భారత్-చైనా సరిహద్దు వివాదం: సేనల ఉపసంహరణపై రెండు దేశాల ప్రకటనల్లో ఎందుకింత తేడా..

ఫొటో సోర్స్, YAWAR NAZIR/GETTY IMAGES
- రచయిత, శుభమ్ కిశోర్
- హోదా, బీబీసీ ప్రతినిధి
భారత్-చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తగ్గించడానికి ప్రయత్నాలు కొనసాగుతున్న సమయంలో “లద్దాఖ్‌లోని ఎల్ఏసీ నుంచి సైన్యాన్ని వెనక్కు పిలిపించే ప్రక్రియ ఇంకా పూర్తి కాలేద”ని భారత్ ఇటీవల ప్రకటించింది.
బలగాలను వెనక్కు పిలిపించే విషయంలో రెండు దేశాల్లో కాస్త పురోగతి ఉంది. కానీ అది ఇంకా పూర్తిగా జరగలేదు అని భారత విదేశాంగ శాఖ చెప్పింది.
రెండు దేశాల సీనియర్ కమాండర్లు సమావేశమవుతారని, ఈ అంశంపై రాబోయే రోజుల్లో భారత్-చైనా కలిసి పనిచేస్తాయని ఆ ప్రకటనలో చెప్పారు.
“సరిహద్దు ప్రాంతాల్లో శాంతి, స్థిరత్వం రెండు దేశాల బంధానికి పునాది అని మేం ఇంతకు ముందు కూడా చెప్పాం. అందుకే చైనా తమ బలగాలను ఉపసంహరించి, ఉద్రిక్తతలు తగ్గించడానికి, శాంతి స్థాపన కోసం ఇరుదేశాలూ ఇప్పటికే అంగీకరించిన ఒప్పందానికి అనుగుణంగా పనిచేస్తుందని మేం ఆశిస్తున్నాం” అని విదేశాంగ శాఖ చెప్పింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
చాలా ప్రాంతాల నుంచి తమ బలగాలను వెనక్కు పిలిపించామని అంతకు ముందు చైనా ప్రకటించింది. పాంగాంగ్ సరస్సుకు ఉత్తరాన చైనా సైన్యం సంప్రదాయ సరిహద్దు రేఖకు ఇవతలే ఉందని చైనా రాయబారి సన్ వెంగ్‌డాంగ్ చెప్పారు. “మా ప్రాంతం బయట ఉన్న భూభాగం మాదని చైనా ఎప్పటికీ చెప్పుకోలేదు” అన్నారు.
“భారత బలగాలు రెండు దేశాల మధ్య జరిగిన ఒప్పందాలు, ప్రొటోకాల్‌ను అనుసరిస్తాయని, అక్రమంగా ఎల్ఏసీని దాటి చైనా వైపు రావని మేం భావిస్తున్నాం” అని సన్ వెంగ్‌డాంగ్ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చైనీస్ స్టడీ వెబినార్‌లో అన్నారు.
“రెండు దేశాల ఉమ్మడి ప్రయత్నాల వల్ల చాలా ప్రాంతాల్లో సేనలు వెనక్కు వెళ్లాయి. క్షేత్రస్థాయిలో ఉద్రిక్తతలు తగ్గాయి” అని ఆయన చెబుతున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
సరిహద్దులో ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది?
రెండు దేశాల ప్రకటనలతో సరిహద్దుల్లో పరిస్థితిని అంచనా వేయడం చాలా కష్టం. ఒకవైపు చాలా ప్రాంతాల నుంచి బలగాలు వెనక్కు తగ్గాయని చైనా చెబుతుంటే, భారత్ మాత్రం ఆ దిశగా పురోగతి తక్కువగా ఉందని చెబుతోంది.
దీని గురించి తెలుసుకోడానికి చైనా అంశాల నిపుణులు జేఎన్‌యు ప్రొఫెసర్ స్వర్ణసింగ్‌తో బీబీసీ మాట్లాడింది.
ఎల్ఏసీ గురించి రెండు దేశాల అవగాహన భిన్నంగా ఉండడం వల్ల ఇరు దేశాల నుంచి వేరువేరు ప్రకటనలు రావడంలో ఆశ్చర్యం లేదు అని ప్రొఫెసర్ స్వర్ణసింగ్ అన్నారు.
“సరిహద్దుల్లో సైన్యం నిరంతరం గస్తీ కాస్తుంటుంది. ఆ సరిహద్దులను ఇంకా పూర్తిగా నిర్ధరించలేదు. అందుకే, వివాదం మొదలవడానికి ముందు ఏ సైన్యం ఏ ప్రాంతంలో ఉందనేది చెప్పడం కష్టంగా ఉంది” అన్నారు.
అందుకే, భారత్ ఎల్ఏసీగా భావిస్తున్న ప్రాంతం నుంచి చైనా ఇంకా వెనక్కు వెళ్లలేదు. కానీ, చైనా మాత్రం మేం మా భూభాగంలోనే ఉన్నామని చెబుతోంది.
“క్షేత్రస్థాయిలో ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందో ప్రభుత్వం తెలుసుకుంటోంది. ఏయే ప్రాంతాల నుంచి సైన్యం వెనక్కు వెళ్లిందో సమాచారం సేకరిస్తోంది. దానిపై ప్రభుత్వం చాలా సర్వేలు కూడా చేస్తుంటుందని నేను గట్టిగా చెప్పగలను. ఈ అంశంలో ప్రభుత్వం ఏ సమాచారం ఇస్తుందో, దానినే మనం నమ్మాలి” అని మాజీ దౌత్యవేత్త పి.స్టాబటన్ భావిస్తున్నారు.
