బాబ్రీ మసీదు కూల్చివేత: తీర్పు చెప్పిన న్యాయమూర్తి సురేంద్ర కుమార్ యాదవ్ ఎవరంటే...

ఫొటో సోర్స్, Sanjeev Pandey
- రచయిత, విభురాజ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఆయనకు తొలి పోస్టింగ్ ఫైజాబాద్‌లో వచ్చింది. అదనపు జిల్లా జిడ్జి (ఏడీజే)గా తొలి పదోన్నతి వచ్చింది కూడా ఆ జిల్లాలోనే. బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో చివరి తీర్పు కూడా ఆయన అక్కడి నుంచే ఇచ్చారు.
28 ఏళ్ల నాటి ఈ క్రిమినల్ కేసుకు ప్రత్యేక జడ్జిగా నియమితుడైన సురేంద్ర కుమార్ యాదవ్‌కు ఫైజాబాద్‌తో ప్రత్యేక అనుబంధముంది. ఫైజాబాద్ జిల్లానే అయోధ్య జిల్లాగా పిలుస్తుంటారు.
బాబ్రీ మసీదు కూల్చివేత కేసుపై ఏర్పాటుచేసిన లఖ్‌నవూలోని ప్రత్యేక కోర్టుకు ప్రిసైడింగ్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న ఆయన సెప్టెంబరు 30న తుది తీర్పు ఇచ్చారు.
ఐదేళ్ల క్రితం ఆగస్టు 5న ఈ ప్రత్యేక కోర్టు ఏర్పాటైంది. 19 ఏప్రిల్ 2017లో ఈ కేసు విచారణను రెండేళ్లలోగా పూర్తిచేయాలని సుప్రీం కోర్టు ఆదేశించింది.
బీజేపీకి మార్గదర్శకులైన ఎల్‌కే అడ్వాణీ, మురళీ మనోహర్ జోషి, ఉత్తర్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కల్యాణ్ సింగ్, మాజీ కేంద్ర మంత్రి ఉమా భారతి తదితర 32 మంది ప్రముఖులు బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
ఈ కేసులో బలమైన ఆధారాలు లేవని.. నిందితులందరూ నిర్దోషులని జడ్జి సురేంద్ర కుమార్ యాదవ్ ప్రకటించారు. మసీదు కూల్చివేత ముందస్తు ప్రణాళికతో జరిగింది కాదని.. క్షణికావేశంలో జరిగిందని తీర్పు చెప్పారు.

ఫొటో సోర్స్, Sanjeev Pandey
సురేంద్ర కూమార్ యాదవ్ ఎవరు?
తూర్పు ఉత్తర్ ప్రదేశ్‌లోని జౌన్‌పుర్ జిల్లాలో పఖాన్‌పుర్ గ్రామంలో సురేంద్ర కుమార్ జన్మించారు. ఆయన తండ్రి పేరు రామకృష్ణ యాదవ్. 31ఏళ్ల వయసులో రాష్ట్ర జ్యుడిషియల్ సర్వీస్‌కు సురేంద్ర ఎంపికయ్యారు.
ఫైజాబాద్‌లో అడిషనల్ మున్సిఫ్‌గా ఆయనకు తొలి పోస్టింగ్ వచ్చింది. గాజీపుర్, హర్దోయి, సుల్తాన్‌పుర్, ఎటావా, గోరఖ్‌పుర్ తదితర జిల్లాలో పనిచేసిన అనంతరం లఖ్‌నవూ జిల్లా జడ్జిగా ఆయన నియమితులయ్యారు.
అయోధ్య కేసులో ప్రత్యేక కోర్టు జడ్జిగా ఆయనకు బాధ్యతలు అప్పగించకుండా ఉండుంటే గతేడాది సెప్టెంబరులోనే ఆయన పదవీ విరమణ పొందాల్సి ఉంది.

ఫొటో సోర్స్, Sanjeev Pandey
మృదు స్వభావి..
''సురేంద్ర మృదు స్వభావి. ఆయన ఎలాంటి ఒత్తిడికీ తలొగ్గరు. రాష్ట్రంలోని నిజాయితీగల మంచి జడ్జిల్లో ఆయన కూడా ఒకరు''అని లఖ్‌నవూలోని సెంట్రల్ బార్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ, అడ్వొకేట్ సంజీవ్ పాండే వ్యాఖ్యానించారు.
