ఇండియన్ ఆర్మీలో మహిళలకు శాశ్వత కమిషన్ ఏమిటి? దీనివల్ల ఏం జరుగుతుంది?

ఫొటో సోర్స్, GETTY IMAGES
- రచయిత, కమలేష్
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఐదేళ్ల షార్ట్ సర్వీస్ కమిషన్ నుంచి మహిళలకు ఒక శాశ్వత కమిషన్ సాధించుకునే వరకూ భారత సైన్యంలో సాగిన ప్రయాణం ఇప్పుడు పూర్తైంది. ప్రభుత్వం దానికి తన ఆమోద ముద్ర వేసింది.
సమానత్వం దిశగా ఇది ఒక పెద్ద అడుగు అని ఒక మహిళా సైనికాధికారి భావించారు. కల నిజమైనట్లు అనిపిస్తోందన్నారు.
“2008లో మేం ఈ పోరాటం ప్రారంభించినపుడు నిజంగా ఈ రోజు వస్తుందని మేం అసలు అనుకోలేదు. మహిళలకు శాశ్వత కమిషన్ సాధించడం అంత సులభం కాదు. కానీ ప్రయత్నిస్తే అసాధ్యాలు కూడా సుసాధ్యం అవుతాయని ఈరోజు అనిపిస్తోంది. దీనివల్ల మహిళల ధైర్యం పెరగడమే కాదు, ఆకాశమే హద్దుగా వారి ముందు ఇప్పుడు చాలా అవకాశాలు కూడా ఉంటాయి” అని పదవీ విరమణ చేసిన లెఫ్టినెంట్ కల్నల్ డాక్టర్ అనుపమా మున్షీ చెప్పారు.
అనుపమ, మరో 11 మంది మహిళా అధికారులతో కలిసి మహిళలకు శాశ్వత కమిషన్ అందించాలని పిటిషన్ వేశారు.
ఆ పిటిషన్‌పై విచారణలు జరిపిన సుప్రీంకోర్టు ఫిబ్రవరి 17న భారత ఆర్మీలో మహిళా అధికారులకు శాశ్వత కమిషన్ ఇవ్వడంపై తీర్పు వినిపించారు.
మహిళలకు భారత సైన్యంలో శాశ్వత కమిషన్ అందించడానికి ఇప్పుడు రక్షణ మంత్రిత్వ శాఖ ఆమోదముద్ర వేసింది. దీనికి సంబంధించి అధికారిక ఆదేశాలు కూడా జారీ చేసింది.

ఫొటో సోర్స్, ANUPAMA MUNSHI
శాశ్వత కమిషన్ అంటే?
షార్ట్ సర్వీస్ కమిషన్ కింద మహిళలు సైన్యంలో 10 నుంచి 14 ఏళ్లు మాత్రమే సేవలు అందిస్తున్నారు. ఆ తర్వాత వారు పదవీ విరమణ చేయాలి. కానీ ఇప్పుడు వారు శాశ్వత కమిషన్‌కు దరఖాస్తు చేసుకునే అవకాశం లభిస్తుంది. అలా వారు సైన్యంలో తమ సేవలు కొనసాగించవచ్చు. ర్యాంక్ ప్రకారం పదవీ విరమణ చేయవచ్చు. దానితోపాటూ వారికి పెన్షన్, మిగతా అన్ని భత్యాలూ లభిస్తాయి.
1992లో షార్ట్ సర్వీస్ కమిషన్ కోసం మహిళల మొదటి బ్యాచ్‌ను భర్తీ చేశారు. అప్పట్లో ఇది ఐదేళ్ల వరకే ఉండేది. ఆ తర్వాత ఆ సేవల అవధిని 10 ఏళ్లకు, 2006లో 14 ఏళ్లకు పెంచారు.
పురుష అధికారులు షార్ట్ సర్వీస్ కమిషన్ పదేళ్లు పూర్తి చేస్తే తమ అర్హత ప్రకారం శాశ్వత కమిషన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. కానీ మహిళలు అలా చేయడం కుదరదు. ప్రస్తుతం మహిళలను షార్ట్ సర్వీస్ కమిషన్ ద్వారా సైన్యంలో భర్తీ చేస్తున్నారు. పురుషులను మాత్రం నేరుగా శాశ్వత కమిషన్ ద్వారా కూడా భర్తీ చేయవచ్చు.
శాశ్వత కమిషన్‌లో ఇకమీదట మహిళలను కూడా నేరుగా భర్తీ చేస్తారా, లేదా అనేది ఇక ముందు చూడాలి. దాని కోసం వేరే నిబంధనలు రూపొందించాల్సి ఉంటుంది.

