అయోధ్య లాగే కాశీ, మథుర తీర్పులు కూడా హిందువులకు అనుకూలంగా ఉంటాయా?

ఫొటో సోర్స్, Suresh Saini
- రచయిత, అనంత్ ప్రకాశ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
2020 సెప్టెంబర్ 30. ఈ తేదీ భారత చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయింది.
ఎందుకంటే, లఖ్‌నవూలో సీబీఐ ప్రత్యేక కోర్టు బాబ్రీ మసీదు విధ్వంసం కేసులో అందర్నీ నిర్దోషులుగా ప్రకటించింది. మసీదు కూల్చివేతలో ఎలాంటి కుట్రా జరగలేదని కూడా కోర్టు తన తీర్పులో భావించింది.
కోర్టు తీర్పుపై రకరకాల స్పందనలు వస్తున్నాయి.
ఈ తీర్పుతో దేశంలో దశాబ్దాలుగా నడుస్తున్న మందిరం-మసీదు వివాదాలకు తెరపడేలా కనిపిస్తోంది.
కానీ, ఇదే సెప్టెంబర్ 30న ఉత్తరప్రదేశ్‌లోని మరో కోర్టులో వేసిన మధురలోని షాహీ ఈద్గా మసీదు కేసు కూడా వెలుగులోకి వచ్చింది.

ఫొటో సోర్స్, SURESH SAINI
కాశీ-మథుర కేసులు
రామజన్మభూమి కేసులో సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ఇక భారత్‌లోని మిగతా ఏ మతపరమైన స్థానాలనూ నాశనం చేసే అవకాశం లేదనే విషయం స్పష్టమైంది.
దేశ అత్యున్నత న్యాయస్థానం తన చారిత్రక తీర్పులో 1991 నాటి ‘ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్’(ఆరాధనా స్థలాల చట్టం)ను ప్రస్తావించింది.
కానీ, రామజన్మభూమి తీర్పు వచ్చిన తర్వాత, “ఇక కాశీ, మథుర మిగిలాయి” అనే నినాదాలు వినిపిస్తూ వచ్చాయి.
శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర అధ్యక్షుడు మహంత్ నృత్య గోపాల్‌దాస్ ఆగస్టు 11న మధురలో “అయోధ్య తర్వాత ఇక మధుర వంతు” అన్నారు.
అటు, దేవమురారీబాపూ కూడా “మందిరం నిర్మించడానికి మసీదును తొలగించాల”న్నారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు.
కానీ, ఇటీవల మథుర, కాశీలో ఉన్న మసీదులను కూడా తొలగించాలనే డిమాండ్ ప్రకటనల వరకే పరిమితం కాకుండా, కోర్టుకు కూడా చేరింది.
రంజనా అగ్నిహోత్రి, విష్ణు శంకర్ జైన్, హరిశంకర్ జైన్ సహా మరో ముగ్గురు మథురలోని ఒక కోర్టులో సివిల్ కేసు వేశారు.
ఈ కేసులో షాహీ ఈద్గా మసీదును తొలగించాలని పిటిషనర్లు డిమాండ్ చేశారు. షాహీ ఈద్గా మసీదును కట్టిన నేల కింద, శ్రీకృష్ణుడి జన్మభూమి ఉందన్నారు.
ఈ కేసులో కూడా ముస్లిం ఆక్రమణదారులు, మధుర విషయంలో ఔరంగజేబు కృష్ణుడి ఆలయాన్ని ధ్వంసం చేసి మసీదు నిర్మించారని వాదించారు.
కానీ, విచారణకు తగినది కాదని కోర్టు ఈ కేసును తిరస్కరించింది. దానితోపాటూ 1991లో ఆమోదించిన ‘ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్’ను కూడా ప్రస్తావించింది.

ఆరాధన స్థలాల చట్టం ఏంటి
1991లో పీవీ నరసింహారావు ప్రభుత్వం ‘ఆరాధనా స్థలం(ప్రత్యేక నిబంధన) చట్టం’ ఆమోదించింది.
ఈ చట్టంలో 1947 ఆగస్టు 15 నాటికి భారత్‌లో ఏ మతపరమైన స్థానాలు ఎలాంటి స్వరూపంలో ఉన్నాయో, అవి అలాగే ఉంటాయని చెప్పారు. దీని నుంచి అయోధ్య వివాదానికి మినహాయింపు ఇచ్చారు.
కానీ, కాశీలోని జ్ఞానవాపీ మసీదు, మధురలోని షాహీ ఈద్గా సహా దేశంలోని అన్ని మతపరమైన స్థలాలకు ఈ చట్టం వర్తిస్తుంది.
“ఒక వ్యక్తి మత సంప్రదాయం లేదా దానికి సంబంధించిన విభాగానికి చెందిన ఒక ఆరాధనా స్థలాన్ని, ఆ మత సంప్రదాయాలకు భిన్నంగా వేరే మత సంప్రదాయం లేదా దాని విభాగానికి సంబంధించిన ఆరాధనా స్థలంగా మార్చకూడదు” అని ఈ చట్టంలోని సెక్షన్(3)లో చెప్పారు.
ఇదే చట్టంలోని సెక్షన్ 4లో 1947 ఆగస్టు 15 నాటికి దేశంలోని ప్రార్థనా స్థలాలకు ఏ మత స్వరూపం ఉందో, అవి ఆరోజు ఎలా ఉన్నాయో అలాగే ఉంటాయని కూడా చెప్పారు.
“ఒకవేళ ఈ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత 1947 ఆగస్టు 15 నాటికి ఉన్న ప్రార్థనా స్థలాల ధార్మిక స్వరూపాన్ని మార్చడం గురించి కోర్టులు, ట్రిబ్యునళ్లలో కేసులు, అపీళ్లు, ప్రొసీడింగ్స్ ఏవైనా పెండింగులో ఉంటే అవి రద్దవుతాయి. అలాంటి కేసులకు సంబంధించిన దావాలు, అపీళ్లు, ప్రొసీడింగ్స్ లాంటివి ఏవీ కోర్టు, ట్రిబ్యునల్ లేదా అథారిటీల ఎదుట ఉండకూడద”ని ఇదే చట్టంలోని సెక్షన్ 4(2)లో పేర్కొన్నారు.