చైనా సైన్యం ఎక్కడివరకూ వెనక్కు వెళ్లాలని మన ప్రభుత్వం అనుకుంటోందో, అక్కడి వరకూ వారు వెళ్లుండకపోవచ్చు. అందుకే ఇలాంటి ప్రకటనలు వస్తున్నాయని స్టాబటన్ చెప్పారు.
దాంతోపాటూ డీఎస్కలేషన్ ఒక సుదీర్ఘ ప్రక్రియ కావచ్చనేది తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యం.
రెండు దేశాల సైన్యం పరస్పరం ఎదురెదురుగా లేకపోతే, అది మంచి సంకతమే. సరిహద్దుల్లో ఉద్రిక్తతలను తగ్గించడం చాలా అవసరం. గత నెలతో పోలిస్తే ఆ ఉద్రిక్తతలు చాలా తగ్గాయి. అంటే, పరిస్థితి మెరుగ్గా ఉందనే అనుకోవాలి” అంటారు స్టాబటన్.

ఫొటో సోర్స్, EPA/STRINGER
సరిహద్దులో శాంతి ప్రయత్నాలు
గత నెలలో రెండు దేశాల ప్రతినిధుల మధ్య శాంతి ప్రయత్నాలు మొదలయ్యాయి.
భారత జాతీయ భద్రత సలహాదారు అజిత్ డోభాల్, చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ టెలిఫోన్లో చర్చలు జరిపారు. ఆ తర్వాత రెండు దేశాల వైపు నుంచి ప్రకటనల వెల్లువ మొదలైంది.
ఈ చర్చలతో వాస్తవ నియంత్రణ రేఖ దగ్గర వీలైనంత త్వరగా సైనికుల డిసెంగేజ్‌మెంట్ ప్రక్రియ ప్రారంభించడానికి భారత్-చైనా ప్రతినిధులు అంగీకరించారని భారత్ చెప్పింది.
ఆ తర్వాత చైనా కూడా ఒక ప్రకటనలో భారత్ లాగే నాలుగు ప్రధాన అంశాలను అంగీకరిస్తున్నట్లు చెప్పింది. రెండు దేశాల మధ్య దౌత్య, సైనిక స్థాయి చర్చల ప్రక్రియ కొనసాగుతుందని తెలిపింది.
అయితే చైనా ప్రభుత్వ ప్రకటనలో డిస్ఎంగేజ్‌మెంట్ మాటను గానీ, డీఎస్కలేషన్ ప్రక్రియ గురించి గానీ ప్రస్తావించలేదు.
వివాదం ఎలా పరిష్కరిస్తారు?
“ఇరుదేశాల మధ్య విదేశాంగ శాఖ స్థాయిలో సమన్వయం, అవగాహన పెంపొందించుకోవాల్సిన అవసరం ఉంది. తాము సరిహద్దుల్లో శాంతి కోరుకుంటున్నామని రెండు దేశాలూ చెబుతున్నాయి. అది మంచి సంకేతమే. దానితోపాటు సైనికాధికారుల స్థాయిలో కూడా వరుస చర్చలు జరుగుతున్నాయి” అని స్వర్ణసింగ్ అన్నారు,
చైనా తాజా ప్రకటనతో సరిహద్దుల్లో పరిస్థితి ఉద్రిక్తంగా మారుతున్నట్లు మనం భావించకూడదని నిపుణులు చెబుతున్నారు. రెండు దేశాల మధ్య శాంతి ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ, అన్నీ త్వరగా సమసిపోతాయని అనుకోవడం సరికాదు. సరిహద్దు వివాదాన్ని దౌత్య స్థాయిలో పరిష్కరించే ప్రయత్నాలకు చాలా సమయం పడుతుంది” అంటున్నారు.
ఇవి కూడా చదవండి:
- అమెరికా దారిలోనే బ్రిటన్... చైనాపై కఠిన చర్యలకు సిద్ధం
- చిన్న మార్పుతో చైనాను భారీ దెబ్బకొట్టిన ఇండియా
- విశాఖపట్నం హిందుస్తాన్ షిప్‌యార్డులో కుప్పకూలిన క్రేన్.. 11 మంది మృతి
- రాజ్యసభ సభ్యుడు అమర్ సింగ్ మృతి
- మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు మృతి
- కరోనా విపత్తు బొగ్గు పరిశ్రమను అంతమొందిస్తుందా
- మేఘాలయ: 'ర్యాట్ హోల్' బొగ్గు గనిలో ఎలా పనిచేస్తారు
- ఆంధ్రప్రదేశ్‌లో బొగ్గు గనులు: తక్కువ లోతులోనే బొగ్గు ఉన్నా ఎందుకు తవ్వట్లేదు?
- భారత్‌లో నాలుగు దశాబ్దాల్లో తొలిసారిగా భారీగా తగ్గిన కర్బన ఉద్గారాలు
- ర్యాట్ హోల్ మైనింగ్: బొగ్గుగనిలో చిక్కుకున్న కార్మికులు.. కాపాడడం సాధ్యమేనా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