ఫొటో సోర్స్, GETTY IMAGES
పది శాఖల్లో శాశ్వత కమిషన్
ప్రభుత్వ తాజా నిర్ణయం సైన్యంలో మహిళా అధికారులు కీలక పాత్ర పోషించడానికి, సాధికారతకు కొత్త దారులు తెరుస్తుందని భారత సైన్యం ప్రతినిధి కల్నల్ అమన్ ఆనంద్ అన్నారు.
భారత సైన్యంలో మొత్తం 10 శాఖల్లో ఉన్న షార్ట్ సర్వీస్ కమిషన్(ఎస్ఎస్‌సి) మహిళా అధికారులకు శాశ్వత కమిషన్ అందిస్తామని ఆదేశాలలో చెప్పారని కల్నల్ అమన్ ఆనంద్ పీటీఐతో అన్నారు.
“మహిళలకు సైన్యంలోని పది శాఖల్లో, అంటే.. ఆర్మీ ఎయిర్ డిఫెన్స్, సిగ్నలింగ్, ఇంజనీర్స్, ఆర్మీ ఏవియేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజనీర్స్, ఆర్మీ సర్వీస్ కార్ప్స్, ఆర్మీ ఆర్డినెన్స్ కార్ప్స్, ఇంటెలిజెన్స్ కార్ప్స్ లో శాశ్వత కమిషన్(పీసీ) ఇవ్వడానికి ఆమోదం లభించింది” అని కల్నల్ ఆనంద్ చెప్పారు.
ప్రస్తుతం మహిళలకు జడ్జ్ అండ్ అడ్వకేట్ జనరల్(జేఏసీ), ఆర్మీ ఎడ్యుకేషనల్ కోర్(ఏడీసీ)లో మాత్రమే శాశ్వత కమిషన్ లభిస్తోంది.
అంటే, ఇప్పుడు బాధిత ఎస్ఎస్‌సి మహిళా అధికారులు అందరూ తమ ప్రత్యామ్నాయాలను ఉపయోగించుకుని, అవసరమైన పత్రాలు పూర్తి చేయగానే, వారి ఎంపికను బోర్డు నిర్ణయిస్తుంది అని సైన్యం ప్రతినిధి చెప్పారు.
ఈ ప్రత్యామ్నాయాలతో భారత సైన్యంలో భాగం కావాలని కోరుకునే అమ్మాయిలే కాదు, సైన్యంలో ప్రస్తుతం ఉన్న మహిళలకు కూడా ఒక కొత్త మార్గం తెరుచుకుంది. అందులో సమానత్వం, గౌరవం లభిస్తుంది.

ఫొటో సోర్స్, TAUSEEF MUSTAFA/AFP VIA GETTY IMAGES
ఒక నిర్ణయం, ఎన్నో మార్పులు
శాశ్వత కమిషన్ కోసం మొదటి పిటిషన్ 2003లో వేశారు. ఆ తర్వాత 11 మంది మహిళా అధికారులు దీనిపై 2008లో మళ్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు మహిళల పక్షాన తీర్పు వినిపించింది. కానీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఆ తీర్పును సవాలు చేసింది. ఫిబ్రవరి 2020లో సుప్రీంకోర్టు కూడా మహిళా అధికారులకు అనుకూలంగా తమ తీర్పు చెప్పింది.
“ఇది ఒక పెద్ద నిర్ణయం. రాబోవు రోజుల్లో ఇది ఎన్నో సానుకూల మార్పులు తీసుకువస్తుంది” అని పిటిషనర్లలో ఒకరైన మాజీ సైనిక అధికారి అంకితా శ్రీవాస్తవ్ చెప్పారు.
ఆర్డినెన్స్ కోర్‌లో ఎస్ఎస్‌సి ద్వారా 14 ఏళ్ల సర్వీస్ తర్వాత శ్రీవాస్తవ్ పదవీవిరమణ చేశారు. శాశ్వత కమిషన్ వల్ల మహిళలకు ఎలాంటి ప్రయోజనాలు లభిస్తాయో ఆమె వివరించారు.
“మొదటి మార్పు- మహిళా అధికారులకు పదోన్నతులు లభిస్తాయి. షార్ట్ సర్వీస్ కమిషన్‌లో నేను లెఫ్టినెంట్ కల్నల్ నుంచి ముందుకు వెళ్లలేకపోయాను. కానీ, ఇప్పుడు మహిళలు అడ్వాన్స్ లెర్నింగ్ విభాగం కోర్సులకు కూడా పంపిస్తారు. మనం అందులో మంచి ప్రదర్శన చూపిస్తే, పదోన్నతికి ఆ ప్రయోజనం లభిస్తుంది. మహిళలు శాశ్వత కమిషన్ కోసం ఎంపికయితే కల్నల్, బ్రిగేడియర్, జనరల్ కూడా కావచ్చు”
“రెండో ప్రయోజనం-ప్రభుత్వ ఆదేశాలు రావడంతో ఇప్పుడు మహిళల భర్తీ కోసం వచ్చే ప్రకటనల్లో మీ అర్హతలను బట్టి శాశ్వత కమిషన్ అందిస్తామని చెబుతారు. ఇంతకు ముందు నోటిఫికేషన్‌లో 14 ఏళ్ల షార్ట్ సర్వీస్ కమిషన్‌ను మాత్రమే ప్రస్తావించేవారు”.
