విజయవాడలో స్విగ్గీ సర్వీస్ ఎందుకు ఆగిపోయింది...

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, రాజేష్ పెదగాడి
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీతో తెగతెంపులు చేసుకుంటున్నట్లు విజయవాడ హోటల్ ఓనర్స్ అసోసియేషన్ (వీహెచ్‌వోఏ) తెలిపింది. ఈ అసోసియేషన్‌లో దాదాపు 250 రెస్టారెంట్లు, హోటళ్లు ఉన్నాయి. అంటే ఇవేవీ సోమవారం నుంచి స్విగ్గీకి అర్డర్లు ఇవ్వబోవన్నమాట.
మరోవైపు జొమాటో, ఉబర్ ఈట్స్, ఫుడ్ పాండా లాంటి ఇతర యాప్‌లపైనా నిషేధం విధించే అవకాశముందని వీహెచ్‌వోఏ హెచ్చరించింది.
ఒక్క విజయవాడలోనే కాదు, హైదరాబాద్‌లోనూ ఇదే పరిస్థితి. ఫుడ్ డెలివరీ యాప్‌లను బహిష్కరించేందుకు చాలా రెస్టారెంట్లు సిద్ధంగా ఉన్నట్లు హైదరాబాద్ హోటల్ అసోసియేషన్ ఇటీవల వెల్లడించింది.

ఫొటో సోర్స్, TBK
స్విగ్గీలో ఆర్డర్లు నిలిపివేయాలన్న నిర్ణయం గురించి విజయవాడ హోటల్ రెస్టారెంట్ ఓనర్స్ అసోసియేషన్ ప్రతినిధి పీవీ రమణ బీబీసీతో మాట్లాడారు.
‘‘యాప్‌ల ద్వారా ఆర్డర్లు బాగా పెరిగాయి. కానీ వాళ్లు పెట్టే షరతులతో నష్టాల్లో కూరుకుపోతున్నాం. ఫుడ్ డెలివరీ కమీషన్ ఇవ్వాలి. కాల్ ఛార్జీలు, క్యాన్సిలేషన్ చార్జీలు కూడా వేస్తున్నారు. ఇవన్నీ మాకు భారంగా మారాయి’’ అని అన్నారు.
‘‘పుడ్ యాప్‌లు చెల్లింపులు కూడా పదిహేను రోజులకు ఒకసారి చేస్తున్నాయి. దానివల్ల మాకు పెట్టుబడుల లేమి పెద్ద సమస్యగా మారింది. అనవసరపు పోటీ పెరుగుతోంది. అందుకే ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ వ్యాపారంలో 50శాతం మేర తగ్గించాలని నిర్ణయం తీసుకున్నాం. అందుకే తొలుత స్విగ్గీ సేవలు నిలిపివేస్తున్నాం. మెజార్టీ వ్యాపారం వారిదే కాబట్టి స్విగ్గీ సేవలను సోమవారం నుంచి నిలిపివేస్తాం. ఆ తర్వాత మిగిలిన సంస్థల గురించి ఆలోచిస్తాం’’ అని వివరించారు.

ఫొటో సోర్స్, TBK
ఆంక్షలు ఎందుకు?
రెండేళ్ల క్రితం వరకు రెస్టారెంట్ల నుంచి ఫుడ్ డెలివరీ యాప్స్ కమీషన్ వసూలు చేసేవి కాదు. క్రమంగా వ్యాపారం విస్తరించడంతో ఇవి కమీషన్ పద్ధతిని ప్రవేశపెట్టాయి. ప్రస్తుతం పది శాతం నుంచి 25 శాతం వరకు కమీషన్లను వసూలు చేస్తున్నాయి.
కొన్నిచోట్ల ఇవి 30 శాతం వరకు ఉంటున్నాయి. వీటికితోడు ఆర్డర్ క్యాన్సిలేషన్, టెలిఫోన్ ఛార్జీలు తాము అదనంగా భరించాల్సి వస్తోందని హోటల్ నిర్వాహకులు చెబుతున్నారు.
ఈ విషయాన్ని కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు వీహెచ్‌వోఏ వెల్లడించింది.
ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of YouTube ముగిసింది
యాప్స్ ఎలా పనిచేస్తాయి?
ఈ యాప్స్‌కు సొంతంగా ఎలాంటి రెస్టారెంట్లూ ఉండవు. రెస్టారెంట్ల విక్రయాలకు ఇవి ఆన్‌లైన్ వేదికలా పనిచేస్తాయి. కస్టమర్లకు డోర్ డెలివరీ చేసేందుకు సిబ్బందినీ నియమించుకుంటాయి.
ప్రస్తుతం దేశంలో 500 నగరాలు, పట్టణాల్లో స్విగ్గీ సేవలు అందిస్తోంది. డిసెంబరు నాటికి ఈ సంఖ్యను 600కు పెంచాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకున్నట్లు స్విగ్గీ సీవోవో వివేక్ సుందర్ తెలిపారు.
ప్రస్తుతం తమతో 1.4 లక్షల రెస్టారెంట్లు కలిసి పనిచేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ప్రస్తుతం జొమాటో కూడా 200కుపైగా నగరాల్లో సేవలు అందిస్తోంది.

