ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో వివాదాలకు కేంద్రంగా మారిన మరో 'రాముడు'

परशुराम

ఫొటో సోర్స్, NARINDER NANU

    • రచయిత, సమీరాత్మజ్ మిశ్ర
    • హోదా, బీబీసీ కోసం

పరశురాముడిని విష్ణువు ఆరో అవతారంగా హిందువులు భావిస్తారు. ఆయన ఉత్తరప్రదేశ్‌లో బ్రాహ్మణ కులంలో జన్మించాడని చాలామంది నమ్ముతారు. కానీ, ఇక్కడ పరుశురాముడి ఆలయాలు పెద్దగా కనిపించవు. పరశురాముడి విగ్రహం కూడా గుళ్లలో కనిపించదు.

అయితే, హఠాత్తుగా ఇప్పుడు యూపీ రాజకీయ పార్టీలు పరుశురాముడి అంశాన్ని ఎత్తుకున్నాయి. ఆయన విగ్రహాలు ఏర్పాటు చేయడానికి పెద్ద ఎత్తున ప్రయత్నాలు ప్రారంభించాయి.

రాజకీయ నాయకులకు పరుశురాముడి మీద ప్రేమకన్నా, బ్రాహ్మణ వర్గాన్ని ప్రసన్నం చేసుకునే ఆకాంక్ష ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తోంది. నిజంగా పరశురాముడి విగ్రహాలు పార్టీలకు మేలు చేస్తాయా, బ్రాహ్మణులను ఆకట్టుకుంటాయా అన్నదే ఇప్పుడు అసలు ప్రశ్న.

పరశురాముడి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనను తొలిసారి సమాజ్‌వాదీ పార్టీ చేసింది. లఖ్‌నవూలో 108 అడుగుల ఎత్తయిన పరశురామ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని, ఇతర ప్రాంతాలలో కూడా ఆయన విగ్రహాలు పెడతామని సమాజ్‌వాదీ పార్టీ ప్రకటించింది.

పరశురామ విగ్రహాల ఏర్పాటు ఇవాళ కొత్తగా అనుకున్నదికాదని ఆ పార్టీ నేత, మాజీ మంత్రి అభిషేక్‌ మిశ్రా అన్నారు.

“మా పార్టీ విభాగాలలో ఒకటైన పరశురామ్‌ చేతనా పీఠ్‌ తరఫున మేం ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నాం. దక్షిణ భారతదేశంలో పరుశురాముడికి చాలా ఆలయాలు ఉన్నాయి. కానీ ఉత్తర భారతదేశంలో లేవు’’ అని అభిషేక్‌ మిశ్రా బీబీసీతో అన్నారు.

పరుశురామ రాజకీయాలు

బ్రాహ్మణుల్లో అసంతృప్తి

“మమ్మల్ని ఎవరూ పట్టించుకోవడం లేదని బ్రాహ్మణులు బాధపడుతున్నారు. ఇటీవల అనేకమంది బ్రాహ్మణులు హత్యకు గురయ్యారు. కొందరు కనిపించకుండా పోయారు. యోగి ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో గోరఖ్‌పూర్‌కు చెందిన హరిశంకర్‌ తివారీని లక్ష్యంగా చేసుకుని దాడులు చేసిన తీరు బ్రాహ్మణ వర్గాన్ని కలతకు గురి చేసింది ‘’ అని అభిషేక్‌ మిశ్రా అన్నారు.

అయితే, సమాజ్‌వాదీ పార్టీ ప్రభుత్వంలోకన్నా తమ ప్రభుత్వంలో ఎక్కువగా బ్రాహ్మణులు నిర్లక్ష్యానికి గురయ్యారన్న అభిషేక్ మిశ్రా వాదనను భారతీయ జనతా పార్టీ ఖండించింది.

"సమాజ్‌వాదీ పార్టీ పాలనలో పరశురాముడి ఎన్ని విగ్రహాలు ధ్వంసం అయ్యాయో అందరికీ తెలుసు. ఇప్పుడు ఆ పార్టీ విగ్రహాల గురించి మాట్లాడుతోంది. సమాజ్‌వాదీ, బహుజన్‌ సమాజ్‌పార్టీలు ఎప్పుడూ కుల రాజకీయాలు చేస్తాయి " అని బీజేపీ విమర్శించింది.

ఒకపక్క సమాజ్‌వాదీ పార్టీ విగ్రహం గురించి ప్రకటన చేయగానే, బీఎస్పీ అధినేత్రి మాయావతి కూడా రంగంలోకి దిగారు. తాము అధికారంలోకి వస్తే 108 అడుగులకంటే ఎత్తైన పరశురాముడి విగ్రహం నిర్మిస్తామని ఆమె ప్రకటించారు.

అధికారంలో ఉన్నప్పుడు విగ్రహాలు ఏర్పాటు చేయకుండా, ఇప్పుడు ఎందుకు ప్రకటనలు చేస్తున్నారంటూ సమాజ్‌ వాదీ పార్టీపై విమర్శలు గుప్పించింది బీఎస్పీ.

ఈ విమర్శలకు సమాధానం చెప్పడానికి సమాజ్‌వాదీ నుంచి ఏ నేతా ముందుకు రాలేదు.

