బాబ్రీ మసీదు కేసులో తీర్పు: ‘న్యాయం భ్రమ’, సీబీఐ దర్యాప్తుపైనా ప్రశ్నలు

ముస్లిం వ్యక్తి

ఫొటో సోర్స్, Javed Sultan/Anadolu Agency via Getty Images

    • రచయిత, దివ్య ఆర్య
    • హోదా, బీబీసీ ప్రతినిధి

బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో నిందితులందరినీ కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) ప్రత్యేక న్యాయస్థానం నిర్దోషులుగా ప్రకటించింది.

బీజేపీ సీనియర్ నాయకుడు ఎల్‌కే అడ్వాణీ, ఉత్తర్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కల్యాణ్ సింగ్, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు ఉమా భారతి, విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్‌పీ) నాయకురాలు సాధ్వి రితంభర తదితర 32 మంది నిందితుల పాత్రపై జడ్జి సురేంద్ర కుమార్ యాదవ్ విచారణ చేపట్టారు. అనంతరం బాబ్రీ మసీదు కూల్చివేత ఘటన ఓ ప్రణాళిక ప్రకారం కుట్ర పన్నిన ఘటన కాదని తీర్పునిచ్చారు.

28ఏళ్లపాటు ఈ కేసు విచారణ సాగింది. ఆ సమయంలోనే మరో 17 మంది నిందితులు మరణించారు.

తాజా తీర్పు.. భారత న్యాయ వ్యవస్థకు పెద్ద దెబ్బని, తీర్పుతో చాలా మందిలో నిరాశ ఆవహించిందని హైదరాబాద్‌లోని నల్సార్ లా యూనివర్సిటీ వైస్ ఛాన్సెలర్ ఫైజాన్ ముస్తఫా వ్యాఖ్యానించారు.

''బీజేపీ, శివసేన నాయకులు అప్పుడు చేసిన ప్రసంగాలు ఇప్పటికీ కనిపిస్తాయి. పార్లమెంటులోనే హిందూత్వ నినాదాలు చేశారు. బాబ్రీ మసీదు కూల్చివేయడానికి వచ్చిన కరసేవకుల చేతిలో గొడ్డలి, తాళ్లు, నాగళ్లు కనిపించాయి. అంటే వారు ముందే మసీదును కూల్చివేయాలని కుట్ర పన్నారు''.

6 డిసెంబరు 1992లో రామ మందిర ఉద్యమం పతాక స్థాయికి చేరిన సమయంలో అయోధ్యలో బాబ్రీ మసీదును ఓ గుంపు కూల్చివేసింది. దీని వెనుక కుట్ర కోణంపై విచారణకు ఓ క్రిమినల్ కేసు కూడా నమోదైంది.

మసీదు కూల్చివేత అనంతరం దేశ వ్యాప్తంగా మత ఘర్షణలు చోటుచేసుకున్నాయి. వీటిలో దాదాపు 2,000 మంది మరణించారు.

కూల్చివేత ఘటనపై సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఇచ్చిన తీర్పు దోషపూరితమైనదని సున్నీ వక్ఫ్ బోర్డు తరఫున న్యాయవాది జఫర్యాబ్ జిలానీ.. బీబీసీ ప్రతినిధి సల్మాన్ రవితో చెప్పారు. తీర్పును అధ్యయనం చేసిన అనంతరం హైకోర్టులో అప్పీలు అభ్యర్థనను దాఖలు చేస్తామని ఆయన వివరించారు.

''ప్రభుత్వ అధికారులు, ఐపీఎస్ అధికారులు, సీనియర్ జర్నలిస్టులు.. కోర్టులో వాంగ్మూలాలు ఇచ్చారు. వారు చెప్పింది తప్పా? అయితే వారిపై చర్యలు తీసుకోండి మరి..''అని ఆయన వ్యాఖ్యానించారు.

జఫరయాబ్ జిలానీ

ఫొటో సోర్స్, SANJAY KANOJIA/AFP via Getty Images

ఫొటో క్యాప్షన్, జఫర్యాబ్ జిలానీ

సీబీఐపై ప్రశ్నలు

ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రార్థనా మందిరం కూల్చివేత లాంటి భారీ నేరానికి శిక్ష విధించకుండా నిందితులను ఇలా విడిచిపెట్టడం మంచిదికాదని ప్రొఫెసర్ ముస్తఫా అన్నారు.

