తెలంగాణ: రామోజీపేటలో అంబేడ్కర్, శివాజీ విగ్రహాల ఏర్పాటుపై వివాదం.. దళితులు, ముదిరాజ్‌ల మధ్య ఘర్షణ

దాడిలో ధ్వంసమైన తలుపులు
ఫొటో క్యాప్షన్, దాడిలో ధ్వంసమైన తలుపులు
    • రచయిత, బళ్ల సతీశ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

విగ్రహాల విషయంలో మొదలైన గొడవ ఆ గ్రామంలో చిచ్చు పెట్టింది. రెండు కులాల వారు తలలు పగలగొట్టుకునే వరకూ వెళ్లింది.

మాదిగపల్లెపై ముదిరాజ్‌లు దాడి చేసి తరిమితరిమి కొట్టారని మాదిగలు ఆరోపిస్తే, తమ ఆస్తులు తామే ధ్వంసం చేసుకుని ఎదురు కేసులు పెట్టారని ముదిరాజ్‌లు ప్రత్యారోపణలు చేస్తున్నారు.

దసరా పండుగ రోజున జరిగిన ఈ ఘర్షణల్లో ఆరుగురు ఎస్సీలు, ముగ్గురు బీసీలూ గాయపడ్డారు.

సిరిసిల్ల జిల్లాలో సిరిసిల్ల, సిద్ధిపేట మధ్య రామోజీపేట గ్రామం ఉంది. అక్కడ ముదిరాజ్‌లు, మాదిగలు ఉంటారు. గ్రామంలో వీరి మధ్య సఖ్యత ఉండేది.

అయితే ఊరి కూడలిలో విగ్రహాల విషయంలో గొడవ జరిగింది. అక్కడ శివాజీ విగ్రహం పెట్టాలని ముదిరాజ్‌లు ప్రయత్నిస్తే, అదే చోట అంబేడ్కర్ విగ్రహం పెట్టాలని ఎస్సీలు ప్రయత్నించారు.

తామే ముందు విగ్రహ ప్రతిపాదన తెచ్చామనీ, తమకు పోటీగానే అవతలి పక్షం రెండో విగ్రహం ప్రస్తావన తెచ్చారని రెండు వర్గాలూ చెబుతున్నాయి. సెప్టెంబరు నెలలో ఈ విషయంలో జరిగిన వాగ్వివాదంపై ఒక ఎస్సీ ఎస్టీ ఎట్రాసిటీ కేసు నమోదైంది.

ఆ తరువాత రాజీ కుదిరింది. కానీ ఆ కేసు పెట్టడం గ్రామంలో కక్షలకు కారణమైంది.

విగ్రహం ఏర్పాటు చేయాలనుకున్న స్థలం
ఫొటో క్యాప్షన్, విగ్రహం ఏర్పాటు చేయాలనుకున్న స్థలం

అప్పటి నుంచీ గ్రామంలోని ముదిరాజ్‌లు, మాదిగలూ ఒకరిపై ఒకరు అనుమానంతోనూ, అప్రమత్తంగానూ ఉంటున్న సమయంలోనే బతుకమ్మ, దసరా పండుగలు వచ్చాయి.

ఈ గ్రామంలో దళితులు బతుకమ్మ ఆడరు. ముదిరాజ్‌లు ఆడుతుంటే, దళితులు డప్పు కొడుతుంటారు.

కానీ ఈసారి సొంత గ్రామానికి చెందిన మాదిగలను డప్పు కొట్టడానికి పిలవలేదు ముదిరాజ్‌లు.

''వాళ్లతో ఇప్పటికే పరిస్థితులు బాలేదు. మళ్లీ ఇప్పుడు పిలిస్తే ఏదైనా గొడవ అవుతుందేమోనన్న ఆలోచనతో మేం వాళ్లను పిలవలేదు'' అని బీబీసీతో చెప్పారు లక్ష్మి అనే బీసీ వర్గానికి చెందిన మహిళ.

''మమ్మల్ని డప్పులకే పిలవనప్పుడు దసరా పండుగ చూడ్డానికి మాత్రం మేం ఎలా వెళ్తాం? అందుకే మేం ఈసారి వేరుగా పండుగ చేసుకుందాం అని నిర్ణయించుకున్నాం. మాకు ఎలానూ బతుకమ్మ ఆట లేదు. కనీసం డీజే పెట్టించమనీ మా (ఎస్సీ) ఆడవాళ్లం అందరం అడిగాం. దాంతో దసరా ముందు రోజూ, దసరా రోజూ రెండు స్పీకర్లు ఏర్పాటు చేశారు. మా ఇళ్ల ముందే వేరెవరికీ అభ్యంతరం లేకుండా డీజే పెట్టుకుని డాన్సులు చేశాం.