గతేడాది లఖ్‌నవూ జిల్లా జడ్జిగా పదవీ విరమణ పొందేటప్పుడు బార్ అసోసియేషన్ ఆయనకు ఘనంగా వీడ్కోలు పలికింది.
అయితే, సుప్రీం కోర్టు ఆయన పదవీ కాలాన్ని పొడిగించింది. ప్రత్యేక కోర్టు ప్రిసైడింగ్ అధికారిగా కొనసాగుతూ బాబ్రీ మసీదు కూల్చివేత కేసును పూర్తి చేయాలని ఆయనకు సూచించింది.
అందుకే ఆయన జిల్లా జడ్జిగా పదవీ విరమణ పొందినప్పటికీ.. ప్రత్యేక న్యాయమూర్తిగా కొనసాగుతున్నారు.
''చరిత్ర పుటల్లో నిలిచిపోయే చరిత్రాత్మక తీర్పును ఇవ్వబోతున్నారనే సంతోషం నడుమ ఆయనకు వీడ్కోలు పలికాం. ఎలాంటి ఒత్తిడికీ తలొగ్గకుండా ఆయన తీర్పు చెబుతారని మేం ఆశిస్తున్నాం''అని సంజీవ్ పాండే వ్యాఖ్యానించారు.

ఫొటో సోర్స్, Sanjeev Pandey
ఆర్టికల్ 142 కింద..
పదవీ విరమణ పొందే జడ్జి పదవీ కాలాన్ని పొడిగించడమంటే.. అది ఒక చరిత్రాత్మక నిర్ణయం. రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 కింద సుప్రీం కోర్టుకుండే ప్రత్యేక అధికారాలతో ఈ నిర్ణయం తీసుకుంటారు.
ఈ ఆర్టికల్ ప్రకారం.. కేసులో సంపూర్ణ న్యాయం జరిగేలా చూసేందుకు సుప్రీం కోర్టు ఏ నిర్ణయమైనా తీసుకోవచ్చు.
ప్రజాప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఆర్టికల్ 142ను సుప్రీం కోర్టు చాలా సార్లు ఉపయోగించింది. అయితే, బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో ఒక ట్రయల్ కోర్టు జడ్జిని కేసు పూర్తయ్యే వరకూ అదే పదవిలో కొనసాగాలని చెప్పడం మాత్రం బహుశా ఇదే తొలిసారి కావొచ్చు.
రాష్ట్ర జ్యుడీషియల్ సర్వీస్‌లో జడ్జి పదవీ కాలం పొడిగించే నిబంధనలు లేవని ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం చెప్పడంతో సుప్రీం కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది.
''ఈ విచారణ పూర్తయ్యేవరకూ బాబ్రీ మసీదు కూల్చివేతకు సంబంధించి ఎలాంటి కొత్త విచారణలు జరగకూడదు. కేసు విచారణ పూర్తయ్యేవరకూ జడ్జిని వేరే చోటుకు బదిలీ చేయకూడదు. విచారణను వాయిదా కూడా వేయకూడదు. ఒక వేళ కుదరని పక్షంలో మరుసటిరోజు లేదా వీలైనంత త్వరగా మళ్లీ విచారణను మొదలుపెట్టాలి. దీనికి గల కారణాలను రికార్డులో నమోదు చేయాలి''అని కూడా సుప్రీం కోర్టు ఆదేశించింది.

ఫొటో సోర్స్, Getty Images
కేసు నంబర్లు 197, 198
6 డిసెంబరు 1992లో బాబ్రీ మసీదు కూల్చివేతకు సంబంధించి రెండు ప్రాథమిక విచారణ నివేదిక (ఎఫ్‌ఐఆర్)లు నమోదయ్యాయి. వీటిపైనే ప్రస్తుతం జడ్జి సురేంద్ర కుమార్ యాదవ్ తీర్పు ఇచ్చారు.
