అన్‌లాక్ 5.0: అక్టోబర్ 15 నుంచి సినిమాహాళ్లు, మల్టీప్లెక్స్‌లు తెరిచేందుకు అనుమతి - BBC Newsreel

సినిమా థియేటర్

ఫొటో సోర్స్, Reuters

కంటైన్మెంట్ జోన్ల బయట సాధారణ కార్యకలాపాలను పెంచేందుకు గాను అక్టోబర్ 15వ తేదీ నుంచి సినిమా హాళ్లు, మల్టీప్లెక్స్‌లు, క్రీడాకారులకు శిక్షణ ఇచ్చే స్విమ్మింగ్ పూల్స్‌, ఎంటర్‌టైన్‌మెంట్ పార్కులు తెరిచేందుకు అనుమతి ఇస్తున్నట్లు కేంద్ర హోం శాఖ ప్రకటించింది.

ఈ మేరకు బుధవారం కేంద్ర హోం శాఖ కార్యదర్శి అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేశారు.

కాగా, పాఠశాలలను తెరిచే నిర్ణయాన్ని రాష్ట్రాలకే వదిలిపెడుతున్నట్లు కేంద్రం తెలిపింది.

అక్టోబర్ 15వ తేదీ తర్వాత పాఠశాలలను తెరిచే అంశంపై రాష్ట్రాలు నిర్ణయాలు తీసుకోవచ్చునని, అయితే ఏ నిర్ణయం తీసుకున్నా విద్యార్థుల తల్లిదండ్రుల అనుమతి అవసరమని పేర్కొంది.

హాథ్‌రస్ సామూహిక అత్యాచారం

ఫొటో సోర్స్, Abhishek Mathur / BBC

హాథ్‌రస్ సామూహిక అత్యాచారం: కుటుంబ అనుమతి లేకుండానే బాధితురాలికి అంత్యక్రియలు

సామూహిక అత్యాచారం అనంతరం మరణించిన దళిత యువతి (19) మృతదేహానికి ఆమె కుటుంబ సభ్యుల అనుమతి లేకుండానే అంత్యక్రియలు నిర్వహించినట్లు పోలీసులు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

ఉత్తర ప్రదేశ్‌లోని హాథ్‌రస్ జిల్లాలో బాధితురాలిపై నలుగురు ఉన్నత కులాల యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు.

బాధితురాలికి తీవ్ర గాయాలయ్యాయి. రెండు వారాల పాటు ప్రాణాలతో పోరాడిన ఆమె మంగళవారం దిల్లీలోని ఓ ఆసుపత్రిలో మరణించారు.

అయితే, కుటుంబ సభ్యుల అనుమతి లేకుండా అమానవీయంగా ఆమెకు ఎందుకు అంత్యక్రియలు నిర్వహించారని పోలీసులను సామాజిక ఉద్యమకారులు ప్రశ్నిస్తున్నారు.

నిందితులను అరెస్టు చేశారు. త్వరితగతిన విచారణ చేపట్టేందుకు ఓ ఫాస్ట్‌ట్రాక్ కోర్టును కూడా ఏర్పాటుచేశారు.

అంత్యక్రియలను దూరం నుంచి చూసిన స్థానిక జర్నలిస్టు అభిషేక్ మాథుర్.. బీబీసీతో మాట్లాడారు. ఆమె కుటుంబ సభ్యులతోపాటు మీడియాను అంత్యక్రియల సమయంలో దూరంగా ఉంచారని ఆయన చెప్పారు.

మంగళవారం అర్థరాత్రి దాటిన సమయంలో ఆమె మృతదేహాన్ని స్వస్థలానికి తీసుకొచ్చారు. అయితే వెంటనే ఆమెకు అంత్యక్రియలు నిర్వహించాలని పోలీసులు ఒత్తిడి తెచ్చినట్లు ఆమె సోదరుడు తెలిపారు.

''మేం నిరాకరించడంతో.. వారే మృతదేహాన్ని తీసుకెళ్లి, అంత్యక్రియలు నిర్వహించారు'' అని అతడు తెలిపారు.

అయితే, కుటుంబ అనుమతితోనే అంత్యక్రియలు నిర్వహించాని సీనియర్ జిల్లా పరిపాలనా అధికారి బీబీసీతో చెప్పారు.

దగ్గుబాటి పురందేశ్వరి

ఫొటో సోర్స్, Y.S. CHOWDARY/FACEBOOK

పురందేశ్వరికి కరోనా పాజిటివ్.. ఆస్పత్రిలో చేరిక

బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరికి కరోనా వైరస్ సోకింది.

కరోనా లక్షణాలతో ఆమె స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దాంతో హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చారు.

ప్రస్తుతం వైద్యులు ఆమెకు చికిత్స అందిస్తున్నారు.

మూడు రోజులుగా ఆమె కరోనా లక్షణాలతో బాధపడుతున్నారు. దాంతో పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌గా తేలింది.

వెంటనే కుటుంబ సభ్యులు ఆమెను ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.

ప్రస్తుతం ఆమె ఆరోగ్యం స్థిరంగా ఉందని వైద్యులు చెప్పినట్టు బీజేపీ నేతలు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)