మేమంతా బాగా పండుగ చేసుకున్నాం అని వారికి కడుపు మంట. మరునాడు దసర పండుగ రోజు మేం బొడ్రాయి దగ్గర కొబ్బరికాయ కొట్టడానికి వెళితే 'మీరిక్కడ కొట్టకూడదు. వెళ్లి మీ గుళ్లో చేస్కోండి' అంటూ ఉప సర్పంచి చేతిలోని కొబ్బరికాయ లాక్కున్నారు. అయినా మేం గొడవపడకుండా వెనక్కు వెళ్లిపోయి, రాముల వారి గుడికి వెళ్లి వచ్చాం'' అని బీబీసీతో చెప్పారు రేణుక అనే ఎస్సీ వర్గానిక చెందిన మహిళ.

దళితులు ఏర్పాటు చేసుకున్న ఫ్లెక్సీ

విగ్రహాల నుంచీ ఉన్న గొడవ, బతుకమ్మ డప్పులకు ఊరి మాదిగలను పిలవకపోవడంతో కాస్త మలుపు తిరిగింది.

దసరా పండుగనాడు బొడ్రాయి (గ్రామం మధ్యలో ఉండే చిన్న రాయి. అమ్మవారి రూపంగా గ్రామస్తులు కొలుస్తారు) దగ్గర ఏటా ముదిరాజులు పూజ చేస్తారు.

ఈసారి మొట్టమొదటగా అక్కడ పూజ చేయడానికి దళితులు కూడా వచ్చారు. వారిని ముదిరాజులు అడ్డుకున్నారు. దీంతో దళితులు వెనుదిరిగారు. తరువాత వారు రామాలయానికి వెళ్లి అక్కడ పూజ చేశారు.

ముదిరాజ్‌ల ఫ్లెక్సీ

అదే రోజు సాయంత్రం దళితవాడలో మళ్లీ డీజే పెట్టుకున్న తరువాత దళితుల డీజే దగ్గరకు ముదిరాజు వర్గానికి చెందిన సర్పంచి భర్త, భూమయ్య అనే వ్యక్తీ వెళ్లారు.

''పోలీసులు ఫోన్ చేసి ఆ డీజే సౌండు గురించి ఫిర్యాదు వచ్చింది. దాన్ని బంద్ చేయించండి. ఉప సర్పంచి ఫోన్ ఎత్తడం లేదు. మీరు వెళ్లండి. అని చెప్తేనే సర్పంచి భర్తా, భూమయ్యా కలసి అక్కడకు వెళ్లారు.'' అన్నారు లక్ష్మి.

బొడ్రాయి
ఫొటో క్యాప్షన్, గ్రామంలోని బొడ్రాయి

''వాళ్లు కావాలనే దాడి చేయాలనే ఉద్దేశంతోనే వచ్చారు. పైకి ఇద్దరే వచ్చినట్టు కనిపించినా, మిగతా వారంతా ఆయుధాలతో వెనక నక్కి ఉన్నారు. వాళ్లిద్దరూ వచ్చి డాన్స్ చేస్తోన్న దళిత మహిళలను అవమానకరంగా మాట్లాడారు. అక్కడికీ గొడవ వద్దంటూ, ఎస్సీ వర్గానికి చెందిన మాజీ సర్పంచ్ రవి, వాళ్లకు సర్ది చెప్పబోయారు. వాళ్లు వినకుండా అతణ్ణి కొట్టారు. అంతే అంతా ఒక్కసారిగా మీద పడ్డారు. విచక్షణా రహితంగా కొట్టారు. తరిమారు. ఇళ్లల్లోకి వచ్చారు. తలుపులు పగలగొట్టారు. బైకులు ధ్వంసం చేశారు. కారం కొట్టారు. మీద పడ్డారు. తలలు పగిలాయి. ప్రాణ భయంతో వృద్ధులు పొలాల్లోకి వెళ్లి దాక్కున్నారు. తరువాత మేం ఫోన్ చేస్తే, పోలీసులు వచ్చాక వాళ్లు తగ్గారు'' అంటూ ఘటనను వివరించారు రేణుక.

''ఇంటి దగ్గర బల్బులు పగలగొట్టారు. తలుపులు కొట్టేసరికి, ఇక చచ్చాం అని భావించి చీకట్లో పొలాల్లోకి వెళ్లి వరి పొలంలో బురదలో దాక్కున్నాం. ఒక గంట తరువాత పోలీస్ సైరన్ వచ్చాక బయటకు వచ్చాం'' అంటూ వివరించారు మొండయ్య అనే ఎస్సీ వర్గానికి చెందిన వ్యక్తి.

