అయోధ్య తీర్పు: ‘తప్పు చేసిన వారికే బహుమతి ఇచ్చారు’ - జస్టిస్ లిబర్హాన్ కమిషన్ న్యాయవాది అనుపమ్ గుప్తా

ఫొటో సోర్స్, Getty Images
బాబ్రీ మసీదు కూల్చివేతకు బాధ్యులైన అనేక మంది సీనియర్ రాజకీయ నాయకులు.. ఎల్.కె.అద్వానీ, మురళీ మనోహర్ జోషి, ఉమా భారతి, కల్యాణ్ సింగ్, పి.వి.నరసింహారావు తదితరులను ప్రశ్నించే విశిష్ట అవకాశం ఆయనకు లభించింది.
1992లో బాబ్రీ మసీదు కూల్చివేత మీద విచారణ జరిపిన జస్టిస్ ఎం.ఎస్.లిబర్హాన్ కమిషన్ న్యాయవాదిగా.. దాదాపు 15 సంవత్సరాల కిందట న్యూ దిల్లీలోని విజ్ఙాన్ భవన్‌లో ఆ నాయకులను ప్రశ్నించారు చండీగఢ్‌కు చెందిన సీనియర్ న్యాయవాది అనుపమ్ గుప్తా. అయితే.. లిబర్హాన్ కమిషన్‌తో విభేదాలు రావటంతో ఆ కమిషన్ చివరికి 2009లో సమర్పించిన నివేదికను కూడా ఆయన విమర్శించారు.
ఇప్పుడు.. అనుపమ్ గుప్తా బీబీసీకి టెలిఫోన్ ద్వారా ఇచ్చిన ఇంటర్వ్యూలో.. అయోధ్య వివాదంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో తీవ్ర విభేదాలు వ్యక్తంచేశారు.
అయోధ్య తీర్పులో... 1) వివాదాస్పద స్థలం మొత్తాన్నీ కక్షిదారుల్లో ఒక పార్టీకి (హిందువులకు) ఇవ్వటం, 2) ఆ మసీదులో 1528 నుంచి 1857 మధ్య ముస్లింలు నమాజ్‌లు చేయటానికి సంబంధించిన సాక్ష్యాలపై లేవనెత్తిన ప్రశ్నలు, 3) 1949 డిసెంబర్‌లో మసీదులో విగ్రహాలను పెట్టటం ద్వారా, 1992లో మొత్తం నిర్మాణాన్ని కూల్చివేయటం ద్వారా చట్టాన్ని ఉల్లంఘించటం అనే మూడు అంశాల మీద అనుపమ్ గుప్తా విమర్శలు చేశారు.
ఇంటర్వ్యూ ముఖ్యాంశాలివీ...

అయోధ్య తీర్పుతో మీరు ఎంత వరకూ ఏకీభవిస్తారు?
ఒక హిందూ విగ్రహానికి చట్టపరంగా వ్యక్తిహోదా ఉందని.. అది నిర్ధారిత చట్టమని ఈ తీర్పు అద్భుతంగా పునరుద్ఘాటించింది. నేనూ ఏకీభవిస్తాను.
కాబట్టి.. ఒక మైనర్ - రామ్ లల్లా విరాజ్‌మన్ (బాల రాముడు, దేవుడు) విషయంలో - పరిమితి అనే చట్టానికి (కాల పరిమితి నిషేధానికి) తావులేదు.
ఈ తీర్పుతో మీరు ప్రధానంగా విభేదించే అంశం ఏమిటి?
వివాదాస్పద స్థలం- లోపలి, వెలుపలి ఆవరణ - మొత్తాన్నీ హిందువులకు కేటాయించటం పట్ల నేను గట్టిగా విభేదిస్తున్నా.
ఆ స్థలం స్వాధీన హక్కుకు సంబంధించిన నిర్ణయంతో విభేదిస్తున్నా.
వెలుపలి ఆవరణ మీద హిందువుల స్వాధీన హక్కు ఉందని, వారు సుదీర్ఘ కాలంగా నిరంతరాయంగా పూజలు చేస్తున్నారని నిర్ణయించటం సరైనదేనని అంగీకరించినా కూడా.. లోపలి ఆవరణ విషయంలో నిర్ణయానికి సంబంధించి తుది తీర్పు స్థిరంగా లేదు.
లోపలి ఆవరణ - గోపురాల కింది ప్రాంతం - స్వాధీన హక్కు, అందులో ప్రార్థనల విషయం వివాదాస్పదంగానే ఉండిపోయిందని కోర్టు అనేక పర్యాయాలు పదే పదే స్పష్టంచేసింది.
దీనికి గట్టి ప్రాతిపదిక ఉందనుకుంటే.. వెలుపలి ఆవరణను హిందువులకు ఇవ్వటం తుది పరిష్కారం అయివుండాలి. లోపలి ఆవరణను కూడా హిందువులకు ఎలా ఇస్తారు?
వెలుపలి, లోపలి ఆవరణలు రెండిటినీ హిందువులకు ఇవ్వాలంటూ కోర్టు చేసిన ఈ కీలకమైన, అతి ముఖ్యమైన నిర్ణయం.. కేవలం వెలుపలి ఆవరణ మాత్రమే హిందువుల స్వాధీనంలో ఉందని ఇదే కోర్టు చేసిన నిర్ధారణతో మౌలికంగా విరుద్ధం.

