ఆంధ్రప్రదేశ్‌లో రథాల చుట్టూ రాజకీయాలు... ఇంద్రకీలాద్రి వెండి రథంపై విగ్రహాలు ఏమయ్యాయి?

రథం పాత చిత్రం

ఫొటో సోర్స్, FB/Kanaka durgamma temple

ఫొటో క్యాప్షన్, రథం పాత చిత్రం
    • రచయిత, వి. శంకర్
    • హోదా, బీబీసీ కోసం

ఆంధ్రప్రదేశ్‌లో వరుసగా దేవస్థానాల చుట్టూ వివాదాలు చెలరేగుతున్నాయి. అంతర్వేది ఆలయ రథం మంటల్లో కాలిపోయిన వ్యవహారం ఈ మధ్యే కలకలం రేపింది. ఇప్పుడు తాజాగా విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఉన్న దుర్గామల్లేశ్వర స్వామి రథం విషయం వేడి రాజేస్తోంది.

అమ్మవారి రథంపై నాలుగు సింహా ప్రతిమలు ఉండాల్సి ఉండగా, వాటిలో మూడు వెండి సింహాలు మాయమయ్యాయని టీడీపీ, బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు.

ఈ విషయంపై ఆలయ ఈవో స్పందించారు. విచారణ జరుపుతున్నామని వెల్లడించారు. దేవాదాయ శాఖ మంత్రి మాత్రం ఇంద్రకీలాద్రి రథంపై విగ్రహాల విషయానికి గత ప్రభుత్వానిదే బాధ్యత అంటూ వ్యాఖ్యానించారు.

ఇంద్రకీలాద్రి రథం
ఫొటో క్యాప్షన్, వెండి రథానికి మిగిలి ఉన్న సింహం

ఏడాదిగా రథానికి ముసుగు

ఏపీలో కుల రాజకీయాలకు సుదీర్ఘ చరిత్ర ఉంది. అయితే, ఇప్పుడు తొలిసారిగా రాష్ట్రంలో మత సంబంధిత అంశాలు ప్రధానంగా ముందుకు వస్తున్నాయి. వరుస వివాదాలకు కారణం అవుతున్నాయి.

కొద్దికాలం క్రితం పిఠాపురం, ఆ తర్వాత నెల్లూరు జిల్లా బిట్రగుంట, వారం రోజుల క్రితం అంతర్వేది, ఇప్పుడు విజయవాడ ఇంద్రకీలాద్రి.. ఇలా అనేక ఆలయాలను వివాదాలు చుట్టుముడుతున్నాయి. అంతర్వేది రథం కాలిపోయిన ఘటనపై సీబీఐ విచారణకు కూడా ఆదేశించారు.

ఇంతలోనే ఇంద్రకీలాద్రి రథం చుట్టూ వివాదం రాజుకుంటోంది.

ఈ ఆలయానికి చెందిన వెండి రథంపై ఏటా ఉత్సవమూర్తులను ఊరేగిస్తారు. 2019 ఉగాది నాడు కూడా ఊరేగింపు జరిగింది. ఆ తర్వాత ఈ ఏడాది ఉగాది సమయానికి లాక్‌డౌన్ విధించడంతో రథయాత్ర జరగలేదు. దాంతో వెండి రథం జోలికి ఎవరూ వెళ్లలేదని అధికారులు చెబుతున్నారు.

వెండి రథంపై రక్షణ కోసం ముసుగు వేసి ఉంచారు. అక్కడికి ఆలయ సిబ్బంది తప్ప ఇతరులు వెళ్లేందుకు ఆస్కారం లేదు. అలాంటి రథంపై తాజాగా మూడు సింహం ప్రతిమలు మాయమయ్యాయనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ప్రస్తుతం రథంపై కేవలం ఒక్క ప్రతిమ మాత్రమే దర్శనమిస్తోంది. మిగిలిన మూడు ప్రతిమలు కనిపించకపోవడంతో వ్యవహారం రాజకీయంగానూ దుమారం రేపుతోంది.

ఈ ఆలయ పరిధిలో మూడు రథాలు ఉంటాయి. పెద్ద రథాన్ని ఏటా దసరా సందర్భంగా నిర్వహించే వేడుకల్లో వినియోగిస్తారు. మహా మండపం దగ్గర చెక్కతో చేసిన మరో చిన్న రథం ఉంటుంది. ఉగాది, బ్రహ్మోత్సవాల సమయంలో వెండి రథం వినియోగిస్తారు.

