అయోధ్య రామజన్మభూమి తరువాత మోదీ లక్ష్యం యూనిఫాం సివిల్ కోడ్ అమల్లోకి తేవడమేనా?

ఫొటో సోర్స్, ANI
- రచయిత, సల్మాన్ రావి
- హోదా, బీబీసీ ప్రతినిధి
భారతీయ జనతాపార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలోని రెండు ప్రధాన హామీలను నెరవేర్చిందని చెబుతున్నారు.మొదటిది ఆర్టికల్ 370కాగా, రెండోది రామమందిర నిర్మాణానికి మార్గం సుగమం చేయడం.
అయోధ్యలో రామమందిరానికి పునాదిరాయి పడిన మరుసటిరోజునే సోషల్‌మీడియాలో బీజేపీకి మరో వాగ్దానాన్ని గుర్తు చేయడం మొదలుపెట్టారు. అదే యూనిఫాం సివిల్ కోడ్.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
భూమిపూజ రోజు ఉదయం నుంచే ట్వీట్‌లు మొదలయ్యాయి. 2021 ఆగస్టు 5 నాటికి యూనిఫాం సివిల్ కోడ్‌ను కూడా ప్రభుత్వం అమలులోకి తీసుకువస్తుందని జర్నలిస్ట్ షాహిద్ సిద్ధిఖీ చేసిన కామెంట్ ప్రాధాన్యత సంతరించుకుంది.
భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటినుండి యూనిఫాం సివిల్ కోడ్‌పై చర్చ జరుగుతోంది.
దేశంలో పౌరులందరికీ ఒకే చట్టం ఉండాలని రాజ్యాంగ రూపకర్తలు సూచించారు. తద్వారా పెళ్లిళ్లు, విడాకులు, ఆస్తి, వారసత్వ హక్కులన్నీ ఒకే పరిధిలో తీసుకువచ్చే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.
ప్రస్తుతం దేశంలో ఒక్కోమతం వారు ఒక్కో చట్టం ద్వారా ఈ సమస్యలను పరిష్కరించుకుంటున్నారు.

ఫొటో సోర్స్, AFP/Getty
మతానికొక చట్టం పై చర్చ
ఒక్కో మతానికి ఒక్కో చట్టం అనేది ఆదేశిక సూత్రాలలో ఉంది. కానీ, యూనిఫాం సివిల్ కోడ్‌ను భవిష్యత్తులో రూపొందించాల్సిన అవసరం ఉందని ఆనాటి రాజ్యాంగ రూపకర్తలు భావించారు.
భారతీయ సమాజంలోని వైవిధ్యాన్ని చూసిఅప్పటి బ్రిటీష పాలకులు కూడా ఆశ్చర్యపోయేవారని న్యాయనిపుణులు అన్నారు. హిందువులు,ముస్లింలు, పార్సీలు, క్రైస్తవులు ఇలా ఎవరికి వారుగా ప్రత్యేక చట్టాలు ఉండటం పట్ల ఆంగ్లేయులు ఆశ్చర్యపడేవారు.
అప్పటి బ్రిటీష్ ప్రభుత్వం కూడా ఆయా సామజికవర్గాల సంప్రదాయ చట్టాల ప్రకారమే మతపరమైన సమస్యలను పరిష్కరించడం ప్రారంభించింది.
రాజారామ్మోహన్‌రాయ్‌మొదలుకుని అనేకమంది సంఘ సంస్కర్తలు హిందూ సమాజంలో మార్పు తీసుకురావడానికి కృషిచేశారు. సతి సహగమనం, బాల్యవివాహం వంటి ఆచారాలను అంతం చేయడానికి తీవ్రంగాప్రచారం చేశారు.
స్వతంత్రం వచ్చాక ఏర్పడిన తొలి ప్రభుత్వం 'హిందూ కోడ్ బిల్లు'ను తీసుకువచ్చింది.ఇది హిందూ సమాజంలో మహిళలపై విధించిన అనేక నిబంధనల నుంచి విముక్తి చేయడానికి ఉద్దేశించింది. అయితే హిందూ కోడ్ బిల్లు పార్లమెంటులో తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంది.ఇది మెజారిటీ హిందూ సమాజపు హక్కుల అంశమని, ప్రజల ద్వారా ఎన్నికైన ప్రజాప్రతినిధులు మాత్రమే దీనిపై నిర్ణయం తీసుకోగలరని సభలో నిరసన వ్యక్తం చేసిన ఎంపీలు వాదించారు.
