దళిత సర్పంచ్‌కు అవమానం: ''సమావేశాల్లో నేలపై కూర్చోమన్నారు.. జెండానూ ఎగురవేయనివ్వరు''

దళితులు
    • రచయిత, నటరాజన్ సుందర్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

తమిళనాడులో ఓ దళిత మహిళా సర్పంచ్‌ను పంచాయతీ సమావేశాల్లో నేలపై కూర్చోబెట్టిన ఘటన ఆన్‌లైన్‌లో వైరల్ అవుతోంది. ఆమెపై పంచాయతీ ఉపాధ్యక్షుడు, వార్డు సభ్యుడు కావాలనే వివక్ష చూపించారంటూ అభియోగాలు ఎదుర్కొంటున్నారు.

తమిళనాడులో 12,000కుపైగా పంచాయతీలు ఉన్నాయి. వీటిలో దళిత, అణగారిన వర్గాలకు చెందిన ప్రతినిధులు వివక్ష ఎదుర్కొంటున్నారని స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచీ వార్తలు వస్తున్నాయి. తాజా ఘటనలో మాత్రం క్రమశిక్షణ చర్యలు కూడా తీసుకుంటున్నారు. ఇలా జరగడం చాలా అరుదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

కేవలం దళిత ప్రతినిధులపై హత్య, తీవ్రమైన దాడుల విషయంలో మాత్రమే ఇక్కడ చర్యలు తీసుకుంటారు. ప్రజల్లో తీవ్రమైన చర్చ జరగడంతోనే చర్యలకు ఉపక్రమిస్తారు. అయితే అప్పుడు కూడా నిందితులు దోషులుగా నిరూపితం అయ్యే అవకాశాలు చాలా తక్కువ.

దళిత సర్పంచ్ రాజేశ్వరి శ్రావణకుమార్‌తోపాటు, ఆరోపణలు ఎదుర్కొంటున్న, ఎగువ తరగతి కులానికి చెందిన పంచాయతీ ఉపాధ్యక్షుడు మోహన్‌రాజ్‌తో బీబీసీ మాట్లాడింది.

పంచాయతీ సభ్యుడితోపాటు పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్న మహిళనూ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. అయితే, ప్రధాన నిందితుడైన పంచాయతీ ఉపాధ్యక్షుడిని ఇంకా అరెస్టు చేయలేదు.

దళితులు

ఈ కేసు ఎందుకు ప్రత్యేకమైనది?

తమిళనాడులోని స్థానిక సంస్థల్లో దళితులపై వివక్ష కొంచెం తక్కువ. ఏవైనా కేసులు నమోదైనా విచారణలో అవి తేలిపోతుంటాయి. కానీ తాజా కేసులో స్పష్టమైన ఆధారాలున్నాయి.

కడలూరులోని థేర్కుథిట్టాయ్ గ్రామం పంచాయతీ కార్యాలయంలో రాజేశ్వరి నేలపై కూర్చున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ఆమె వివక్షతో తల దించుకొని కూర్చుంటే.. మిగతా పంచాయతీ సభ్యులు కుర్చీలపై కూర్చొని కనిపిస్తున్నారు.

సోషల్ మీడియాలో ఈ ఫోటో బాగా వైరల్ అవ్వడంతో స్థానిక మీడియా దృష్టి పడింది. లేదంటే ఈ వార్త జిల్లాకు మాత్రమే పరిమితమై ఉండేది.

దీంతో పంచాయతీ ఉపాధ్యక్షుడుతోపాటు మరో పంచాయతీ సభ్యుడు సుకుమార్, పంచాతీ కార్యదర్శి సింధూజాలపై ఎస్సీ, ఎస్టీలపై అకృత్యాల నిరోధక చట్టం-2018 కింద జిల్లా పరిపాలనా విభాగం కేసులు నమోదుచేయించింది.

దళితులు
ఫొటో క్యాప్షన్, దళిత ప్రతినిధులతో మాట్లాడుతున్న జిల్లా కలెక్టరు, అధికారులు

''జాతీయ జెండా ఎగురవేయనివ్వరు''

గతేడాది తను పంచాయతీ సర్పంచ్‌గా ఎన్నికైనప్పటి నుంచీ తనతోపాటు మరో దళిత వార్డు సభ్యురాలికి కూడా సమావేశాల్లో కుర్చీలు ఇవ్వరని, కిందనే కూర్చోమంటారని బీబీసీతో రాజేశ్వరి చెప్పారు.

గణతంత్ర దినోత్సవం నాడు తనను జాతీయ జెండా ఎగురవేయనివ్వలేదని ఆమె ఆవేదన వ్యక్తంచేశారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు సైతం అవమానిస్తారనే భయంతో వెళ్లలేదని ఆమె చెప్పారు.