ఇంద్రీకీలాద్రి రథం

20 ఏళ్ల క్రితమే రథం తయారీ

వెండి రథం 2001లో తయారుచేయించినట్టు ఆలయ అధికారులు చెబుతున్నారు. అప్పట్లో రూ. 50 లక్షల వ్యయంతో దీన్ని తయారుచేయించారు.

విజయవాడకే చెందిన దుర్గా ఇండస్ట్రీస్ సంస్థ అప్పట్లో వెండి తాపడం పనులు నిర్వహించింది. మొత్తం 70 కిలోల వెండిన ఈ రథం కోసం వినియోగించారు.

అందులో ఒక్కో సింహం ప్రతిమకు సుమారుగా 8 కిలోల వెండి వినియోగించి ఉంటారని పేరు వెల్లడించేందుకు సిద్ధపడని ఆలయ అధికారి ఒకరు బీబీసీకి తెలిపారు.

ప్రస్తుతం కనిపించకుండా పోయిన మూడు సింహాల ప్రతిమల బరువు కలిపి 24 కిలోల వరకూ ఉంటుందని చెబుతున్నారు. ప్రస్తుతం కిలో వెండి ఖరీదు రూ. 69,500గా ఉంది. ఆ లెక్కన చూస్తే, కనిపించని మూడు సింహ ప్రతిమల ఖరీదు 16.68 లక్షల వరకూ ఉండొచ్చు.

ఆలయ ఈవో నుంచి వివరాలు తెలుసుకుంటున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు
ఫొటో క్యాప్షన్, ఆలయ ఈవో నుంచి వివరాలు తెలుసుకుంటున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు

రికార్డులు చూడకుండా ఏదీ చెప్పలేం..

దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయ రథంపై మూడు సింహ ప్రతిమలు మాయమయ్యాయనే సమాచారం మంగళవారం నాడు బయటకు వచ్చింది. తొలుత అక్కడ పనిచేస్తున్న సిబ్బంది వీటిని గ్రహించి ఆలయ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.

అంతర్వేది ఘటన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాల్లో రథాల పరిస్థితిపై ప్రభుత్వం ఆడిటింగ్ నిర్వహించాలని నిర్ణయించింది. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా రథాలకు అదనపు భద్రత ఏర్పాటు చేయాలని సంకల్పించారు. ఈమేరకు డీజీపీ నేరుగా రాష్ట్రంలోని పోలీసు అధికారులందరికీ ఆదేశాలు ఇచ్చారు.

అందులో భాగంగా విజయవాడ నగర పోలీస్ అధికారులు, అమ్మవారి ఆలయ అధికారులు కూడా సమీక్ష చేశారు. ఆలయ రథాన్ని పరిశీలించే ప్రయత్నంలో సింహాలు లేవనే విషయాన్ని గుర్తించినట్టు ఈవో సురేష్ బాబు బీబీసీకి తెలిపారు.

"ఆలయ రథానికి సంబంధించిన సింహ ప్రతిమల విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. విగ్రహాలు కూడా మాయమయినట్టు సాగిన ప్రచారం అవాస్తవం. రథానికి సంబంధించిన సింహ ప్రతిమల గురించి రికార్డులను పరిశీలిస్తున్నాం. వెండి రథానికి ఉండాల్సిన సింహాలకు సంబంధించిన వివరాలన్నీ చూడాల్సి ఉంది. నేను బాధ్యతలు స్వీకరించిన తర్వాత రథం వినియోగించలేదు. అంతకుముందు నుంచి కప్పి ఉంచారు. రథాన్ని పూర్తిగా పరిశీలించి సింహాలకు సంబంధించిన వివరాలు వెల్లడిస్తాం. దాని కోసం గత రికార్డులను పరిశీలిస్తున్నాం. అన్నింటికీ బీమా ఉంది. ఎటువంటి ఆందోళన అవసరం లేదు. అర్ధ సత్యాలను ప్రచారం చేయడం తగదు. ఆలయ రికార్డులన్నీ పరిశీలించి వాస్తవాలు తెలియజేస్తాం" అని ఆయన అన్నారు.

రథాన్ని పరిశీలిస్తున్న టీడీపీ నాయకులు బుద్ధా వెంకన్న, గద్దె అనురాధ తదితరులు
ఫొటో క్యాప్షన్, రథాన్ని పరిశీలిస్తున్న టీడీపీ నాయకులు బుద్ధా వెంకన్న, గద్దె అనురాధ తదితరులు

ఆలయాలకు భద్రత లేకుండా పోయింది’

ఈ వ్యవహారంలో రాజకీయ పార్టీలు జోక్యం చేసుకున్నాయి. టీడీపీ, బీజేపీ నేతలు కూడా రంగంలో దిగారు.

ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న నేతృత్వంలో టీడీపీ నాయకుల బృందం, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు సారథ్యంలో బీజేపీ నేతల బృందం రథాన్ని పరిశీలించాయి. మూడు ప్రతిమలు కనిపించకపోవడం పట్ల ఆందోళన వ్యక్తం చేశాయి.

రథానికి ఉండాల్సిన మూడు సింహాలు లేవనే విషయం స్పష్టమవుతోందని, తక్షణమే దీనిపై వివరణ ఇవ్వాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు.

‘‘ఆలయ రథానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. దానికి తగిన భద్రత అవసరం. ప్రతిమలు లాకర్ లో ఉన్నాయని చెప్పేందుకు ఈవో ప్రయత్నిస్తున్నారు. కానీ, చూస్తుంటే ఆయా ప్రతిమలను ధ్వంసం చేసినట్టు ఆనవాళ్లున్నాయి. ఆలయ అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. తక్షణమే వాస్తవాలు వెల్లడించాలి. పూర్తి నివేదికను రెండు రోజుల్లో బయటపెట్టాలి’’ అని ఆయన డిమాండ్ చేశారు.

చంద్రబాబు

ఫొటో సోర్స్, CHANDRABABU/FB

ఫొటో క్యాప్షన్, చంద్రబాబు నాయుడు

‘ఈవో ప్రకటనలు విచిత్రంగా ఉన్నాయి’

ఆలయ రథానికి సంబంధించిన మూడు సింహ ప్రతిమల విషయంలో అధికారుల తీరుని విపక్ష నేత, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు తప్పుబట్టారు.

‘‘ఘటన వెలుగులోకి వచ్చిన తర్వాత పోలీసు కేసు పెట్టాల్సి ఉన్నా ఈవో పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. ఓవైపు భక్తులంతా ఆలోచిస్తున్నారు. ఏం జరిగిందోననే అనుమానాలు తలెత్తుతున్నాయి. ఈవో మాటలు విచిత్రంగా ఉన్నాయి. కనీస స్పందన కూడా లేదు. మూడు రోజుల తర్వాత చెబుతామని ఈవో చెప్పడం నిర్లక్ష్యానికి నిలువుటద్దం. భక్తుల మనోభావాలతో ఆడుకుంటున్నారు. నీచంగా వ్యవహరిస్తున్నారు. కేక వేస్తే వినిపించేంత దూరంలో దేవాదాయ శాఖ మంత్రి ఉన్నారు. అయినా, ఆయనకు ఈ విషయం పట్టదా. వ్యవహారం బయటకు వచ్చింది కాబట్టి కప్పి పుచ్చే ప్రయత్నం చేస్తున్నారు. నాలుగో సింహ ప్రతిమను కూడా లాగేందుకు ప్రయత్నం చేశారు. అది రాకపోవడంతో ఆగిపోయారు. ఇంత ఘోరం జరిగినా ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోంది’’ అని ఆయన వ్యాఖ్యానించారు.

‘అనవసర రాద్ధాంతం’

విపక్షాల తీరుని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తప్పుబట్టారు. ఇంద్రకీలాద్రి రథం అంశంపై ఆయన బీబీసీతో మాట్లాడారు. వెండి రథాన్ని తాను పరిశీలించినట్టు తెలిపారు.

"అన్ని ఆలయాల్లో రథాల రక్షణ కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. వెండిర‌థంపై మూడు సింహాలు క‌నిపించ‌డం లేద‌ని ప‌రిశీలన‌లో తేలింది. మా ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఆ రథాన్ని ఉపయోగించడంలేదు. గత ప్రభుత్వ హయాంలో ఏం జరిగిందో తెలియాలి. అప్పుడా, ఇప్పుడా అన్నది విచారణలో తేలుతుంది. ఘటనపై దేవదాయ శాఖ ఆధ్వర్యంలో కమిటీ వేస్తున్నాం. క‌మిటీ విచార‌ణ చేసి, నిజాలు నిగ్గు తెలుస్తుంది. చాలా ఆల‌యాల్లో భ‌ద్ర‌త‌ను ప్రైవేట్ ఏజెన్సీలు చూస్తున్నాయి. సెక్యూరిటీ ఏజెన్సీ భద్రతా లోపం ఉందని తేలితే దానిపై చర్యలు తీసుకుంటాం. ఈలోగా ప్రతిపక్షాలు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నాయి. అంతర్వేది ఘటన తరువాత అన్ని దేవాలయాల్లో భద్రతా చర్యలు తీసుకుంటున్నామని గుర్తించాలి. ఆ క్రమంలోనే ఈ రథం విషయం బయటకు వచ్చింది. బాధ్యులెవరైనా చర్యలు తీసుకుంటాం" అని అన్నారు.

