్ డిపాజిట్‌గా అందించారు. వీటి రికార్డులు ఆర్కైవ్స్‌లో భద్రంగా ఉన్నాయి.

దీని కంటే బాగా ప్రాచుర్యంలో ఉన్న కథ భద్రాచలానిది. కుతుబ్ షాహీ నవాబు తానీషా పాలనలో భద్రాచలం తహశీల్దార్‌గా ఉన్న రామదాసు.. ప్రభుత్వ నిధులు మళ్లించి రామాలయం నిర్మించారు. దీనికిగాను ఆయనకు జైలు శిక్ష పడింది. తర్వాత రామ లక్ష్మణులే స్వయంగా ఓ రోజు రాత్రి సుల్తాన్‌ను కలలో కలుసుకుని, ప్రభుత్వానికి చెల్లించాల్సిన సొమ్మును చెల్లించారు. తర్వాత సుల్తాన్.. తహశీల్దార్‌ను చెర నుంచి విడుదల చేయడమే కాదు, మళ్లీ ఉద్యోగంలోకి తీసుకున్నారు. శ్రీరామ నవమికి శ్రీరాముడికి ఆభరణాలు అందించే తంతునూ ఆయన మొదలుపెట్టారు. ఈ సంప్రదాయం నిజాం కాలంలోనూ కొనసాగింది. ఇప్పటికీ కొనసాగుతూ ఉంది. ఇలాంటి జన రంజకమైన కథనాలతో ప్రజల్లో సుహృద్భావం నెలకొంటుంది. తెలుగు వారందరికీ భద్రాద్రి రాముడి తర్వాతే మిగతా రాముళ్లంతా.

ఇక ఆధునిక రాజకీయాలకొస్తే.. దక్షిణ భారత రాజకీయాలు ఉత్తర భారత దేశానికంటే భిన్నంగా పరిణామం చెందాయి. కేరళలో 1903లో వచ్చిన శ్రీ నారాయణ ధర్మపరిపాలన (ఎస్‌ఎన్‌డీపీ) ఉద్యమం, మద్రాసు ప్రెసిడెన్సీలో వచ్చిన ద్రవిడ, బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమం విశిష్టమైన సంస్కరణోద్యమాలు. ఇవి స్వతంత్ర ఉద్యమాలు. జాతీయోద్యమంతో నిమిత్తం లేకుండా పుట్టిన స్థానికోద్యమాలు. దక్షిణ భాతర దేశ రాజకీయాలు ఇప్పటికీ ఈ ఉద్యమాల పర్యవసానంగానే కొనసాగుతూ ఉన్నాయి. ఇక్కడ శూద్రకులాలు రాజకీయాధికారం చేపట్టేందుకు కారణమైన ఉద్యమాలివే. ఒక నాడు మద్రాస్ ప్రెసిడెన్సీలో భాగమైన ఆంధ్రప్రదేశ్‌లో బ్రాహ్మణుల అధిపత్యం పోయి రెండు శూ ద్రకులాలు (రెడ్డి, కమ్మ) అధికారంలోకి రావడం వెనక పెరియార్ ఉద్యమం ప్రభావం లేదనడానికి వీల్లేదు.

దిల్లీలో వేడుక

ఫొటో సోర్స్, AFP/Money Sharma

తేడా ఇక్కడే...

శ్రీరాముడు తెలుగు నాట కూడా ఆరాధ్య దైవమే. ఈ రాష్ట్రాల్లో రామాలయం లేని ఊళ్లుండవేమో. ఇప్పటికీ ప్రతి ఊళ్లో రామ భజనలు జరుగుతూనే ఉన్నాయి. రామదాసులు కీర్తనలు అంతా మనసారా పాడతారు. లవకుశ ఇప్పటికీ ఇక్కడ గొప్ప చిత్రమే. వీధి నాటకాల్లో లవకుశ చాలా పాపులర్. అయితే, రామభక్తి ఇక్కడ ముస్లిం వ్యతిరేక మతావేశంగా మారలేదు. ముస్లిం వ్యతిరేక రాజకీయ ఉద్యమంగా రామభక్తి మారే పరిస్థితులు తెలుగు ప్రాంతాలలో ఎప్పుడూ లేవు. ఇక్కడ మతావేశం బాగా తక్కువ. ఒక శత్రువుని చూపించి మతావేశం తెప్పించి హిందువులను ఒక జాతిగా ఐక్యం చేయాల్సిన పరిస్థితులు ఇక్కడ ఎప్పుడూ రాలేదు.