గర్భిణి అయిన తన కుమార్తెను తీసుకెళ్ళి పొలంలో దాక్కున్నట్టు చెప్పారు మరో దళిత వృద్ధుడు.

ధ్వంసమైన వాహనం
ఫొటో క్యాప్షన్, ధ్వంసమైన వాహనం

''ఎస్సీలు చెప్పేది తప్పు. మా వాళ్లిద్దరూ పోలీసులు చెప్పారని డీజే ఆపడానికి మాత్రమే వెళ్లారు. కానీ వాళ్లే కావాలని గొడవ పడ్డారు. మా వాళ్ల కూడా ఒక పాప వెళ్లింది. ఆమెను కొట్టారు. ఇప్పుడామె చావుబతుకుల్లో ఉంది. మా వాళ్ల ఇద్దరి తలలపై కొట్టారు. ఒకరి కన్ను పోయింది. దీంతో కేసులు అవుతాయని భయపడి, మేమే కొట్టామని ఆరోపిస్తూ, తిరిగి మామీదే కేసులు పెట్టారు. వాళ్ల ఆస్తులు వాళ్లే ధ్వంసం చేసుకున్నారు. వాళ్లే గీరుకున్నారు. వాళ్లే కారం కొట్టారు. ఉల్టా కేసులు పెట్టారు'' అన్నారు ముదిరాజ్ కులానికి చెందిన లక్ష్మి.

నిజానికి గ్రామంలో నెలన్నర నుంచి పరిస్థితి దిగజారింది. విగ్రహాల గొడవ తీవ్రమైంది. దీంతో రెండు వర్గాలూ విడిపోయాయి. సరిగ్గా దసర పండుగనాటి డీజే గొడవలకు తక్షణ కారణం అయింది.

కలెక్టరు, ఎస్పీ
ఫొటో క్యాప్షన్, కలెక్టరు, ఎస్పీ

పోలీసులు ఏమంటున్నారు

''ఎస్సీ మహిళలు డాన్స్ చేస్తుంటే బీసీ వ్యక్తులు కామెంట్ చేస్తే గొడవ పెరిగింది. ఎస్సీ వర్గం వారు విసిరిన రాయి బీసీ వర్గం పాపకు తగలడంతో పెద్ద గొడవ జరిగింది. విషయం తెలియగానే పోలీసులు వెళ్లారు. అక్కడ పరిస్థితి చక్కదిద్దారు.

దీనిపై మొత్తం 9 ఎఫ్ఐఆర్ లు నమోదు చేశాం. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాం. అలాగే ముదిరాజుల ఫిర్యాదు కూడా నమోదు చేశాం. గాయపడ్డ వారిలో ఆరుగురు ఎస్సీలు, ముగ్గురు బీసీలు ఉన్నారు. ఇప్పటి వరకూ 28 మంది నిందితులను (బీసీలను) గుర్తించగా, సర్పంచి భర్త సహా 15 మందిని అరెస్టు చేసి రిమాండుకు పంపాం.

ముగ్గురు చికిత్స పొందుతున్నారు. వారు డిశ్చార్జి అయ్యాక కస్టడీలోకి తీసుకుంటాం. మిగిలిన వారి కోసం గాలిస్తున్నాం. అటు ముదిరాజులు, ఎస్సీలపై ఇచ్చిన ఫిర్యాదుపై విచారణ ఇంకా జరగాల్సి ఉంది'' అన్నారు సిరిసిల్ల జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే.

గ్రామాన్ని ఎస్సీ కమిషన్ చైర్మన్, కలెక్టర్, ఎస్పీ సందర్శించారు. దళిత వర్గానికి చెందిన బాధితులకు పరిహారం ఇచ్చే ఏర్పాట్లు చేస్తున్నారు.

స్థానిక ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఏకపక్షంగా ఎస్సీలకు సపోర్టు చేస్తున్నారనీ, కనీసం మా వాదన కూడా ఇవ్వడం లేదని స్థానిక ముదిరా‌జ్‌లు ఆరోపిస్తున్నారు. దీనిపై ఆయన స్పందించాల్సి ఉంది.

బీసీ వర్గానికి చెందిన వ్యక్తి ఎస్సీల ఇళ్ల దగ్గర కర్ర పట్టుకుని తిరుగుతూ, దాడి చేస్తోన్న వీడియో బయటకు వచ్చింది. అందులో బీసీ వర్గానికి చెందిన మరో వ్యక్తి వారిని ఆపుతున్నట్టు కనిపిస్తోంది. ఆ వ్యక్తికి కూడా దెబ్బలు తగిలాయి.

ఎస్సీ కాలనీలో దెబ్బతిన్న ఇళ్లు, వాహనాలను ఇప్పటికీ అలానే ఉంచారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)