నెహ్రూ ప్రభుత్వం హిందువులను మాత్రమే చట్టాలతో బంధించాలని కోరుకుంటోందని, ఇతర మతాల సంప్రదాయాలను మాత్రం పట్టించుకోవడం లేదని విమర్శలు వినిపించాయి.చివరకు హిందూకోడ్ బిల్లు ఆమోదానికి నోచుకోలేదు. కానీ 1952లో హిందూ వివాహాలు, మరికొన్ని అంశాలపై నియమాలను రూపొందించారు.

కొన్ని ముఖ్య చట్టాలు
- 1955లో 'హిందూవివాహచట్టం' రూపొందించారు. దీనిలో విడాకులకు చట్టపరమైన గుర్తింపు ఇవ్వడమే కాకుండా, కులాంతరవివాహాలను కూడా గుర్తించారు. ఒకటికంటేఎక్కువ పెళ్లిళ్లను చట్టవిరుద్ధంగా ప్రకటించారు.
- 1956లోనే' హిందూ వారసత్వ చట్టం', 'హిందూ దత్తత, పోషణ చట్టం','హిందూ మైనారిటీ సంరక్షక చట్టం' ప్రవేశపెట్టారు.
- సిక్కులు, బౌద్ధులు,జైనమతస్తులు కూడా హిందువుల కోసం రూపొందించిన చట్టం పరిధిలోకి వచ్చారు.
- బ్రిటీష్ పాలనలో భారతదేశంలో ముస్లింల వివాహం, విడాకులు, వారసత్వ కేసులను షరియా నియమాల ప్రకారమే నిర్ణయించేవారు.
షరియా నిబంధనల ప్రకారం రూపొందించిన చట్టాన్నే 'మహమ్మదీయ చట్టం' అంటారు. దీనిపై ఎవరికీ పెద్దగా అవగాహన లేకపోయినప్పటికీ, 'మహమ్మదీయ చట్టం' 'హిందూకోడ్'తోపాటు ఇతర చట్టాలకుసమానమైనదిగా గుర్తింపుపొందింది.
1937 నుండిఈ చట్టం అమలులోఉంది.

ఫొటో సోర్స్, Getty Images
షాబానో కేసుతో కీలక మలుపు
రాజ్యాంగంలో మతస్వేచ్ఛను ఆర్టికల్ 26 కింద హక్కుగా పేర్కొన్నారు. దీని ద్వారా అన్నిమత శాఖలు, ప్రజలు తమ తమ మత పద్ధతులను స్వేచ్ఛగా అనుసరించడానికి అవకాశం లభించింది.
అయితే,1985లో మధ్యప్రదేశ్‌కు చెందిన షాబానో తన విడాకుల కేసుపై సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో ఈ వ్యవహారం మలుపు తిరిగింది. విడాకులు ఇచ్చినందుకు షాబానోకు ఆమె భర్త జీవనభృతి చెల్లించాలని సుప్రీంకోర్టుఆదేశించింది.
ఈ తీర్పుపై కలకలంరేగింది.
అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో 'ముస్లిం మహిళల (విడాకుల హక్కుల రక్షణ) చట్టాన్ని ఆమోదించింది. ఈ చట్టం షాబానో కేసులో సుప్రీంకోర్టు నిర్ణయాన్నిరద్దుచేసింది. ముస్లిం మహిళకు విడాకులు ఇచ్చినా, ఆమె భర్త జీవితాతం జీవన భృతి చెల్లించాల్సిన అవసరం లేదని ఈచట్టం చెబుతోంది.
ఇదే సమయంలో దేశ ప్రజలందరికీ వర్తించే 'పౌర వివాహచట్టం' ఒకటి వచ్చింది. ఈచట్టంప్రకారం ముస్లింల వివాహాలు కూడా కోర్టు పరిధిలోకి వస్తాయి. దీని ప్రకారం ఒకటి కంటే ఎక్కువ వివాహాలు చట్టవిరుద్ధం. పెళ్లి చేసుకున్న ప్రతి ఒక్కరిని భారత వారసత్వ చట్టం పరిధిలోకి తీసుకువచ్చారు. విడాకుల విషయంలో అన్ని వర్గాలకు భరణం కల్పించారు.