నిజానికి దీనికి పూర్తిగా భిన్నమైన రాజకీయ సంప్రదాయాలు వచ్చాయి. ఇక్కడి ప్రజల మీద మత జాతీయవాద దేవుళ్ల కంటే సెక్యులర్ దేవతలదే పట్టు.

తిరుపతి వేంకటేశ్వరుడు కర్నాటక, తమిళనాడు, తెలుగు రాష్ట్రాల్లో నెంబర్ వన్ దేవుడు. ఆయన విశిష్టాద్వైత సంప్రదాయానికి ప్రతీక. ఆ తర్వాత అంత పాపులర్ దేవుడు షిర్డీ సాయిబాబా. ఆయనదీ సెక్యులర్ సంప్రదాయమే. మరొక పాపులర్ బాబా పుట్టపర్తి సత్య సాయిబాబా. ఆయనా సెక్యులర్ సంప్రదాయమే పాటించారు.

ఇక తెలంగాణ ప్రాంతంలో పోచమ్మ, పెద్దమ్మ, మైసమ్మలదే పట్టు. తెలంగాణ ప్రజలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునేవి బోనాలు, బతుకమ్మ పండగలు. ఇలాగే ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా ప్రాంతంలో సుబ్రమణ్య స్వామిని ఎక్కువగా కొలుస్తారు. మరొకవైపు ఉడుపి శ్రీ కృష్ణాలయం కూడా ఇక్కడ పాపులరే. ఈ మధ్య కాలంలో మాల ధరించడం ఎక్కువైంది. కేరళలోని శబరిమల అయ్యప్పతో మొదలైన ఈ సంప్రదాయం ఇప్పుడు శ్రీశైలం, విజయవాడ కనకదుర్గ గుళ్లకూ వ్యాపించింది. ఇంకా స్థానికమై ఆంజనేయ మాలలు కూడా వేసుకుంటున్నారు. ఇలా తెలుగు నాట ఆధ్యాత్మికం స్థానికమైంది. ఎప్పుడూ అయోధ్యావేశంగా మారలేదు. దానికితోడు తెలుగు రాష్ట్రాలలో ఉన్న బాబాలు, స్వామీజీలు ఉత్తర భారత సాధువుల్లాగా ఎప్పుడూ అయోధ్యావేశం ప్రచారం చేయలేదు.

ఇదే ఉత్తర, దక్షిణ భారత దేశాల రాజకీయ ఆధ్యాత్మికతకు తేడా అని ఉస్మానియా విశ్వవిద్యాలయానికి చెందిన విశ్రాంత ప్రొఫెసర్ సింహాద్రి చెప్పారు.

"ఉత్తర భారతంలో హిందూ ఆధ్యాత్మిక ఉద్యమంలో వెనకబడిన వర్గాలు (ఓబీసీ) కూడా భాగమయ్యాయి. అక్కడ బ్రాహ్మణులు పది శాతం ఉండటం దీనికి తోడైంది. అక్కడ రాజకీయ నాయకత్వం కోసం పోటీ పడే స్థాయిలో బ్రాహ్మణులున్నారు. వారికి బాబ్రీ మసీదు నినాదం బాగా పని కొచ్చింది. అక్కడి మతావేశం ఓబీసీల మీద బాగా పడింది. వారు ఎక్కువగా పాల్గొనడం వల్లే అయోధ్య రామ మందిర ఉద్యమం తీవ్రమైంది. దక్షిణ భారతంలో ఓబీసీలు, దళితులు ఇక్కడి బ్రాహ్మణేతర పార్టీల ప్రాబల్యంలోకి వెళ్లిపోయారు. రాజకీయాల్లో బ్రాహ్మణుల పాత్ర ఎప్పుడో మాయమైంది. బ్రాహ్మణేతర పార్టీలకు అయోధ్యావేశం రగిలించే అజెండా అవసరం లేదు" అని ప్రొఫెసర్ సింహాద్రి అన్నారు.