ఫొటో సోర్స్, Getty Images
వీటికి ఆదాయం ఎలా వస్తోంది?
ప్రధానంగా ఐదు మార్గాల్లో ఈ యాప్స్ ఆదాయాన్ని అర్జిస్తాయి.
- కమీషన్లు: సాధారణంగా ఆర్డర్లపై ఈ యాప్‌లు 15 నుంచి 25 శాతం వరకు కమీషన్లు వసూలు చేస్తుంటాయి. వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ), ఇతర పన్నులు కలిపిన తర్వాత వచ్చే బిల్లుపై ఈ కమీషన్‌ను లెక్కిస్తాయి. కొన్నిసార్లు తమకు మాత్రమే ఆర్డర్లు ఇచ్చేలా రెస్టారెంట్లపై యాప్‌లు ఒత్తిడి చేస్తాయి. అప్పుడు కమీషన్‌ను కాస్త తగ్గిస్తాయి. అయితే, కమీషన్ అనేది రెస్టారెంట్ లొకేషన్, బ్రాండ్, కస్టమర్ల ఆదరణ, కాంపిటీటర్ల ఆఫర్లపై ఆధారపడి ఉంటుంది.
- డెలివరీ ఛార్జీలు: మొదట్లో ఫ్రీ డెలివరీని చేసిన ఈ యాప్‌లు క్రమంగా డెలివరీ చార్జీలు ప్రవేశపెట్టాయి. ఇవి రూ. 20 నుంచి మొదలవుతాయి. డిమాండ్ ఎక్కువగా ఉండటం, పండుగ రోజులు, ప్రతికూల వాతావరణ పరిస్థితులు, అర్థరాత్రిపూట ఈ ఛార్జీలను పెంచుతూ ఉంటాయి.
- అడ్వర్టైజ్‌మెంట్లు: రెండు రకాల అడ్వర్టైజ్‌మెంట్ల ద్వారా ఈ యాప్‌లు ఆదాయాన్ని అర్జిస్తాయి. వీటిలో మొదటిది బ్యానర్ ప్రమోషన్. స్విగ్గీ, జొమాటో, ఫుడ్ పాండా లాంటి యాప్‌లలో ఇది కనిపిస్తుంది. ప్రాంతాల వారీగా తమ వెబ్‌సైట్లు, యాప్‌లలో బ్యానర్లలో రెస్టారెంట్లను డిస్‌ప్లే చేసేందుకు ఇవి చార్జీలు వసూలు చేస్తాయి. రెండోది ప్రియారిటీ లిస్టింగ్. యాప్‌లలో తమ రెస్టారెంట్‌ను మొదట్లో చూపించేందుకు కొన్ని రెస్టారెంట్లు ప్రత్యేక రుసుమును చెల్లిస్తుంటాయి.
- సొంత రెస్టారెంట్లు: సాధారణంగా ఈ యాప్‌లు సొంతంగా రెస్టారెంట్లు నడిపించవు. అయితే స్విగ్గీ ఇటీవల బెంగళూరులో సొంత రెస్టారెంట్లను మొదలుపెట్టింది. ముంబయి, హైదరాబాద్‌లలోనూ వీటిని విస్తరించాలని ప్రణాళికలు రచిస్తోంది.
- స్పెషల్ కిచెన్స్: సెంట్రల్ కిచెన్స్ పేరుతో ప్రత్యేక సదుపాయాలను కొన్నిచోట్ల ఈ యాప్‌లు మొదలుపెడుతున్నాయి. వీటిని హోటళ్లు, రెస్టారెంట్లు ఉపయోగించుకుంటూ.. ఆర్డర్లను సిద్ధం చేస్తున్నాయి. ప్రస్తుతం బెంగళూరు, హైదరాబాద్, దిల్లీ, ముంబయి, కోల్‌కతాలో ఇలాంటి కిచెన్స్‌ను స్విగ్గీ నడిపిస్తోంది.
మెంబర్‌షిప్ కూపన్లు, క్రెడిట్/డెబిట్ కార్డుల ప్రమోషన్ తదితర మార్గాల ద్వారా కూడా ఈ యాప్‌లకు ఆదాయం సమకూరుతుంది.

