బాబ్రీ తీర్పు: ‘పట్టపగలు జరిగింది.. ప్రత్యక్ష సాక్షులూ ఉన్నారు.. అయినా సీబీఐ నిరూపించలేకపోయింది’ - నల్సార్ వీసీ ఫైజాన్ ముస్తఫా

ఫొటో సోర్స్, Deepak Gupta/Hindustan Times via Getty Images
ప్రత్యక్ష సాక్షులు ఉన్నప్పటికీ పట్టపగలు జరిగిన బాబ్రీ మసీదు విధ్వంసం కేసులో నేరాన్ని దేశంలోనే అత్యున్నత దర్యాప్తు సంస్థ అయిన సీబీఐ నిరూపించలేకపోయిందని నేషనల్ అకాడెమీ ఆఫ్ లీగల్ స్టడీస్, రీసెర్చి (నల్సార్) యూనివర్శిటీ వైస్ ఛాన్స్‌లర్ ఫైజాన్ ముస్తఫా అన్నారు.
బాబ్రీ కేసులో సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం బుధవారం తీర్పు వెలువరించిన నేపథ్యంలో ఆయన బీబీసీ ప్రతినిధి దీప్తి బత్తినితో మాట్లాడారు.
వీడియో సాక్ష్యాలు లేని కేసులలో కూడా నేరం రుజువైన దాఖలాలు ఉన్నాయని, 351 మందికి పైగా ప్రత్యక్ష సాక్షులు, డాక్యుమెంటరీ అధారాలు అన్నీ ఉన్నా బాబ్రీ కేసులో నేరాన్ని రుజువు చేయలేక పోయారని అన్నారు.
తీర్పును సమగ్రంగా అధ్యయనం చేయకుండా తాను మాట్లడలేనని, అయితే, ఈ తీర్పులో బెనెఫిట్ ఆఫ్ డౌట్ నిందితులకు అనుకూలంగా ఉందని చెప్పారు.
కాగా, సీబీఐ కూడా తన పని సక్రమంగా చేసినట్టు కనిపించడం లేదని అభిప్రాయపడ్డారు.

'హిందుత్వ సిద్ధాంతాలకే ప్రాధాన్యం ఇస్తున్నారు.. మథురలో మసీదును టార్గెట్ చేశారు' - పాకిస్తాన్
బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితులను నిర్దోషులుగా ప్రకటించడాన్ని పాకిస్తాన్ తీవ్రంగా ఖండించింది. ఈ ఘటనను సిగ్గుచేటని వ్యాఖ్యానిస్తూ పాక్ విదేశాంగ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది.
''అతిపెద్ద ప్రజాస్వామ్యంగా చెప్పుకొనే ఆ దేశంలో కొంచెమైనా న్యాయానికి చోటుంటే.. నేరానికి పాల్పడిన వారిని ఇలా నిర్దోషులుగా ప్రకటించి ఉండేవారు కాదు''.
''బీజేపీ-ఆరెస్సెస్ పాలనా కాలంలో బలహీనమైన న్యాయవ్యవస్థకు ఇది మరొక ఉదాహరణ. చట్టాలు, అంతర్జాతీయ నిబంధనల కంటే హిందూత్వ సిద్ధాంతాలకే ప్రాధాన్యం ఇస్తున్నారు''.
''అయోధ్యలో బాబ్రీ మసీదును ధ్వంసం చేసిన చోట రామాలయం నిర్మాణానికి అనుమతించి గతేడాది భారత సుప్రీం కోర్టు తప్పుచేసింది. అయితే ఆరోజు మసీదు కూల్చివేత అక్రమమని కోర్టు వ్యాఖ్యానించింది. ప్రస్తుతం ఆ వ్యాఖ్యలనూ తుంగలోకి తొక్కి ట్రయల్ కోర్టు తాజా తీర్పు నిచ్చింది''.
''హిందూ అతివాదుల వ్యాఖ్యలు, చర్యలతో ఉద్రేకులైన కొందరు ఇప్పుడు మథురలోని కృష్ణుడి ఆలయం పక్కనుండే మసీదును కూలగొట్టాలని ప్రయత్నిస్తున్నారు. వారికి ప్రభుత్వంలోని ఆర్‌ఎస్‌ఎస్ ప్రతినిధులు మద్దతు పలుకుతున్నారు''.
''ముస్లింలు, వారి ప్రార్థనా స్థలాలను భారత ప్రభుత్వం పరిరక్షించాలి. భారత్‌లోని ఇస్లామిక్ కట్టడాలను పరిరక్షించేందుకు అంతర్జాతీయ సమాజం, ఐక్యరాజ్యసమితి జోక్యం చేసుకోవాలి''

