రామ్ విలాస్ పాశ్వాన్: కొందరికి ‘రాజకీయ వాతావరణ శాస్త్రవేత్త'.. మరికొందరికి 'సూటు బూటు దళిత నేత'

రామ్ విలాస్ పాశ్వాన్

ఫొటో సోర్స్, HINDUSTAN TIMES

    • రచయిత, అపూర్వ కృష్ణ
    • హోదా, బీబీసీ ప్రతినిధి

కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ 74 ఏళ్ల వయసులో గురువారం దిల్లీలో మృతిచెందారు. ఆయన కొడుకు చిరాగ్ పాశ్వాన్ ఈ సమాచారం ఇచ్చారు.

ఆయన చాలాకాలం నుంచీ అనారోగ్యంతో ఆస్పత్రిలో ఉన్నారు. కేంద్రంలో ఎక్కువ ప్రభుత్వాల్లో మంత్రిగా ఉన్న పాశ్వాన్ చాలా ప్రభుత్వాల్లో కీలక పాత్ర పోషించారు. ఆయన్ను రాజకీయ వాతావరణ శాస్త్రవేత్తగా కూడా చెబుతారు.

రామ్ విలాస్ పాశ్వాన్ అనే పేరు దేశ ప్రజలకు మొదట 1977 ఎన్నికల్లో వినిపించింది. బిహార్‌లో ఒక నేత అత్యధిక ఓట్ల తేడాతో గెలిచి గిన్నిస్ బుక్ రికార్డుల్లోకి ఎక్కారని అప్పుడు వార్త వచ్చింది.

ఆ ఎన్నికల్లో రాంవిలాస్ పాశ్వాన్ జనతా పార్టీ అభ్యర్థిగా హాజీపూర్ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థిపై దాదాపు నాలుగు లక్షల 25 వేల ఓట్ల తేడాతో ఓడించారు. మొదటిసారి లోక్‌సభలో అడుగుపెట్టారు.

దానికి ఎనిమిదేళ్ల ముందు పాశ్వాన్ ఎమ్మెల్యేగా కూడా గెలిచారు. కానీ 1977లో విజయంతో పాశ్వాన్ జాతీయ నేత అయ్యారు. తర్వాత నాలుగు దశాబ్దాలకు పైగా ఆయన జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు.

పాశ్వాన్ 9 సార్లు ఎంపీగా ఉన్నారు. తన 50 ఏళ్ల రాజకీయ జీవితంలో 1984, 2009లో మాత్రమే ఆయన ఓటమి చవిచూశారు.

1989 తర్వాత పీవీ నరసింహారావు, మన్మోహన్ సింగ్ రెండోసారి యూపీఏ సర్కారు ఏర్పాటు చేసినప్పుడు మినహా ఆయన ప్రతి ప్రధానమంత్రి మంత్రివర్గంలో మంత్రి పదవి పొందారు.

థర్డ్ ఫ్రంట్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన పాశ్వాన్, కాంగ్రెస్ నేతృత్వంలో యూపీఏ సర్కారులో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వంలో కూడా మంత్రి పదవుల్లో ఉన్నారు.

విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ నుంచి నరేంద్ర మోదీ వరకూ ఆరుగురు ప్రధానమంత్రుల దగ్గర మంత్రిగా పనిచేసిన ఏకైక రాజకీయ నేత పాశ్వాన్ ఒక్కరే.

ఆయన ప్రతిసారీ మంత్రిగా తన స్థానాన్ని పదిలం చేసుకోవడంపై ఒకప్పుటి ఆయన సహచరుడు, తర్వాత రాజకీయ ప్రత్యర్థిగా మారిన లాలూ ప్రసాద్ యాదవ్ పాశ్వాన్‌పై చురకలు వేశారు. ఆయన్ను వ్యంగ్యంగా రాజకీయ ‘వాతావరణ శాస్త్రవేత్త’గా వర్ణించారు.

రామ్ విలాస్ పాశ్వాన్

ఫొటో సోర్స్, THE INDIA TODAY GROUP

ఒక్కసారి తప్పిన అంచనా

ఆయన, తన మొత్తం రాజకీయ జీవితంలో ఒక్కసారి మాత్రం రాజకీయ పవనాలను సరిగా అంచనా వేయలేకపోయారని భావిస్తారు.