“సైన్యంలోని ఈ పది శాఖల్లో మనం శాశ్వత కమిషన్ ద్వారా ఉన్నత పదవుల వరకూ చేరుకోవచ్చని ఇప్పుడు కొత్తగా వచ్చే అమ్మాయిలకు తెలుస్తుంది. వారు దానికి తగినట్లు చదవుతారు, మిగతా సన్నాహాలు చేసుకుంటారు”.
మూడో ప్రయోజనం- ఎస్ఎస్‌సిలో 14 ఏళ్లు పూర్తి చేసి పదవీ విరమణ చేసే సమయానికి మహిళలకు 37-38 ఏళ్లు వచ్చేసుంటాయి. ఇప్పుడు ఆ వయసులో సైన్యం నుంచి బయటికి వస్తే, మన ముందు జీవనోపాధి కోసం చాలా పనుల మార్గాలు ఉంటాయి. అందుకే, వారికి పెన్షన్ కూడా రాదు. కానీ, ఇప్పుడు సైన్యంలో మహిళలకు 54 ఏళ్లు ఉద్యోగం చేసే అవకాశం ఉంటుంది.
అనుపమా మున్షీ కూడా ఆమెతో ఏకీభవిస్తున్నారు.
“ఆ వయసులో సైన్యంలో పనిచేశాక ఖాళీగా ఉంటే జీవితం ఎలా గడుస్తుంది. దాంతో, చాలా మంది మహిళలు డిప్రెషన్‌లో వెళ్లిపోతారు. మనకు ప్రైవేటు కంపెనీల్లో చేరడం లేదా, టీచింగ్ దారి మాత్రమే ఉంటుంది. టీచింగ్ కోసం బీఎడ్ లేదా పీహెచ్‌డీ చేయాల్సి ఉంటుంది. మళ్లీ కాలేజీ పిల్లలు చేసిన అన్నీ చేయాలి. ప్రైవేటు కంపెనీల్లో కూడా మనం మళ్లీ మొదటి నుంచీ ప్రారంభించాల్సి ఉంటుంది” అన్నారు.
అనుపమ కూడా బీఎడ్ పూర్తి చేసిన తర్వాత ఇప్పుడు టీచరుగా పనిచేస్తున్నారు.

ఫొటో సోర్స్, Ankita Srivastava
శాశ్వత కమిషన్‌పై వ్యతిరేకత ఎందుకు
ఆర్మీలో శాశ్వత కమిషన్ కావాలని మహిళల నుంచి చాలా కాలంగా డిమాండ్లు వస్తున్నాయి. కానీ సైన్యం, ప్రభుత్వ స్థాయిలో దానిని వ్యతిరేకిస్తూ వచ్చారు. ఒకసారి పెళ్లి, పిల్లలు కారణం చెబితే, మరోసారి పురుషులకు అసౌకర్యంగా ఉంటుందని చెబుతూ వచ్చారు.
“మహిళలను ప్రయోగాత్మకంగా షార్ట్ సర్వీస్ కమిషన్‌లో తీసుకున్నారు. కానీ మహిళా అధికారులు తమను తాము నిరూపించుకున్నారు. శారీరకంగా గానీ, మానసికంగా గానీ మేం బలహీనులం కామని చూపించాం. మహిళలు భారత సైన్యాన్ని బలోపేతం చేయగలరు. కానీ మెల్లమెల్లగా చాలా మంది పురుష అధికారుల్లో అభద్రతా భావం వచ్చింది. తమకు పేరొచ్చే రంగంలో మహిళలు ఆధిపత్యం చూపుతున్నారని వారికి అనిపించింది” అని అంకితా శ్రీవాస్తవ్ చెప్పారు.
“ఆ తర్వాత మహిళలపై ఆ ఫీల్డులోకి వెళ్లకూడదని, పెళ్లి చేసుకుని పిల్లల్ని కనాలని కుటుంబం నుంచి ఒత్తిళ్లు ఉంటాయని చెప్పారు. వాటి కోసం సెలవులు తీసుకుంటారని, దానివల్ల వారి విధులపై ప్రభావం పడుతుందని, అందుకే వారికి శాశ్వత కమిషన్ ఇవ్వకూడదని వాదించారు”.