ఫొటో సోర్స్, ANI
'అడ్వాణీ వల్లే మసీదు కూలిపోయిందని దేశం మొత్తానికి తెలుసు' - అసదుద్దీన్ ఒవైసీ
''పక్కా ప్రణాళిక ప్రకారమే మసీదును కూల్చివేశారని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. కానీ ఇప్పుడేమో ప్రత్యేక న్యాయస్థానం భిన్నంగా తీర్పునిచ్చింది. ఇంతకీ మసీదు ఎలా కూలిపోయింది మరి? ఏదైనా మాయాజాలం జరిగిందా?''.
బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో ప్రత్యేక న్యాయస్థాన తీర్పుపై ఎంఐఎం అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ విలేకరుల సమావేశంలో ఏర్పాటుచేసి మాట్లాడారు.
కంటెంట్ అందుబాటులో లేదు
మరింత సమాచారం కోసం Facebookఇతర వెబ్‌సైట్లలో సమాచారానికి బీబీసీ బాధ్యత వహించదు.పోస్ట్ of Facebook ముగిసింది
''ఇది చాలా విచారకరమైన రోజు. అడ్వాణీ చేపట్టిన రథాయాత్ర వల్లే ఆ ఘటన జరిగిందని దేశం మొత్తానికి తెలుసు. రథాయాత్ర వెళ్లిన ప్రతిచోటా విధ్వంసం జరిగింది. ప్రజల ఇళ్లను ధ్వంసం చేశారు.''
''మేం బాబ్రీ మసీదును పరిరక్షిస్తామని సుప్రీం కోర్టులో అప్పటి ఉత్తర్ ప్రదేశ్‌లోని కల్యాణ్ సింగ్ ప్రభుత్వం ప్రతినచేసింది. కానీ ఆ మాటను నిలబెట్టుకోలేదు''.
''1992 డిసెంబరు 6న ఉమా భారతి, మురళీ మనోహర్ జోషిలతో కలిసి అడ్వాణీ వేదికపై కూర్చొని బాబ్రీ మసీదు కూల్చివేత ఘటనపై సంతోషం వ్యక్తంచేశారు. స్వీట్లను పంచారు. కానీ అంతా అనుకోకుండా జరిగిందని నేడు కోర్టు చెబుతోంది. కుట్ర జరగలేదని అంటోంది''.

ఫొటో సోర్స్, Getty Images
''దీని ద్వారా ఏం సందేశం ఇవ్వాలని అనుకుంటున్నారు? అసలు ఎలాంటి కుట్ర లేదని ఎలా చెబుతారు? మీరే జనాలను కూడగట్టారు. అసలు వారిని అక్కడికి ఎవరు పిలిచారు? అంతా దేవుడి దయ ప్రకారమే జరిగిందా? మసీదులో ఒక్కసారిగా హిందూ దేవతల విగ్రహాలు ప్రత్యక్షం అయ్యాయా? ఇంద్రజాలం జరిగి.. మసీదు తలుపులు తెరచుకున్నాయా?''
''అడ్వాణీకి పద్మవిభూషణ్ పురస్కారం ఇచ్చినప్పుడే ఇలాంటి ఘటన జరుగుతుందని నేను ఊహించాను. అసలు అడ్వాణీ అంత పేరు ప్రఖ్యాతలు ఎలా గడించారు? మురళీ మనోహర్ జోషి, ఉమాభారతి ఎలా అందరికీ సుపరిచితం అయ్యారు? ఓ భారత ముస్లింగా నేను ఈ ప్రశ్న అడుగుతున్నాను. బాబ్రీ మసీదు విధ్వంసం వల్లే ఇదంతా జరిగింది. వీరంతా కేంద్ర మంత్రులుగా స్థిరపడ్డారు''.
''1950ల నుంచి మాకు న్యాయం జరగలేదు. అన్నీ ఒకదాని తర్వాత మరొకటి జరుగుతున్నాయి. ఈ తీర్పుపై సీబీఐ అప్పీలు చేస్తుందో లేదో తెలియదు. కానీ తమ స్వతంత్రతను కాపాడుకోవాలంటే తప్పనిసరిగా అప్పీలు చేయాలి''.