2009లో ఆయన కాంగ్రెస్‌కు దూరమై లాలూ చేయందుకున్నారు. తను రికార్డు మెజారిటీతో గెలిచిన హాజీపూర్ స్థానంలోనే ఓటమి పాలయ్యారు.

కానీ ఆయన ఆ పొరపాటును త్వరగానే సరిదిద్దుకోగలిగారు. తర్వాత ఏడాది లాలూ యాదవ్ పార్టీ ఆర్జేడీ, కాంగ్రెస్ సాయంతో ఆయన రాజ్యసభలోకి అడుగుపెట్టారు.

కానీ రాజకీయ క్రీడలో నిపుణులుగా భావించే రామ్ విలాస్ పాశ్వాన్ మొదటి నుంచీ రాజకీయ నాయకుడే కావాలనుకున్నారా, ఆయన అలా అనుకోలేదు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

డీఎస్పీగా ఎంపికయ్యారు, నేత అయ్యారు

బిహార్ ఖగ్‌డిగా జిల్లాలో ఒక దళిత కుటుంబంలో పుట్టిన రామ్ విలాస్ పాశ్వాన్ చదువులో చాలా చురుగ్గా ఉండేవారు.

ఆయన బిహార్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసులో పాస్ అయ్యారు. డీఎస్పీ పదవికి ఎంపికయ్యారు.

కానీ అదే సమయంలో బిహార్‌లో రాజకీయ గందరగోళం నెలకొంది. అదే సమయంలో రామ్ విలాస్ పాశ్వాన్ బేగుసరాయ్ జిల్లాలోని ఒక సోషలిస్టు నేతను కలిశారు. పాశ్వాన్ ప్రతిభకు ప్రభావితుడైన ఆయన రాజకీయాల్లోకి రావాలని తనను ప్రోత్సహించారు

1969లో పాశ్వాన్ సంయుక్త సోషలిస్ట్ పార్టీ నుంచి అలౌలీ అసెంబ్లీ స్థానానికి నుంచి పోటీ చేశారు. తన రాజకీయ జీవితానికి శ్రీకారం చుట్టారు.

పాశ్వాన్ తర్వాత జేపీ ఉద్యమంలో కూడా పాల్గొన్నారు. 1975లో ఎమర్జెన్సీ తర్వాత దాదాపు రెండేళ్లు జైల్లో ఉన్నారు.

కానీ మొదట్లో ఆయన్ను బిహార్ అగ్ర యువ నేతల్లో ఒకరుగా గుర్తించేవారు కాదు.

రామ్ విలాస్ పాశ్వాన్

ఫొటో సోర్స్, MAIL TODAY

బిహార్ నుంచి ఎదిగిన దళిత నేత

1977 తర్వాత 1980 ఎన్నికల్లో కూడా గెలిచిన పాశ్వాన్ పార్లమెంటులో, కేంద్ర రాజకీయాల్లో తన ఉనికి చాటుకున్నారు. కానీ, ఇందిరా గాంధీ హత్య తర్వాత 1984లో జరిగిన ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు.

“అదే సమయంలో దేశంలో దళితుల అభ్యున్నతి రాజకీయాలు బలపడ్డాయి. పాశ్వాన్ హరిద్వార్, మురాదాబాద్ లాంటి స్థానాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో తన దళిత నేత ఇమేజ్ బలోపేతం చేసుకోడానికి ప్రయత్నించారు. బిహార్ బయట కూడా రాజకీయాల్లో మెరిశారు. దిల్లీతో టచ్‌లో ఉంటూ వచ్చారు” అని సీనియర్ జర్నలిస్ట్ అరవింద్ మోహన్ చెప్పారు.

“అయితే, ఆయన కాన్షీరాం, మాయావతి స్థాయి నేత కాలేకపోయారు. కానీ, దేశంలో దళిత నేతల గురించి ఎప్పుడు చర్చ జరిగినా అందులో ఆయన పేరు కూడా వచ్చేది. దానివల్ల తర్వాత ఆయనకు లబ్ధి చేకూరింది. ఆయన తన సమాజానికి నాయకుడుగా మారారు” అన్నారు.

రామ్ విలాస్ పాశ్వాన్

ఫొటో సోర్స్, STRDEL

పాశ్వాన్ దళితులకు ఏం చేశారు?

“పాశ్వాన్ బీఎస్పీ లేదా అంబేడ్కర్‌లా దళితుల కోసం ఎలాంటి ఉద్యమాలూ చేయలేదు. కానీ, ఆయన దళితులకు రాజ్కాంగం, చట్టంలో కల్పించిన హక్కులకు ఎప్పుడు భంగం కలిగినా, దానిపై ఓపెన్‌గా మాట్లాడేవారు” అని అరవింద్ మోహన్ చెప్పారు.