పరశురామ రాజకీయాలు

పార్టీల పరస్పర ఆరోపణలు

గత నెలలో కాన్పూర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో వికాస్‌ దుబే, అతని సహచరులు ఎన్‌కౌంటర్‌లో మరణించారు. ఆ తర్వాత మూడు రోజులకు ఘాజీపూర్‌కు చెందిన రాకేశ్ పాంటే హత్యకు గురయ్యారు. బ్రాహ్మణవర్గానికి చెందినవారు ఎక్కువగా హత్యలకు గురవుతున్నారని ఆ సామాజిక వర్గంవారు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ వ్యవహారంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం కావడంతో అధికార భారతీయ జనతా పార్టీ వెనకడుగు వేసింది. మా ప్రభుత్వంలో కన్నా గత ప్రభుత్వాలలోనే ఎక్కువగా ఈ దాడులు జరిగాయని బీజేపీ నేతలు అంటున్నారు.

ప్రభుత్వం మీదున్న ఈ ఆగ్రహాన్ని సొమ్ము చేసుకునేందుకు మిగిలిన రాజకీయ పార్టీలు ఇప్పుడు పరశురాముడి అంశాన్ని ఎత్తుకున్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అందుకే విగ్రహాల విషయంలో పోటీపడి ప్రకటనలు చేస్తున్నారు.

అయితే భగవంతుడిని కూడా కుల ప్రకారం విభజించడం ద్వారా రాజకీయ ప్రయోజనం పొందడం కష్టమని సీనియర్‌ జర్నలిస్ట్‌ యోగేశ్‌ మిశ్రా అన్నారు.

" కొంతకాలంగా బ్రాహ్మణులలో ఆగ్రహం ఉందన్నది వాస్తవం. దాన్ని ఇలా విగ్రహాలు పెట్టడం ద్వారా సొమ్ము చేసుకోవాలని చూస్తున్నారు. ఇప్పుడు రామమందిర భూమి పూజ ముగిసింది. రేపు ఎన్నికల్లో ఈ అంశాన్ని నరేంద్ర మోదీ ఎత్తుకోగానే, ఈ ఆగ్రహాలన్నీ మాయమవుతాయి’’ అని యేగేశ్‌ మిశ్రా అన్నారు.

విగ్రహాల పేరుతో రాజకీయ వైరం పెరుగుతోందని, ఈ తరహా కుల విభజనను ఎవరూ అంగీకరించరని యోగేశ్‌ మిశ్రా అంటున్నారు.

ఇదే సమయంలో బీజేపీ కూడా తాము బ్రాహ్మణులకు ఎలాంటి అన్యాయం జరగనివ్వడంలేదని వాదిస్తోంది.

యూపీ పోలీస్‌ డైరక్టర్ జనరల్‌, చీఫ్‌ సెక్రటరీ ఇద్దరూ బ్రాహ్మణులేనని, గతంలో ఎప్పుడూ ఇలా చూడలేదని ఆ పార్టీ నేతలు వాదిస్తున్నారు.

బ్రాహ్మణ సామాజిక వర్గం బీజేపీకి బలమైన ఓటు బ్యాంకు అన్నది అందరికీ తెలిసినదే. కానీ ఈ మధ్యకాలంలో బీజేపీ పట్ల ఈ కులంవారి అసంతృప్తి పెరుగుతున్నట్లు కొన్ని వాదనలు వస్తున్నాయి.

“సామాన్య బ్రాహ్మణులనే కాదు... ఎమ్మెల్యేలు, ఎంపీలనే ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ప్రభుత్వాన్ని ఎంతమంది నిలదీయగలుగుతున్నారు ? ఇలా అయితే వచ్చే ఎన్నికల్లో ఓడిపోవడం ఖాయం’’ అని పేరు చెప్పడానికి ఇష్టపడని ఒక బీజేపీ సీనియర్‌ నేత అన్నారు.

పరశురామ రాజకీయాలు

ఫొటో సోర్స్, INC

కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం

ఇప్పుడు బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న బ్రాహ్మణ వర్గాన్ని తనవైపు తిప్పుకునేందుకు కాంగ్రెస్‌ పార్టీ ప్రయత్నాలను ప్రారంభించింది.

“బ్రాహ్మణ్‌ చేతనా మంచ్‌’’ పేరుతో ఆ వర్గంవారిని ఏకం చేయడానికి కాంగ్రెస్‌ పార్టీకి చెందిన మాజీ కేంద్రమంత్రి జితిన్‌ ప్రసాద్ ప్రయత్నాలు చేస్తున్నారు

పరశురాముడి విగ్రహ ఏర్పాటును కాంగ్రెస్‌ ప్రకటించకపోయినా, పరుశురామ జయంతిని సెలవుగా ప్రకటించాలని కోరుతూ జితిన్‌ ప్రసాద్ యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్‌కు లేఖ రాశారు.

సమాజ్‌వాదీ పార్టీ ప్రభుత్వంలో పరుశురామ జయంతిని ప్రభుత్వం సెలవుగా ప్రకటించగా, బీజేపీ ప్రభుత్వం దాన్ని రద్దు చేసింది.

ఉత్తరప్రదేశ్‌లో దాదాపు 12శాతం బ్రాహ్మణ వర్గపు ఓటు బ్యాంకు ఉంది. అందుకే ప్రతి పార్టీ ఈ వర్గాన్ని తన వైపుకు ఆకర్షించడానికి ప్రయత్నిస్తోంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)