ఫొటో సోర్స్, Inc
సుప్రీం తీర్పుతో విభేదిస్తోంది: కాంగ్రెస్
మరోవైపు ప్రత్యేక న్యాయస్థానం ఇచ్చిన తీర్పు.. సుప్రీం కోర్టు తీర్పు, రాజ్యాంగ విలువలకు విరుద్ధంగా ఉందని కాంగ్రెస్ వ్యాఖ్యానించింది. ఈ అంశంపై బుధవారం కాంగ్రెస్ మీడియా విభాగం ఇన్‌ఛార్జి రణ్‌దీప్ సుర్జేవాలా విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
''అయోధ్య కేసుపై 9 నవంబరు 2019న సుప్రీం కోర్టు తీర్పు వెలువరించింది. ఆనాడు బాబ్రీ మసీదు కూల్చివేతను అక్రమంగా కోర్టు వ్యాఖ్యానించింది. చట్టాల ఉల్లంఘన జరిగిందనీ కోర్టు అంగీకరించింది. కానీ నిందితులందరినీ నేడు ప్రత్యేక కోర్టు విడిచిపెట్టింది''.
''సుప్రీం కోర్టును తీర్పుతో ప్రత్యేక న్యాయస్థానం విభేదిస్తున్నట్లు ఈ రెండు తీర్పులను పరిశీలిస్తే స్పష్టమవుతోంది''.
''6, డిసెంబరు 1992న బాబ్రీ మసీదును కూల్చివేశారు. మసీదును పూర్తిగా ధ్వంసం చేశారు. పరిస్థితులు తారుమారు కాకుండా చూస్తామని కోర్టులో ఇచ్చిన వాంగ్మూలానికి వ్యతిరేకంగా ఈ ఘటన జరిగింది. ఇది పూర్తిగా చట్టాలను ఉల్లంఘించడమే''అని సుప్రీం కోర్టు వ్యాఖ్యలు చేసిందని సుర్జేవాలా వివరించారు.

ఫొటో సోర్స్, Getty Images
''అన్ని అంశాలు, ఆధారాలు, సాక్ష్యాలనూ పరిగణలోకి తీసుకున్న తర్వాతే బాబ్రీ మసీదు కూల్చివేత అక్రమమని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది''అని సుర్జేవాలా వ్యాఖ్యానించారు.
''ఆనాడు మసీదును కూల్చివేసేందుకు బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ నాయకులు పన్నిన రాజకీయ కుట్రను దేశం మొత్తం చూసింది. దేశ సౌభ్రాతృత్వాన్ని, మత సామరస్యాన్ని వారు ధ్వంసం చేశారు. అధికారంలోకి ఎలాగైనా రావాలని వారు ఈ పని చేశారు''.
''రాజ్యాంగ విలువలపై ఆనాడు జరిగిన దాడిలో ఉత్తర్ ప్రదేశ్‌లోని బీజేపీ ప్రభుత్వానికి కూడా పాత్ర ఉంది. వారు ప్రమాణం చేసికూడా తప్పుడు అఫిడవిట్‌ను దాఖలుచేసి సుప్రీం కోర్టును తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించారు''.
''రాజ్యంగంపై విశ్వాసమున్న భారతీయులందరూ.. ప్రత్యేక న్యాయస్థాన తీర్పును హైకోర్టులో అప్పీలు చేయాలని భావిస్తున్నారు. ఎలాంటి పక్షపాతం లేకుండా రాజ్యంగ విలువలను అందరూ పాటించాలని కోరుతున్నారు''.