“పాశ్వాన్‌ను చాలా సమర్థుడైన దళిత నేతగా కూడా బావించేవారు. బీఎస్పీ వేగంగా ఎదిగింది. అలా దళితుల జీవితాలను కూడా ప్రభావితం చేసింది. కానీ, అది అవినీతిలో కూరుకుపోయింది. జాతి అసమానతలను పెంచింది. పాశ్వాన్ రాజకీయాల్లో అలా ఎప్పుడూ జరగలేదు” అన్నారు.

రామ్ విలాస్ పాశ్వాన్

ఫొటో సోర్స్, Getty Images

పనులు చేయించిన మంత్రి

రామ్ విలాస్ పాశ్వాన్ వివిధ ప్రభుత్వాల్లో వివిధ శాఖలకు మంత్రిగా పనిచేశారు.

రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు ఆయన తన పార్లమంటు స్థానం హాజీపూర్‌లో రైల్వే ప్రాంతీయ కార్యాలయం ప్రారంభించారు.

“బిహార్‌లో జేపీ ఉద్యమం తర్వాత ఆవిర్భవించిన ముగ్గురు యువ నేతల్లో లాలూ యాదవ్, నితీశ్ కుమార్ లాగే పాశ్వాన్‌కు కూడా రాష్ట్రాన్ని పాలించే అవకాశం వచ్చుంటే, బహుశా బిహార్ పరిస్థితి మరోలా ఉండేద”ని పాశ్వాన్ పనితీరు గురించి మాట్లాడిన అరవింద్ మోహన్ అన్నారు.

అయితే, రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆయనపై ఆరోపణలు ఉన్నాయని పట్నాకు చెందిన జర్నలిస్ట్ మణికాంత్ ఠాకూర్ చెప్పారు.

“కుంభకోణాల్లోనూ ఆయన పేరు ఉందని కాదు, కానీ, ఆయన ఎక్కడెక్కడ మంత్రిగా ఉన్నారో అక్కడంతా అవినీతిని అదుపు చేయడంలో ఆయన కఠువుగా ఉన్నట్లు కనిపించలేదు” అన్నారు.

రామ్ విలాస్ పాశ్వాన్

ఫొటో సోర్స్, Getty Images

కుటుంబం- కుటుంబ వాదం

రామ్ విలాస్ పాశ్వాన్ రాజకీయాలతోపాటూ ఆయన కుటుంబం గురించి కూడా జోరుగా చర్చ జరిగేది.

పాశ్వాన్ రెండు పెళ్లిళ్లు చేసుకున్నారు. ఆయన మొదటి భార్యది గ్రామీణ నేపథ్యం. ఆయన ఆమెను గ్రామంలోనే వదిలేసారని ఆరోపణలు కూడా వచ్చాయి. వారిద్దరికీ ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. రామ్ విలాస్ పాశ్వాన్ నామినేషన్ సమయంలో ఇచ్చిన సమాచారం ప్రకారం ఆయన తన మొదటి భార్యకు 1981లో విడాకులు ఇచ్చారు.

కొన్నేళ్ల తర్వాత ఆయన ఎయిర్ హోస్టెస్‌గా పనిచేసిన రీనా శర్మను రెండో పెళ్లి చేసుకున్నారు. వారికి చిరాగ్ పాశ్వాన్‌తో పాటూ ఒక కూతురు కూడా ఉన్నారు.

కుటుబం పట్ల పాశ్వాన్‌కు ఉన్న ప్రేమ రాజకీయాల్లో కూడా కనిపించింది. 2019లో లోక్‌సభ ఎన్నికల్లో ఆయన పార్టీ ఆరు స్థానాల్లో పోటీ చేస్తే అందులో మూడు స్థానాల్లో కుటుంబ సభ్యులే ఉండడం దానికి ఉదాహరణ. వారిలో ఒకరు కొడుకు చిరాగ్ పాశ్వాన్, మిగతా ఇద్దరు ఆయన సోదరులు. వీరు ముగ్గురూ ఆ ఎన్నికల్లో గెలిచారు. తర్వాత పాశ్వాన్ రాజ్యసభకు వచ్చారు. ఇలా పార్లమెంటులో ఉన్న పెద్ద కుటుబం రామ్ విలాస్ పాశ్వాన్‌దే అని చెప్పుకునేవారు.