“పురుష జవాన్లు గ్రామీణ ప్రాంతాల నుంచి వస్తారు. మహిళా అధికారుల దగ్గర పనిచేయడానికి, వారి ఆదేశాలు పాటించడానికి వారికి ఇబ్బందిగా ఉంటుంది అనే కారణం చెప్పారు. కానీ, మొదట్లో అలా జరిగేదేమో కానీ, ఇప్పుడలా లేదు. మహిళలు కూడా తమలాగే కష్టపడే అక్కడివరకూ వచ్చారని, షార్ట్ కట్‌లో ఎవరూ రాలేరనేది పురుషులు కూడా తెలుసుకున్నారు” అన్నారు అనుపమా మున్షీ
“నేను స్వయంగా చాలాసార్లు మగ జవాన్లతో మాట్లాడాను. మేడమ్ మేం ఆదేశాలు పాటించాలి అంతే, పురుషులైనా, మహిళలైనా మాకు ఏ తేడా లేదు అన్నారు. నా కింద పనిచేసే చాలా మంది జవాన్లు, నాకు వారి ఇబ్బందులు చెప్పుకునేవారు. కానీ, పురుష అధికారులకు చెప్పేవారు కాదు. మహిళ కాబట్టి మరింత సున్నితత్వంతో వింటుందని వారు నమ్మేవారు” అన్నారు.
“ఐదేళ్ల షార్ట్ సర్వీస్ కమిషన్‌లో కూడా తర్వాత ఏ దారీ లేదని తెలిసినా, మహిళలు కష్టపడి, ఏకాగ్రతతో పనిచేయాల్సి ఉంటుంది. ఇక ముందు వచ్చే అమ్మాయిలు దీనకి ఎన్నో రెట్లు కష్టపడతారు. ఎందుకంటే, సైన్యంలో ఇప్పుడు ఎంత ఎత్తులకు చేరగలమో వారికి తెలుసు. అది చాలా పెద్ద ప్రేరణను ఇస్తుంది” అని పదవీ విరమణ చేసిన ఇద్దరు మహిళా అధికారులూ చెబుతున్నారు.
రాబోయే రోజుల్లో మనం ఒక మహిళా బ్రిగేడియర్‌ను చూస్తారేమో, ఆమె ఒక్కరే అయినా, ఆ ఒక్కరికైనా సమాన అవకాశం లభించినట్టే అవుతుంది.
ఇవి కూడా చదవండి:
- పాకిస్తాన్ నిర్మిస్తున్న ఆనకట్టపై భారత్ ఎందుకు అభ్యంతరం చెబుతోంది?
- భారత జనాభా ఈ శతాబ్దం చివరికి ఎందుకు తగ్గుతుంది... తగ్గితే ఏమవుతుంది?
- వ్యాక్సిన్ త్వరలో వచ్చేస్తుందనుకుంటే అది అత్యాశే: ప్రపంచ ఆరోగ్య సంస్థ
- తూర్పుగోదావరి జిల్లాలో ఒక వ్యక్తి నుంచి 100 మందికి కరోనావైరస్.. ఎలా వ్యాపించింది?
- హైదరాబాద్ నుంచి ఇప్పటివరకు ఎంతమంది వెళ్లిపోయారు
- సెక్స్ వర్కర్లు ఆ దేశంలో రెయిన్ కోట్ ఎందుకు వేసుకుంటున్నారు?
- రిలయన్స్ జియో 5జీ వస్తోంది.. కానీ భారతీయులు ఎన్నాళ్లు ఎదురు చూడాలి?
- చైనా - భారత్ మధ్య 45 ఏళ్లుగా లేనంత గొడవలు ఇప్పుడెందుకు?
- భారత్ - చైనా 1962 యుద్ధం: పిరికిపందల చర్యా లేక నమ్మకద్రోహమా?
- చైనా, ఇరాన్‌ల సీక్రెట్ డీల్: భారత్‌కు ఎంత నష్టం
- పాకిస్తాన్ నిర్మిస్తున్న ఆనకట్టపై భారత్ ఎందుకు అభ్యంతరం చెబుతోంది?
- అక్కడ అమ్మాయి పేరు ఎవరికీ చెప్పకూడదు.. పెళ్లి పత్రాల్లో రాయరు, మరణ ధ్రువీకరణల్లో ఉండదు
- ఆంధ్రప్రదేశ్‌లో కరోనావైరస్ హాట్ స్పాట్‌గా మారిన తూర్పు గోదావరి
- భారత జనాభా ఈ శతాబ్దం చివరికి ఎందుకు తగ్గుతుంది... తగ్గితే ఏమవుతుంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