శిలాఫలకం

ఫొటో సోర్స్, Pbns

వామపక్ష ఉద్యమాల పాత్ర

తెలుగు రాష్ట్రాల్లో ఒకప్పుడు వామ పక్ష ఉద్యమాలు బాగా బలంగా ఉండేవి. సీపీఐ నుంచి మావోయిస్టు ఉద్యమాల దాకా అన్ని రకాల వామపక్ష భావాలు ఇక్కడి ప్రజలను ప్రభావితం చేశాయి. నిజాం వ్యతిరేక సాయుధ పోరాటం ఉద్యమం, నక్సలైట్ ఉద్యమాలు.. ప్రజల్లో రాజకీయ చైతన్యం తీసుకు వచ్చాయి. ఈ ఉద్యమాలకు ప్రజల్లో ఎంత పట్టుందంటే... కమ్యూనిస్టేతర పార్టీలు కూడా కమ్యూనిస్టు సాంస్కృ తిక వ్యూహలనే ప్రయోగించి ప్రజలను తమ వైపు తిప్పుకున్నాయి.

ఉత్తర భారత దేశంలో రామాలయం ఉద్యమం ఉద్ధృతంగా సాగుతున్నపుడు ప్రత్యేక తెలంగాణ నినాదంతో ప్రజలను 2001లో కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్రి) సులభంగా ఆకట్టుకున్నారు. ఇక్కడి ప్రజలూ ఎక్కడో 1500 కి.మీ. దూరాన ఉన్న అయోధ్య కంటే ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికే ప్రాముఖ్యం ఇచ్చారు. కమ్యూనిస్టు ఉద్యమాల వ్యూహంతో నడిచినందునే తెలంగాణ ఉద్యమం సులభంగా ప్రజా ఉద్యమమైంది. అందుకే తెలంగాణ ఉద్యమం రావడంతో ఇక్కడి ప్రజల్లోకి రామమందిరం ప్రవేశించడం దుర్లభమైంది. దాదాపు ఇదే సమయంలో రామాలయం కంటే స్థానిక సమస్యలే నినాదాలుగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి (2004) జన సమీకరణ చేయగలిగారు. ఈ రెండు రాజకీయ పరిణామాల మధ్య అయోధ్య నినాదం స్థాయి ఏమిటో అర్థం చేసుకోవచ్చు.

రామ మందిరం భారతదేశానికి చాలా ముఖ్యమైందని ఎల్‌కే అడ్వాణీ, అటల్ బిహారీ వాజ్‌పేయీ, తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ నచ్చ చెప్పినా తెలుగు ప్రజలుగాని, తెలుగు ఓటర్లు గానీ విశ్వసించడం లేదు.

అయోధ్య
ఫొటో క్యాప్షన్, అయోధ్య

భద్రాద్రి రాముడు వేరా

తెలుగు వాళ్లకు రాముడంటే భద్రాద్రి రాముడే.. గాని 'అయోధ్య ఉద్యమ రాముడు' కాదేమో అని 1991లో అడ్వాణీ రథయాత్ర మొదలైనప్పటి నుంచి ఇప్పటిదాకా సాగిన అయోధ్య రాజకీయాలను చూస్తే అర్థమవుతుంది.

'మందిరాన్ని అక్కడే కడతాం' (మందిర్ వహీ బనాయేంగే) అని విశ్వ హిందూ పరిషత్, ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీ, ఇరత సాధువులు, అయోధ్యలో శంఖారావం పూరిస్తున్నా.. దాన్నొక సినిమా లాగా చూశారు, తెలుగు వారు మితిమీరి ఆవేశపడలేదు.

"అయోధ్య గొడవ మొత్తం ఉత్తరాది ఆర్య ముస్లింలకు, ఆర్య హిందువులకు మధ్య వచ్చిన తగాదా" అని కర్నాటక మాజీ ముఖ్యమంత్రి వీరప్ప మొయిలీ అన్న మాట నిజమేనా అనిపించేంత ఉదాసీనత తెలుగు ప్రాంతంలో కనిపిస్తుంది. ఊరూరా వెలసిన తమ రాముడు వేరు, బీజేపీ వారు చూపిస్తున్న అయోధ్య రాముడు వేరని తెలుగువారు భావిస్తున్నారేమో అనిపిస్తుంది.

