రఫేల్ విమానాలు వచ్చాయని సంబరాలు చేసుకోవాలా... భారత వాయుసేన పరిస్థితి ఏంటి?

రఫేల్

ఫొటో సోర్స్, INDIAN AIR FORCE

    • రచయిత, జుగల్ పురోహిత్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

రఫేల్ యుద్ధ విమానాలు జులై 29న అంబాలాలో దిగాయి. అయితే, దీని గురించి మాట్లాడుకునేముందు, కాలంలో కొంత వెనక్కి వెళ్దాం.

ఇంకా నిర్దిష్టంగా చెప్పాలంటే, 2000 సంవత్సరం ఆగస్టుకు వెళ్దాం.

అప్పటికి కార్గిల్ యుద్ధం ముగిసి ఏడాది గడిచింది.

126 మిరాజ్ 2000 II యుద్ధ విమానాలను సమకూర్చుకోవాలని భావిస్తున్నట్లు భారత వాయు సేన కేంద్ర రక్షణ శాఖకు తెలిపింది.

126 యుద్ధ విమానాల అవసరాన్ని ఈ 36 రఫేల్ యుద్ధ విమానాలు ఎలా తీరుస్తాయి?

ఫొటో సోర్స్, EUROPEAN PHOTOPRESS AGENCY

ఫొటో క్యాప్షన్, 126 యుద్ధ విమానాల అవసరాన్ని ఈ 36 రఫేల్ యుద్ధ విమానాలు ఎలా తీరుస్తాయి?

ఎందుకీ విమానాలు?

యుద్ధ పోరాటంలో మిరాజ్ విజయవంతమైన విమానమని, బహుముఖ పాత్రల్లో పోరాటం చేయగలదని వాయుసేన భావించింది. వాటి ద్వారా యుద్ధ విమానాల కొరతను పూడ్చుకోగలమని వాయుసేన భావించింది.

మూడేళ్ల తర్వాత, అంటే 2004 జనవరిలో ఈ ప్రతిపాదనను రక్షణశాఖ తోసిపుచ్చింది. అయితే, 2004కు తర్వాత వద్దాం.

భారత్ కోసం ఫ్రాన్స్‌లో తయారవుతున్న 36 రఫేల్ యుద్ధ విమానాల్లో మొదటి ఐదు ఈ ఏడాది జులై 29న అంబాలాలో దిగాయి.

ఈ విమానాల రాక భారత సైనిక చరిత్రలో కొత్త అధ్యాయానికి తెరతీసిందని, బహుముఖ పాత్రలు పోషించే ఈ యుద్ధవిమానాలు భారత వాయుసేన సామర్థ్యాల్లో విప్లవాత్మకమైన మార్పులు తీసుకువస్తాయని దేశ రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు.

‘‘విమానాల కొనుగోలు అంశం చాలా కాలం ఎటూ తేలకుండా ఉన్న తర్వాత, ఫ్రాన్స్‌తో ప్రభుత్వానికి ప్రభుత్వానికి మధ్య దీనికి సంబంధించి ఒప్పందం చేసుకోవాలని నరేంద్ర మోదీ సరైన నిర్ణయం తీసుకోవడంతోనే అవి భారత్‌కు వచ్చాయి’’ అని వ్యాఖ్యానించారు.

ఇంకా చాలా విషయాల గురించి రాజ్‌నాథ్ మాట్లాడారు. అయితే, అందులో సమాధానాలు లేకుండా మిగిలిన అంశాలు రెండు ఉన్నాయి.

రెండు దశాబ్దాలుగా ఉన్న 126 యుద్ధ విమానాల అవసరాన్ని ఈ 36 రఫేల్ యుద్ధ విమానాలు ఎలా తీరుస్తాయి? ఈ కొరతను ప్రభుత్వం ఎప్పుడు పరిష్కరిస్తుంది?

మోదీ

ఫొటో సోర్స్, TWITTER/ANURAGTHAKUR

యుద్ధ విమానాల కొరత తీరుతుందా?

1998 డిసెంబర్ నుంచి 2001 డిసెంబర్ వరకూ వాయుసేన‌కు అధిపతిగా ఉండి, కార్గిల్‌ యుద్ధంలో భాగంగా గగనతలంలో ఆపరేషన్ సఫేద్ సాగర్‌ను పర్యవేక్షించిన ఎయిర్ చీఫ్ మార్షల్ ఏవై టిప్నిస్ రఫేల్ విమానాల కొనుగోలు గురించి స్పందించారు.