విజయవాడ ఆలయంలో దసరా ఉత్సవాలకు సిద్ధమవుతున్న వేళ తలెత్తిన ఈ వివాదం ప్రకంపనలు పుట్టిస్తోంది. భక్తుల విశ్వాసాలతో ముడిపడిన అంశం కావడంతో చర్చనీయాంశం అవుతోంది. రాజకీయ విమర్శలకు కేంద్రం అవుతోంది. సాధారణ భక్తుల్లో కూడా పలు సందేహాలు కనిపిస్తున్నాయి. ఘటనపై సమగ్ర దర్యాప్తు జరపాలన్న డిమాండ్ వినిపిస్తోంది.

అంతర్వేది రథం

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, కొద్ది రోజుల క్రితమే అంతర్వేది ఆలయ రథం మంటల్లో కాలిపోయింది

ఏపీలో రథాలపై వరుస వివాదాలెందుకు

అన్ని ప్రముఖ హిందూ ఆలయాల్లోనూ రథయాత్రకు ప్రాధాన్యత ఉంటుంది. దానికి తగ్గట్టుగా భారీ రథాల నుంచి సామాన్య స్థాయిలో రథాలు నిర్మించి , వాటి నిర్వహణ సాగిస్తూ ఉంటారు.

సాధారణంగా ఏటా ఒకటి రెండు సార్లు మాత్రమే వాటిని వినియోగిస్తారు. మిగిలిన సమయమంతా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన షెడ్డుల్లో గానీ, ఆలయాల్లోనే ఆరుబయట గానీ రథాలను భద్రపరుస్తారు. చాలా ప్రాంతాల్లో రథాలను ఉంచిన చోట తాటాకులతో వాటిని కప్పుతుంటారు. ఆదాయం ఉన్న ఆలయాల్లో తాటాకు పందిళ్లతో పాటుగా వాటి కోసం ప్రత్యేక నిర్మాణాలు కూడా చేస్తున్నారు.

వినియోగం కొద్ది రోజుల పాటు మాత్రమే ఉండడంతో రథాల నిర్వహణపై ఆలయాలు తగినంత శ్రద్ధ పెట్టడం లేదు. రథయాత్రలకు కొద్ది రోజుల ముందే వాటి పరిస్థితిని సమీక్షిస్తున్నాయి.

ప్రస్తుతం ఇంద్రకీలాద్రి ఆలయంలో వివాదానికి కారణమైన వెండి రథం కూడా 2019 మార్చి తర్వాత బయటకు తీసిన దాఖలాలు లేవు. ఏడాదిన్నరగా దాన్ని అలాగే భద్రపరిచి ఉంచినట్టు అధికారులు చెబుతున్నారు.

అంతర్వేది రథం కూడా ఈ ఏడాది పిబ్రవరి తొలినాళ్లలో ఉత్సవాల సందర్భంగా ఒక పూట నిర్వహించే రథయాత్రలో వినియోగించారు. ఆ తర్వాత దానిని భద్రపరిచే ప్రాంతంలో తగిన రక్షణ ఏర్పాటు చేయలేదు.

అంతర్వేది, ఇంద్రకీలాద్రి రెండు రథాల ఘటనలకు సంబంధించి సీసీ కెమెరా ఫుటేజ్ లేకపోవడం గమనార్హం.

ప్రత్యేక దృష్టి సారించిన పోలీసులు

రథాలపై భక్తులకు ప్రత్యేక శ్రద్ధ ఉంటుంది. ముఖ్యంగా రథయాత్రలో పాల్గొని, ఉత్సవ మూర్తుల విగ్రహాలను ఉంచిన రథాన్ని లాగడం శుభసూచకంగా భావిస్తారు. ఆ అవకాశం కోసం పోటీపడుతుంటారు.

భక్తుల విశ్వాసంతో ముడిపడిన అంశం కావడంతో, రథాల విషయమై ఏపీ డీజీపీ పోలీసులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 650కిపైగా ఆలయాల్లో రథాలున్నట్లు గుర్తించారు. ఆయా రథాలకు సంబంధించిన భద్రత, సీసీ కెమెరాల పర్యవేక్షణ, ఇతర రక్షణకు సంబంధించిన విషయాలపై ఆడిటింగ్ చేయాలని ఆదేశించారు.

ఇందులో భాగంగా చేపట్టిన చర్యల్లోనే విజయవాడ ఆలయం వెండి రథం వ్యవహారం వెలుగులోకి వచ్చిందని చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)