''సీబీఐ తమ విధులు సరిగా నిర్వహించలేనట్లు కనిపిస్తోంది. ఏం జరిగిందో మనం టీవీలో చూశాం. 350 మందికిపైగా ప్రత్యక్ష సాక్షులు వాంగ్మూలం ఇచ్చారు. చాలా ఆడియో, వీడియో సాక్ష్యాలు అందుబాటులో ఉన్నాయి. అయినప్పటికీ సరైన ఆధారాలు దొరకలేదు అనడం ఏమిటో అర్థం కావడం లేదు''

సీబీఐ.. కేంద్ర హోం శాఖ కింద పనిచేస్తుంది. ఇది భారత్‌లో అత్యున్నత దర్యాప్తు సంస్థ. తాజా తీర్పు అనంతరం అధికారికంగా సీబీఐ స్పందించలేదు.

అయితే, సీబీఐ స్వతంత్రతను ప్రశ్నించడం సరికాదని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జాఫర్ ఇస్లాం వ్యాఖ్యానించారు.

''మేం విచారణలో జోక్యం చేసుకోలేదు. సీబీఐ ఒక స్వతంత్ర దర్యాప్తు సంస్థ. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో సేకరించిన ఆధారాల ఆధారంగా సీబీఐ ముందుకు వెళ్లింది''అని బీబీసీతో ఆయన చెప్పారు.

ఫైజాన్ ముస్తఫా

ఫొటో సోర్స్, facebook/Faizan Mustafa

ఫొటో క్యాప్షన్, ఫైజాన్ ముస్తఫా

అయితే, దర్యాప్తు సంస్థ నుంచి ప్రాసిక్యూషన్ సిబ్బందిని వేరు చేయాలని, రెండు స్వతంత్ర బృందాలుగా పనిచేయాలని ప్రొఫెసర్ ముస్తాఫా వ్యాఖ్యానించారు.

''భారత పీనల్ కోడ్‌లో 120బి సెక్షన్ ప్రకారం.. ఒక ఇద్దరి మధ్య మాటలు రికార్డు చేసినా అది సాక్ష్యం కింద పనికి వస్తుంది. అలాంటిది మొత్తం 32 మందిపైనా ఎలాంటి ఆధారాలూ లభించలేదంటే ఆశ్చర్యంగా అనిపిస్తోంది''.

అయితే, కోర్టు దగ్గరున్న సాక్ష్యాలను పూర్తిగా పరిశీలించిన తర్వాతే తీర్పు వెల్లడించారని జాఫర్ ఇస్లాం వ్యాఖ్యానించారు. మసీదు కూల్చివేతలో బీజేపీ నాయకులను ఇరికించడమే లక్ష్యంగా అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు ప్రభుత్వం ప్రయత్నాలు చేసిందని అన్నారు.

డిసెంబరు 1992లో బాబ్రీ మసీదు కూల్చివేత అనంతరం దీనిపై విచారణ చేటపట్టాలని హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ లిబర్హాన్ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం ఓ కమిటీని నియమించింది.

17ఏళ్ల తర్వాత లిబర్హాన్ కమిషన్ ఓ నివేదిక సమర్పించింది. ఈ నివేదికలో ఉమా భారతి, సాధ్వి రితంభర, విజయరాజే సింధియా సహా 68 మందిపై మత విద్వేషాలు రెచ్చగొట్టారంటూ ఆరోపణలు చేశారు.

రామ జన్మభూమి ఉద్యమంలో పాలుపంచుకోవడంతో చాలా గర్వంగా అనిపిస్తోందని ఇదివరకు మాజీ కేంద్ర మంత్రి ఉమా భారతి వ్యాఖ్యానించారు. అయితే మసీదు కూల్చివేతకు సంబంధించి తను కేవలం నైతిక బాధ్యతను మాత్రమే తీసుకుంటానని అన్నారు.