ఫొటో సోర్స్, /
ట్రిపుల్ తలాక్- ముస్లిం మహిళల హక్కులు
ప్రపంచంలో 22 ఇస్లామిక్ దేశాలు మూడు సార్లు తలాక్ చెప్పడం ద్వారా విడాకులు ఇచ్చే పద్ధతిని పూర్తిగా రద్దుచేశాయి. వీటిలోపాకిస్తాన్, బంగ్లాదేశ్, టర్కీ, ట్యునీషియా, అల్జీరియా వంటి దేశాలు ఉన్నాయి.పాకిస్థాన్‌లో ట్రిపుల్ తలాక్‌లో మార్పులు తీసుకువచ్చే ప్రక్రియ 1955లో మొదలైంది. అప్పటి ప్రధాని మహ్మద్ అలీ అలీబోగ్రా భార్య ఉండగానే తన వ్యక్తిగత కార్యదర్శిని వివాహం చేసుకోవడంపై వివాదం చెలరేగింది.
ఈ వివాహాన్ని పాకిస్థాన్‌లో తీవ్రంగా వ్యతిరేకించారు. ఆ తర్వాత పాకిస్తాన్ ప్రభుత్వం ఏడుగురు సభ్యుల కమిషన్‌ను ఏర్పాటు చేసింది. కమిషన్ రూపొందించిన నిబంధనల ప్రకారం పాకిస్థాన్‌లో ఒక వ్యక్తి తలాక్ చెప్పాలనుకుంటే స్థానిక ప్రజాప్రతినిధి అయిన 'యూనియన్ కౌన్సిల్' అధ్యక్షుడికి నోటీసు ద్వారా తెలపాలి. ఆ నోటీసు కాపీని భార్యకు కూడా ఇవ్వాలి.
ఈ నిబంధనలను ఉల్లంఘించిన వారికి పాకిస్థాన్ లాంటి దేశాలలో రూ. 5000 జరిమానా విధిస్తారు. భారతదేశంలో చాలా చర్చలు, వివాదాల తర్వాత ట్రిపుల్ తలాక్‌ను రద్దు చేయడంలో విజయం సాధించారు.
ట్రిపుల్ తలాక్ రద్దు చట్టంవల్ల వేలాది మంది ముస్లిం మహిళలు లబ్ధి పొందారని కేంద్ర ప్రభుత్వంలో మైనారిటీ వ్యవహారాల మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ వ్యాఖ్యానించారు. ఈ చట్టంకారణంగా విడాకుల కేసులు కూడా బాగా తగ్గాయని ఆయన అన్నారు.
'యూనిఫాం సివిల్ కోడ్' అంటే కామన్ సివిల్ కోడ్ గురించి 2016 సంవత్సరంలో భారత లా కమిషన్ సామాన్య ప్రజల అభిప్రాయాన్ని కోరింది. ఇందుకోసం కమిషన్ ఒక ప్రశ్నాపత్రాన్ని వార్తాపత్రికలలో ప్రచురించింది.
ఇందులో 16పాయింట్లపై అభిప్రాయాలు అడిగారు. అయితే దేశ పౌరులందరికీ ఒకే చట్టం ఉండాలా వద్దా అన్నదే ఇందులో ప్రధానమైన అంశం.

ఫొటో సోర్స్, Getty Images
తదుపరి నిర్ణయం ఉమ్మడి పౌరచట్టమేనా?
వివాహం,విడాకులు, దత్తత, సంరక్షణ, భరణం, వారసత్వం ఇలా పలు అంశాలపై ప్రశ్నపత్రంలో ప్రశ్నలువేశారు. ఒకే విధమైన హక్కులను పొందటమే కాకుండా దేశవైవిధ్యాన్ని కాపాడుకునే అటువంటి కోడ్‌ను రూపొందించాలా అనేదానిపై కూడా కమిషన్ అభిప్రాయం కోరింది. వివిధ మతాలలో, కులాలలో పలు ఆచారాలు అంటే బహుభార్యత్వం, బహుభర్తృత్వం, గుజరాత్‌లో అనుసరించే మైత్రికరార్ ఒప్పందం లాంటి అంశాలపై అభిప్రాయాలు అడిగింది. లా కమిషన్ అడిగిన కొన్ని సంప్రదాయాలకు చట్టపరమైన గుర్తింపులేకున్నా, కొన్ని సమాజాలలో వీటికి అంగీకారం ఉంది.