‘‘(రఫేల్ విమానాల) రెండు స్క్వాడ్రన్లను సమకూర్చుకోవడం మనకు పెద్ద విషయంగా అనిపించవచ్చు. కానీ, మన సరిహద్దులు ఎంత పొడవు ఉన్నాయో దృష్టిలోకి తీసుకుంటే, అది పెద్ద విషయం కాదు. కనీసం నాలుగైదు స్క్వాడ్రన్లు ఉండాలన్నది నా అభిప్రాయం’’ అని అన్నారు.

ఒక్క స్క్వాడ్రన్‌లో 18 యుద్ధ విమానాలు ఉంటాయి.

‘‘చైనాకు మంచి విమానాలు లేకపోవచ్చు. కానీ, సంఖ్యాపరంగా చూస్తే వారికి ఎక్కువ ఉన్నాయి. అదే అసలు విషయం. చివరికి ఏ విమానమైనా, ఆయుధాలను మోసుకువెళ్లే ఓ వాహనమే’’ అని టిప్నిస్ వ్యాఖ్యానించారు.

వాయుసేన యుద్ధవిమానాల దళం 40 స్క్వాడ్రన్ల నుంచి 30 స్క్వాడ్రన్లకు పడిపోయిందని వాయుసేన మాజీ చీఫ్ ఒకరు అన్నారు. తన పేరు గోప్యంగా ఉంచాలని బీబీసీని ఆయన కోరారు.

‘‘మన ప్రత్యర్థి అంత వేగంగా బలాన్ని పెంచుకుంటుంటే, మనం ఒక దేశంగా ఇది ఎలా జరగనిచ్చాం. మిగ్21లు రిటైరవుతాయి. మిగ్‌27లు రిటైరవుతాయి. తర్వాత జాగ్వార్‌లు కూడా రిటైరవుతాయి. వాయుసేనలోకి రాకలు ఆ సంఖ్యను పూడ్చే స్థాయిలో లేవు’’ అని ఆయన అభిప్రాయపడ్డారు.

యుద్ధ విమానాల స్క్వాడ్రన్లు తగ్గుతున్నా, రఫేల్ లాంటి విమానాల రాక ప్రభావం ఎంతవరకూ ఉంటుందన్న ప్రశ్నకు... ‘‘మరిన్ని విమానాలు, మరిన్ని శక్తివంతమైన విమానాలు శత్రు నిరోధకంగా పనిచేస్తాయి. భారత్ సంఘర్షణను నివారించాలనుకుంటుంది. కానీ, ఈ నిరోధకత, సైనికశక్తి తగ్గుతూ పోతే, ఏదో ఒక రోజు మన శత్రువులు ఘర్షణ ద్వారా వాళ్లకు కావాల్సింది నెరవేర్చుకోవడానికి తహతహలాడతారు. సరళంగా చెప్పాలంటే... మనల్ని యుద్ధంలోకి నెడతారు’’ అని ఆయన బదులిచ్చారు.

ఎయిర్ టు ఎయిర్ రీఫ్యూయెలర్స్, ఎయిర్‌బార్న్ ఎర్లీ వార్నింగ్ అండ్ కంట్రోల్ ప్లేన్స్ కూడా గగనతల రక్షణలో కీలకమైన పాత్ర పోషితాయని అన్నారు.

‘‘మనకు అవి కొన్నే ఉన్నాయి. 10-15 ఏళ్లుగా వాటిని సమకూర్చుకునేందుకు మనం ప్రయత్నిస్తున్నాం. కానీ, తగినన్ని ఉన్నాయా?’’ అని అన్నారు.

రఫేల్

ఫొటో సోర్స్, IAF

‘రఫేల్‌తో వ్యూహాత్మక పైచేయి... కానీ,’

వాయుసేన అసంతృప్తిగా ఉందని చెప్పడం కూడా తప్పే అవుతుంది.

ఈ ఐదు యుద్ధ విమానాలైనా, వ్యూహాత్మకంగా వాయు సేనకు మరింత శక్తిని జోడిస్తాయని చాలా మంది అంటున్నారు.