రామ్ విలాస్ పాశ్వాన్

ఫొటో సోర్స్, Getty Images

అయితే, రామచంద్ర పాశ్వాన్ ఎన్నికల ఫలితాలకు రెండు నెలల ముందు అనారోగ్యంతో చనిపోయారు. తన తమ్ముడి మరణంతో పాశ్వాన్ చాలా కుంగిపోయారని చెబుతారు.

రామ్ విలాస్ పాశ్వాన్ జీవితం ప్రారంభం నుంచి చివరి వరకూ కుటుంబవాదం అనే ప్రశ్న ఆయన్ను వెంటాడుతూనే వచ్చిందని, ఆయన ఆ విమర్శల నుంచి బయటపడే ప్రయత్నం కూడా చేయలేదని మణికాంత్ ఠాకూర్ చెబుతారు.

“మేం ఎవరిని నమ్ముతామో, వారినే ముందుకు తీసుకు వస్తాం. దానిపై ఏదైనా నిషేధం ఉందా. మా సమాజం వెనుకబడింది. దానికోసం ఎవరైనా పని చేయగలిగితే, మేం వారిని ఉపయోగించుకుంటాం” అని ఈ ప్రశ్నకు పాశ్వాన్ ఒకసారి సమాధానం ఇచ్చారు.

కుటుంబం అంటే పాశ్వాన్‌కు ఉన్న ప్రేమ గురించి మణికాంత్ ఠాకూర్ ఉదాహరణలు కూడా ఇచ్చారు. “ఆయన తన కొడుకు చిరాగ్‌ను పార్టీ అధ్యక్షుడుగా చేశారు. సోదరుడి కొడుకు ప్రిన్స్ రాజ్‌ను బిహార్‌లో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని చేశారు” అన్నారు.

“దానికి ఆయనను తప్పు పట్టడం సరికాదు. నిజానికి, కుటుంబ సభ్యులను తప్ప ఇతరులపై నమ్మకం ఉంచడం ఈరోజుల్లో సాధ్యం కాదు. సంస్థ కంటే ఎక్కువగా కుటుంబంలో అభిప్రాయ బేధాలు బయటపడే సమస్య ఉంటుంది. అందుకే విషయం ఇంట్లోనే ఉండాలని నేతలు కోరుకుంటార”ని అరవింద్ మోహన్ చెప్పారు.

రామ్ విలాస్ పాశ్వాన్

ఫొటో సోర్స్, LJP

సూటు బూటు దళిత నేత

రామ్ విలాస్ పాశ్వాన్ కుటుంబంతోపాటూ ఆయన స్టైల్ గురించి కూడా చర్చల్లో నిలుస్తుంటుంది.

తను నాయకుడుగా ఉన్న సమాజంలో ఆయన తనకంటూ ఒక జీవన శైలిని ఏర్పరుచుకున్నారు. ముఖ్యంగా ఆయన దుస్తుల శైలి.

చాలామంది రామ్ విలాస్ పాశ్వాన్‌ను తన ‘ఫైవ్ స్టార్ దళిత నేత’ ఇమేజ్ గురించి అడిగినపుడు ఆయన చిరాకు పడేవారని మణికాంత్ ఠాకూర్ చెప్పారు.

“దళితులు అంటే జీవితాంతం భిక్షమెత్తుకోవాలి అనేది మీ మానసికత. మేం ఆ పరిస్థితిని అధిగమిస్తున్నప్పడు మీకు అంత కష్టం ఎందుకు” అని పాశ్వాన్ సమాధానం ఇచ్చేవారు.

రామ్ విలాస్ పాశ్వాన్ ఎవరు, ఆయన్ను ఎందుకు గుర్తుంచుకోవాలి అనే దాని గురించి అరవింద్ మోహన్ ఒక విషయం చెప్పారు.

“రామ్ విలాస్ పాశ్వాన్ ఆదర్శ రాజకీయాలు చేయలేదు. కానీ, ఒక దళిత కుటుంబంలో పుట్టి, ఎవరి సాయం, ఏ కుటుంబ నేపథ్యం లేకుండానే అంత ఎత్తుకు ఎదిగారు అంటే, ఆయన ఏం చేయగలిగేవాడో, ఆయన సత్తా ఏంటో అది నిరూపిస్తుంది” అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)