ఫొటో సోర్స్, Getty Images
వివాదాస్పద స్థలంలో 1528 - 1857 మధ్య నమాజ్ చేసేవారు అనటానికి సాక్ష్యం లేదని కూడా ఈ తీర్పు నిర్ణయించింది. మీ అభిప్రాయం?
కోర్టు ఈ ప్రాథమిక సూత్రం చేసింది. అది నాకు వింతగా కనిపించింది. మసీదు 1528 నుంచి 1857 వరకూ తమ స్వాధీనంలో ఉందని, అక్కడ నమాజు చేసేవారిమని చెప్పటానికి ముస్లింలు ఎటువంటి సాక్ష్యాలూ ఇవ్వలేదని ఈ తీర్పు చెప్తోంది.
అప్పీలులో తీర్పు చెప్తున్న కేసుల్లో సాక్ష్యాలు శూన్యమైనా కానీ.. ఆ మసీదును 1528లో నిర్మించారని, 1992లో కూల్చివేశారన్న వాస్తవం.. వివాదానికి తావులేనిది.
ఎక్కడో ఒక చోట ఒక చర్చినో, గురుద్వారానో మొఘలుల కాలంలో నిర్మించారని అనుకోండి. ఈ వందల ఏళ్ల కాలంలో మీరు అక్కడ ప్రార్థనలు చేశారని మీరు నిరూపించుకోవాల్సి ఉంటుందని ఆ మతం వారిని అడుగుతారా?
1528 నుంచి 1857 వరకూ అక్కడ హిందువులు ఏవైనా ప్రార్థనలు చేశారనటానికి, వాళ్లు అక్కడ పూజలు చేశారనటానికి హిందువుల దగ్గర కూడా సాక్ష్యాలు లేవు. వాళ్లు (హిందువులు) ఇది రాముడి జన్మభూమి అని విశ్వసిస్తుండవచ్చు, ఆ విధంగా ఆ ప్రాంతాన్ని గౌరవిస్తుండవచ్చు.
కానీ.. 1528లో నిర్మించిన ఒక మసీదును.. ముస్లింలు 1857 వరకూ వినియోగించలేదని నిరూపితం కాలేదంటూ న్యాయ నిర్ణయానికి రావటం... గౌరవనీయమైన న్యాయస్థానం ఏ ప్రాతిపదికన ఈ విస్తృత అభిప్రాయానికి వచ్చింది?

ఫొటో సోర్స్, Getty Images
1949 డిసెంబరులో, 1992 డిసెంబరులో జరిగిన సంఘటనలను ఈ తీర్పు పరిగణనలోకి తీసుకుందా?
ఈ తీర్పు.. 1949 డిసెంబర్ 22న మధ్య గోపురం లోపల రామ్ లల్లా విగ్రహాలను పెట్టిన సంఘటన - మసీదును అపవిత్రం చేయటం అని వారు అభివర్ణిస్తారు - చట్టవ్యతిరేకమని స్పష్టం చేస్తోంది. దీని ఫలితంగానే ఆ ఆస్తిని అటాచ్ చేశారు. 1949 డిసెంబర్ 22వ తేదీకి ముందు అక్కడ విగ్రహాలు లేవని ఈ తీర్పు సరిగానే చెప్తోంది. అయినప్పటికీ.. కోర్టు నిర్ణయాలు, దృక్పథం, విశ్లేషణ, సమీక్షల మీద ఇది ప్రభావం చూపలేదు.
అపవిత్రం చేసిన ఒక చర్యను చివరికి హిందువులకు స్వాధీన హక్కు ఉందనే దానితో సమానంగా తీసుకున్నారు. దీనర్థం చట్టాన్ని బలప్రయోగం రద్దుచేస్తుందని.
1992 డిసెంబరులో కూల్చివేతకు సంబంధించి కూడా.. అది చట్టాన్ని ఉల్లంఘించటమేనని, కోర్టు ఉత్తర్వులను అతిక్రమించటమేనని ఈ తీర్పు అభివర్ణిస్తోంది. కానీ ఆ కూల్చివేత అనేది కోర్టును భావోద్వేగపరంగా కానీ, నైతికంగా కానీ, మేధోపరంగా కానీ తాకినట్లు కనిపించటం లేదు.
కోర్టు పట్ల అత్యంత గౌరవంతో.. ఇది సమర్థించరానిదని నేను భావిస్తున్నాను. పక్కకు పెట్టేయజాలని మౌలిక ప్రాధాన్యత ఉన్న వాస్తవాలు ఇవి. ఇది బాధాకరం.
నా అభిప్రాయంలో.. మొత్తం నిర్మాణాన్ని హిందువులకు ఇవ్వటం - 1949లో విగ్రహాలు స్థాపించటం, 1992లో మొత్తం నిర్మాణాన్ని కూల్చివేసిన దోషికి ఇవ్వటం - తప్పుచేసిన వారికి బహుమతి ఇవ్వటంతో సమానం.

