అయోధ్య రామమందిరం: మోదీ ముఖ్య అతిథిగా శంకుస్థాపన...ఇది భారత్ స్వరూపాన్నే మార్చేస్తుందా?

నరేంద్ర మోదీ

ఫొటో సోర్స్, Pti

    • రచయిత, సీమా చిష్తీ
    • హోదా, బీబీసీ కోసం

గుజరాత్‌లో సోమనాథ్ దేవాలయ పునర్నిర్మాణానికి 1951లో శంకుస్థాపన జరిగింది. దానికి భారత రాష్ట్రపతిని ఆహ్వానించారు. అప్పుడు మతాన్ని దేశ సంబంధిత విషయాలకు దూరంగా ఉంచాలని భావించిన భారత తొలి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్‌కు ఒక లేఖ రాశారు. అందులో “మీరు ఈ వేడుకకు అధ్యక్షత వహించకపోవడం మంచిది” అన్నారు.

చాలా మంది ముస్లిం పాలకుల హయాంలో సోమనాథ్ ఆలయాన్ని నిరర్థకంగా వదిలేశారు.చివరకు, మొఘల్ రాజు ఔరంగజేబు దాన్ని కూల్చేశారు. ఆ తరువాత 250 ఏళ్లకు 1947లో సర్దార్ పటేల్ దానిని సందర్శించడంతో ఆ ఆలయ పునర్నిర్మాణం ప్రారంభమైంది.

నెహ్రూ, రాజేంద్రప్రసాద్

ఫొటో సోర్స్, Getty Images

దేశ విభజన సమయంలో ఏర్పడిన గాయాలను రెచ్చగొట్టడానికి ఈ కార్యక్రమం కారణం అవుతుందేమోనని, దేశ భద్రత గురించి నెహ్రూ ఆందోళన చెందారు. “దురదృష్టవశాత్తూ, దీనివల్ల ఎన్నో చిక్కులు రావచ్చన్న నెహ్రూ, సోమనాథ్‌లో భారీ ఎత్తున జరిగే కార్యక్రమానికి ప్రాధాన్యం ఇవ్వడానికి ఇది సమయం కాదని నాకు అనిపిస్తోంది” అన్నారు .

నెహ్ర సలహాను పట్టించుకోని రాజేంద్ర ప్రసాద్ ఆ కార్యక్రమానికి వెళ్లారు. సామరస్యం నెలకొనేలా, పూర్తి సహనం, మతాల సారాంశంపై దృష్టి పెట్టాలని ఆయన వేదిక మీద నుంచి గాంధేయవాద మాటలు చెప్పారు. సమానత్వం రేఖలు గీయడానికి ప్రయత్నాలు జరిగాయి.

అయోధ్య, రామమందిరం, బాబ్రీ మసీదు, బీజేపీ

ఫొటో సోర్స్, Getty Images

కానీ ఆగస్టు 5న జరగబోయే ప్రతిపాదిత రామమందిర ఆలయ శంకుస్థాపన వేడుక సోమనాథ్ పునరుద్ధరణ లాంటిది కాదు. ఇక్కడ రాష్ట్రపతి, దేశంలో రెండోసారి అత్యున్నత పదవిని అలంకరించిన దళితుడు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరుకావడం లేదు. ఆయన గైర్హాజరీ భారత్‌లోని ఒక పెద్ద కుల విభజన రేఖను గీస్తోంది. భారతదేశంలో విశ్వ మహమ్మారి కేసులు పెరగడం, పతనమవుతున్న ఆర్థికవ్యవస్థ, భారత తూర్పు సరిహద్దుల్లో భద్రత ప్రమాదకరంగా మారిన సమయంలో భారీ ఎత్తున జరిగే కార్యక్రమాలు ప్రధానమంత్రికి అసౌకర్యంగా అనిపించడం లేదు. దానికి భిన్నంగా ఈ వేడుకకు ఇప్పటికే కావల్సినంత హైప్ వచ్చింది, దేశమంతా ఈ వేడుక చూసేందుకు సిద్ధమవుతోంది.