కాశీ గురించి కొనసాగుతున్న వివాదం
వారణాసిలోని కాశీ విశ్వనాథ ఆలయం, జ్ఞానవాపి మసీదు గురించి కూడా వివాదం కొనసాగుతుంది. కానీ, ఆరాధనా స్థలాల చట్టం, ప్రస్తుతం మసీదుకు కల్పిస్తున్న భద్రతతో స్థానిక ముస్లిం సమాజం సంతృప్తికరంగా ఉన్నట్లు కనిపిస్తోంది.
జ్ఞానవాపి మసీదు సంరక్షణ సమితి ప్రధాన కార్యదర్శి ఎస్ఎం.యాసీన్ దీనిపై బీబీసీతో మాట్లాడారు.
“ఆ నినాదాలు వినిపిస్తుండడం నిజమే. ఇవి ఇంతకు ముందు కూడా ఉన్నాయి. కానీ, బనారస్ విషయం వేరే. ఇక్కడ హిందూముస్లింల మధ్య చాలా ఐకమత్యం ఉంది. దానికి మించి ‘ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్- 1991’ కూడా ఉంది. ఏ ప్రార్థనా స్థలమైనా 1947 ఆగస్టు 15న ఎలా ఉందో అది అలాగే ఉండాలని అది చెబుతుంది. జ్ఞానవాపి మసీదు గరించి కోర్టుల్లో కేసులున్నాయి. అవి కొనసాగుతూనే ఉంటాయి. ఎందుకంటే, కొన్ని శక్తుల రాజకీయాలు ఈ అంశాలపైనే నడుస్తాయి” అన్నారు.
బాబ్రీ మసీదు కేసులో కోర్టు అందరూ నిర్దోషులని తీర్పు ఇచ్చింది. కానీ ఆ తీర్పు వచ్చే ముందు తాము రామ్ లల్లా కోసమే ఇదంతా చేశామని జనం బాహాటంగా చెప్పుకున్నారు.
ఇప్పుడు, ప్రశ్న ఒక్కటే.. అరాచక శక్తులు బాబ్రీ మసీదును ఏం చేశాయో అలాగే ప్రభుత్వం కృష్ణ జన్మభూమి కోసం కూడా జరగనిస్తుందా..
లేక, జ్ఞానవాపి మసీదు భవిష్యత్తు గురించి ఎస్ఎం యాసీన్ ఎంత నిశ్చింతగా ఉన్నారో, అలాగే మధురలోని షాహీ ఈద్గాకు కూడా కట్టుదిట్టమైన రక్షణ కల్పిస్తుందా?
ఇవి కూడా చదవండి:
- బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో నిందితులందరూ నిర్దోషులే - సీబీఐ ప్రత్యేక కోర్టు తీర్పు
- పోర్ట్ రాయల్: చరిత్రలో ‘అత్యంత దుర్మార్గపు నగరం’ ఎందుకైంది? సముద్రంలో ఎలా మునిగిపోయింది?
- కోకాకోలా, మొసలిపేడ, పంది పేగులు... గర్భం రాకుండా పూర్వం వీటితో ఏం చేసేవారో తెలుసా?
- కొళాయి నీళ్లలో మెదడును తినేసే సూక్ష్మజీవులు.. ఆ నీళ్లు వాడొద్దంటూ అధికారుల వార్నింగ్
- కరోనావైరస్ వంటి ప్రాణాంతక మహమ్మారులు సహజంగానే అంతరించిపోతాయా? అదెలా సాధ్యం?
- గ్వాదర్: ఒమన్ నుంచి ఈ ప్రాంతం పాకిస్తాన్లో ఎలా కలిసింది? భారత్ మంచి అవకాశం వదులుకుందా?
- కరోనావైరస్: వ్యాక్సీన్ ముందుగా ఎవరికి అందుతుంది? పేద దేశాలకు ఎవరు ఇస్తారు? ఎలా ఇస్తారు?
- అండమాన్ కాలాపానీలో బ్రిటిష్ వైస్రాయ్ లార్డ్ మేయో హత్య.. ‘‘ద ఫస్ట్ జిహాద్’’
- కోటీశ్వరుడైన యజమానితో పనిమనిషి పోరాటం.. ఎందుకు? ఎవరు గెలిచారు?
- బంగారం వ్యాపారానికి ప్రొద్దుటూరు ఎలా కేంద్రంగా మారింది? ఈ ఊరిని రెండో ముంబై అని ఎందుకు అంటారు?
- వాడి పడేసిన 3 లక్షల కండోమ్‌లు రీసైకిల్ చేసి విక్రయించే ప్రయత్నం...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








