భారత్-చైనా ఉద్రిక్తతలు: ‘మొదట బుల్లెట్ దించేది భారత ఆర్మీనే’ - చైనా మీడియా ఆందోళన

భారత్-చైనా ఉద్రిక్తతలు

ఫొటో సోర్స్, Getty Images

భారత్-చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతలను తగ్గించడమే లక్ష్యంగా రెండు దేశాలు దౌత్య, సైనిక స్థాయిల్లో చర్చలు జరుపుతున్నాయి. అయితే, రెండు దేశాల మీడియాల్లో దీనికి భిన్నమైన కథనాలు వస్తున్నాయి.

ఈ విషయంపై చైనా ప్రభుత్వ మీడియా గ్లోబల్ టైమ్స్ ఇటీవల ఓ కథనం ప్రచురించింది. భారత్‌ వైపు నుంచి తూటాలు పేలితే తీవ్రమైన పరిణామాలు ఉంటాయని ఈ కథనంలో వ్యాఖ్యలు చేశారు.

''సరిహద్దుల్లో భారత్ సైనిక మోహరింపులు పెరిగాయని సైనిక పరిశీలకులు చెబుతున్నారు. చైనా జవాన్లతో ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తితే తమ సైనికులు కాల్పులు జరిపేందుకు భారత్ అనుమతించినట్లు వార్తలు వస్తున్నాయి. అదే జరిగితే భారత్ తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది''.

ఉద్రిక్తతలను తగ్గించేందుకు రెండు దేశాలు అంగీకరించిన సమయంలో గ్లోబల్ టైమ్స్ ఈ కథనాన్ని ప్రచురించింది.

''సరిహద్దుల్లో మోహరింపులను పెంచబోమని రెండు దేశాల సైనిక కమాండర్ స్థాయి చర్చల్లో అంగీకారం కుదిరింది. కానీ భారత్ తమ మాటలకు కట్టుబడి ఉండటంలేదు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు పెరుగుతున్నాయి''.

''తాజా పరిస్థితుల నడుమ భారత్‌ నుంచి ఎలాంటి సైనిక పరమైన చర్యలు కనిపించినా తిప్పికొట్టేందుకు చైనా అప్రమత్తంగా ఉండాలి. అన్నింటికీ సిద్ధంగా ఉండాలి. భవిష్యత్‌లో సరిహద్దుల్లో ఇలాంటి పరిస్థితులు సర్వసాధారణం కాబోతున్నాయి''అంటూ సైనిక నిపుణులు చేసిన వ్యాఖ్యలను గ్లోబల్ టైమ్స్ ఉటంకించింది.

భారత్-చైనా ఉద్రిక్తతలు

ఫొటో సోర్స్, Getty Images

ప్రతి స్పందనగా..

ఉద్రిక్తతలపై ద హిందూ పత్రికలో ఓ వార్త ప్రచురితమైన మరుసటి రోజే స్పందనగా గ్లోబల్ టైమ్స్ తాజా కథనాన్ని రాసుకొచ్చింది.

చైనా సైనికులు సరిహద్దుల వెంబడి ముందుకు అడుగువేస్తే.. కాల్పులు జరపాలని జవాన్లకు భారత్ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు ద హిందూలో ఓ కథనం ప్రచురితమైంది. పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఉన్నత స్థాయి అధికారి తమకు ఈ సమాచారం వెల్లడించినట్లు దానిలో పేర్కొన్నారు.

''మా పైకి వచ్చేందుకు ప్రయత్నిస్తే చైనా సైనికులపై కాల్పులు జరపాలని ఆదేశాలు వచ్చాయి. ఆత్మరక్షణలో భాగంగా కాల్పులు జరిపేందుకు మాకు అనుమతి ఇచ్చారు''అని ఆ అధికారి వివరించారు.

ఇటీవలి కాలంలో, తూర్పు లద్దాఖ్‌లోని ప్యాంగ్యాంగ్ సో సరస్సు సమీపంలో భారత్, చైనా సైనికుల మధ్య ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. అనంతరం గాల్లోకి కాల్పులు జరిపారు.