''పంచాయతీ ఉపాధ్యక్షుడి తండ్రే జెండా ఎగురవేశారు. సమావేశాల్లో నేను ఏదైనా చెప్పాలని ప్రయత్నిస్తే.. నోరు మూసుకోమని ఉపాధ్యక్షుడు చెబుతుంటారు. నాకేమీ తెలియదని ఆయన అంటుంటారు''అని రాజేశ్వరి చెప్పారు.

sc st atrocities act
ఫొటో క్యాప్షన్, ఎస్‌పీ అభినవ్

''మేం దళితులం అందుకే''

అదే గ్రామానికి చెందిన మహిళా వార్డు సభ్యురాలు సుగంథి బీబీసీతో మాట్లాడారు. గ్రామ సభల్లో తమకు మిగతా సభ్యుల్లా గౌరవం ఇవ్వరని ఆమె చెప్పారు. ''మేం దళితులం. అందుకే ఇలా చేస్తారు''అని ఆమె వ్యాఖ్యానించారు.

గ్రామ వాటర్ ట్యాంకు నిర్వహణ విషయంలో ఉపాధ్యక్షుడితో గొడవ అనంతరం ప్రజలతో తన బాధ చెప్పుకోవాలని అనిపించిందని రాజేశ్వరి చెప్పారు.

''ట్యాంకు నిర్వహణ బాధ్యతలు అప్పగించిన వ్యక్తి సరిగా పనిచేయట్లేదు. దీంతో అతడి దగ్గర నుంచి తాళాలు తీసుకోవాలని గ్రామ సభ నిర్ణయించింది. కానీ నాకు తెలియకుండా మోహన్‌రాజ్.. తాళం విరగ్గొట్టి.. అతణ్ని మళ్లీ లోపలకు పంపించి.. పనిచేసుకోమన్నారు. దానిపై నేను మాట్లాడినప్పుడు మోహన్‌రాజ్ తిట్టారు. కలెక్టర్ వరకు వెళ్లినా అతడికి వ్యతిరేకంగా ఏమీ చేయలేనని అన్నారు''

మరోవైపు ఆరోపణలు ఎదుర్కొంటున్న మోహన్‌రాజ్‌ బీబీసీతో ఫోన్లో మాట్లాడారు. జెండా ఎగురవేసే కార్యక్రమానికి ఆమె కనీసం హాజరుకాలేదని అన్నారు. తన ఇష్టపూర్వకంగానే సమావేశాల్లో ఆమె కింద కూర్చున్నారని చెప్పారు. తను ఎలాంటి వివక్షకూ పాల్పడలేదని చెప్పుకొచ్చారు.

ఇన్ని నెలల నుంచి లేని వివక్ష ఇప్పుడే వచ్చిందా అని, ఇప్పుడు ఆమె దురుద్దేశం బయట పడిందని వ్యాఖ్యానించారు.

ఐ పాండ్యన్
ఫొటో క్యాప్షన్, ఐ పాండ్యన్

''ఇలాంటి చర్యలు సరిపోవు''

ఈ అంశంపై కడలూరు ఎస్పీ శ్రీ అభినవ్ బీబీసీతో మాట్లాడారు. రాజేశ్వరిపై వివక్షకు సంబంధించి కేసు నమోదు చేశామని అన్నారు. కులపరమైన వివక్షతో ఆమెను విధులు నిర్వర్తించకుండా అడ్డుకున్న మోహన్‌రాజ్ సహా ముగ్గురిపై ఈ కేసు పెట్టినట్లు తెలిపారు. వారు దోషులుగా నిరూపణ అయితే ఆరు నెలల నుంచి ఐదేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశముందన్నారు.

అయితే, కేసుల పరంగా కాకుండా స్థానిక సంస్థల్లో వివక్షను మొత్తంగా పరిగణలోకి తీసుకోవాలని కుల వ్యతిరేక ఉద్యమకారుదు, విట్‌నెస్ ఫర్ జస్టిస్ స్వచ్ఛంద సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఐ పాండ్యన్ వ్యాఖ్యానించారు.

ఇలాంటి ఘటనల అనంతరం దళిత ప్రతినిధులతో వరుసగా రెండు సమావేశాలు నిర్వహించి వారికి భరోసా కల్పించాలని ఆయన చెప్పారు.

''ఇలా చేస్తే.. దళిత ప్రతినిధుల సాధకబాధకాలను నేరుగా విన్నట్లు అవుతుంది. వారి కోసం ప్రత్యేక అధికారులను నియమించాలి''.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)