సరయూ నది తీరంలోని అందమైన పట్టణాలలో అయోధ్య ఒకటి. దీనికి ఘనమైన గతం ఉంది. బౌద్ధులు దీనిని సాకేత్ అని పిలుచుకునేవారు. ఇటీవల రామ జన్మభూమి స్థలం బౌద్ధుల ప్రాంతమని, యునెస్కో ద్వారా ఆ ప్రాంతంలో తవ్వకాలు జరిపించాలని బౌద్ధ సన్యాసులు డిమాండ్ చేశారు.

జులై 15న ఆజాద్ బౌద్ధ ధర్మసేన ఆందోళనలు కూడా నిర్వహించింది. జైనుల దీనిని మాదన్నారు. సిక్కు సంఘాలు వారితో కలిశాయి. ఇదే ప్రాంతంలో 400 ఏళ్లకు పైగా బాబ్రీ మసీదు ఉంది. శ్రీరాముడి జన్మభూమి అనే వాదనలు దీనిని భారత వారసత్వానికి ఒక గొప్ప సయోధ్య కేంద్రంగా మార్చగలవు.

కానీ, విసిగిపోయిన భారత యువతలో సమానత్వాన్ని ప్రేరేపించే మార్గంలా కాకుండా దీనిని రకరకాల రాజకీయాలను పదును పెట్టడానికి ఉయోగిస్తున్నారు, నమ్మకాల విభజనకు వాడుకుంటున్నారు.

అడ్వాణీ నిర్వహించిన రథ యాత్రలో సమన్వయకర్తగా నరేంద్ర మోదీ పనిచేశారు

ఫొటో సోర్స్, Kalpit S Bhachech

ఫొటో క్యాప్షన్, అడ్వాణీ నిర్వహించిన రథ యాత్రలో సమన్వయకర్తగా నరేంద్ర మోదీ పనిచేశారు

ఇటీవలి గతం భయంకరంగా ఉంది. భారతదేశంలోని కుల అసమానతలను దృష్టిలో పెట్టుకుని వీపీ సింగ్ ప్రభుత్వం ఆమోదించిన మండల్ రిపోర్ట్ నుంచి దృష్టి మళ్లించడానికి ఎల్.కే.అడ్వాణీ 1990లో భారతీయులను ‘మేల్కొలిపే’ రథయాత్ర చేశారు. ఆ ప్రచారం 8 రాష్ట్రాల్లో 6 వేల కిలోమీటర్లకు పైగా సాగింది. 1990లో నెలకు పైనే సాగిన ఆ యాత్ర ఫలితంగా దాదాపు 300 మరణాలు, హింస, అల్లర్లు జరిగాయని రాజకీయ మేధావులు చెప్పారు. అప్పటి బీహార్ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ చివరికి సమస్తిపూర్‌లో అడ్వాణీ టయోటా వ్యాన్‌ను అడ్డుకున్నారు. 1992లో జరిగిన బాబ్రీ మసీదు విధ్వంసం వల్ల సంభవించిన ఎన్నో మరణాలు, సామాజిక చీలికలు భారత ప్రజాస్వామ్యాన్ని కుదిపేశాయి.

మొత్తం ఈ భూమినంతా ఆలయం కోసం అప్పగించినా, 2019లో అయోధ్య వివాదంపై తీర్పు ఇచ్చిన సుప్రీంకోర్టు, 1992 డిసెంబర్ 6న బాబ్రీ మసీదును కూల్చివేయడాన్ని “చట్టనియమాలను అతిగా ఉల్లంఘించడమేనని, ప్రజలు ప్రార్థనలు చేసే ఒక స్థలాన్ని ప్రణాళిక ప్రకారం ధ్వంసం చేయడమేనని” చెప్పింది. “450 ఏళ్ల క్రితం నిర్మించిన మసీదును ముస్లింలు అన్యాయంగా పోగొట్టుకున్నారని” ధర్మాసనం పేర్కొంది.

ఈ ఘటనపై ఏర్పాటైన లిబర్హాన్ కమిషన్ దీనిపై నివేదిక ఇచ్చినప్పటికీ, సాక్ష్యులు ఏళ్ల తరబడి తమ వాంగ్మూలాలు ఇచ్చినప్పటికీ దోషులను తేల్చే విచారణ ఇంకా ముగియలేదు.

ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా హాజరవుతూ మొదలవుతున్న మందిర నిర్మాణాన్ని దేశం పూర్తి నిబద్ధతో చేయాల్సిన కొత్త కార్యంగా చిత్రీకరిస్తున్నారు. దీని పర్యవసానాలు చాలా ఉంటాయి. 1992 డిసెంబర్ 6 భౌరత మౌలిక నిర్మాణాన్ని దెబ్బకొడితే, ఈ ఘటన కొత్తగా ఓ రూపాన్నే ఇస్తోంది.

అయోధ్య

ఫొటో సోర్స్, Getty Images

నవ భారతంలో కొందరు 'మరింత సమానం'

ప్రిన్స్‌ టన్‌లోని స్కాలర్ , రచయిత జ్ఞాన్ ప్రకాష్ తన ‘ది ఎమర్జెన్సీ క్రానికల్స్’ పుస్తకంలో “ఈ శంకుస్థాపన వేడుక, సమాన పౌరసత్వం అనే రాజ్యాంగ సిద్ధాంత మూలాలపై దాడి చేయడమే. లౌకిక ప్రజాస్వామ్యం విషయం పక్కన పెడితే, మతాలకు అతీతంగా సమాన పౌరసత్వం అనే ప్రాథమిక ప్రజాస్వామ్య సిద్ధాంతం కూడా ఇకపై సురక్షితం కాదు. బీజేపీ ప్రభుత్వం, బెదిరిపోయిన న్యాయవ్యవస్థ ఒక నిరంకుశ హిందూ రాష్ట్రానికి ఒక క్రమపద్ధతిలో పునాదులు వేస్తున్నాయి. అబేండ్కర్, నెహ్రూ కచ్చితంగా చాలా ఆవేదనకు గురవుతూ ఉంటారు” అని చెప్పారు.

అయినా, కేంద్రం, న్యాయస్థానంతో హక్కుల వాటా ప్రత్యామ్నాయాన్ని ఎంచుకోవాడానికి కూడా సిద్ధంగా లేదు. ఇది అత్యంత ప్రముఖమైనదని దేశాన్నే ఎగతాళి చేస్తున్నారు. ఇప్పటివరకూ ‘సర్వధర్మ సంభవంగా ఉన్న భారతదేశం ఇప్పుడు ఎలా వెళ్తోందనడానికి ఇది సంకేతం. ఇది ప్రైవేటు కార్యక్రమం కాదు. కానీ ఇది ఆ ప్రాంతం బీజాలు నాటిన చరిత్ర, సందర్భం, విభజనను చూస్తే ఈ బహిరంగ చొరవ భారత దేశ స్వభావాన్ని దాటవేస్తుంది.

అమిత్ షా, నరేంద్ర మోదీ

ఫొటో సోర్స్, Getty Images

మతం, ప్రభుత్వానికి మధ్య చెరుగుతున్న గీతలు‘

మధ్యవర్తిత్వం’ కోసం జరిగిన చాలా ప్రయత్నాల్లో ఈ అంశాన్ని వదిలిపెట్టాలని, ముగింపు పలకాలని ‘ముస్లిం’ పక్షానికి చాలా సార్లు అభ్యర్థనలు వచ్చాయి.ఈ పరిణామాలు భారత గణతంత్ర రాజ్యాన్ని పునర్విచించేందుకు మరో స్థాయిలో జరుగుతున్న ప్రయత్నాలకు ఇది ఆరంభమని నార్వేయియన్ స్కూల్ ఆఫ్ థియాలజీ, రిలీజియన్ అండ్ సొసైటీ పరిశోధకురాలు ఎవియాన్ లీడిగ్ అభిప్రాయపడ్డారు.

‘‘ఆగస్టు 5న ప్రధాని మోదీ రామ మందిరానికి పునాది రాయి వేయడం హిందూత్వ ఉద్యమానికి ఓ చారిత్రక ఘట్టమవుతుంది. ఇదివరకు కొన్ని అతివాద హిందూ జాతీయవాద అంశాలు హింసాత్మక అల్లర్లకు కారణమయ్యాయి. కానీ, ఇప్పుడు ఆ హింసకు ప్రభుత్వ మద్దతు చర్యలతో న్యాయబద్ధత కల్పించారు. రామమందిర నిర్మాణం అధికసంఖ్యాక జాతీయవాదాన్ని ప్రతిబింబిస్తోంది. ఇందులో భాగంగా మిగతా మతాల కన్నా హిందూయిజానికి మరింత విలువ ఇస్తున్నారు. మతపరమైన వైవిధ్యంతో సుసంపన్నమైన భారత్‌లో.. మిగిలిన మతాలపై ‘జాతి వ్యతిరేక’ ముద్ర వేస్తున్నారు. మోదీ ప్రభుత్వం నుంచి హిందూ ఎజెండాను చూడటం ఇదే ఆఖరిసారి కాకపోవచ్చు. పైగా దేశీయ, విదేశాంగ విధానాలపైనే కాదు రామ మందిరం లాంటి సాంస్కృతిక ప్రాంతాలపైనా ప్రభుత్వం దృష్టి ఉంది’’ అని అన్నారు.