లేకపోతే, బీజేపీ జాతీయ నేతలు ఎంతగా ప్రచారం చేసినా తెలుగువారిలో అయోధ్యావేశం రాకపోవడమేంటి?

నాలుగు వందల శతాబ్దాలుగా సాగుతున్న ముస్లిం పెత్తనం నుంచి దేశానికి విముక్తి కల్పిస్తామని బీజేపీ చేస్తున్న ఆవేశపూరిత నినాదం తెలుగు ప్రజలలో మారుమోగనే లేదు. ఎందుకంటే, ముస్లిం అధిపత్యం తెలుగు వారికి కొత్తకాదు. అయితే, ఇంత తీవ్రమైన ముస్లిం వ్యతిరేకతేమిటి? అది ఒక జాతీయ నినాదం ఎలా అవుతుందో తెలుగువారికి అర్థమే కావడంలేదు.

హైదరాబాద్‌లో అప్పుడప్పుడూ కొన్ని ఘర్షణలు జరిగినా అది రెండు మతాల మధ్య వైరాన్ని పెంచేంత స్థాయికి ఎప్పుడూ వెళ్లలేదు.

అంతేకాదు, తెలుగు ప్రాంతాల్లో ముస్లిం జనాభా 10 శాతం నుంచి 40 శాతం దాకా ఉన్న పట్టణాలు చాలా ఉన్నాయి. అక్కడి ముస్లింల మీద ఇంత కసితీరా వైషమ్యం కక్కే అవసరం తెలుగువారికి ఎప్పుడూ రాలేదు. దానికి తోడు తెలుగు నాట ఊరూరా దర్గాలున్నాయి. దర్గాలు హిందూ ముస్లింలను బాగా దగ్గరచేసే వారధుల్లా పనిచేస్తున్నాయి. కడప దర్గాకు హిందువులు పెద్ద సంఖ్యలో వెళ్తారు. అమితాబ్ బచ్చన్ కుమారుడు అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య వంటి వారు కూడా ఇక్కడికి వచ్చారు. ఈ నేపథ్యంలో బీజేపీ బాబ్రీ-అయోధ్య ఆవేశం తెలుగు ప్రాంతాలలో అసందర్భంలా అనిపిస్తుంది.

ప్రధాని మోదీ

ఫొటో సోర్స్, PIB

ఫొటో క్యాప్షన్, ప్రధాని మోదీ

''రామాలయాలకు, పుణ్య క్షేత్రాలకు కొదవ లేదు ఇక్కడ. అందుకే దక్షిణ భారతీయులు అయోధ్య రామాలయాన్ని బీజేపీ సొంత వ్యవహారంగా చూస్తున్నారు. బీజేపీ రామ మందిరాన్ని జాతీయం చేయలేకపోయింది'' అని తెలుగు భాషా ఉద్యమకారుడు కురాడి చంద్రశేఖర కల్కూర అన్నారు. 'వందేమాతరం' నినాదంతో గత రెండున్నర దశాబ్దాలు కర్నూలుకు చెందిన కల్కూర ఊరూరు తిరిగి తెలుగు భాష ప్రోత్సాహ ఉదమ్యం నిర్వహిస్తున్నారు.

''బీజేపీ తన సొంత పార్టీ వ్యవహారంగా చూస్తున్నందుకే అయోధ్య వ్యవహారం తెలుగు రాష్ట్రాలలో పిడికెడు అగ్రవర్ణాల సమస్య అయింది. అయోధ్యను ఎప్పుడూ బీసీలు తమ సమస్యగా చూడటం లేదు. హిందూ మతానికి రక్త మాంసాల్లాంటి వారు బీసీలు. వారు సొంతం చేసుకోలేదు కాబట్టే తెలుగు నాట బీజేపీ అయోధ్య ప్రచారం విజయవంతం కాలేదు'' అని కర్నూలు బ్రాహ్మణ సంఘానికి పెద్ద దిక్కయిన కల్కూర వ్యాఖ్యానించారు.

(అభిప్రాయాలు వ్యాసకర్త వ్యక్తిగతం)

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)