‘‘ఈ ఐదు విమానాలు పూర్తి ఆయుధీకరణ చెందినవి. వీటితో మన సామర్థ్యాలు గణనీయంగా పెరుగుతాయి. వ్యూహాత్మకంగా మన స్థితిని మెరుగుపరుస్తాయి’’ అని వాయుసేన మాజీ వైస్ చీఫ్ ఎయిర్ మార్షల్ ఎస్‌బీ దేవ్ అన్నారు. దేశీయంగా మధ్యస్థ శ్రేణి యుద్ధ విమానాల తయారీకి చర్యలు తగినంతగా లేకపోవడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

‘‘హిందుస్థాన్ ఎరోనాటిక్స్ లిమిటెడ్, ఎరోనాటికల్ డెవెలప్‌మెంట్ ఏజెన్సీ, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవెలప్‌మెంట్ ఆర్గనైజేషన్ లాంటి మన సొంత సంస్థలు చాలా జాప్యం చేస్తున్నాయి. తేజాస్‌కు మించిన కొత్త తరం దేశీయ యుద్ధ విమానం డిజైన్లు ఫైనలైజ్ అయ్యి, ఇప్పటికే పని మొదలుకావాలి. కానీ, మనం ఇంకా ఎక్కడున్నాం?’’ అని అన్నారు.

తేజాస్ తేలికపాటి యుద్ధ విమానాల విభాగంలోకి వస్తుంది.

దేశీయ సంస్థలపై ప్రభుత్వమే కాదు, వాయు సేన కూడా ఆశలు పెట్టుకున్నాయి.

యుద్ధ విమానాలను దిగుమతి చేసుకోవడమనేది తాను ప్రోత్సహించే విషయం కాదని ఎయిర్ చీఫ్ మార్షల్ ఆర్‌కేఎస్ భదౌరియా గత అక్టోబర్‌లో వ్యాఖ్యానించారు కూడా.

రఫేల్ యుద్ధ విమానాలు

ఫొటో సోర్స్, IAF

తదుపరి తరం యుద్ధ విమానాన్ని భారత్ తయారు చేసుకోగలదా?

ఈ ప్రశ్నకు సీడీ బాలాజీ బాగా సమాధానం చెప్పగలరు. నౌకాదళంలో కమాండర్‌గా పనిచేసిన ఆయన ఆ తర్వాత రక్షణశాఖలోని ఎరోనాటికల్ డెవెలప్‌మెంట్ ఏజెన్సీకి అధిపతిగా పనిచేశారు.

‘‘దేశీయ విమానాల తయారీకి సంబంధించి రెండు అంశాలు ఉన్నాయి. ఒకటి పరిశోధన, ఇంకొకటి ఉత్పత్తి. భారత్ తదుపరి తరం యుద్ధ విమానాన్ని అడ్వాన్స్‌డ్ మీడియం కొంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ (ఏఎమ్‌సీఏ) అంటారు. ఈ ప్రాజెక్టు కోసం ప్రాథమిక డిజైన్ ఐదేళ్ల క్రితమే పూర్తైంది. పూర్తి స్థాయి ఇంజినీరింగ్ డెవెలప్‌మెంట్ (ఎఫ్‌ఎస్‌ఈడీ) కోసం కేంద్ర ప్రభుత్వం అనుమతి గురించి వేచిచూస్తున్నాం. వాయుసేనో, ప్రభుత్వమో ఆసక్తి చూపించకపోవడం కాదు. కానీ, వాస్తవాలు వాటికవే మాట్లాడతాయి’’ అని అన్నారు.

అనుమతులకు జాప్యం జరిగితే ఏమవుతుంది?

‘‘మా ప్రయత్నాలపై దాని ప్రభావం పడుతుంది. సాంకేతికంగా అంతరం ఏర్పడుతుంది. దాన్ని పూడ్చేందుకు డిజైన్లను మేం మారుస్తూ వెళ్లాల్సి వస్తుంది’’ అని ఆయన వివరించారు.

‘‘పెద్ద సంఖ్యలో తేజాస్ విమానాలను ఇచ్చేందుకు రక్షణ శాఖ సొంత విమాన తయారీదారు హెచ్‌ఏఎల్ ప్రయత్నాలు చేస్తోంది. కానీ, ఇక్కడ ఓ విషయం నేను గుర్తు చేయాలనుకుంటున్నా. 2016లో రక్షణ శాఖ 83 ఎల్‌సీఏ తేజాస్ ఎమ్‌కే1ఏ (అధునాతన రకం) విమానాలను సమకూర్చుకునే ఒప్పందానికి ఆమోదం తెలిపింది. కానీ, ఇప్పటివరకూ అది జరగలేదు. దేశీయ ఉత్పత్తిలోనూ ఇలాంటి జాప్యానికి ఏం సమాధానం చెబుతారు’’ అని అన్నారు.