దేశంలోని వివిధ ప్రాంతాలలో వివిధ ఆచార సంప్రదాయాలు
కొనసాగుతున్నాయి. మేజిస్ట్రేట్ సంతకం ద్వారా మాత్రమే ఆమోదించబడే మైత్రి కరార్ ఒప్పందం గుజరాత్‌లో చట్టబద్ధంగా చెల్లుతుంది. అలాంటి ఆచారాలను పూర్తిగా రద్దుచేయాలా లేక చట్ట ప్రకారం వాటిని నియంత్రించాలా అని లా కమిషన్ అడిగింది. కమిషన్ నివేదికను ప్రజల నుండి ఎటువంటి సూచన లేకుండా ప్రభుత్వానికి సమర్పించింది. కానీ ఈ నివేదిక ఏమయిందో తెలియదు.ఏది ఏమైనా ప్రభుత్వం 'ట్రిపుల్ తలాక్' పై ఒక చట్టాన్ని రూపొందించినట్లే, కామన్ సివిల్ కోడ్ లేదా యూనిఫాం సివిల్ కోడ్ మీద కూడా ఒక నిర్ణయం తీసుకోవచ్చు.

ప్రస్తుతం సమాజంలో నడుస్తున్న కొన్ని ఆచారాలను గమనిద్దాం
బహుభార్యత్వం
భారతీయశిక్షాస్మృతి 1860లోని సెక్షన్ 494, 495 ప్రకారం క్రైస్తవులలో బహుభార్యాత్వాన్ని నిషేధించారు.1955లో హిందూ వివాహ చట్టం ప్రకారం హిందువు భార్య జీవించి ఉండగా రెండో వివాహం చట్టవిరుద్ధంగా ప్రకటించారు.
1956 నాటి ఈ చట్టాన్ని గోవాలోని హిందువులకు మినహాఅందరికీ వర్తింపజేశారు. ముస్లిం వ్యక్తిగత చట్టం ఒప్పుకుంటున్నందున ఆ మతంలో పురుషుడు నాలుగు పెళ్లిళ్లు చేసుకోడానికి అనుమతించారు. పౌరవివాహ చట్టం ప్రకారం జరిగే వివాహాలలో అన్ని వర్గాల ప్రజలకు బహుభార్యాత్వం చట్టవిరుద్ధం.
బహుభర్తృత్వం
కొన్ని మారుమూల ప్రాంతాలలో మినహా భారతదేశంలో చాలావరకు బహుభర్తృత్వం అనే ఆచారం లేకుండా పోయింది. హిమాచల్‌ప్రదేశ్‌లోని కిన్నౌర్ ప్రాంతంలో ఈ ఆచారం ఎక్కువగా కనిపిస్తుంది. ఇది టిబెట్ సమీపంలోని ఇండో-చైనా సరిహద్దు ప్రాంతం. మహాభారతం ప్రకారం పాండవులు ఈప్రాంతంలోనే నివసించారు. అందుకే ఇక్కడ బహుభర్తృత్వం ఆచారం కొనసాగిందని చెబుతారు. దక్షిణ భారతదేశంలోని మలబార్ ప్రాంతంలోని ఇజావాస్, కేరళలోని ట్రావెన్కోర్ ప్రాంతంలోని నాయర్లు, నీలగిరి పర్వత ప్రాంతాలలో నివసించే తొద తెగ వారిలో ఈ ఆచారం కనిపిస్తుంది.
లా కమిషన్ప ప్రశ్నపత్రం బహుభర్తృత్వంపై కూడా సూచనలు అడిగింది.
ముతాహ్ నిఖా
ఇరాన్‌లోని షియా ముస్లిం శాఖల్లో ఈ ఆచారం ఎక్కువగా ఉంటుంది. ఇదిస్త్రీ, పురుషుల మధ్య ఒకరకమైన స్వల్పకాలిక వివాహ ఒప్పందం. ఇది రెండు లేదా మూడు నెలల వరకు ఉంటుంది. ఇప్పుడు ఇరాన్‌లో ఈ ఆచారం ముగింపు దశలో ఉంది.భారతదేశపు షియా వర్గాల్లో దీని ప్రాబల్యం చాలా తక్కువ.