ఫొటో సోర్స్, Getty Images
వివాదాస్పద స్థలంలోని లోపలి ఆవరణను హిందువులకు ఇవ్వటంలో కోర్టు వాదన ఏమిటి?
కోర్టు ఇచ్చిన ఏకైక సమర్థన.. ఆ మొత్తం నిర్మాణం ఏక మొత్తంగా ఉందనేది అని మాత్రమే.
అవి విడదీయరాని, విభజించలేని ఏక మొత్తం అయినట్లయితే.. మొత్తం సంపూర్ణ ఏక మొత్తం మీద ఏ పక్షానికీ పూర్తి యాజమాన్య హక్కు ఉండదు.. ఆ ఏక మొత్తంలోని ఏ భాగాన్నీ ఏ పక్షానికీ ఇవ్వకూడదు.
సుప్రీంకోర్టు పట్ల ఎంతో గౌరవంతో, ఎంతో నమ్రతతో చెప్తున్నా.. అన్ని రకాలుగా ఇంతటి ప్రాధాన్యత ఉన్న కేసులో ఆశించిన తీవ్రత, నిష్పాక్షికత, సమతౌల్యం ఈ తీర్పులో లోపించాయి.. ఇది నన్ను బాధిస్తోంది. ఈ విషయంలో సుప్రీంకోర్టు తన మొత్తం వ్యవహారశైలిలో లౌకికవాదం సూత్రాలు, ఆదర్శాల నుంచి తిరోగమించింది.
ఇవి కూడా చదవండి.
- ‘అయోధ్య తీర్పులో స్పష్టంగా చెప్పారు, మసీదు కిందే రామ జన్మస్థలం ఉంది’ - సి.ఎస్.వైద్యనాథన్
- ఇతరుల పట్ల ప్రేమ, దయ చూపితే ఎక్కువ కాలం జీవిస్తారు ఎందుకు?
- సాంబార్ సరస్సు తీరంలో వెయ్యికి పైగా పక్షుల మృతికి కారణాలేమిటి?
- ఆర్టీఐ పరిధిలోకి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి కార్యాలయం
- ఇతరుల పట్ల ప్రేమ, దయ చూపితే ఎక్కువ కాలం జీవిస్తారు ఎందుకు?
- యూఎస్ఎస్ గ్రేబ్యాక్: 75 ఏళ్ల తర్వాత దొరికిన రెండో ప్రపంచ యుద్ధం నాటి జలాంతర్గామి
- విజయవాడలో స్విగ్గీ సర్వీస్ ఎందుకు ఆగిపోయింది...
- టీఎన్ శేషన్ (1932-2019): ఎవరికీ భయపడని భారత ఎన్నికల కమిషనర్
- భూపత్ డాకూ: భారత్ నుంచి పారిపోయిన ఈ దోపిడీ దొంగకు పాకిస్తాన్ ఆశ్రయం ఇచ్చింది
- పిడికెడు మిరపకాయలు, గుప్పెడు అన్నం... అయిదేళ్లు ఆదే ఆమె ఆహారం
- తలలోకి పేలు ఎలా వస్తాయి? ఎందుకు వస్తాయి?
- పెరియార్ : దక్షిణాది రాష్ట్రాలు భారతదేశంలో చేరడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు
- మెక్ డోనల్డ్స్ బర్గర్లు: పదేళ్లైనా పాడవలేదు.. బూజు పట్టలేదు.. ఎందుకు?
- అయోధ్య-రామ మందిర ఉద్యమంలో ముఖ్య పాత్రధారులు వీరే..
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