రఫేల్

ఫొటో సోర్స్, Joe Giddens/PA Wire

డబ్బు సంగతి

అధునాత సాంకేతికత, ఖరీదైన వ్యవస్థల్లో పెట్టుబడి పెట్టాలని ఏ వాయుసేన అయినా కోరుతుంది.

కానీ, భారత వాయుసేన అవి సులభంగా సమకూర్చుకునే పరిస్థితిలో లేదు.

‘‘త్రివిధ దళాల (సైన్యం, నావికాదళం, వాయుసేన) ఆధునికీకరణపై కొన్నేళ్లుగా ప్రభావం పడుతూనే ఉంది. వాయుసేన పెట్టుబడులు ఎక్కువగా అవసరమైన దళం. అందుకే దాని మీద ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుంది’’ అని మనోహర్ పారికర్ డిఫెన్స్ స్టడీస్ అండ్ అనాలసిస్ రీసెర్చ్ ఫెలో డాక్టర్ లక్ష్మణ్ కుమార్ బెహెరా అన్నారు.

లక్ష్మణ్ కుమార్ విశ్లేషణ ప్రకారం రెండేళ్లుగా కొనుగోలు ఒప్పందాల విలువకు, త్రివిధ దళాలకు అందుబాటులో ఉన్న నిధులకు మధ్య అంతరం బాగా పెరుగుతోంది.

2018-19లో అది 33 శాతం, 2019-20లో 29 శాతంగా ఉంది.

‘‘వాయుసేన ఇప్పుడు అట్టడుగున ఉంది. పైకి రావడమే ఇప్పుడున్న ఏకైక మార్గం. కానీ, 100-200 యుద్ధ విమానాల ఒప్పందాల గురించి మాట్లాడుకునే రోజులు పోయాయి. కోవిడ్-19 నేపథ్యంలో ప్రస్తుత బడ్జెట్ పరంగా చూస్తే, సాధ్యాసాధ్యాలను వాయుసేన పరిశీలించుకోవడం అవసరం. పాత వాదనలు, అంకెలు ఇంకా వర్తిస్తాయా అన్నది చూసుకోవాలి’’ అని లక్ష్మణ్ కుమార్ వ్యాఖ్యానించారు.

మిరాజ్ యుద్ద విమానం

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్, మిరాజ్ యుద్ద విమానం

మళ్లీ గతంలోకి...

మిరాజ్ 2000 యుద్ధ విమానాల కోసం వాయుసేన చేసిన ప్రతిపాదనను తిరస్కరించడానికి 2000 ఆగస్టు నుంచి 2000 జనవరి మధ్యలో ఏం జరిగింది?

126 మిరాజ్ 2000 II యుద్ధ విమానాలను కొనుగోలు చేయాలని రక్షణశాఖను ఒప్పించేందుకు వాయుసేన ఒకటి కాదు, రెండు కాదు... మూడు సార్లు ప్రయత్నించినట్లు ప్రభుత్వ పత్రాలు చెబుతున్నాయి.

రఫేల్ యుద్ధ విమానాల గురించి ప్రస్తావిస్తూ... ప్రదర్శనలో మిరాజ్ 2000 II వాటితో పోల్చదగ్గవని, పైగా తక్కువ ధరకు, అధునాతన సాంకేతికతతో వస్తాయని వాయుసేన వాదించింది. కానీ, ప్రభుత్వం స్పందించలేదు.

ఆనాటి ఈ చిన్నపాటి పొరపొచ్చాలు చాలా తక్కువ మందికి గుర్తుంటాయి. అయితే, వాయుసేన మాత్రం వీటిని మరిచిపోయే అవకాశాలు తక్కువ.

‘‘126 యుద్ధ విమానాలతో మేం 15 ఏళ్లు పనిచేశాం. 36 విమానాలు వస్తాయని, దానికి కూడా 5-6 ఏళ్లు సమయం పడుతుందని ఓ రోజు చెప్పారు. ఇప్పుడు వాటిలో ఐదు విమానాలు వస్తే సంబరాలు చేసుకుంటున్నాం. కానీ, ఎందుకు?’’ అని పేరు వెల్లడించేందుకు ఇష్టపడని మాజీ ఎయిర్ చీఫ్ ప్రశ్నించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)