రెండు మతాల మధ్య విభేదాలు సృష్టించడం, ప్రార్థనా స్థలాన్ని ధ్వంసం చేయడం, దోపిడీ, ప్రజాధనం కొల్లగొట్టడం, గాయపరచడం తదితర ఆరోపణలపై లక్షల మంది కరసేవకులపై కేసు నంబరు 197 నమోదైంది.
ఎల్‌కే అడ్వాణీ, అశోక్ సింఘాల్, వినయ్ కతియార్, ఉమా భారతి, సాధ్వి రితంభర, మురళీ మనోహర్ జోషి, గిరిరాజ్ కిశోర్, విష్ణు హరి దాల్మియాలపై రెండో కేసు(198) నమోదైంది. మతపరమైన ఘర్షణలు రెచ్చగొట్టేలా విద్వేషపూరిత ప్రసంగాలు చేశారంటూ వీరు ఆరోపణలు ఎదుర్కొన్నారు.
ఈ రెండు ఎఫ్‌ఐఆర్‌లతోపాటు మరో 47 కేసులు కూడా విడిగా నమోదయ్యాయి. మొత్తంగా 49 మందిపై అభియోగాలతో కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) అభియోగ పత్రం దాఖలు చేసింది. అయితే విచారణ పూర్తికాక ముందే 17 మంది నిందితులు మరణించారు.
మరణించినవారిలో బాల్ ఠాక్రే, అశోక్ సింఘాల్, గిరిరాజ్ కిశోర్, విష్ణుహరి దాల్మియా తదితరులు ఉన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఈ కేసు విచారణలో ఎదురైన సవాళ్లు
- ''కొన్నిసార్లు నిందితులు వ్యక్తిగతంగా హాజరయ్యారు. కానీ సాక్షులు రాలేదు. వారు మెజిస్ట్రేట్‌కు ఇచ్చిన చిరునామాలో ఇప్పుడు లేరు''.
- ''కొన్నిసార్లు నిందితులు కూడా వ్యక్తిగతంగా రాలేదు.. సాక్షులు కూడా ఎవరూ రాలేదు''..
- ''వాంగ్మూలం ఇచ్చేందుకు రావాలని సాక్షులకు సమన్లు ఇచ్చారు. కానీ ఆ సమయానికి వారు రాలేదు. తర్వాత వస్తామని చెప్పారు''.
- ''వీహెచ్‌ఎస్ వీడియో క్యాసెట్‌ను చూసి నిందితులను సాక్షులు గుర్తించాలి. కానీ ఈ వీడియోను చూపించగలిగే పరికరాలను సీబీఐ కోర్టుకు తీసుకురాలేదు. దూరదర్శన్ దిల్లీ కేంద్రం నుంచి సిబ్బంది రావాలని కోర్టుతో సీబీఐ చెప్పింది''.
- ''తాను రాలేనని, తన వల్ల కాదని దిల్లీలో నివసిస్తున్న 69ఏళ్ల సాక్షి ఒక ఈమెయిల్ ద్వారా తెలియజేశారు''.
విచారణ సమయంలో ఇలాంటి ఎన్నో సవాళ్లను సురేంద్ర కుమార్ యాదవ్ ఎదుర్కొన్నారు. అప్పీళ్ల కోసం దాఖలైన డజన్ల కొద్దీ అభ్యర్థనలనూ ఆయన పరిష్కరించాల్సి వచ్చేది.
''సాక్ష్యం ఇవ్వడానికి ఇష్టపడనివారు తర్వాత వస్తామని చెబుతూ వాయిదా వేస్తుంటారు. ఇలాంటి పరిస్థితులు ప్రతి విచారణలోనూ ఎదురవుతుంటాయి. అయితే సాక్షులు తప్పనిసరిగా హాజరుకావాలని సమన్లు జారీచేసే అధికారం కోర్టుకు ఉంటుంది. ఒకవేళ అప్పటికీ రాకపోతే వారెంటు జారీచేస్తారు. అప్పుడు అరెస్టుచేసి వారిని కోర్టులో ప్రవేశపెట్టొచ్చు''అని విశ్రాంత న్యాయమూర్తి ఎస్‌సీ పాఠక్ వివరించారు.

ఫొటో సోర్స్, Getty Images
30న చివరి ఘట్టం..