భారత్-చైనా మధ్య జరిగిన ఆరో దఫా చర్చల అనంతరం సరిహద్దుల్లో మోహరింపులను పెంచకూడదని రెండు దేశాలు అంగీకరించాయి. భారత్ సైనిక మోహరింపులు అలానే ఉన్నాయని, వీటిని కొనసాగిస్తామని భారత అధికారులు వెల్లడించారు.

భారత్-చైనా ఉద్రిక్తతలు

ఫొటో సోర్స్, Reuters

''మేం చెప్పేది చాలా స్పష్టంగా ఉంది. ఇక్కడకు చైనా సైన్యమే ముందు వచ్చింది. వారే ముందు వెనక్కి వెళ్లాలి''అని వారు పేర్కొన్నారు.

గ్లోబల్ టైమ్స్ రాసిన కథనంలో బీజింగ్‌లోని షిన్‌హువా యూనివర్సిటీ నిపుణుడు కియాన్ ఫెంగ్ వ్యాఖ్యలను ఉటంకించారు.

''సరిహద్దుల్లో నిర్మాణ, సైనిక పరమైన చర్యలను భారత్ ఆపడంలేదు. చైనా, పాకిస్తాన్ సరిహద్దుల్లో దాదాపు రెండు నుంచి మూడు లక్షల మందిని భారత్ మోహరించింది''అని ఆయన వ్యాఖ్యానించారు.

ద హిందూ పత్రిక కథనంపై చైనా మీడియా చాలా కథనాలు ప్రచురిస్తోంది. ఒక కథనంలో మొదటి తూటా భారత్ వైపు నుంచే పేలవచ్చని ఆందోళన వ్యక్తంచేశారు.

లద్దాఖ్‌లోని గాల్వన్ లోయలో గత జూన్‌లో భారత్-చైనా సైనికుల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. వీటిలో 20 మంది భారత సైనికులు మరణించారు.

తమ వైపు సంభవించిన మరణాలపై చైనా ఎలాంటి గణాంకాలనూ విడుదల చేయలేదు. అయితే కొంతమంది సైనికులు మరణించినట్లు గ్లోబల్ టైమ్స్ ఇటీవల వెల్లడించింది.

భారత్-చైనా ఉద్రిక్తతలు

ఫొటో సోర్స్, Getty Images

ఒప్పందంలో ఏముంది?

భారత్, చైనా సైనిక కమాండర్ స్థాయి ఆరో దఫా చర్చల అనంతరం సెప్టెంబరు 22న రెండు దేశాలూ సంయుక్త ప్రకటన విడుదల చేశాయి.

ఇకపై సరిహద్దుల్లో మోహరింపులను పెంచబోమని రెండు దేశాలూ దీనిలో అంగీకరించాయి.

''రెండు దేశాల మధ్య చర్చలను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రస్తుతం కుదిరిన అంగీకారాన్ని తూచా తప్పకుండా అమలుచేయాల్సిన అవసరముంది. ముఖ్యంగా వదంతులు, అపోహలను తగ్గించేందుకు కృషి చేయాలి. అదే సమయంలో రెండు వైపులా సైనిక మోహరింపులు పెరగకుండా చూసుకోవాలి. పరిస్థితులను తారుమారు చేసేలా ఎవరూ చర్యలు తీసుకోకూడదు. వాస్తవాధీన రేఖ వెంబడి శాంతిని నెలకొల్పేందుకు రెండు దేశాలు కృషి చేయాలి''అని చర్చల అనంతరం ప్రకటన విడుదల చేశారు.

మరోవైపు వాస్తవాధీన రేఖ వెంబడి ఎలాంటి నిర్మాణపు పనులు చేపట్టకూడదనీ తాజా చర్చల్లో అంగీకారం కుదిరినట్లు పేర్కొన్నారు.

అయితే, బలగాల ఉపసంహరణపై ఎలాంటి ఒప్పందమూ కుదరలేదని రక్షణ శాఖ వర్గాలు చెప్పినట్లు ద హిందూ పత్రిక కథనంలో పేర్కొంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)