చిన్నవీడు
చిన్నవీడు అంటే చిన్నఇల్లు. రెండో వివాహానికి సంబంధించిన విషయం. ఒకప్పుడు తమిళనాడులో ఈ ఆచారం అమలులో ఉండేది. ఒక ప్రముఖ రాజకీయ నాయకుడు కూడా రెండో వివాహం చేసుకున్నారు. అయితే ఇప్పుడు ఈ ఆచారం ఎక్కువగా పాటించడం లేదు.
మైత్రికరార్
ఈ పద్ధతి గుజరాత్‌లో ఇప్పటికీ అమలులో ఉంది. స్థానికంగా ఇది చట్టపరమైన ఆమోదం పొందింది. ఇద్దరు వ్యక్తుల మధ్య ఒప్పందాన్ని మేజిస్ట్రేట్ ఆమోదిస్తారు. ఒప్పందం చేసుకుంటున్న వారిలో ఒకరు అప్పటికే వివాహం చేసుకుని ఉంటారు.ఇదిస్త్రీ, పురుషులమధ్య ఒక రకమైన 'లివ్-ఇన్ రిలేషన్'. అందుకే దీనిని 'మైత్రి కరార్' అంటారు. గుజరాత్‌లో చాలామంది ప్రముఖ వ్యక్తులు కూడా ఈ రకమైన ఒప్పందంలో జీవనం సాగిస్తున్నారు. ఈ ఆచారం ద్వారా ఒక వివాహితుడు తన భార్య కాకుండా వేరే మహిళతో కలిసి జీవించడానికి సామాజికంగా గుర్తింపు పొందుతాడు.

ఫొటో సోర్స్, AFP/GETTY
కాలంతోపాటు మారని ఇస్లామిక్ చట్టాలు
కాలంతో పాటు మనమూ మారాలని ప్రగతిశీల భావాలున్నవారు చెబుతుంటారు. సమాజంలో ఇంకా సంస్కరణలు అవసరమని భావిస్తుంటారు. హిందూ సమాజం అనేక సంస్కరణలను చూసిందని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్‌తో సంబంధమున్న సందీప్ మహాపాత్ర బీబీసీతో అన్నారు.
హిందూ సమాజంలో అనేక దురాచారాలు తొలగిపోయాయని, కానీ ముస్లిం మతం సంస్కరణలకు ఇంకా దూరంగా ఉందని, ప్రాచీన ఆచారాలను ఆ మతస్తులు ఇప్పటికీ పాటిస్తున్నారని మహాపాత్ర అన్నారు. యూనిఫాం సివిల్ కోడ్‌ను సమర్థించిన ఆయన, ఇది వర్తిస్తే పితృస్వామ్యానికి బలైపోయే ప్రతి సమాజంలోని ప్రతి మహిళకు ఇది ప్రయోజనకరంగా మారుతుందని అన్నారు.
భారతీయ శిక్షాస్మృతి, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్‌ను అందరికీ వర్తింప జేసినట్లే, అన్ని మతాల వారికి ఒకేరకం చట్టాలు అమలయ్యేలా చూడాలని వృత్తిరీత్యా న్యాయవాది అయిన మహాపాత్ర అన్నారు.
"ముస్లింల దగ్గరే చర్చ మొదలవుతుంది. 1937 నుండి ముస్లిం పర్సనల్ లా లో సంస్కరణలులేవు. స్వాతంత్య్రం వచ్చిన తరువాత యూనిఫాం సివిల్ కోడ్ గురించి మాట్లాడారు. కాని దాన్నివారు వ్యతిరేకించారు. యూనిఫాం సివిల్ కోడ్ అమల్లో ఉన్న గోవా మన ముందే ఉదాహరణగా కనిపిస్తోంది" అని మహాపాత్ర అన్నారు.

ఫొటో సోర్స్, Reuters
యూనిఫాం సివిల్ కోడ్ అన్ని మతాలకు వర్తింపజేస్తే ఏమవుతుంది?