మొఘల్ చక్రవర్తి బాబర్ కాలంలో నిర్మించిన బాబ్రీ మసీదును 6 డిసెంబరు, 1992న కూల్చివేతకు సంబంధించిన మరో చరిత్రాత్మక కేసుపై గత ఏడాది నవంబరులో సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది.
అయోధ్యలోని ఈ వివాదాస్పద స్థలంలో రామ మందిరాన్ని నిర్మించుకోవచ్చని జస్టిస్ రంజన్ గొగొయి నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఇప్పటికే తీర్పునిచ్చింది.
450 ఏళ్ల నాటిదిగా కొందరు భావిస్తున్న బాబ్రీ మసీదులో 70 ఏళ్ల క్రితం ముస్లింలు ప్రార్థన చేసుకోకుండా ఆపడం తప్పని కోర్టు వ్యాఖ్యానించింది. మరోవైపు మసీదు కూల్చివేతను అక్రమమని కూడా చెప్పింది.
ఇప్పుడు కూల్చివేతకు సంబంధించిన రెండో కేసు తీర్పును సెప్టెంబరు 30న సురేంద్ర కుమార్ యాదవ్ వెలువరించారు.
మసీదును కూల్చివేసిన ఘటనకు సంబంధించి తీర్పును వెల్లడించాలంటే ఎంతో ఒత్తిడి ఉంటుంది కదా?
''ప్రజలు ఏమనుకుంటారో జడ్జి పట్టించుకోరు. ఆయన నిర్ణయాన్ని ప్రశంసిస్తారా? లేక విమర్శిస్తారా? అనేది కూడా ఆయన పట్టించుకోరు. ముఖ్యంగా సాక్ష్యాలు ఏం చెబుతున్నాయి? వాటి విశ్వసనీయత ఎంత? లాంటి అంశాలనే ఆయన పరిగణలోకి తీసుకుంటారు''అని విశ్రాంత న్యాయమూర్తి ఎస్‌సీ పాఠక్ వ్యాఖ్యానించారు.
ఇవి కూడా చదవండి:
- ఓ డొక్కు టీవీ ఊరు మొత్తానికీ ఇంటర్నెట్ రాకుండా చేసింది.. ఎలాగంటే...
- ఇస్లాం స్వర్ణయుగం: జ్యోతిషశాస్త్రాన్ని అధ్యయనం చేసిన అరబ్ తత్వవేత్త అల్-కింది
- పోర్ట్ రాయల్: చరిత్రలో ‘అత్యంత దుర్మార్గపు నగరం’ ఎందుకైంది? సముద్రంలో ఎలా మునిగిపోయింది?
- కోకాకోలా, మొసలిపేడ, పంది పేగులు... గర్భం రాకుండా పూర్వం వీటితో ఏం చేసేవారో తెలుసా?
- కొళాయి నీళ్లలో మెదడును తినేసే సూక్ష్మజీవులు.. ఆ నీళ్లు వాడొద్దంటూ అధికారుల వార్నింగ్
- కరోనావైరస్ వంటి ప్రాణాంతక మహమ్మారులు సహజంగానే అంతరించిపోతాయా? అదెలా సాధ్యం?
- గ్వాదర్: ఒమన్ నుంచి ఈ ప్రాంతం పాకిస్తాన్లో ఎలా కలిసింది? భారత్ మంచి అవకాశం వదులుకుందా?
- కరోనావైరస్: వ్యాక్సీన్ ముందుగా ఎవరికి అందుతుంది? పేద దేశాలకు ఎవరు ఇస్తారు? ఎలా ఇస్తారు?
- అండమాన్ కాలాపానీలో బ్రిటిష్ వైస్రాయ్ లార్డ్ మేయో హత్య.. ‘‘ద ఫస్ట్ జిహాద్’’
- కోటీశ్వరుడైన యజమానితో పనిమనిషి పోరాటం.. ఎందుకు? ఎవరు గెలిచారు?
- బంగారం వ్యాపారానికి ప్రొద్దుటూరు ఎలా కేంద్రంగా మారింది? ఈ ఊరిని రెండో ముంబై అని ఎందుకు అంటారు?
- వాడి పడేసిన 3 లక్షల కండోమ్‌లు రీసైకిల్ చేసి విక్రయించే ప్రయత్నం...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