ఫొటో సోర్స్, Getty Images
సాక్షులందరూ అబద్ధం చెప్పారా?- ముస్లిం పర్సనల్ లా బోర్డు
ఆధారాలు, సాక్ష్యాలకు ప్రత్యేక న్యాయస్థాన తీర్పు వ్యతిరేకంగా ఉందని, తీర్పులో తప్పులు ఉన్నాయని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు లాయర్ జఫర్యాబ్ జిలానీ వ్యాఖ్యానించారు. బీబీసీ ప్రతినిధి సల్మాన్ రవితో ఆయన ఫోన్లో మాట్లాడారు.
''ఘటనను ప్రత్యక్షంగా తమ కళ్లతో చూసినవారి సాక్ష్యాలను కోర్టు పరిగణలోకి తీసుకోలేదు. ఐపీఎస్ అధికారులు, ప్రభుత్వ అధికారులు, సీనియర్ జర్నలిస్టులు కూడా కోర్టులో వాంగ్మూలం ఇచ్చారు. వారి వాంగ్మూలం ఏమైంది? వారంతా అబద్ధం చెప్పారో నిజం చెప్పారో కోర్టు చెప్పాల్సింది''
''ప్రమాణం చేసి కూడా సాక్షులు అబద్ధం చెప్పివుంటే.. వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి కదా''
''ఈ తీర్పుపై మేం కోర్టులో అప్పీల్ చేసుకుంటాం''
తీర్పును అధ్యయనం చేసిన తర్వాత అప్పీలుపై నిర్ణయం: సీబీఐ
''తీర్పు ప్రతులు మాకు అందాయి. వీటిని కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) ప్రధాన కార్యాలయానికి పంపిస్తాం. అక్కడ తీర్పుపై న్యాయ విభాగం నిపుణులు అధ్యయనం చేపడతారు. వారి సూచనలపై అప్పీలుకు వెళ్లాలా? వద్దా.. అనేది నిర్ణయం తీసుకుంటాం''అని సీబీఐ తరఫు న్యాయవాది లలిత్ సింగ్ చెప్పినట్లు పీటీఐ వార్తా సంస్థ వెల్లడించింది.
ఇవి కూడా చదవండి:
- ఓ డొక్కు టీవీ ఊరు మొత్తానికీ ఇంటర్నెట్ రాకుండా చేసింది.. ఎలాగంటే...
- ఇస్లాం స్వర్ణయుగం: జ్యోతిషశాస్త్రాన్ని అధ్యయనం చేసిన అరబ్ తత్వవేత్త అల్-కింది
- పోర్ట్ రాయల్: చరిత్రలో ‘అత్యంత దుర్మార్గపు నగరం’ ఎందుకైంది? సముద్రంలో ఎలా మునిగిపోయింది?
- కోకాకోలా, మొసలిపేడ, పంది పేగులు... గర్భం రాకుండా పూర్వం వీటితో ఏం చేసేవారో తెలుసా?
- కొళాయి నీళ్లలో మెదడును తినేసే సూక్ష్మజీవులు.. ఆ నీళ్లు వాడొద్దంటూ అధికారుల వార్నింగ్
- కరోనావైరస్ వంటి ప్రాణాంతక మహమ్మారులు సహజంగానే అంతరించిపోతాయా? అదెలా సాధ్యం?
- గ్వాదర్: ఒమన్ నుంచి ఈ ప్రాంతం పాకిస్తాన్లో ఎలా కలిసింది? భారత్ మంచి అవకాశం వదులుకుందా?
- కరోనావైరస్: వ్యాక్సీన్ ముందుగా ఎవరికి అందుతుంది? పేద దేశాలకు ఎవరు ఇస్తారు? ఎలా ఇస్తారు?
- అండమాన్ కాలాపానీలో బ్రిటిష్ వైస్రాయ్ లార్డ్ మేయో హత్య.. ‘‘ద ఫస్ట్ జిహాద్’’
- కోటీశ్వరుడైన యజమానితో పనిమనిషి పోరాటం.. ఎందుకు? ఎవరు గెలిచారు?
- బంగారం వ్యాపారానికి ప్రొద్దుటూరు ఎలా కేంద్రంగా మారింది? ఈ ఊరిని రెండో ముంబై అని ఎందుకు అంటారు?
- వాడి పడేసిన 3 లక్షల కండోమ్‌లు రీసైకిల్ చేసి విక్రయించే ప్రయత్నం...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