భారతదేశం విభిన్న సంస్కృతుల నిలయమని, ఎవరి పద్దతులు వారికున్నాయని, కామన్ సివిల్ కోడ్‌తో రాజకీయాలకు తప్ప ఎవరికీ ప్రయోజనం లేదని ముస్లిం పర్సనల్ లా బోర్డ్ ప్రధానకార్యదర్శి వలీ రెహమనీ బీబీసీతో అన్నారు. ఎవరికి నచ్చిన మతాన్ని, ఆచారాన్ని వారు పాటించవచ్చన్నారు.
‘‘మహిళలను శక్తివంతులను చేసి, పిల్లల భవిష్యత్తును పరిరక్షించే ప్రతి చట్టానికి నా మద్దతు ఉంటుంది. కానీ ఈ చట్టం మెజారిటీ మతస్తులకే అనుకూలంగా ఉంటుంది’’ అని సామాజిక కార్యకర్త జాన్ దయాళ్ అన్నారు. ప్రభుత్వం యూనిఫాం సివిల్ కోడ్ తీసుకురావాలనుకుంటే అన్ని సంప్రదాయాలను, సంస్కృతులను ఒక గొడుగు కిందకు తీసుకురావాలని, దానిపై చర్చించి నిర్ణయం తీసుకోవాలని జాన్ దయాళ్. అందరి మీదా రుద్దే ప్రయత్నం చేయకూడదన్నారు.
హిందూ మతంలోనే ఇంకా అనేక దురాచారాలున్నాయని, వాటిని చట్ట విరుద్ధం అనే శక్తి ప్రభుత్వానికి లేదని దయాళ్ వ్యాఖ్యానించారు. ‘‘దక్షిణ భారతదేశంలో ఓ ప్రాంతంలో మామ తన సొంత కోడలిని వివాహమాడే సంప్రదాయం ఉంది. దీనిని ప్రభుత్వం నిషేధించగలదా? జాట్లు, గుజ్జార్లలో ఉన్న దురాచారాలను ప్రభుత్వం అడ్డుకోగలదా? అది అంత సులభం కాదు’’ అని జాన్ దయాళ్ అన్నారు
ఇవి కూడా చదవండి:
- అమెరికా దారిలోనే బ్రిటన్... చైనాపై కఠిన చర్యలకు సిద్ధం
- చిన్న మార్పుతో చైనాను భారీ దెబ్బకొట్టిన ఇండియా
- ఆంధ్రప్రదేశ్‌లో బొగ్గు గనులు: తక్కువ లోతులోనే బొగ్గు ఉన్నా ఎందుకు తవ్వట్లేదు?
- భారత్‌లో నాలుగు దశాబ్దాల్లో తొలిసారిగా భారీగా తగ్గిన కర్బన ఉద్గారాలు
- ర్యాట్ హోల్ మైనింగ్: బొగ్గుగనిలో చిక్కుకున్న కార్మికులు.. కాపాడడం సాధ్యమేనా?
- రఫేల్ యుద్ధ విమానాలు ఫ్రాన్స్ నుంచి భారత్‌లోకి వచ్చేశాయి
- కార్గిల్ యుద్ధం: భారత సైన్యాన్ని ఆపడానికి అమెరికా శరణు కోరిన నవాజ్ షరీఫ్
- "శరీరంలో 15 బుల్లెట్లు దిగాయి, శక్తిని కూడదీసుకుని పాక్ సైన్యంపై గ్రెనేడ్ విసిరా"
- సైనికులు సోషల్ మీడియా యాప్‌లు ఉపయోగిస్తే ప్రమాదం ఏంటి?
- భారత్-చైనా సరిహద్దు ఘర్షణ: రెండు దేశాల బలగాలు ఎక్కడ 'ఢీ అంటే ఢీ' అన్నట్లున్నాయి?
- చైనా దాడిపై భారత్‌కు నిఘా సమాచారం అందలేదా?
- ‘లద్దాఖ్‌లో మన భూమిపై కన్నేసినవారికి తగిన సమాధానం చెప్పాం’ - చైనా పేరెత్తకుండా వ్యాఖ్యలు
- 1962 చైనాతో యుద్ధానికి ముందే నెహ్రూ ఆధిపత్యానికి అంతం మొదలైంది ఇలా..
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