కరోనావైరస్ సోకడంతో ప్రస్తుతం ఆమె రిషీకేశ్‌లోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

బీజేపీ అధికార ప్రతినిధి జాఫర్ ఇస్లామ్

ఫొటో సోర్స్, facebook/@syedzafarBJP

ఫొటో క్యాప్షన్, బీజేపీ అధికార ప్రతినిధి జాఫర్ ఇస్లామ్

ముస్లింలపై ప్రభావం

''ఇలాంటి పరిణామాలతో కోర్టులలో న్యాయం జరగదని ప్రజలు భావించే అవకాశముంది. న్యాయం జరుగుతుందని ప్రజలు ఎప్పుడూ భ్రమపడుతుంటారు. కానీ న్యాయం మాత్రం జరగదు''అని సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ వ్యాఖ్యానించారు.

''ఇదేమీ అంత ఆశ్చర్యంగా అనిపించడం లేదు. ఎందుకంటే బాబ్రీ మసీదు కూల్చివేత కేసుకు ముందు, గత నవంబరులో ఒక తీర్పు వచ్చింది. అప్పుడు మసీదు కూల్చివేసిన వారి పక్షానే తీర్పు ఇచ్చారు''.

అయితే, తమ పార్టీ ఎప్పుడూ మసీదు కూల్చేయాలని అనుకోలేదని జఫార్ ఇస్లాం చెప్పారు. కేవలం మందిరం నిర్మించాలని మాత్రమే అనుకున్నామని వివరించారు. కోర్టు కూడా ఇదే విషయాన్ని చెప్పిందని అన్నారు.

గత ఏడాది నవంబరులో రామ జన్మభూమి-బాబ్రీ మసీదు వివాదంపై సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది. వివాదాస్పద స్థలాన్ని హిందూ ప్రతినిధులకు కోర్టు కేటాయించింది. ముస్లింలకు వేరేచోట మసీదును కట్టుకోవడానికి ఐదు ఎకరాల స్థలాన్ని ఇవ్వాలని సూచించింది.

ప్రశాంత్ భూషణ్

ఫొటో సోర్స్, PRAKASH SINGH/AFP VIA GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, ప్రశాంత్ భూషణ్

''బాబ్రీ మసీదును కూల్చివేయడం చట్టాలకు, సుప్రీం కోర్టు ఆదేశాలకు విరుద్ధం, అన్యాయం''అని ఆ సమయంలో సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది.

తమ ప్రార్థనా స్థలాన్ని పోగొట్టుకున్న ముస్లింలకు పరిహారం చెల్లించాలని కూడా కోర్టు సూచించింది.

అయితే, మసీదు కూల్చివేతపై తాజా తీర్పుతో ముస్లింలలో విద్వేషం పెరుగుతుందని ప్రశాంత్ భూషణ్ వ్యాఖ్యానించారు. ఎందుకంటే రెండు కేసుల్లోనూ వారికి వ్యతిరేకంగా తీర్పు వచ్చిందని అన్నారు.

''ముస్లింలను ద్వితీయ స్థాయి పౌరుల్లా చూస్తున్నారు. అయితే వారికి అంతకంటే పెద్ద సవాల్ ఒకటి ఎదురవుతోంది. అదేంటంటే.. దేశాన్ని హిందూ దేశంగా మారుస్తున్నారు''.

అయితే, ముస్లింలు తాజా తీర్పుపై అంత ప్రభావితం కారని జాఫర్ ఇస్లాం అన్నారు. ''వారు జీవితాల్లో ముందుకు వెళ్లడంపై దృష్టి పెడుతున్నారు. కానీ, కొంత మంది ముస్లిం నాయకులు దీనిపై రాజకీయం చేయాలని చూస్తున్నారు''.

ప్రార్థనా మందిరాల విషయంలో బీజేపీ ఎలాంటి రాజకీయాలకూ పాల్పడదని ఆయన అన్నారు.

వీడియో క్యాప్షన్, బాబ్రీ మసీదు కూల్చివేత: నాడు ప్రత్యక్ష సాక్షులుగా ఉన్న జర్నలిస్టులు ఏం చెప్తున్నారు?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)