అయోధ్య

ఫొటో సోర్స్, MANSI THAPIYAL

ఆ దేశాల కోవలో భారత్

గణతంత్ర రాజ్య రెండో రూపానికి ఇవి సంకేతాలని ఇంకొందరు విశ్లేషకులు అంటున్నారు. మతం, జాతి ఆధారంగా పౌరసత్వాన్ని నిర్ణయించాలన్న భావనలున్న దేశాల కోవలో భారత్ కూడా చేరుతోందని వారు అభిప్రాయపడుతున్నారు.

‘‘రామమందిర నిర్మాణానికి ఎంచుకున్న తేదీ కూడా జమ్మూకశ్మీర్ ప్రత్యేక హోదాను రద్దు చేసిన తేదీతో కలుస్తోంది. బాబ్రీ మసీదు స్థానంలో రామ మందిరం నిర్మించడానికి గత ఏడాది వరకూ లక్ష్యం భారత్‌ను హిందూ దేశంగా మార్చడం. బహుళ సంస్కృతిని గౌరవించే రాజ్యాంగాన్ని దానికి పణంగా పెట్టడం. భారత్... ఇజ్రాయెల్, టర్కీ, పాకిస్తాన్, మరికొన్ని దేశాల బాటలో ఉంది’’ అని ప్రొఫెసర్ క్రిస్టోఫ్ జాఫర్లేట్ అన్నారు.

హిందుస్తాన్ ఇక్కడ పుట్టి, పెరిగిన అందరిదని, వారికి ఇంకో దేశం లేదని మహాత్మ గాంధీ హరిజన్ పత్రికలో 1942, ఆగస్టు 9న రాశారు.‘‘హిందుస్తాన్ పార్సీలది. బెని ఇజ్రాయెలీలది. భారతీయ క్రైస్తవులది. ముస్లింలది. ఈ దేశం ఎంతగా హిందువులదో, అంతగా హిందువులు కానివారిది కూడా. స్వేచ్ఛాయుత భారత్ హిందూ రాజ్యం కాదు. ఏదో మెజార్టీ మతం, వర్గం ఆధారంగా భారత్‌లో పాలన ఉండదు. మతంతో సంబంధం లేకుండా ప్రజలందరి ప్రాతినిధ్యం ఇందులో ఉంటుంది’’ అని వ్యాఖ్యానించారు.

‘సమాధిపై రాత’

రామమందిర శంకుస్థాపన... భారత్ కొత్తగా ప్రత్యేకవాదానికి చేస్తున్న శంకుస్థాపన కూడా. చాలా మందికి ప్రియమైన, ఆదర్శ మానవుడిగా, మర్యాద పురుషోత్తముడిగా, పరిపూర్ణ మానవుడిగా భావించే శ్రీరాముడి పేరుతో ఇదంతా జరగడం బాధాకరం. 1990లో సాగిన అయోధ్య రథయాత్ర సీతాపతి అయిన రాముడిని శ్రీరామ్‌గా మార్చింది. ఇప్పుడు, ఆ రాముడిని కుంచించుకుపోతున్న భారతీయ అవగాహనకు ప్రతీకగా వాడే ప్రయత్నం జరుగుతోంది. దీన్ని కొందరు నవ భారతం అని పిలవొచ్చు. కానీ, మరికొందరికి ఇది ఆధునిక భారత గణతంత్ర రాజ్యమనే సమాధి మీద రాస్తున్న అక్షరాలుగానూ కనిపిస్తున్నాయి.

(అభిప్రాయాలు వ్యాసకర్త వ్యక్తిగతం)

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)