ఫొటో సోర్స్, Getty Images
ఖర్చు పెట్టేది ఎంత?
అన్ని ఈ-కామర్స్ సంస్థల్లానే వీటికీ వెబ్‌సైట్/యాప్ డెవలప్‌మెంట్, మెయింటెనెన్స్ ఖర్చులు ఉంటాయి. డెలివరీ సిబ్బందికి పేమెంట్స్, ఇన్సెంటివ్స్ ఇస్తుంటాయి.
ఇవి టైమ్, ప్లేస్, ఎక్స్‌పీరియన్స్, రేటింగ్స్ బట్టీ మారుతుంటాయి. ఫుల్‌టైం ఉద్యోగులకు జీతాలు, ప్రకటనలు, ఆఫర్ల రూపంలో కస్టమర్లకు కల్పించే ప్రయోజనాలు, రిఫండ్లు, రిటర్న్స్ వీటికి అదనం.
డెలివరీ సిబ్బందికి ఎలా చెల్లిస్తారు?
నేషనల్ రెస్టారెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ) గణాంకాల ప్రకారం.. స్విగ్గీతోపాటు జొమాటోకూ దేశ వ్యాప్తంగా 50 వేల మంది డెలివరీ సిబ్బంది అందుబాటులో ఉన్నారు. వీరికి చెల్లింపులు వేర్వేరు పద్ధతుల్లో జరుగుతుంటాయి.
వారంలో తాము సూచించినన్ని డెలివరీలు చేసే వారికి కనీస వేతనం రూపంలో కొన్ని యాప్‌లు అందిస్తుంటాయి. డెలివరీకి ఇచ్చే ఇన్సెంటివ్ దీనికి అదనం. స్విగ్గీ ఈ పద్ధతిని అనుసరిస్తుంది.

ఫొటో సోర్స్, Getty Images
జొమాటోలో అయితే షిఫ్టులు, లాగిన్లు, ఫుల్‌టైమ్/పార్ట్‌టైమ్ పేరుతో చాలా చెల్లింపు విధానాలున్నాయి. ఇన్సెంటివ్స్‌లో కస్టమర్ల రివ్యూలు, డెలివరీల సంఖ్య, ప్రయాణించిన దూరం పరిగణనలోకి తీసుకుంటాయి.
అయితే, ఇటీవల తమకు వచ్చే ఇన్సెంటివ్స్ బాగా తగ్గిపోతున్నాయని బెంగళూరు, ముంబయి సహా పలు నగరాల్లో జొమాటో డెలివరీ సిబ్బంది నిరసనలకు దిగారు.
డెలివరీపై కమీషన్ తగ్గించేస్తున్నారని, ఇన్సెంటివ్స్, బోనస్‌లకు అవసరమైన ఆర్డర్ల సంఖ్య, ప్రయాణించాల్సిన దూరంను పెంచేస్తున్నారని వారు చెబుతున్నారు. స్విగ్గీ డెలివరీ సిబ్బంది జూన్‌లో ఇలాంటి నిరసనలు చేపట్టారు.

ఫొటో సోర్స్, InDIACLUB
జరుగుతున్న మంతనాలు
ఇటీవల నేషనల్ రెస్టారెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌ఆర్‌ఏఐ) ప్రతినిధులతో స్విగ్గీ బృందం మంతనాలు జరిపింది.
రెస్టారెంట్స్ నుంచి వసూలు చేస్తున్న కమీషన్‌ను 25 శాతం మించకుండా చూడటంపై దీనిలో నిర్ణయించినట్లు వార్తలు వచ్చాయి.
దీన్ని ఇంకా తగ్గించాలని ప్రస్తుతం హోటళ్లు, రెస్టారెంట్ల యజమానులు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంపై వివరణ కోసం బీబీసీ స్విగ్గీని సంప్రదించేందుకు ప్రయత్నించినా, వారి నుంచి స్పందన రాలేదు.
ఇవి కూడా చదవండి:
- వెజిటేరియన్లకు.. పక్షవాతం ప్రమాదం ఎక్కువా?
- అయోధ్య తీర్పుపై పాకిస్తాన్ స్పందన ఏమిటి?
- గాడిద పాలతో చేస్తారు.. కేజీ రూ.78 వేలు.. తినడానికి విదేశాల నుంచి వస్తారు
- ఎడిటర్స్ కామెంట్: వందేళ్ల రష్యా అక్టోబర్ విప్లవం తెలుగు సమాజానికి ఏం చేసింది?
- ఆవు పాలు ఆరోగ్యానికి మంచివేనా?
- వాతావరణ ఎమర్జెన్సీని ఎదుర్కొంటున్నాం - 11 వేల మంది శాస్త్రవేత్తల హెచ్చరిక
- పాస్‌వర్డ్‌లతో భద్రత లేదా? బయోమెట్రిక్స్ సురక్షితమేనా?
- ఈ మొక్కలు కార్చిచ్చుతో మళ్లీ పుడతాయి.. అంగారకుడిపై పెరుగుతాయి... 32000 సంవత్సరాలు బతుకుతాయి
- మీకు ఇలాంటి వాట్సాప్ కాల్ ఎప్పుడైనా వచ్చిందా.. వస్తే అనుమానించాల్సిందే
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








